Others

కొలువుదీరిన సృజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా అంటే సరదా పండగ. పిల్లలకు పరీక్షల తర్వాత వచ్చే దసరా సెలవులు వారికి ఆటవిడుపు. ఈ పండుగలో పెట్టే బొమ్మలకొలువు పిల్లల సృజనాత్మకతనూ, ఆసక్తినీ పెంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వారంతా సంక్రాంతి పండుగకి బొమ్మలకొలువు పెట్టే ఆచారం ఉంది. మద్రాసు, కర్ణాటక ప్రాంతాల వారంతా దసరాకే బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలను కొన్నింటిని సేకరించి, కొన్ని తయారుచేసి, కొన్ని కొంటూ ప్రతిదసరాకూ కొత్త కొత్త సంఘటనలనూ, పురాణ గాధలనూ, చారిత్రక ఘట్టాలనూ, శ్రీకృష్ణలీలలను, దశావతారాలను, కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను కొలువుగా తీర్చిదిద్దడం ఒక గొప్ప కళ. పూర్వం ఈ బొమ్మలకు పాత చీరలు లేక ఎండు గడ్డి చుట్టి తట్టల్లోనో, బుట్టల్లోనో జాగ్రత్తగా అటకలమీద పెట్టేవారు. కొందరైతే బొమ్మలకోసం భోషాణం పెట్టెలు చేయించి భద్రపరిచేవారు. సుమారుగా నెల ముందునుంచే వాటిని తీసి రంగులు పోతే వేసి, ఎలా పెట్టాలో ఆలోచించి శ్రమించి పథకం వేసుకుని, తయారుచేసుకుని కొలువు అమరుస్తారు.

బొమ్మల కొలువు అమోఘమైన కళ. మెట్లు మెట్లుగా ఏర్పరచి అన్ని బొమ్మలూ సరిగా కనిపించేలా పెడతారు. ఇది ఒక అమోఘమైన కళ. సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం ఏర్పరిచేదే అయినా దీనిలో సృజనాత్మకత, విజ్ఞానం, ఆధ్యాత్మికం కలగలసి ఉంటాయి.
దుర్గాదేవి రాక్షస సంహారం చేసినందుకు గుర్తుగా.. ..
బొమ్మలతో తొమ్మిది మెట్లు పెడతారు. బొమ్మల లభ్యతను బట్టి మూడు నుంచీ తొమ్మిదివరకూ ఏర్పరుస్తారు. గృహిణి, పిల్లల కళాదృష్టి, ఆర్థిక స్థోమత, ఇతర సౌకర్యాలకు అనుగుణంగా, ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు. పైమెట్లమీద దేవుళ్ళ బొమ్మలు, అమ్మవారి బొమ్మలు సత్వగుణానికి ప్రతీకగానూ, క్రింది మెట్లు మీద తామస గుణానికి ప్రతీకగా ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు పెడతారు. మధ్యభాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలిపే రాజు, రాణి, యుద్ధవీరుల బొమ్మలనూ రాజస గుణానికి ప్రతీకగా పెడతారు. పై మెట్టుమీద ఉంచే కలశం దేవీ కరుణకు ప్రతీక. ఈ మూడు సత్వ రజస్తమో గుణాలను అధిగమించినవారికి దేవీ కటాక్షం లభిస్తుందని అంతరార్థం. మెట్లపై తెల్లని కొత్త వస్త్రాన్ని పరిచి దానిపై బొమ్మలను అమర్చుతారు.
ప్రతిరోజూ ధూప, దీప నైవేద్యాలతో లలితా సహస్ర నామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజూ ఒక కన్యకు అంటే 10 సం. లోపు బాలికకు, ఒక సువాసినికి భోజనం పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులైన బొట్టు, కాటుక దువ్వెన, అద్దం వంటివి బట్టలు ఇస్తారు. ఇది తాము సువాసిగా జీవితాంతం ఉండేందుకై చేసే సువాసినీ పూజ అనే నమ్మిక కూడా ఉంది.
దీనివలన అటు దాన ధర్మాలనూ, ఇటు సంతోషాన్నీ, కలివిడితనాన్ని కూడా పెంచుతుంది. ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం పేరంటానికి ముతె్తైదువలను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపు, కుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు కలసివస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇలా వాయనాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకునే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నం. అష్టగంధం, పసుపు, ఆరోగ్యానికి చిహ్నాలు. కాళ్ళకు పసుపు రాసుకోవడం వలన పాదాలకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ రావు. పసుపు యాంటీ బయాటిక్ కదా!
ఒకమారు బొమ్మల కొలువు పెట్టడం మొదలెడితే ఆపకుండా ప్రతి సంవత్సరం పెడుతూనే వుండాలనే నియమం ఉంది. అందుచేత ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచిస్తారు. బొమ్మలకొలువు చాలా సినిమాల్లో పాటలు పాడుతూ చాలామంది చూసే వుంటారు. ఈ బొమ్మల కొలువు గొప్ప నైపుణ్యాన్నీ, ఉత్సాహాన్నీ పెంచి, స్నేహస్వభావాన్నీ, ప్రేమనూ, ఐకమత్యాన్నీ ఇచ్చిపుచ్చుకునే నైజాన్నీ పెంపొందించే గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. సరదా దసరా కొలువుకు జేజేలు చెపుదామా!

-ఆదూరి హైమావతి