కడప

పర్యాటక కేంద్రంగా వెలిగల్లు ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, నవంబర్ 29: గాలివీడుకు 2 కిమీ దూరంలో పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రాజెక్టు ఈశాన్య దిశలో పార్కు ఏర్పాటు చేయడంతో నిత్యం సందర్శకులతో ప్రాజెక్టు పరిసర ప్రాంతం అలరారుతోంది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించడంతో ఈ ప్రాంతానికి వెలిగల్లు ప్రాజెక్టు వరంగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. దాదాపు రూ.200 కోట్లకు పై వ్యయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు కూడా ఏర్పాటు చేసి గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు 25 వేల ఎకరాల మెట్ట్భూమిని సాగులోనికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్‌కు 2.54టిఎంసిల నీరుచేరడంతో ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. దీంతో మూడు మండలాల్లో తాగునీరు అందించడానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నీటిని రాయచోటి పట్టణానికి తాగునీరుగా అందిస్తున్నారు. త్వరలో మండల కేంద్రానికి వెలిగల్లు ప్రాజెక్టు నీరు అందించేందుకు ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులు రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పార్కులో ఏపుగా మొక్కలు పెంచడం, ఈతకొలను ఏర్పాటు చేయడంతో సందర్శకులకు మరింత ఆహ్లాదకరంగా మారింది. రెండు గుట్టల మధ్య దక్షిణం నుంచి ఉత్తరానికి నీరు ప్రహించేలా ప్రాజెక్టు నిర్మాణం చేయడంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మరింత మహర్ధశ వస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పార్కు సందర్శనకు కడప జిల్లా వాసులే కాకుండా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు నిత్యం వస్తుంటారు. దీంతో పాటు ఈ ప్రాజెక్టు ప్రధాన కట్టపై రాజంపేట-తుంకూరు ప్రధాన రహదారి వెళ్తోంది.. కట్టపై నిలబడి ఎగువ నిలిచిన నీటిని, దిగువ ఉన్న పార్కు గండిమడుగు పరిసర ప్రాంతాలను చూస్తే ఎంతటి వారికైనా ఒళ్ళు పులకిస్తోంది.
నూటొక్క దేవుళ్ళకు నెలవు గండిమడుగు
పవిత్ర పాపాఘ్ని నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన గండి మడుగు(నీటిమడుగు) ఉమామహేశ్వరస్వామి దేవస్థానం నూటొక్క దేవుళ్లకు నెలవుగా ఉందని పెద్దలుచెబుతుంటారు. రెండు కొండల నడుమ పారుతున్న పాపాఘ్నినది,నదికి తూర్పు ఒడ్డున బృగుమహర్శిచే ప్రతిష్టించిన ఉమామహేశ్వర్లు, పాగేటి గంగమ్మ ఆలయాలకు ఎంతో ప్రాశస్థ్యం ఉంది. ఇక్కడ పూర్వం మహామునులు తపస్సు చేసిన గుహ కూడా ఉంది. పాపాఘ్నినదిలో స్నానమాచరించి ఉమామహేషశ్వరున్ని సేవించి ఋషులు, చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలంలోని మల్లయ్య కొండలో వెలిసిన శ్రీమల్లేశ్వరస్వామిని దర్శించేందుకుగుహ ఏర్పాటు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.. నేటికి గుహను ఎందరో సందర్శిస్తుంటారు.
రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి
కమలాపురం, నవంబర్ 29: ఇటీవల కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరదలకు గురై తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతాంగానికి ప్రభుత్వం పూర్తి సబ్పిడీతో ఉచితంగా విత్తనాలు మంజూరు చేయాలని జిల్లా వైసిపి రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి డిమాండ్ చేసారు. ఆయన ఆదివారం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఠాకూర్ నాయక్ ను జడ్పీటిసి, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదల వల్ల రైతులు పెద్ద ఎత్తున వరి,మినుము,శనగ,పత్తి,వేరుశనగ,ప్రొద్దు తిరుగుడు తదితర పంటలు నీటమునిగి నష్టపోయారన్నారు. దీంతో కోట్లాది రూపాయల పంట నష్టం జరిగిందన్నారు.ప్రధానంగా వరి పంట సుమారు 5వేల హెక్టార్లలో నీటమునిగి చేతికొచ్చిన ధాన్యం మోసులెత్తి విపరీతంగా నష్టం జరిగిందన్నారు. అలాగే పప్పుశనగ దాదాపు 12వేల హెక్టార్లలో మినుము 8వేల హెక్టార్లలో,పెసర 6వేల హెక్టార్లలో నష్టం జరుగగా ఇతర పంటలు కూడా సుమారు 4వేల హెక్టార్లలో నీట మునిగి లక్షల్లో నష్టమేర్పడిందన్నారు. ప్రస్థుతం జిల్లాలో చాలాచోట్ల రైతులు కుళ్లిపోయిన పంటలను పీకివేసి ఆ స్థానంలో తిరిగి పంటలు సాగు చేసెందుకు ముమ్మరమవుతున్నారన్నారు. ఐతే ప్రభుత్వం అధికారులతో నష్టాన్ని అంచనావేయించడం జరిగిందని ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్ట పరిహారం కాని,తిరిగి విత్తనాలు పంపిణీ చేస్తామని కాని భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఇన్‌చార్జ్ గంటా శ్రీనివాసరావ్,మంత్రి పరిటాల సునీత పర్యటించారే కాని రైతులకవసరమైన సహాయం అందించకలేకపోయారన్నారు. రైతులకు సాయం అందించడంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కడప రైతులపై వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వరదనష్టం జరిగిన చిత్తూరు,నెల్లూరు జిల్లాల పట్ల చూపుతున్న శ్రద్ద కడప జిల్లాపై చూపకపోవడం అన్యాయ మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో ప్రత్యామ్నాయపంటలు సాగుచేసెందుకు రైతులకు పూర్తి సబ్సిడీతో విత్తనాలను వెంటనే మంజూరు ఆయన డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో చెన్నూరు జడ్పీటిసి చీర్ల సురేశ్‌యాదవ్, ఇతర వైసిపి పార్టీ నేతలు భాస్కర్‌రెడ్డి,మల్లారెడ్డి,శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
రాయచోటి, నవంబర్ 29: కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడో మూలప్రాంతం అనుకుంటున్నారనుకుంటే పొరపాటే పట్టణంలోని రద్దీ ప్రాంతాలైన కొత్తపేట ఎంపియూపి స్కూల్, మండల పరిషత్ కార్యాలయం వెనుకభాగాన ప్రభాకర్ సీడ్స్ కంపెనీ వద్ద ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్నాయి. ఎంపియూపి స్కూల్ గేటుకు ఎదురుగా ఉంది. ఈ ప్రధాన వీధి నుండి నిత్యంవందల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వేలమంది ప్రజలు ఇటు ఈదారి వెంబడి వెళ్తుంటారు విద్యార్థులు నిత్యం స్కూళ్లకు వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో రోడ్డు ఆనుకుని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసి కంచెవేయడం విద్యుత్ అధికారులు మరచిపోయారు. ప్రమాదం జరిగే అవకాశాలు ఎకువగా ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన తరువాత అధికారులు చర్యలు చేపట్టేకంటే ప్రమాదాలు జరగకముందు అధికారులు స్పందించి వాటికి కంచెలు ఏర్పాటుచేస్తే చాలా మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా మండల పరిషత్ ఆఫీసు వెనుకభాగాన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచలేదు అందునా ఇరుకుస్థలంలో రోడ్డుపైన విద్యుత్ స్తంభం ఉంది దానికి ఫీజు కారియర్లు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీ ప్రాంతం అయినందున ఈ దారి వెంబడి పలు వాహనాలు తిరుగుతుంటాయి. ఈ విద్యుత్ స్తంభం రోడ్డుపై ఉండటం వలన నిత్యం ఇక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అయితే ఇటు రెండు వాహనాలు ఒకేసారి వెళ్లే పరిస్థితి లేదు. ఈ విద్యుత్ స్తంభం పక్కన ఏర్పాటుచేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి ప్రధానవీధిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటుచేసి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులకు ఎంతైనా ఉంది.

భక్తుల కోర్కెలు తీర్చే కొండగోపాలస్వామి
బద్వేలు, నవంబర్ 30: కడప - బద్వేలు ప్రధాన రహదారి అట్లూరు మండలం రెడ్డిపల్లె గ్రామానికి పశ్చిమ భాగాన సుమారు ఐదు మైళ్ల దూరంలో శ్రీ లంకమల్ల అభయారణ్యంలో కొండగోపాలస్వామి (వేణుగోపాలస్వామి) ఆలయం కలదు. పురాణాల ప్రకారం క్రీ.పూ.400 సంవత్సరాల క్రితం మట్టిరాజులు ఈ ఆలయం నిర్మించారు. అయితే మరికొందరు చాళుఖ్య చక్రవర్తి నరేంద్ర మృగరాజు ఆలయాన్ని 6వ శతాబ్దంలో నూరు యుద్ధాల విజయోత్సవ సందర్భంగా పాప పరిహారాలకు, తల్లిదండ్రుల సుకృరానికి ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాన ఉన్న కొండ వరుసలు పశ్చిమగా గండి నుంచి తూర్పుగా పెట్టిన కోట గోడలా వ్యాపించిన కొండలలో ఈ ఆలయం వుంది. దీనికి సమీపాన ఒకే రాతితో కూడిన కోనేరు, కోనేరులో నిరంతరం నీరు పుష్కలంగా ఉంటుంది. దానిపైన పెద్ద అఘాధం, చతురస్రాకారంతో ఉన్న పసుపు గుండాలు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వెలసి వున్నాయి. ఇక్కడ వున్న స్వచ్ఛమైన జలంతో మునులు జలాభిషేకం చేసి స్వామివారిని పూజించే వారని సమాచారం. కొండపైకి వెళ్లినట్లయితే జ్యోతేశ్వర ఆలయం కనిపిస్తుంది. కొండలో కొలను నుంచి బయలుదేరు సెలయేరు ఒడ్డున గల పెద్ద పేటిక కింద గోపికాస్ర్తిల ప్రతిమలు భక్తాదులచే పూజింపబడుతున్నాయి. దేవాలయ సమీపం నందు ఒక పూల తోట వుండుట ప్రతీతి. ఆ తోట సమీపం నందు కొందరు బోయవారు ఆవులను మందలో దొడ్లను వేసుకొని జీవనం సాగించేవారట. అందులో ఒక ఆవు ప్రతినిత్యం ఒక పుట్ట దగ్గరకు వెళ్లి తన పాలను పుట్టలో వదులుతోందని, ఆవు సాయంకాలం పాలు ఇవ్వకపోవడంతో వెంబడించి గమనించగా శిలా రూపంలో వున్న వేణుగోపాలస్వామి ప్రత్యక్షమై ఆ గొల్లవాడిని శిలాకృతి చెందమని శపించి అదృశ్యమైనట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ గొల్లవాడు తన మొక్కబోయిన గొడ్డలి భుజాన వుండునట్లు ఒక శిలా విగ్రహం ఆలయం ఎదుట ఇప్పటికీ భక్తాదులకు దర్శనమిస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసం నందు పలు జిల్లాల నుంచి శ్రావణ మాస నాలుగు వారాలలో భక్తాదులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు సమర్పించి సంతానం లేని వారు వృక్షానికి ఊయల కట్టి మొక్కులు తీర్చికుంటారు.