సబ్ ఫీచర్

తెలుగు రాసేదెవరు? మాట్లాడేదెవరు??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలంటూ తీసుకున్న నిర్ణయంపై కవులు, రచయితలు, మేధావులు, భాషాపండితులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విస్తృతంగా చర్చలు, నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు ప్రముఖులే ఆంగ్లమాధ్యమంలో బోధనను సమర్థించడం తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నది. మొన్నటికి మొన్న దేశంలోనే తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్య 2వ స్థానంలో ఉన్నదని, ద్వితీయ భాషగా తెలుగును గుర్తించమని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వారే ఇప్పుడు ఆంగ్ల బోధనకు మద్దతు పలకడం సిగ్గుచేటు. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ చర్యకి వత్తాసు పలుకుతున్నారు. అధికార పదవులను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలను కొట్టిపారేయవచ్చు. కానీ కొందరు భాషావేత్తలు, తల్లిదండ్రులు కూడా వీరి చర్యలకి కొమ్ముకాయడం నిజంగా ఆశ్చర్యకర విషయమే!
‘మీ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవడం లేదా? ఉన్నత ఉద్యోగాలు చెయ్యడం లేదా? పేదపిల్లలు కూడా ఆంగ్లంలో చదివి మంచి ఉద్యోగాలు చెయ్యనక్కర్లేదా? దీనికి ప్రభుత్వం చేయూతనిస్తే మీరు ఓర్వలేకపోతున్నా రా?’అంటూ కొందరు ఎదురుదాడికి దిగుతున్నారు. వీళ్లన్నది కొంత నిజమే కావొచ్చు. అందరూ ఆంగ్ల మాధ్యమంలో చదవాలి, ఉన్నత ఉద్యోగాలు చెయ్యాలి. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి, అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదవాలని పిల్లల్ని నిర్బంధిస్తే, ఇక మన మాతృభాష ఎందుకు? అసలు తెలుగు ఎవరు మాట్లాడతారు? మాట్లాడవల్సిన అవసరమేమున్నది?
ఇక వీళ్ళు చెబుతున్న మాటల్ని బట్టి- ఆర్థిక స్థోమత కలిగి, ఇతర దేశాల్లోనో, ఇతర రాష్ట్రాలలో ఉన్నత చదువులు చదివి, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నవారి సంఖ్య అతి తక్కువ మాత్రమే. కాని అధిక సంఖ్యలో తెలుగువారు సొంత రాష్ట్రంలోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ గడుపుతుంటారు. అప్పుడు వీళ్ళందరికీ ఆంగ్లభాషతో పనేమున్నది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివెయ్యవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు, ఆంగ్లం రెండు మాధ్యమాలూ ఉంటే ఎవరికి నచ్చిన భాషలో వారు చదువు కొనసాగిస్తారు. కానీ తెలుగు మాధ్యమాన్ని ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ నిర్బంధం చేస్తామనడం సమంజసమా?
ఆంధ్రప్రదేశ్‌ని ‘ఆంగ్లప్రదేశ్’గా మారుస్తామని ప్రస్తుత పాలకులు ఎవరికైనా మాటిచ్చారా? భవిష్యత్‌లో తెలుగు భాషకు ఏర్పడబోతున్న అతిపెద్ద ప్రమాదాన్ని అసలు వీరు గమనిస్తున్నట్లుగా లేదు. రెండు తరాల క్రితం తెలుగువారు చిన్నతనం నుంచి తెలుగులో పద్యాలు కంఠస్తం చేసి ధారాళంగా పాడేవారు. తెలిసో తెలియకో గత తరం వారు కానె్వంట్ విద్యలో చదివిన పాపానికి తెలుగులో చదవడం, రాయడం మాత్రం చేయగలుగుతున్నారు. పద్యాలు, పాటలు పాడలేని పరిస్థితి వారిది. ఇక ఆంగ్లమాధ్యమంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకొనసాగిస్తున్న ఇప్పటితరం యువతీ యువకులు తెలుగులో పట్టిపట్టి మాట్లాడుతున్నారు తప్పించి, చదవడం, రాయడం చెయ్యగలుగుతున్నారా అంటే ప్రశ్నార్థకమే.
ఇప్పటికే దేశంలో లిపిలేని భాషలు అంతరించిపోతున్నాయని భాషా శాస్తవ్రేత్తలు ఘోషిస్తున్నారు. తెలుగును మాధ్యమ భాషగా తప్పిస్తే లిపిలేని భాష అవడానికి ఎంతోకాలం పట్టదు. లిపే కాదు వౌఖికంగా కూడా కనుమరుగవ్వడం ఖాయం. ఆంగ్లమాధ్యమ బోధనను నిర్బంధం చేస్తే తెలుగు మాట్లాడేవారు ఎవరుంటారు? తెలుగులో మాట్లాడవలసిన అవసరం ఎవరికుంటుంది? ఎందుకంటే అందరూ ఆంగ్లంలోనే చదివి, ఆంగ్లంలోనే రాస్తూవుంటే ఆ భాషనే కొనసాగిస్తారు తప్పించి, తెలుగులో మాట్లాడవలసిన పని వారికెందుకుంటుంది? తెలుగు భాష, తెలుగు సంస్కృతి కాలగర్భంలో కలిసిపోవడం తప్పించి మరోమార్గం ఉండదుగాక ఉండదు.
అంతరించే భాషల్లో తెలుగుకూడా ఉన్నదని యునెస్కో ఎప్పుడో చెప్పింది. దాన్ని ఈనాటి ఏపీ ప్రభుత్వం త్వరగా అమలుచేయడానికి కంకణం కట్టుకుందా? అనే అనుమానం కలుగుతున్నది. విద్యార్థుల చదువుకి పునాదిలా పాఠశాల చదువంతా మాతృభాషలోనే సాగాలి. అప్పుడే మాతృభాష బతుకుతుంది. పదవ తరగతి వరకు ఆంగ్లంలో చదివి ఆ తరువాత మాతృభాష చదవాలన్నా రాదుగాక రాదు. మాతృభాషలో పునాది వేసుకుని ఆ తర్వాత ఎవరెన్ని భాషలు చదివినా, ఎవరు ఏ భాషలో ఉన్నత ఉద్యోగాలు చేసినా, ఏ దేశానికి వలస వెళ్లినా- మన మాతృభాష ఉనికి కొంతైనా ఉంటుదని పాలకులు గ్రహించాలి. ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్ మన తెలుగుకి వెలుగులిచ్చిపోతే, మనం తెలుగువాళ్ళమై ఉండి ఆంగ్లమే చదువును, సంపదలను, ఉన్నతిని కల్పిస్తుందని ముసుగేసుకొని కలలుకంటే.. మన భాష, మన నేల, మన ఉనికిని కోల్పోయి, ఏ జాతివాడో తెలియని దుర్భరస్థితికి తెలుగువాడు దిగజారక తప్పదన్న కఠోర నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి.

-చలపాక ప్రకాష్ 92474 75975