పర్యాటకం

చిలుకూరు బాలాజీ ప్రదక్షిణల వేంకటేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంకటాద్రి సమంస్థానం
బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ నమో దేవో
న భూతో నభవిష్యతి ..
ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రిని మించిన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుని మించిన దైవమూలేడు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా, వడ్డీకాసుల వానిగా, ఏడుకొండల వానిగా, సప్తగిరీశుడుగా పేరెన్నిక గన్నవాడు భక్తుల కోరిక మేరకు తాను ఎక్కడ కావాలంటే అక్కడే ఒదిగి ఉండేవాడు ఆపదల మొక్కులవాడు. ప్రత్యక్ష నారాయణుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అటువంటి వేంకటేశ్వరుని దర్శనంకోసం దేశం నలుమూలల నుంచి కాదు ప్రపంచం నలుమూలల నుంచి పరుగెత్తుకుని వచ్చేవారెందరో నిత్యం కనబడుతుంటారు.
తిరుమల తిరుపతిలో కలియుగ దైవంగా నిత్యార్చనలు అందుకునే వేంకటేశ్వరుడు నిత్యాన్నదాత. ఎంతమందో భక్తులు స్వామి వారి కరుణాకటాక్షాలను పొంది వారి అనుగ్రహంతో మేం చల్లగా బతుకుతున్నామంటారు. స్వామి మహిమాన్వితుడు. ఆయన మహిమలను కథలు కథలుగా చెప్తుంటారు.
స్వామిని దర్శించుకోవడానికి ఆయన అపార వాత్సల్యాన్ని పొందడానికి కేవలం ఆయనపై భక్తి ఉంటే చాలు. కుమ్మరి వాడైనా, అపర కుబేరుడైనా స్వామి వారి కరుణ కావాలని అర్రులు చాచేవారే.
అటువంటి స్వామిని ప్రతి సంవత్సరమూ హైదరాబాదు నుంచి కాలినడక వెళ్లి గున్నాల మాధవరెడ్డి అను భక్తుడు స్వామిని దర్శించుకునేవాడు.
సుమారు 550 ఏళ్లక్రితం అలా వెళ్తుతున్న సమయంలో గున్నాల మాధవరెడ్డి ముదిమి వయస్సు కాలి నడకకు ఆటంకం కలుగచేసింది. దాంతో స్వామి వారిని ఎలా దర్శించుకోవడమా అని వాపోయాడు. అయినా అంతా ఆ వేంకటేశ్వరుడే చూచుకుంటాడని అపార న మ్మకంతో బయలుదేరాడు. కాని కొంత సేపటికే ఆయన ఎండ వేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే మాగన్నుగా నిద్ర పోయాడు. నిత్యమూ వేంకటేశ్వరనామంతో పునీతమైన ఆయన మనస్సు ఇపుడు కూడా వేంకటేశ్వర నామాన్ని జపిస్తూ ఉంది. అలా సొమ్మసిల్లి పడిపోయి నిద్రలోకి జారిన మాధవ రెడ్డి కలలో వేంకటేశ్వరుడు దర్శనం ఇచ్చాడు.
స్వామి ‘‘ఓ మాధవా! నీవు ఇక నా దర్శనం కోసం ఆయాస పడకు. నేనే నీ చెంతకు వస్తున్నాను. మీ ఇంటి దగ్గరలోని చిలుకూరుప్రాంతంలోని ఓ పుట్టలో కొలువై ఉంటాను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఆ పుట్టలో నుంచి నన్ను వెలుపలికి తీసి నాకో ఆలయాన్ని కట్టి అక్కడే నీవు దర్శించుకో. ఇతరులకు కూడా నా దర్శన సదుపాయాన్ని చేయించు’’ అని చెప్పారట.
ఆనందచిత్తంతో తల వూపుతూ మేల్గాంచిన మాధవ రెడ్డి తనకొచ్చి న స్వప్నాన్ని తలచుకుని అమితానంద పడ్డాడు. వెంటనే స్వామిని స్మరించుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.
తన మిత్రులతో కలసి పుట్టను వెతికి, గునపాలతో స్వామిని బయటకు తీశారు. అలా తీసే క్రమంలో స్వామికి ఎదభాగంలో గునపం కొస తగిలి రక్తం ప్రవహించింది. దాన్ని చూచి మాధవరెడ్డి మిత్రులు స్వామికి అపచారం జరిగిందని క్షమించమని వేడుకున్నారట.
ఈ స్వామిని బాలాజీగా సంబోధిస్తూ స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు. స్వామి వారి చెంతనే రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. గరుత్మంతుల వారిని, హనుమంతుల వారిని కూడా ప్రతిష్ఠించారిక్కడ. ఆ బాలాజీ చెంతనే ఈశ్వరుడు కూడా కొలవైనాడు.
ఈ స్వామిని దర్శించుకోవడానికి ఎలాంటి ఆర్జిత సేవా రుసుమును చెల్లించుకోనవసరం లేదు. కేవలం ఈ బాలాజీ తనకు ప్రదక్షిణలు చేసిన వారి కోరికలను ఈడేరుస్తూ ప్రదక్షిణల దేవునిగా ప్రసిద్ధి గాంచినాడు. ఏ ప్రత్యేక పూజలకు గాని, దర్శనానికి గాని రుసుమును వసూలు చేయరు. కేవలం ఎవరు ముందు వస్తే వారికే ఈ స్వామి వారి దర్శన సదుపాయం కలుగుతుంది. స్వామిని దర్శించుకోవడానికి తమ కోరికలు నెరవేర్చమని ప్రదక్షిణలు చేయడానికి తెల్లవారు జామున 4 గంటలనుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శని, ఆదివారాల్లో స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో జనం వస్తుంటారు. కేవలం 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికను స్వామికి నివేదించుకుని తర్వాత కోర్కె ఈడేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలనే నియమం తప్ప ఈ ప్రదక్షణల వేంకటేశ్వరునికి మరో నియమేమి లేకపోవడమే ఇక్కడి ప్రత్యేకత.
హైదరాబాదుకు వచ్చిన ఇతర ప్రాంతాల వారు కూడా స్వామి మహిమను తెలుసుకొని స్వామి దర్శనార్థం ఇక్కడకు వస్తారు. హైదరాబాదు నుంచి బస్సు సౌకర్యంతోపాటుగా ప్రైవేటు వాహన సౌకర్యం కూడా ఉంది.
ఈ స్వామిని దర్శించుకున్నవారికి త్వరగా వీసాలు వస్తాయన్న ప్రచారం కూడా ఉంది అందుకే వీసాల వేంకటేశ్వరుడుగా కూడా ఖ్యాతిగాంచాడు ఈ చిలుకూరు బాలాజీ.

- ఎస్. నాగలక్ష్మి