Others

ఆత్మవిశ్వాసంతోనే ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
*
సమాజంలో ఎవరు ఏ పనిచేసినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా, ఎంత ముందుకైనా వెళ్లగలరు, లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలరు.. అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం వుంది. నిజమైన సామర్థ్యం గురించి తెలుసుకున్నవారు ఎవరూ ఎవరినీ తక్కువగా చూడలేరు. అలా అర్థం చేసుకోలేక గత కొన్ని తరాలుగా కొంతమందిని సామర్థ్యం పేరుతో సమర్థులను కూడా అసమర్థులుగా మార్చిన సమాజం నుండి బయటకు వచ్చి అందరినీ అర్థం చేసుకొనే సమాజం వైపు పయనించడానికి నిర్ణయం తీసుకోవాల్సి సమయం ఆసన్నమైంది.
ప్రపంచంలో పనికిరానివారంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైనవాళ్లే ఉండరు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపోతే మనం వాళ్లకన్నా గొప్పవాళ్లం అనుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్థం చేసుకోవడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే - ‘‘ఒక వ్యక్తి కూర్చున్న చోటినుండి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే, ఆ వ్యక్తి నిలబడడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం’’ అంటారు.
చిరిగిన, మాసిన బట్టలతో, పెరిగిన గడ్డం, చుట్టలు తిరిగిన జుట్టు, బందిఖానాలాగ ఉండే ఓ చిన్న గది, ఒంటరితనం, ఈ ప్రపంచంలో నా గురించీ ఆలోచించేవారు, నన్నుగా గుర్తించే మనిషి ఒక్కరూ లేరా.. అనే ఆవేదనతో ఆకాశం ఊడిపడేలా అరుస్తున్న ఆ గొంతు, నలుదిక్కులుగా వెతుకుతున్న కళ్లు, మంచానికి గొలుసులతో కట్టేసిన కాళ్లు.. మానసిక వైకల్యం కారణంగా పిచ్చివాళ్లు అనే ముద్ర వేయించుకుని, ప్రపంచంలో ఎవరికీ పట్టని వారుగా దీనంగా బతుకులను వెళ్లదీస్తున్నవాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అందరూ ఉన్నారు, అన్ని హక్కులూ ఉన్నాయి. ఎవరికీ ఏమీ కానివాళ్లలాగే, ఏవీ వినియోగించుకోలేక జీవితాలను వెళ్లదీస్తున్నవారు ఎందరో మరెందరో.. వాళ్లూ మనుషులే.. వారి పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైకల్యం అనేది ఒక సంఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటువ్యాధి అంతకన్నా కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, ప్రపంచ ఆధునిక ఆవిష్కరణలు ఆవిష్కరించడంలో వైకల్యం అడ్డురాదని నిరూపించిన వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి వికలాంగుల దశాబ్దం (1983-1992) తరువాత, జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబర్ 3న అంతర్జాతీయ వైకల్యత కలిగిన వ్యక్తుల దినోత్సవంగా ప్రకటించింది. ఇండియాలో 1992 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘ప్రపంచ వికలాంగుల (దివ్యాంగుల) దినోత్సవం’ను దివ్యాంగులు మానసికంగా అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో అన్నిరంగాలలో ముందుకు దూసుకెళ్లాలి అనే ఉద్దేశ్యంతో నిర్వహించుకోవడం జరుగుతుంది.
సామాజిక బాధ్యత
* వైకల్యం పుట్టిన శిశువుకు చేసే ప్రతి సేవను భగవంతునికి ప్రత్యక్షంగా చేసిన సేవగా సమాజం భావించాలి.
* ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుకోవడానికి అనువైన పరిసరాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కల్పించాలి.
* పిల్లలలో నెగెటివ్ ఆలోచనలను దరిచేరనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* దివ్యాంగులలో స్వతంత్రంగా జీవించడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలను తల్లిదండ్రులు అందించేలా చూడాలి. అలా స్వతంత్రంగా జీవించగలిగితే వారికి వారిపై ఆత్మవిశ్వాసం పెంపొందిచబడి జీవన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
* ఎందరో దివ్యాంగులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. వారి విజయగాధలను చెప్పడం ద్వారా, వీడియో క్లిప్పింగులు చూపడం ద్వారా లక్ష్యాన్ని స్థిరీకరించుకోవడానికి దోహదపడుతుంది.
* దివ్యాగులలో తమ తప్పులను, అపజయాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన ప్రోత్సాహాన్ని అందించాలి.
* సైకాలజిస్ట్ ద్వారా లక్ష్య నిర్థారణ, ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని నింపేవిధంగా కౌనె్సలింగ్ ఇప్పించాలి.
* ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ రకాల సేవలు, పింఛన్, ఉపకారవేతనాలు, రవాణా సౌకర్యాలు, రిజర్వేషన్, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలుల చైతన్యం చేయాలి.
* కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో ప్రత్యేక పాఠశాలలు (అంధుల పాఠశాల, మూగ చెవిటి, మానసిక వికలాంగుల ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన అవసరం ఉంది.
వివిధ రకాల వైకల్యాలు
దృష్టి లోపాలు చూడటంలో పూర్తి అంధత్వం, పాక్షిక అంధత్వం, శ్రవణ లోపం, భాషణ లోపం, చలన వైకల్యం, బుద్ధిమాంద్యత, సెరిబ్రల్ పాల్సి, ఆటిజం, ఆటిజం, అభ్యాసన సమస్యలు, బహుళ వైకల్యం-రెండు లేదా ఎక్కువ వైకల్యాలు కల్గి ఉండటం.
చట్టాలు - సౌకర్యాలు
వికలాంగుల చట్టం- 1995, జాతీయట్రస్టు చట్టం-1999, విద్యాహక్కు చట్టం-2009, భారత పునరావాస మండలి -1992, మానసిక ఆరోగ్య చట్టం-1987.
వికలాంగుల చట్టం కల్పించే ప్రత్యేక సౌకర్యాలు
సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం ద్వారా వికలాంగులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడ్డాయి.
సెక్షన్ 26 (ఎ): ప్రతి ప్రత్యేక అవసరాలు గల పిల్లవానికి 18 సంవత్సరాల వయస్సు వరకు తగిన విద్యను అభ్యసించే వాతావరణం కల్పించి ఉచిత విద్యను అందించాలి.
సెక్షన్ 26 (బి): సాధారణ పాఠశాలలోనే వికలాంగులైన పిల్లలు కూడా కలిసి చదువుకునేలా వారిని ప్రోత్సహించాలి.
సెక్షన్ 30 బి):విద్య, ఉద్యోగ, వృత్తి సంబంధమైన సంస్థలలో, కాలేజీలలో, పాఠశాలలలో శిక్షణ పొందడానికివచ్చే వికలాంగులకు భవన నిర్మాణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి.
సెక్షన్ 30(సి): పాఠశాలకు హాజరయ్యే వికలాంగ విద్యార్థులకు పుస్తకాలు, నిర్దేశిత యూనిఫాంలు మరియు ఇతర పరికరములు సరఫరా చేయాలి.
సెక్షన్ డి:వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయాలి. అన్ని ప్రభ్వు విద్యా సంస్థలలో మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న విద్యాసంస్థలు, ఉద్యోగాలలో వికలాంగులకు 3 శాతం తక్కువ కాకుండా రిజర్వు చేయాలి. సెక్షన్ 69 ప్రకారం వికలాంగులకు సంబంధించిన ప్రయోజనాలను ఎవరైనా దుర్వినియోగం చేసినా, చేయాలని ప్రయత్నించినా రెండు సంవత్సరాలు జైలు లేదా 20 వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
పింఛను పథకాలు, ఉపకార వేతనాలు
ఒకటో తరగతినుండి ఇంటర్ వరకు చదువుకున్న విద్యార్థులకు ఎస్‌ఎస్‌ఎ, ఆర్‌ఎమ్‌ఎస్‌ఎ పథకాల ద్వారా 700 నుండి 1500 రూపాయలవరకు చెల్లిస్తారు. తెలంగాణ ప్రభుత్వం వికలాగుల పింఛన్ క్రింద 1500 రూపాయలు చెల్లిస్తున్నారు.
వికలాంగుల అభివృద్ధికి ప్రధానంగా వివిధ జాతీయ సంస్థలు కృషి చేస్తున్నారు. భారత పునరావాస మండలి, జాతీయ మానసిక వికలాంగుల సంస్థ, అలియవర్ జంగ్ జాతీయ శ్రవణ విలాంగులసంస్థ, జాతీయ శారీరక వికలాంగుల సంస్థ, జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ, జాతీయ బహుళ వైకల్లా సాధికారిత సంస్థ, నింహాన్స్ బెంగుళూరు, ఎన్‌సిఇఆర్‌టి ఢిల్లీ.
సర్వశిక్ష అభియాన్ ద్వారా శారీరక వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, కృత్రిమ అవయవాలు, వాకర్స్, కంటి అద్దాలు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, బ్రెయిలీ పలక, పుస్తకాలు, అంధుల చేతికర్ర, యూనివర్సల్ బ్రెయిలీ కిట్, అబాకస్‌లను ఉపకరణాలుగా అందజేస్తున్నారు.
దేశంలో 2011లెక్కల ప్రకారం 2,68,10,557 మంది వికలాంగులున్నారు.వీరిలో 55.8 శాతం ఉంటే, స్ర్తిలు 44.2శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వికలాంగుల జనాభా 69.4 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 30.6 శాతం ఉన్నారు.
దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకొని, వారికి రయణ, ఉపాధి కల్పించిననాడే దివ్యాంగులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచుంటారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలతోపాటుగా మరిన్ని డిమాండ్స్ వారినుండి వస్తున్నాయి. వారికి రిజర్వేషన్ 3 శాతం నుండి 8 శాతానికి, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు, 40 శాతంగా వున్న అర్హతను 30శాతానికి కుదించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించాలి. ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. డబుల్ బెడ్‌రూం పథకంలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహాన్ని 2 లక్షలకు పెంచాలి. వ్యక్తిగత రుణ సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి. వికలాంగ మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వికలాంగులకోసం బలమైన చట్టాన్ని రూపొందించాలి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి