శ్రీవిరించీయం

కలిసి వుంటే సుఖమే - కాని కళ్యాణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛ..ఛ.. చదివించి ఉద్యోగం చేసుకోమంటే యింత బరితెగింపా? ఇదేం ఫారిన్ అనుకుంటున్నావా? లివింగ్ టుగెదర్లు చేస్తూ వుంటే చుట్టూ జనం వూరుకోవటానికి, మీ మామయ్య చెబుతోంటే తల ఎత్తుకోలేకపోయాం. ఎవరన్నా ఏమనుకుంటారన్న భయమన్నా లేకుండా యింత తెగింపా?’- ఈ మాటలు అంటున్న ఆడపిల్ల తండ్రి శ్రీహరి మొహం కోపంతో, అవమానంతో ఎర్రబడింది.
-ఈ సన్నివేశం డి.కామేశ్వరి వ్రాసిన కథానిక ‘లివింగ్ టుగెదర్’ అన్నదానిలో తారసపడుతుంది.
ఆ అమ్మాయి ‘చిత్ర’ చిన్నతనం నుంచి తల్లిదండ్రుల పోషణలోనే ఆప్యాయంగా మురిపెంగా పెరిగింది. ఇంజనీరింగ్ చదువుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. ఆడపిల్లలా కాకుండా, మగరాయుడుగా తయారయిన ప్రవర్తన. అయినా హాస్టల్‌లో వుంటూన్న తల్లి చేసిన బోధ యిది: ‘నీ యిష్టం వచ్చినవాడినే చేసుకో. ఆ చూసుకోవటం, చేసుకోవడం ఏదో త్వరగా చెయ్యి. పాతికేళ్లు నిండకుండా చేసుకో. ఏ వయసుకాముచ్చట. ఆలస్యం అయితే అన్నీ ప్రాబ్లెమ్స్’- చిత్ర రుూ బోధను పాటిస్తూనే తోటి ఉద్యోగస్థుడు ‘గౌతమ్’ అనే అతన్ని ఎంచుకుంది. పరిచయం ప్రేమగా మారి అతన్ని హాయిగా కలుసుకుందుకు వీలయేట్లుగా హాస్టల్ నుంచి ఒక చిన్న ఇంటికి స్థావరం మార్చుకుంటుంది. గౌతమ్ కూడా తను వుంటున్న ‘రూం’ నుంచి బదిలీ అయి రుూ ఇంట్లోనే వుంటూ ఇద్దరూ ‘లివింగ్ టుగెదర్’ ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకుని, ప్రత్యక్షంగా వచ్చిన తల్లిదండ్రులు, ఆమె ఇంటికి వస్తారు. అప్పటివరకు అక్కడే వున్న గౌతమ్ పరుగెత్తుకుంటూ పోయి వాళ్ళ కంట పడనక్కర్లేకుండా, స్నేహితుడి గదిలో తలదాచుకుంటాడు. గౌతమ్‌తో కలిసి కాపురం చేయటానికి సిద్ధపడి, పెళ్లికోసం కూడా తాపత్రయపడుతున్న చిత్ర జీవితంలో రుూ ఆరు నెలలు వచ్చిన మార్పులు కథనంలో కులాసాగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు గౌతమ్ పెళ్లిచేసుకో, అతన్ని పిలిచి మాట్లాడుతాం అన్నపుడు కూడా అతను ప్రత్యక్షం అవడు. పైగా చిత్ర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినపుడు ‘అబ్బా.. ఎంత చదివినా, ఉద్యోగాలు చేసినా మీ ఆడవాళ్లకి ఎప్పుడు పెళ్లిగోలే! పెళ్లయితే తప్ప లైఫ్‌కి సెక్యూరిటీ లేదనుకునే సగటు ఆడదానికీ, నీకూ తేడా ఏముంది?’ అని హేళనగా అంటాడు.
అతని ప్రవర్తన కూడా ఇదివరకులాగా కాకుండా వేరుగా వ్యతిరేకంగా మారిపోయినట్టు గమనిస్తుంది చిత్ర. అయినా చేసేదేమీ లేక అతని అంగీకారం యివాళో రేపో దొరుకుతుందని ఎదురుచూస్తూ వుంటుంది. ఇంతలో గౌతమ్‌కు టెలిగ్రాం వస్తుంది, తండ్రికి సుస్తీగా వున్నదనీ- వెంటనే రమ్మనీ! అతను హడావుడిగా వెళితే యిది దొంగ టెలిగ్రాం అని తేలుతుంది. తల్లిదండ్రులు అతనికో సంబంధం ఖరారు చేసి- మహరాష్ట్ర బ్రాహ్మల అమ్మాయితో అతని వివాహానికి ఏర్పాట్లు చేశారు. ‘పెళ్లికాకుండా కాపురాలు చేసే పిల్లని చచ్చినా కోడలిగా అంగీకరించం’ అని తల్లిదండ్రులు ఘంటాపథంగా చెప్పారు. ‘ఆ అమ్మాయి యిలా నీతో కాపురం వెలిగించే ముందే నిన్ను పెళ్లిచేసుకోమని అడిగి వుంటే అలాంటి అమ్మాయిని కోడలిగా స్వీకరించటానికి మాకేం అభ్యంతరం లేదు. ఆడపిల్ల అంత తెగించి, బరితెగింపుగా పెళ్లి ప్రసక్తి లేకుండా నీతో ఏడాదిగా వున్నదంటే ఆ అమ్మాయి కారెక్టర్ ఎలాంటిదో తెలుస్తోంది. అలాంటిపిల్లనా నీవుచేసుకునేది?’ అని కొడుకును దులిపిపారేశారు. ఈ పెళ్లి సంబంధంతో వచ్చే కోటి రూపాయల ఆస్తి అతనికి ఆకర్షణ అనీ, అందుకనే తల్లిదండ్రులమీద భక్తి ఎక్కువయిపోయి, తనతో తెగతెంపులు చేసుకుందుకు సిద్ధమయిపోయినాడని చిత్రకు స్పష్టం అవుతుంది.
చిత్ర పరిస్థితులను క్షుణ్ణంగా సమాలోచించుకోగలిగింది. ‘ఇప్పటికే తన ప్రేమ, ఎమోషన్స్, శక్తి, డబ్బు అన్నీ చాలా ఖర్చు చేసుకుంది. ఇంకొక మాట కూడా మాట్లాడి తన ఎనర్జీ, ప్రేమని వృధాపరచదలుచుకోలేదు’. చిత్ర ఆతని బట్టలు, సామాన్లు సూట్‌కేసులో, షోల్డర్ బ్యాగ్‌లో పడేసి తీసుకువచ్చి వీధి తలుపు తీసి బయట పడేసి ఇంక వెళ్లచ్చు అన్నట్లుగా ‘మండుతున్న కళ్లతో నడుంమీద చేతులు పెట్టుకుని నిల్చుంది’.
కథ ఇక్కడితో అయిపోయినా, చిత్ర లాంటి అమ్మాయిల భవిష్యత్తు ఎలా ముందుకు సాగుతుంది? అని ఆలోచన చేయవలసిన అవసరం పాఠకుడికి మిగిలిపోతుంది. వివాహ వ్యవస్థకు మన దేశంలో వున్న విలువ వేరు, పాశ్చాత్య నాగరికతలో వున్న తాత్కాలిక అవసర సంపర్కం వేరు. చదువుకున్న ఆడపిల్లలు రుూ సంధియుగంలో తమ జీవన గమనం ఎలా సాగాలని, సవ్యంగా కొనసాగాలని నిర్ణయించుకుంటారో- తగిన సమయంలోనే నిర్థారించుకోవాలనడం శ్రేయస్కరం. చూస్తూ చూస్తూ పెనంలోంచి పొయ్యిలోకి పడిపోగూడదు అన్న సందేశం యిస్తుంది ఈ కథానిక.
స్ర్తి విద్యనే ఒకప్పుడు అంగీకరించని ఈ సమాజం, యిప్పుడు స్ర్తి స్వాతంత్య్రానికీ- వ్యక్తిత్వ పోషణకూ దీపం చూపుతోంది. ఈ అవకాశాలను సవ్యంగా, సజావుగా వినియోగించుకోవడంలోనే విజ్ఞత వున్నది.

-శ్రీవిరించి