Others

మాటే మంత్రము..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా.. నాన్న కూడా యాన్యువల్ డే ఫంక్షన్‌కి వచ్చి వుంటే బావుండేది.. చూశావుగా నాకు ఎన్ని ప్రైజులు వచ్చాయో..’
‘అసలు.. నువ్వు నాకే చెప్పలేదు కదరా.. చివరి క్షణం వరకు.. ముందే చెప్పి వుంటే నాన్న కూడా వచ్చేవారేమో..!’
‘ఎక్కడమ్మా.. పొద్దున అయితే చాలు వీరిద్దరూ ఆఫీసులకు వెళ్లిపోతారు.. మళ్లీ రాత్రెప్పుడో వస్తారు.. ఏదో రోజు నాతో కాసేపు సరదాగా మాట్లాడతారని.. ఎలా చదువుతున్నావు? స్కూల్ విశేషాలు ఏంటీ? అని అడుగుతారేమో అని ఎదురుచూస్తాను..
కానీ పీజు కట్టే రోజు తప్ప ఏమీ అడగరు.. పట్టించుకోరు.. మీరు రోజుకొకసారైనా నాతో మాట్లాడాలని.. నేను చెప్పేవి వినాలని ఉంటుంది.. నాన్న అంటే నాకు చాలా భయం.. ఎప్పుడూ ఫ్రీగా మాట్లాడనే లేదు.. మొన్న ఫంక్షన్‌కి మా ఫ్రెండ్స్ ఫాదర్స్ అందరూ వచ్చారు..’ బాధ ధ్వనించింది ఆ చిన్నోడి గొంతులో.
ఆలోచనలో పడింది ఆ అమ్మ.
***
‘అనుకున్నాను.. మీరు ఇలాగే చేస్తారని.. అయినా ఇంత ఈగో దేనికి? అక్కడిదాకా వెళ్లింది బెల్లం కొట్టిన రాయిలా నోరు మూసుకుని కూర్చోవడానికా?’ విసుక్కుంది భార్యామణి.
‘అదికాదోయ్ కాంతామణి.. ఈగో లేదు.. పాడు లేదు.. అక్కడ ఆ ఆఫీసు వాతావరణం చూసేసరికి నాకు చెమటలు పట్టేసాయి.. ఏం చేయను?’ సమర్థించుకున్నాడు ఆ భర్త.
‘వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నపుడు ఆఫీసు అలా ఉండక.. నాలుగు గదులతో మన ఇల్లులా ఉంటుందా? అయినా అక్కడ చైర్మన్ మీ ప్రాణ స్నేహితుడే కదా!’
‘అవుననుకో.. కానీ స్నేహం చెడిపోదు!.. నోరు తెరిచి సాయం అడిగితే.. అయినా వాడి స్థాయి ఇపుడు చాలా పెద్దది...’
‘అయినా మీరు నోరు విప్పితేనే కదా తెలిసేది.. అక్కడి వాతావరణం, సానుకూలత ఏమిటో! అయినా మాటల వల్ల బంధం చెడిపోవడం అన్నది లేనే లేదు.. మాట్లాడాలంటే భయం అని చెప్పండి..’
‘అలా తిట్టకే భార్యామణి.. అదే నిజం అనుకో.. అతను బాగానే పలకరించాడు.. కానీ నేనే ఏమీ మాట్లాడలేకపోయా.. బహుశా మాట్లాడి వుంటే బావుండేదేమో!’
ఆలోచనలో పడ్డాడు ఆ భర్త.
***
సీన్‌లు మారినా, మనుషులు మారినా.. కరువైంది ఏమిటో అర్థమయ్యే ఉంటుంది కదూ!
అదే.. మాట.. మాటకు మించిన ఆత్మీయ స్పర్శ ఏముంటుంది ఈ లోకంలో! అయినా పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడితే పోయేదేముంది బిడియాలు, ఈగోలు తప్ప..
మహా అయితే ‘మాట్లాడటం రాదు’ అని అనుకుంటారు..!
ఏమీ లేని యాంత్రికత కన్నా మనుషుల మధ్య ఈ ‘మాటల స్పర్శ ఆత్మీయత’ బావుంటుందేమో.. ఆలోచించండి!
***
విద్య, విగ్రహపుష్టి, వాక్కు, వస్త్రం, వైభవం.. ఈ ‘వ’కార పంచికం వున్న వ్యక్తి ఉన్నతికి లోకంలో కొదవ ఉండదట!
ఇకపోతే మన మాటల్లో మన పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి (సాక్షి వ్యాసాలు) మాటల్లో చెప్పేయ్యాలంటే...
‘మాటకు వశుడు కాని మనుజుడేడీ? మాటకున్న వేగము గాలికెక్కడిది? మాటకున్న వైనం కల్లుకెక్కడిది? మాటకున్న ఆకర్షణ శక్తి భూమికెక్కడిది? పెద్దోళ్ల మాటలే కాదండోయ్.. మనం విసురుకునే సరదా ఛలోక్తులు కూడా.. ఒకటా.. రెండా.. బోలెడన్ని?!
‘మాట చూడనిదే మనసీయరాదు’, ‘మాటల చేత మహంకాళిని నవ్వించవచ్చును’, ‘మాట్లాడ నేర్పిస్తే.. పోట్లాట పని లేదు’..
రాసుకుంటూ పోతే మహభారతమే!
***
ఇన్నీ పక్కన పెట్టేస్తే...
మనం చాలాసార్లు కొత్తవాళ్ళతో మాట్లాడటానికి ఎందుకు సంకోచిస్తాం? పోనీ కొత్తవాళ్ళను పక్కన పెట్టెయ్యండి.. సన్నిహితులయినా సరే.. వాళ్ళ మనసులు చదవడానికి ప్రయత్నించి.. వాళ్ళకు తగినట్టు మన సమాధానం లేదా సంభాషణ ఉండాలని ఎందుకు తపన పడతారా? అయినా మనం కలిసేది మనుషులనే కదండీ.. మెషీన్లను కాదుగా.. అవుట్‌పుట్‌లు అంచనా వేసెయ్యడానికి!(?) పోనీ ఏదైనా తెలిసి తెలియకుండానో.. అప్పటికప్పుడు అనిపించింది మాట్లాడేసినా ఏమవుతుంది చెప్పండి?
ఆ క్షణం మాట్లాడటం సరిగా రాదు అని అనుకుంటారేమో! అంతేగా! అంతేకానీ అది జీవితాంతం గుర్తుపెట్టుకుని ఫలానా వ్యక్తి ఆ రోజు అలా మాట్లాడాడు అని డెయిరీలో రాసుకుని మరీ ప్రతిరోజూ దాన్నో లక్ష్యంలా చూసుకుంటారా!
ఇంత ఉపోద్ఘాతం తర్వాత.. అసలు మాట్లాడితే ఏం లాభం అనే తర్కం ఒకటి మెదడును తొలిచేస్తుంది కదా! ఇంకెందుకు ఆలస్యం.. ఆ సమాధానం కూడా మనమే విశే్లషించి చెప్పేసుకుందాం..
***
టెక్నాలజీతో నిండిపోయిన యుగం ఇది. ఎవరి లోకం వారిది. విపరీతమైన వ్యక్తిగత ధోరణి ప్రబలే ప్రమాదం కూడా అధికంగా పొంచి వున్న కాలం ఇది.
ప్రతి మనిషి తనకో ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ఆ గుర్తింపు మెషీన్లనుండి కాదు మనుషులనుండి కావాలని కోరుకుంటాడు. ఓ మనిషి ఇంకో మనిషి దూరం ద్వారా గుర్తుంచుకునే దానికన్నా మాటల ద్వారా గుర్తుంచుకునే అవకాశాలే ఎక్కువని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి.
‘సదభిప్రాయం’ అనే స్టిగ్మా చాలావరకు మనుషుమధ్య మాటలకు అడ్డుగోడలా నిలుస్తుంది. మన ఎదుట ఉన్నవారు కూడా మొదట మనం మాట్లాడతారేమోనని ఎదురుచూస్తారు.. ఆ ‘మాటల మొదటి అడుగు’ మనదైతే ఆ బంధం మానసికంగా శాశ్వతం!
పిల్లలు తమ చదువులు తాము చదువుకుంటున్నారు అని అనుకునే తల్లిదండ్రులు.. అలాగే పెద్దలు బిజీ అని నిర్లిప్తతో ఉండే పిల్లలు... ప్రేమ లేక కాదు.. ‘మాటల్లో ఒరిగేదేముందిలే’ అనే భావనతో.. లేకపోతే, మాటల ప్రాధాన్యత తక్కువ అని అనుకోవడంవల్లే తప్ప.. అనుబంధం మీద అపేక్ష లేక కాదు!
కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేడు అన్నిచోట్లా వినిపిస్తున్న ట్రెండ్.. కేవలం అన్ని విభాగాల్లో, వర్గాల్లో.. జాతీయంగా, అంతర్జాతీయంగా.. మనుషుల మధ్య, సంస్థలమధ్య ఆత్మీయ స్పర్శను నిర్మించడానికే తప్ప ప్రజ్ఞకు గీటురాళ్ళు కాదు!
అలా అని ఎలాగోలా మాట్లాడేస్తే కుదరదు కదా! మొదట కాస్త బిడియాల్ని వదిలించుకున్నాక, మన మాటల్తో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించగలగాలి.
కొద్ది మాటల్లోనే మనోహరంగా ఎవరు మహావిషయాన్ని చెప్పగలరో వారిని ‘వాగ్మి’ అంటాం. అలా కాకుండా అల్పాంశాన్ని కూడా అతిగా చెప్పేవారిని వాగుడుకాయగా జమకడతాం. ఇది మనుస్మృతి చెప్పిన మాట.
అలాగే,
‘‘మాన్పగలిగితే కత్తికోతలు.. మాన్పవశమే మాట కోతలు
కత్తిచంపును; మాట వాతలు మానవేనాడున్’’
కత్తి దెబ్బతో, గొడ్డలి వేటుతో తెగిన చెట్టు మ్రానయితే తిరిగి ఎలాగోలా చివురిస్తుందేమోగాని, మాట పదునుతో చెడిపోయిన కార్యం తిరిగి సానుకూలమవదు. ఇది ‘లవణరాజు కల’ ఖండికలో గురజాడ వారి ముత్యాల సరాల మాటల మేడ.
ఇంకెందుకు ఆలస్యం..
వాగ్భూషణంతో ఆత్మీయ పూదోట పూయిస్తారు కదూ!

-శృంగవరపు రచన