చిత్తూరు

మోసగాళ్లపై పోరాడుదాం - బంద్‌కు కదలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఆంధ్రరాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన బిజెపి, టిడిపి మోసగాళ్లపై వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్ పోరాడటానికి బంద్‌కు పిలుపునిచ్చారని, ఈబంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మధ్యా హ్నం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బతికున్న టిడిపి, బిజెపిపై నిప్పులు చెరిగారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ విభజించబడిన రాష్ట్రానికి వెన్నుదండుగా నిలుస్తానని ప్రజలకు హామీలిచ్చారని ఇటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారానికి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక హోదాపై మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రత్యేక హోదాకోసం వైఎస్‌ఆర్ సిపి నేత జగన్ ప్రధానిని రెండు పర్యాయాలు కలిసి కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు నీటి ప్రాజెక్టులపై భారం తగ్గుతుందని, దీనికి తోడు రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్స్ వస్తుందని అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసి రెండు రైళ్లల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి ఢిల్లీలో అరెస్ట్‌లు సైతం లెక్కచేయకుండా ప్రత్యేక హోదా నినాదాన్ని లేవనెత్తడంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక హోదా విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ జగన్‌పై వ్యక్తిగత రాజకీయ దాడులు చేశారు. ఇక రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ నిర్జీవమైందని, నేడు టిడిపి, బిజెపి తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. ఆల్‌మట్టి ఎత్తుపెంచడంలో ఇప్పటి టిడిపి ప్రభుత్వం అరెస్టులు లెక్కచేయకుండా పోరాటం చేసిందని, ప్రత్యేకహోదా విషయంలో నేడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి 5కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల భవిష్యత్ నమ్మకాన్ని ఊచకోత కోయడానికి చంద్రబాబు వెనకాడలేదన్నారు. వీరు విభజనలోని హామీలను ఒక్కటంటే ఒక్కటిగానీ నెరవేర్చకుండా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపనలు చేసిన గిరిజన, అగ్రికల్చర్, సెంట్రల్ యూనివర్సిటీలు మంగళగిరిలోని ఎయిమ్స్ పునాదిరాళ్లు సమాధిగా మారిందన్నారు. శ్రీ కాళహస్తి వద్ద బెల్ కర్మాగారం కడప జిల్లాలో ఉక్కుకర్మాగారాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించాలని, ఈ బంద్‌కు శ్రీవారి భక్తులను మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వామపక్షాలు ప్రత్యేక హోదా విషయంలో తమ బంద్‌కు సహకరించాలని కోరారు.
వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట తప్పారు
* నటనలో బాబు బాలయ్యను మించాడు
* జి ఓ నెంబర్ 40పై ఉద్యమం చేపడతా
* ఎమ్మెల్యే రోజా ధ్వజం
తిరుచానూరు, జూలై 30: వెంకన్న సాక్షిగా తిరుపతి ఎన్నికల సభలో ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను తప్పారని వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవిని కాదు అన్న చంద్రబాబు మాటల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి నెలకొందన్నారు.
ప్రత్యేక హోదాపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
* మంత్రి నారాయణ స్పష్టం
రేణిగుంట, జూలై 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభత్వమే నిర్ణయం తీసుకోవాలని మునిసిపల్ శాఖామంత్రి నారాయణ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమనాశ్రయం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభలో జరిగిన తీరుపై ముఖ్యమంత్రి స్పందించారని, ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఆయన గుర్తుచేశారు. 14వ ఆర్థిక సంఘం నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే ఆర్థిక పనులపై ఉంటుందని, ఇది ప్రత్యేక హోదాకు సంబంధించింది కాదన్నారు. మిత్ర పక్షం అయిన బిజెపి ప్రత్యేక హోదావిషయంలో పునరాలోచించి కేంద్రప్రభుత్వం లోటుబడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరమెంతైనా ఉందన్నారు. ఇక వైకాపా 4 ఓట్లు సంపాదించేందుకు రాజకీయ లబ్ధికోసం ప్రత్యేక హోదా విషయంలో మసలికన్నీరు కారుస్తుందన్నారు. రాజధాని నిర్మాణం నచ్చని జగన్‌కు ప్రత్యేకహోదాపై మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. అనంరతం ఆయన రోడ్డుమార్గాన చిత్తూరులో జరిగే కార్యక్రమానికి పయనమయ్యారు.
ప్రత్యేక హోదా విషయంలో
కేంద్రం వైఖరిపై నిరసన వెల్లువ
తిరుపతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పిలుపుమేరకు ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, రాష్ట్ర విభజనతో చేసిన తప్పును తెలుసుకొని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టామని, అయితే రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు 11 పార్టీలు మద్దతు ఇవ్వగా తెదేపా రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్ సభలో ఇచ్చిన 10 నిముషాల సమయాన్ని చంద్రబాబు, మోదీ జపం చేశారని, ఇక కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజు ప్రత్యేక హోదా చర్చ జరుగుతున్న సమయంలో కానరాలేదన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని
చెప్పిన ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షను నిర్వీర్యం చేశారన్నారు. ఆగస్టు 5న రాజ్యసభలో జరగనున్న ఓటింగ్‌లో టిడిపి ఎంపిలు పాల్గొనేవిధంగా చంద్రబాబు ఆదేశాలివ్వాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు గుప్పించి ఓటుకు నోటు విషయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఫణంగా పెట్టి చేతులు దులుపుకున్న ఘనుడు ముఖ్యమంత్రి అని, ఇకనైనా ప్రత్యేకహోదాపై అఖిలపక్షంతో ఢిల్లీకి టిడిపి రావాలని కల్లబొల్లి కబుర్లతో కాలంగడుపుతున్న తెదేపాకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, పొలకల మల్లిఖార్జున్, చుక్కల దాము, నయనార్‌శ్రీను, అసోక్‌సామ్రాట్ యాదవ్, యార్లపల్లి గోపి, ప్రమీలమ్మ, సావిత్రి, సింధూజ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో
కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పినందుకు నిరసనగా శనివారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ప్రతిఘటించి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సి ఐ టియు నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ కల్పిస్తామని హామీ ఇచ్చి మాటతప్పడం దుర్మార్గమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రకటనలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేవిధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం నాయకులు గురుప్రసాద్, శ్రీనివాసులు, రాజ, కుమారమ్మ, రాధ, బుజ్జి, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
రాష్ట్ర ప్రజల బట్టలూడదీస్తున్న నరేంద్రమోదీ తీరును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గోచీలు కట్టుకొని వినూత్న నిరసన ప్రదర్శించారు. సిపి ఐ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల బట్టలూడదీస్తున్న బిజెపి ప్రభుత్వం నరేంద్రమోదీ వైఖరి మార్చుకోవాలని సిపి ఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు తిరుపతి నగర సమితి కార్యదర్శి చిన్నం పెంచులయ్య ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలో సిపిఐ కార్యాలయం నుంచి మీసేవ సర్కిల్ వరకు గోచీలు కట్టుకొని వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుప్పం అవినీతిపై కమిటీ వేయండి
* అఖిలపక్షం డిమాండ్
కుప్పం, జూలై 30: కుప్పం పంచాయతీలో జరిగిన అవినీతిపై కమిటీ వేసి విచారణ జరపాలని కుప్పం అఖిలపక్షం శనివారం డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదాపై ఇటు బిజెపి, అటు టిడిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసారని స్థానిక ఆర్టీసీ బస్టాండులో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు డౌన్ డౌన్..చంద్రబాబునాయుడు వౌనం వీడాలని నినాదాలు చేసారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రగల్బాలు పలుకుతున్నారే గానీ నిజానికైతే ఎటువంటి అభివృద్ధి జరగలేదని వారన్నారు. కుప్పం పంచాయతీలోని 20 వార్డులు ఉండగా అందులో 16వార్డు సభ్యులు తమవార్డు పరిధిలో ఎలాంటి అబివృద్ధి జరగలేదని విధిగా నిధులు ద్వారా మంజూరైన డబ్బులు పూర్తిగా గోల్‌మాల్ అయ్యాయని ఆ వార్డు సభ్యులు రాజీనామా బాట పట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్య మంత్రికి వినతిపత్రాలు అందచేసారు. దీనిని బట్టి చూస్తే కుప్పం పట్టణంలో ఎంత అవినీటి జరిగిందో అర్థమవుతుందని ఓ వైపు అమరావతిలో పూర్తిగా మునిగిపోయిన చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి చేస్తున్నానని ప్రగల్బాలు పలుకుతున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఆ పార్టీ వార్డు సభ్యుల రాజీనామాతోనే తేటతెల్లమైందని వారన్నారు. కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ కన్వీనర్ చంద్రవౌళి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్‌బాబుతో పాటు పలువురు అఖిలపక్ష సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఎపిపై ఎన్‌డిఏ సవతితల్లి ప్రేమ
*ఎన్‌డిఏలోనే ఉండి పోరాటం
* మంత్రి బొజ్జల, టిడిపి నేత వర్ల వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూలై 30: రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతుందని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి, దేశం నేత వర్లరామయ్య చిత్తూరు ఎంపి శివప్రసాద్ ఆరోపించారు. శనివారం చిత్తూరులో వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ బతికి బట్టకట్టలేదని రాష్ట్రానికి మెండిచేయి చేపుతున్నారని దుయ్యపట్టారు. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు బిజెపి నేతలు వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ ఒక మాట నేడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి నేడు బిజెపి ప్రత్యేక హోదా విషయంలో మాటమార్చడం వల్ల మరింత నష్టపోయే ప్రమాదం జరుగుతుందన్నారు. బిజెపి తీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అవమానించినట్లేనని తెలిపారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ ఏకాకిని చేసిందన్నారు. రాజ్యసభలో అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విన్నవించినా బిజెపి మాత్రం మిన్నకుండడం శోచనీయమన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎన్‌డి ఎలోనే ఉండి ప్రత్యేక హోదా సాధన కోసం తమ వంతు పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్‌లో ప్రధానమంత్రిని నిలదీసి అయినా సరే హోదా సాదించే దిశగా తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. పార్లమెంట్‌లో ఏనాడు రాష్ట్రం గురించి మాట్లాడని వై ఎస్ జగన్ నేడు ప్రత్యేక హోదా విషయంపై బంద్‌కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వక మరో ప్రక్క ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. బిజెపి పార్టీ తన తీరు మార్చుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. ఈ విలేఖర్ల సమావేశంలో జడ్పి చైర్‌పర్శన్ గీర్వాణి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.