Others

చిక్కడు, దొరకడు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలను పుట్టించిన భగవంతుడు ఎలా ఉంటాడో అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఆ పర్పారుడిని చూడాలని మరెందరో తహతహలాడుతుంటారు. కానీ భగవంతుడిని చూసిన వారు అరుదనే చెప్పాలి. మనలను పుట్టించినవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడన్న కథలను వింటూ ఉంటాం. ఇందు గలడు అందులేడని సందేహం వలదు అన్న కథలను మనం రోజు వింటాం. అంటే సర్వ సృష్టికి కారణమైనవాడు సర్వ త్రా నిండి ఉంటాడు. మరి అలాంటపుడు ఎందుకు కనిపించడు అంటే పాలలో వెన్న దాగి ఉంటుంది. కానీ అది కనిపించదు. పాలల్లోనే వెన్న ఉంది అంటే దాన్ని చూసిన చెప్తారు కనుక చూడని వారు సైతం పాలల్లో వెన్న ఉందనే విషయాన్ని నమ్ముతారు. అట్లానే పరమేశ్వరుడిని చూసిన వారు చెప్పారు కనుక ఈ పరాత్పరుడు, పరమేశుడు, భగవంతుడు ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడికి నామం లేదు. రూపం లేదు. వ్యక్తావ్యక్తుడాయన. సర్వానికి ఎలా కారణుడయ్యాడో, అట్లానే దేనికీ లొంగనివాడు, దేనిలోకి చొరబడనివాడు కూడా భగవంతుడే అన్న సత్యం. అటువంటి భగవంతుడిని చూడాలనుకొనేవారు ఈ సంసారంలోఅంటే జగతిలో ఉంటూనే కనిపించే జగతి అనిత్యం అని, మిధ్య అని తెలుసుకొంటూ కనపించని భగవంతుడే నిత్యుడు సత్యడు అని కూడా తెలుసుకోవాలి. ఇట్లా తెలియాలి అంటే భగవంతుని ఉనికిని పసికట్టడానికి వేయి నేత్రాలు అక్కర్లేదు. శోధన అవసరమే లేదు. ఎందులోకైనా లోతుగా విశే్లషిస్తే భగవంతుడనేవాడు ఉన్నాడన్న విషయం మనసు గుర్తిస్తుంది. కానీ ఆ మనస్సు కాదు నేత్రాలు చూడాలి అంటే అది అంత సులభ సాధ్యమయ్యే పని కాదు.
నిప్పునుంచి వేడిని వేరు చేయలేనట్టు, సూర్యుని నుంచి కాంతిని వేరు చేయలేనట్టు మనిషి నుంచి మనిషిలోని అంతరాత్మలో అణుమాత్రంగా నిలిచి ఉన్న భగవంతుడిని చూడడం అనేది చాలా చాల కష్టసాధ్యం. కానీ దాన్ని సులభ సాధ్యం చేసుకోవాలంటే ఈ జగతిలో తామరాకుపై నీటిబొట్టువలె వ్యవహరించాలి అంటారు. ఏదీ నాది కాదు అనుకోవాలి. ఆఖరికి శరీరమనే ఉపాధి కూడా నాది కాదు అన్న సత్యాన్ని గుర్తెరగాలి. అపుడే ఆ భగవంతుడు కనిపిస్తాడని భాగవతం చెప్తుంది.
చూడండి ...
కం. చిక్కడు వత్రముల క్రతువుల
చిక్కడు దానముల శౌచ శీల తపములన్
చిక్కడు యుక్తిని, భక్తిని
చిక్కిన క్రియ నచ్యుతుండు సిద్దము సుండీ
అంటే వత్రాలు,జపతపాలు, దాన ధర్మాలకు భగవంతుడు దొరకడు. కానీ భక్తితో ఆయన్ను పట్టుకోవచ్చు. చూడవచ్చు అని దీని అర్థం.
క. చిక్కడు సిరి కౌగిటలో
జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతి లతికావలి
జిక్కె నతడు లీల దల్లిచేతన్‌ఱోలన్
భాగవతం (దశమస్కంధం)
ఈ భగవానుడు లక్ష్మీదేవి కౌగిటికీ సనకాదిమునుల చిత్త సరోజాలలోను, వేదాలనే తీవలలోనూ కూడా చిక్కడు కానీ యశోదమ్మ భక్తికి వశుడైనా ఆ యమ్మచేత కట్టబడినాడు అంటుంది భాగవతం.
ఈ భాగవతమే మరలా ఇలా కూడా చెప్పింది చూడండి.
గజేంద్రుడు మొసలి బారిన పడి డస్సిపోయి ఇక నాపని అయిపోయింది. నన్ను రక్షించే నాథుడు భగవంతుడు తప్ప వేరు దిక్కులేదు అని ప్రాణముల్ ఠావుల్ దప్పె ... అనగానే వెంటనే ఎక్కడ ఉన్నాడని ఆ గజేంద్రం అనుకొంటుందో ఎక్కడ నుంచి ఏ విధంగా తన్ను రక్షించడానికి ఆపన్నహస్తుడై రావాలని కోరుకుందో అదేవిధంగా తన్ను తాను సృజియించుకుని మరీ వచ్చాడు ఆ లోకపాలకుడు అంటుంది ఈ భాగవతమే. అంటే కేవలం శరణు పొందితే వస్తాడనుకొంటే చాలదు. తన భక్తులు బాధ పొందినా, తనకోసం ఇతరుల వల్లకీడు పొందుతున్నారనుకొన్నా వారిని రక్షించడానికి వారిని కాపాడటానికి, వారిని రక్షించడానికి అవతల వారు రాక్షసులైనా సరే వారిని, మహా పాపాత్ములైనా సరే వారిని ఎదరించి వారిని కట్టడి చేసి ఆఖరికి వారిని సంహరించి అయినా ఆ దేవాది దేవుడు పరంజ్యోతిస్వరూపుడు అఖిలాండేశ్వరుడు వరదుడై వచ్చి తన భక్తులను రక్షిస్తాడు అని చెప్పటానికి- హరి గిరి ఎవరైనా సరే నేను చంపేస్తాను అంటూ గదహారాలు చేస్తూ నేనే సర్వేశ్వరుడిని, నేను తప్ప హరి అనువాడు లేనేలేడు అని మొరాయించే హిరణ్యకశ్యపుడు ఎక్కడరా నీ హరి ఎందున్నాడు అంటూ చిన్న పిల్లవానిని పసి పాపడిని నానా యాగీ చేస్తుంటే అన్ని లోకాలనిండా నిండి ఉండి ఇక్కడ చూపించగలవా అని హిరణ్యకశిపుని నోటి నుంచి రాగానే తన భక్తుడు, కృపారసానికి పాత్రమైనవాడు అతి చిన్న వయస్సువాడు తననే నమ్ముకున్నవాడు ‘సందేహమెందుకు తండ్రీ! నీవేవిధంగా కోరుకున్నావో అదేవిధంగా చూడగలవు’ అని అనగానీ ఆ కోపోద్రిక్తుడు, అజ్ఞాని, నాశనంలేనివాడినే, ఆది అంతము లేనివాడినే రూపమే లేని వాడిని చూపించమని స్తంభాన్ని మోదితే భువన బోంతరాళాలు దద్దరిల్లేటట్లు, ప్రళయకాలునిలా నరమృగరూపియై దిక్కులు పిక్కటిల్లేట్లుగా గర్జిస్తూ ముందుకు ఉరుకుతున్న( ఆ నారాయణ స్వరూపం ఆ హరిద్వేషికి, రాక్షసేంద్రునకు కనిపించలేదా?) ఒక్కసారిగా మీదికి ఉరికి ఒడిసి పట్టుకుని తన తొడలపై వేసుకొని చూస్తుండగానే పేగులు తెంపి పారేశాడే ఆ శ్రీమన్నారాయణుడు అపుడు అపరద్వేషిగా ఉన్న ఆ హిరణ్యకశిపుడు మాటలుడిగి చేతలు పడిపోయి నిశే్చష్టుడై ఆ పరంధాముడిని కళ్లప్పగించి చూడలేదా?
ఆ భగవానుడు అనుకోవాలే కానీ ఎపుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా తన్ను సంతోషింపచేసిన వారికే కాదు తనవారిని హింసించిన వారికి కూడా కనిపించి వారిని తుదముట్టించగలడు. తనవారిని తన అంకపీఠం పై కూర్చోబెట్టుకోగలడు అందుకే ఆ స్వరూపానే్న భగవంతుడని పిలుచుకుంటాం. చేతులారా మొక్కుతాం. భయభీతులై ఇంద్రియాలన్నీ పటుత్వం కోల్పోయి అచేతనావస్థలో కాక చేతనావస్థలోనే భక్తిసామ్రాజ్యంలో చక్రవర్తులై ఆ పరమదయాళువును, ఆ పరంజ్యోతిని, ఆ నిస్సంగుడిని, ఆ నిరాకారుడిని ఆకారుడై మనముందుకు రావాలని, అందరూ ఆ పరమేశ్వరుని కృపనుపొంది ఆ పరాత్పరుని చర్మచక్షువులతో చూడాలని, ఆ పరమేశ్వరుడు సర్వ కాలాల్లో, సర్వావస్థలలో అందరినీ రక్షించాలని సర్వే జనా సుఖినోభవన్తు అంటుంది భారతీయం. ఇంత భద్రత ఉన్న ఈ భక్తి సామ్రాజ్యంలోకి అడుగుపెడదాం .రండి.

-డా. రాయసం లక్ష్మి