Others

మహాజాతర - గిరిజన జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజన జాతరలలో విశిష్టమైంది మేడారం జాతర. సమ్మక్క, సారమ్మల జాతర అనీ కూడా ఈ జాతరను పిలుస్తారు. రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తూంటారు. 900ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకుంటూ ఉండేవారు. కానీ ఆ తర్వాత తెలంగాణా ప్రజలంతా కలసి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 1996లో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ పండుగను రాష్టప్రండుగగా గుర్తించింది.
ఈ జాతరల్లో తల్లులను కొలిచే పూజారులు వీరిని పూజించడానికి ప్రతి సంవత్సరమూ వంశపారంపర్యంగానే రావడం ఓ ప్రత్యేకత. ఈ జాతరలో కొలిచే దేవీరూపాలు గద్దెల పైనే దర్శనం ఇస్తారు. ఈ గద్దెల పైకిఅమ్మవార్ల రూపంగా భావించే కుంకుమ భరిణెలను తీసుకొచ్చి అలంకరిస్తారు. ఈ కుంకుమ భరిణిలనే అందరూ పూజిస్తారు. జాతర గిరిజన వ్యవస్థల్లో ఐకమత్యాన్ని పెంచుతుంది. తెలంగాణాలో జరిగే ఈ జాతరకు తెలంగాణావాసులే కాకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్టల్ర నుంచి కూడా జనం వస్తున్నారు. ఆదివాసి గిరిజన ఆచార వ్యవహారాలు పాటిస్తూ నాలుగు రోజుల పాటు కొనసాగే మేడారం జాతర సమ్మక్క- సారలమ్మల జాతర గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది. కుంకుమ భరిణిలను అమ్మవారి రూపాలుగా అలంకరిస్తారు. ఈ అలంకరించిన అమ్మవారి రూపాలను ఊరేగిస్తూ తరలించి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన మహాజాతర ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు.
వనదేవతలు: 13వ శతాబ్దంలో మేడారం చుట్టు పక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులైన కాకతీయుల పాలనలో ఉండేది. ఒకసారి అక్కడి గిరిజన కోయదొరలు వేటకని అడివికి వెళ్తే ఓ పసిపాప పుట్టమీద పడుకుని కేరింతలు కొడుతూ ఉంది. ఆ పాపకు కాపలాగా పులులు, సింహాలు చుట్టూ తిరుగుతూ కనిపించాయి. ఆ అద్భుతాన్నిచూసి కోయదొలు తమ పాలిట వచ్చిన వనదేవత అనుకొన్నారు.
నేటి జగిత్యాల జిల్లా పోలనాసలో ఉన్న గూడెంకు ఆ పసిపాపను తీసుకొని వచ్చారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. గిరిజన ధీర మేడరాజు సమ్మక్కను ఆయన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాప రుద్రుడు పోలవాసవై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారి పారిపోయి అజ్ఞాన వాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే రాజు పగిడిద్దరాజు కాకతీయ సామంతునిగా ఉంటూ కరువుకాటకాల కారణంగా కప్పం కట్టలేకపోయాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారానికి ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాప రుద్రుడు అతనిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహామహా శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తాడు.
సంపన్నవాగు మీద భీకరమైన యుద్ధం మొదలైంది. సాంప్రదాయ ఆయుధాలు ధరిచి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటాం చేశారు. పగిడిద్ద రాజును ఎదుర్కోవడం శత్రువులకు కష్టమైంది. దీంతో కుట్రలు పన్ని పగిడిద్దరాజుపై శత్రుసైన్యం చుట్టుముట్టి చంపేశారు. భర్త చనిపోవడం తెలుసుకొన్న సమ్మక్క తన అల్లుడు గోవిందరాజుతో కలసి తన పిల్లలను వెంటపెట్టుకొని శత్రుసైన్యం పైకి యుద్ధానికి వెళ్లింది. కానీ అపార కాకతీయుల సేనాధాటికి తట్టుకోలేక సారలమ్మ, నాగులమ్మ, జంపన్న గోవిందరాజు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యను పాల్పడుతాడు. అప్పటి నుంచి సంపన్నవాగు జంపన్నవాగుగా మారింది. ఇక అప్పుడు సమ్మక్క యుద్ధానికి బయలుదేరింది. కాకలుతీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది.
యుద్ధనైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరకు శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతో యుద్ధ్భూమినుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన వారికి సమ్మక్క కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణె లభించింది. సమ్మక్క కుంకుమ భరణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం.
దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమిరోజు సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు.
ఆ సమయంలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. సమ్మక్క కుంకుమ భరిణి గద్దె వద్ద ఉంచిన పక్కనే సమ్మక్క కూతురు సారక్కను మరో గద్దెకు ఏర్పాటు చేస్తారు. భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. తమ మొక్కులను చెల్లించేందుకు తల్లులకు చీరలు సమర్పిస్తారు.
మొదటిరోజు జాతర : సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కనె్నపల్లి మేడారం గద్దెకు మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలోని చిన్న దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. మెదటిరోజు ఉదయం పూజారులు రెండు గంటలపాటు గోప్యంగా పూజాదికాలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, అవివాహితులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు వందలాది మంది భక్తులు తడిబట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ తల్లిని వరం అడుగుతారు.
దేవతారూపాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చిన పూజారులకు సాష్టాంగ నమస్కారాలతో వరం పడుతూ పడుకున్న వారిపై నుంచి నడిచివెళ్తారు. సారలమ్మే తమపై నుంచి నడిచి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు.
రెండోరోజు జాతర : అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాంతం లభిస్తుంది. పోలీసు అధికార తుపాకీ కాల్పుల గౌరవ వందనం ఎదురుకోళ్ల ఘట్టంలో భక్తులు సమ్మక్కను ఆహ్వానిస్తారు. మేడారానికి ఈశాన్యంలో చిలకుల గుట్టపై నారచెట్టు కింద ఉన్న కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. చిలుకల గుట్టపై రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న సమ్మక్కకు రహస్యంగా పూజలు జరిపి కుంకుమ భరిణెను తీసుకొని దిగుతారు. గద్దెల వద్దే సమ్మక్కను ఎదురుకోళ్ళతో స్వాగతం పలుకుతారు. గద్దెలపై ఆశీనులైన సమ్మక్క, సారలమ్మలు మూడురోజులు అశేష జనావళికి దర్శనం ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు దర్శనమిచ్చి ఈ సమ్మక్క సారలమ్మ నాల్గవ రోజు తిరిగి వన ప్రదేశంలో విడుస్తారు. ఇదంతా జాతర రూపంలోనే సాగుతుంది.
బంగారం నైవేద్యాలు

సమ్మక్క సారలమ్మలకు తమ కోరికలు తీరితే భక్తులు నిలువెత్తు తూకాలు వేసి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఒక ఆనవాయితీ. బెల్లం ధరలు ఎంత విపరీతంగా ఉన్నా ఖర్చుకు భయపడక భక్తితో సమర్పిస్తుంటారు. బంగారంగా పిలువబడే బెల్లాన్ని తమ ఎత్తు చెల్లిస్తామని మొక్కుకున్న జనమంతా అక్కడి ఏర్పాటైనా బెల్లం కొట్ల ధగ్గరకు వెళ్లి తన ఎత్తు బెల్లం తీసుకొనేందుకు కొత్త బట్టలు ధరించి త్రాసుతో కూర్చుని, బెల్లం తూకం వేసి సొమ్ములు చెల్లిస్తుంటారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఎంతో పవిత్రంగా పసుపుకుంకుమలను అందుకునేందుకు లక్షలాదిమంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇవి అందుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఈ పసుపుకుంకుమలను అనారోగ్యంతో బాధపడేవారికి పెడితే త్వరలో వారి జబ్బులు నయం అవుతాయని భక్తులు నమ్ముతారు. సమ్మక్క అదృశ్యమైన చోటే బంగారు కుంకుమ భరణి లభ్యమైంది. అందుకనే ఈ పసుపుకుంకుమలను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. సమ్మక్క గద్దెపై కొలువు దీరిన రోజున సమ్మక్క నాగుపాము రూపంలో చెట్టుపైకి వచ్చి వేడుకలను కళ్లార చూస్తుందని గిరిజనుల నమ్మకం.

గట్టమ్మ తల్లి : మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు తరలి వచ్చే భక్తులు ముందుగా కట్టమ్మ తల్లిని దర్శించుకుని తర్వాత మేడారం వెళతారు . వరంగల్ ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు రెండు కిలోమీటర్ల దూరంలో గట్టమ్మ గుడి ఉంది. ఈమార్గంలో వెళ్లే వాహనాలు సైతం ఇక్కడ కొద్దిసేపు ఆగి వెళ్తాయి. కోరికలు తీర్చేటట్టుగా పేరొందిన గట్టమ్మతల్లి ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం గట్టంపల్లె గ్రామంలో వెలసింది. నేడు దానిని ప్రేమ్‌నగర్‌గా పిలుస్తున్నారు. ములుగు ప్రాంతంలో ఎవరింట్లో పుణ్యకార్యం జరిగినా మొదట గట్టమ్మను దర్శించి పూజలు జరుపుతారు. ఇది ఇక్కడి వారి ఆచారం. మేడారం వచ్చే భక్తులు కూడా ఈ గట్టమ్మను పూజించిన తరువాత మాత్రమే మేడారం వస్తారు. ఈ సారి గట్టమ్మ ఉగడి వద్ద ప్లాస్టిక్ కాలకేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు 20 అడుగుల ఎత్తులో ఈ కాలకేయుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. భక్తులంతా ఈ కాలకేయుడి దగ్గరే తమ దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వదిలేసి పర్యావరణ రహితంగా పవిత్రంగా జాతరలో పాల్గొనడానికి ముందుకు వెళ్తున్నారు.. కాలుష్య నియంత్రణకు వనాల సంరక్షణకు ఈ మేడారం జాతర పునాది కావాలని అన్ని ఏర్పాట్లను ఆ దిశగా చేస్తున్నారు.

- కె. రామ్మోహన్‌రావు 9441235912