పర్యాటకం

జగత్తుకు మేలు చేసే జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్నాథుడంటే జగత్తు కంతటికీ నాయకుడు. జగత్తుకు హితం చేకూర్చేవాడు. శ్రీ మహావిష్ణువు జగన్నాథ నామంతో భాసిస్తూన్న క్షేత్రం ‘పూరీ’గా నామాంతరం చెందింది.
పూరీలో వెలసిన క్షేత్రజ్ఞునికి ‘దారుబ్రహ్మం’, ‘చొక్కడోలా’, ‘చొక్కినయనా’, ‘పురుషోత్తముడు’అని ఎన్నో నామాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఆ ఒకే మూర్తిని జగన్నాథునివి.
భారతదేశంలోనే కాదు, హిందూ ధర్మం ప్రజ్వరిల్లిన పలు ప్రపంచ దేశాలలోని దేవాలయాలలో భగవంతుడు శిలారూపంలో సాక్షాత్కరిస్తాడు. కాని, పురుషోత్తమపురంలో దారురూపంలో పూజలందుకొంటుండడం ఒక జగన్నాథుడికే చెందడం విశేషం. పురుషోత్తమ క్షేత్రంలో శ్రీమహావిష్ణువు జగన్నాథ నామంతో ఉన్నట్లు ఋగ్వేదంలోనూ, పలు పురాణాల్లోనూ, మహాభారతంలోనూ పేర్కొనడం జరిగింది. అందువల్ల ఈ క్షేత్రం, క్షేత్రజ్ఞుడు సృష్ట్యారంభం నుంచి ఉన్నట్లు ప్రాచీనతను సంతరించుకుంది.
కృతయుగంలో నీలమాధవునిగా, ద్వాపరంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో జగన్నాథునిగా ప్రశస్తిపొందినట్లు వేద పురాణాల సాక్ష్యం ఉంది. ‘‘సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కుతం మనుష్యం’’
మానవాతీతుడైన పురుషోత్తముడు- ఆ జగన్నాథుని గురించి తెలుసుకోవడం దేవతలకే సాధ్యంకానప్పుడు, మానవ మాత్రులమైన మనకు సాధ్యమవుతుందా? అయినప్పటికీ పురాణాల ఆధారంగా, భౌగోళిక చరిత్రననుసరించి కొంతవరకు సమాధానాలు పొందవచ్చు.
కృతయుగంనుండి జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు. ప్రస్తుతం ‘పూరీ’గా వ్యవహరింపబడుతున్న పట్టణం పురుషోత్తమపురం. నీలాచలం, నీలాద్రి అను పలు నామాలున్నాయి. భారతదేశంలో ఉత్కళ ఖండమనే ప్రాంతంలో నీలాచలం ఉన్నదని స్కాంద పురాణం ఉటంకిస్తున్నది. నీలాచలంపై నీలమణిచే రూపొందించబడిన నీలమాధవుని శబరులు నిత్యం పూజించేవారని చరిత్రనుబట్టి తెలుస్తున్నది.
ఆనాటి మాళవ రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆతనికి నీలమాధవుని గురించి తెలిసి ఆలయం కట్టించాలనుకున్నారు. కాని, స్థలం తెలుసుకోలేకపోయేడు. విద్యావతి అనే బ్రాహ్మణ పురోహితునికి ఆ పని అప్పగించాడు. విద్యావతి తన పనిలో విశ్వావను అను శబరుల నాయకునితో పరిచయం చేసుకుని, ఆతని పుత్రిక లలితను వివాహం చేసుకుంటాడు. అలా నీలమాధవుని ఆచూకీ తెలుసుకుని, తన ప్రభువుకు తెలియజేస్తాడు. ఇంద్రద్యుమ్నుడు ఆనందంతో, మందీమార్బలంతో వస్తాడు. తీరా వచ్చేసరికి నీలమాధవుడే కాదు, శబరుల గ్రామంకూడా అదృశ్యమవడం ఆతనికి దుఃఖం కలిగించింది. ప్రాయోపవేశానికి కూర్చున్నాడు- నీల మాధవుని సాక్ష్యాత్కారానికి. ఇంద్రద్యుమ్నుని భక్తివిశ్వాసాలకు మెచ్చి అశరీరవాణి ‘‘అశ్వమేధ యాగం చేసి, నరసింహస్వామిని ప్రతిష్ఠించి పెద్ద ఆలయాన్ని నిర్మిస్తే నీ కోరిక నెరవేరగలదని’’ చెప్పడంతో ఇంద్రద్యుమ్నుడు అలానే చేసి, నరసింహస్వామికి పూరీ క్షేత్రంలో కోవెల నిర్మించాడు.
ఇంద్రద్యుమ్నుని దీక్షకు సంతసించిన శ్రీ మహావిష్ణువు కలలో సాక్ష్యాత్కరించి ‘‘సముద్రంలో సుగంధ భరితమైన దారువు ఒడ్డుకు వస్తుందని దానిని విగ్రహంగా మలచమని’’చెబుతాడు. కలలో చెప్పిన విధంగా దారువైతే లభించింది కానీ, దానిని నీలమాధవునిగా రూపొందించడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అక్కడ నీలమాధవుని చూచిన వారెవ్వరూ లేరు. చింతాక్రాంతుడైన ఇంద్రద్యుమ్నుని వద్దకు విష్ణుమూర్తి విశ్వకర్మతో వచ్చి దారువును జగన్నాథుని రూపంలో చెక్కి బ్రహ్మపదార్థాన్ని ఉంచి అదృశ్యమయ్యాడు. ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్న రూపం అదే! జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా ఉంటుంది. కాళ్ళూ చేతులు ఉండవు. మొండెం వరకే ఉంటుంది. అయితే నిండైన ముఖంలో గుండ్రని పెద్ద కళ్ళు రెప్పలు లేకుండా ఉంటాయి. రెప్పపాటు కాలం కూడా ప్రజలను రక్షించడానికి అడ్డంకి కారాదనే భావనగా చెబుతారు. అలా జగన్నాథునికి మొట్టమొదటి ఆలయం కట్టించినవాడు ఇంద్రద్యుమ్నుడు. ఇది పురాణ కథనం.
బ్రహ్మదేవుడు తానే స్వయంగా నృసింహ మంత్రాలతో ప్రతిష్ఠచేసినట్లు పురాణ కథనాలున్నాయి. ‘అనంత తత్త్వానికి సంకేతమైన నలుపు వర్ణతలో జగన్నాథుడు, శుద్ధ సత్వంకు ప్రతీకగా బలభద్రుని తెలుపు వర్ణం, ఐశ్వర్యశక్తికి సంకేతంగా పసుపు ఛాయలో సుభద్రాదేవి కనువిందు చేస్తారు. అంతేకాదు- బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు, జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అధర్వణ వేదానికీ ప్రతీకలని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడ’’ని పండితులు ప్రవచిస్తున్నారు.
జగన్నాథునికి ఏటా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)నాడు చందనోత్సవం జరుగుతుంది. రథయాత్రకు ప్రతి ఏటా కొత్త రథం రూపొందించే కార్యక్రమానికి ప్రారంభం ఈరోజునే. చందనోత్సవం ‘బహారే చందన్’, ‘్భత్తర్ చందన్’అని రెండు విధాలుగా జరుగుతుంది. మొదటి విధిని దయితపతులు (శబరులు) తెప్పోత్సవాలుగా జరిపితే, రెండో విధిని ఆలయంలో వైదిక పద్ధతిలో నిర్వహిస్తారు.
కృతయుగంలో విష్ణువు జ్యేష్ఠ పూర్ణిమనాడు ఆవర్భవించినందువల్ల ఆనాడు జగన్నాథునికి, ఆతని సోదరీ సోదరులకు ఊరేగింపు తరువాత జ్యేష్ఠ్భాషేకం నిర్వహించి పదిహేను రోజులపాటు ఏకాంతవాసంలో ఉంచుతారు. సాధారణ ప్రజలకు దర్శనం ఉండదు. నిత్య పూజా కార్యక్రమాలను దయితపతులు పారంపరికంగా నిర్వహిస్తారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ‘‘నవయవ్వన దర్శనం’’ పేరిట భక్తులను అనుమతిస్తారు.
ప్రపంచప్రఖ్యాతి పొందిన జగన్నాథ రథాయాత్ర ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది.
సాధారణంగా ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. కాని జగన్నాథుడు ఈ మాసంలోనే ప్రజలను ఆలయంనుండి బయటకువచ్చి పది రోజులపాటు వారి మధ్యనుండడం ఈ క్షేత్ర విశేషం. ఈ యాత్రను జగన్నాథుని ‘‘ఘోషయాత్ర’’గా, ‘గుండిచా యాత్ర’గా పిలుస్తారు. జగన్నాథుడు తన వేసవి విదియైన గుండిచా మందిరంలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఇంద్రద్యుమ్నుని భార్య గుండిచాదేవి. ఆమె పేరున నిర్మించిన ఆలయం ఇది.
రథాయాత్రకు ముందురోజుకు మువ్వురు మూర్తులకు మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధాన మందిరం ముందు సిద్ధంచేసి ఉంచుతారు.
జగన్నాథ ఆలయంనుండి గుండిచా మందిరంవరకు ఉండే వెడల్పైన మార్గాన్ని, ఆ మార్గంలో జరిగే యాత్రను ‘బడాదండా’గా పిలుస్తారు. రత్నీ వేదికనుండి మూలమూర్తులను ఊయల ఊపుతున్నట్లు ముందు వెనుకలకు కదలిస్తూ రథాలపై ఆశీనులను చేస్తారు. ఈ ప్రక్రియను ‘‘పహుండీ’’అని పిలుస్తారు. ఈ కార్యక్రమాన్నంతా పారంపరికులైన దయితపతులే (వండాలు) నిర్వహిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు పారంపరిక సాంప్రదాయానుసారం జగన్నాథుని తొలి సేవకుడు పూరీ మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రంచేసి, కల్లాపి జల్లుతాడు. అనంతరం అశేష భక్తులు రథాలను గుండిచా మందిరానికి తరలిస్తారు. ఆ సాయంత్రంలోపు చేరినట్లయితే రథాలను మార్గమధ్యంలోనే ఉంచి మరునాటి ఉదయాన తరలిస్తారు. అక్కడ మూలమూర్తులు 9 రోజులు నివాసం ఉంటారు. ఐదవ రోజున ‘హీరాపంచమి’ ఉత్సవం నిర్వహిస్తారు. తనను విడిచి వచ్చిన భర్తపై శ్రీలక్ష్మి ఆగ్రహించి జగన్నాథుని రథచక్రం యొక్క శీలను తొలగిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో దీనిని ‘శీల విరుపు’గా పరిగణిస్తారు. 10వ రోజున అనగా ‘హరిశయన ఏకాదశి’నాడు జగన్నాథుడు తిరుగుప్రయాణం చేస్తాడు. దీనినే మారు ‘రథాయాత్ర’గా పిలుస్తారు. ప్రధాన మందిరం ముందు జగన్నాథుడు సర్వాలంకార భూషితుడై రోజంతా భక్తులకు తన కృపా కటాక్షవీక్షణాలను ప్రసాదిస్తాడు. ఆ మరునాడు జగన్నాథుడు సోదరీసోదరులు, ఇతర మూర్తులతో కలసి రత్నవేదికపై ఆశీనులౌతారు. ‘‘అధర ఫాణాభోగ’అను తీయటి పానీయాలను మూలవిరాట్టులకు సమర్పించడంతో ‘రథయాత్ర’ సంరంభం ముగుస్తుంది. ఇంతటి సంరంభాన్ని మదిలో నింపుకుని జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ‘‘జగన్నాథస్వామీ! నయన పధగామినీ’ అంటూ జగన్నాథాష్టకం రచించడమేకాక, తను ప్రతిష్ఠించిన చతురామ్నాయాలలో ఒకదానిని మోక్షపురియైన పూరీ క్షేత్రంలో నెలకొల్పారు.
‘రధేన వామనం దృష్ట్య పునర్జన్మ విద్యతే’’అని శాస్త్రప్రమాణం. రథంలో ఉన్న జగన్నాథుని దర్శనంచేస్తే పునర్జన్మ ఉండదట. జగత్తుకు హితం చేకూర్చే జగన్నాథుని రథయాత్రను వీక్షించి తరించుదాం!

- ఎ. సీతారామారావు