శ్రీవిరించీయం

ప్రాంతీయత - ఇతివృత్తాల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు తెలుగులో అనేక రకాల కథలు- ప్రణయం, ప్రళయం, సాంసారికం, సమానత్వం- మున్నగు వాటిని వివరించి చెప్పేవి వున్నాయి గాని ప్రాంతీయత సంతరించుకున్న ఇతివత్తాలతో కూడిన కథలు తక్కువ. అమరావతి కథలు (శంకరమంచి సత్యం), గోదావరి కథలు (బి.వి.ఎస్.రామారావు,) కృష్ణాతీరం కథలు (పోలవరపు కోటేశ్వరరావు) వంటి కొన్ని వేళ్లమీద మాత్రమే లెక్కించగల కథా సంపుటాలు కనిపిస్తాయి. జిల్లాలవారీగా రచయితల సంఘాలు ఏర్పడిన తరువాత, కొందరు ఆ జిల్లాకు సంబంధించిన రచయితల (కథకుల) కథలు సంపుటీకరించి ప్రచురించారు. అయితే అవన్నీ ప్రాంతీయతను బయలుపరిచే రచనలు అని చెప్పటానికి వీలులేదు. ఆ ప్రాంతం తాలూకు నాగరికత, పడికట్టు పదాలు, వాడుకలో వున్న పదాలు, సామెతలు ఉపయోగించితే తప్ప కథలను ‘ఆ ప్రాంతపు కథలు’ అనడం భావ్యం కాదు. అక్కడికి ప్రజల తీరుతెన్నులు, జీవన సరళి, వ్యవహార నియమావళులతో పరిచయం తీసుకురాని కథలను ‘ఆ ప్రాంతపు కథలు’ అనడం అక్కడి నుడికారాన్ని తక్కువ చేయడమే అవుతుంది. మాండలికంలో వ్రాసిన కథలు తప్పనిసరిగా ఈ ప్రాతిపదిక ప్రకారం ప్రాంతీయతను కొంతవరకు అనుసరించి ఉంటాయి. అయితే మళ్లీ కథనం మామూలు భాషలో నడిపి, పాత్రల సంభాషణలు మటుకు మాండలికంలో జరిపితే- కొద్దిగా అనుమానించవలసి వస్తుంది. కథా వస్తువు ఆ ప్రాంతీయతను ప్రతిబింబించేట్లయితే రుూ అనుమానం తొలగిపోయే అవకాశం వుంది.
ప్రాంతీయతను పుణికిపుచ్చుకున్న కథలను ఏరుకోవడం ప్రయత్నించినపుడు శ్రీ గుడిపూడి సుబ్బారావుగారు వ్రాసిన ‘మునగాల పరగణా కథలు’ అన్న సంపుటం ముందుగా చేతికి వచ్చింది. ఎక్కువ ప్రచారంలో లేని రచయిత అవడంవల్ల కూడా రుూ ప్రక్రియను ప్రవేశపెట్టడంలో సమంజసత కనిపించింది. ఈ సంపుటంలో 16 కథలు వున్నవిగాని వాటిలో సగభాగం కథా చిత్రికలు (స్కెచెస్)గానే పరిగణనకు వస్తాయి. ముందుగా మునగాల పరగణా గురించిన పరిచయ వ్యాసం వుంది. మునగాల యిపుడు నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి చెందినదే అయినా, కొన్ని సంవత్సరాల క్రితం అది కృష్ణా జిల్లాలో భాగం. మునగాల పరగణాకు సంస్థానాధీశులుగా వుండిన నాయని వెంకట రంగారావు 1900లో అధికారం స్వీకరించిన తరువాత తెలుగు భాష ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో కృషి చేశారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఆయనకు దివాను.
కథలకు ముందు రచయిత ఆత్మ కథలో భాగం అనదగ్గ ‘అపూర్వ కథ’ తారసిస్తుంది. సుబ్బారావుకు చిన్నపరెడ్డి అనే స్నేహితుడు వున్నాడు. ఇద్దరూ హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో సహవాసులు. చిన్నపరెడ్డికి హితోపదేశం చేసి, పెద్దలు కూర్చిన పెళ్లి చేసుకునేట్లు చేస్తాడు సుబ్బారావు. తరువాత, చిన్నపరెడ్డికీ సుబ్బారావుకు మళ్లా కలుసుకోవడం జరగలేదు. అయితే సుబ్బారావులో ప్రత్యేకత ఏమంటే- చిన్నపరెడ్డిని కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ‘రెండున్నర ఏళ్ల క్రితం అతను చనిపోయాడు’ అనే వర్తమానం దొరికింది. ఆ కుటుంబాన్ని కలుసుకుని తృప్తుడు కాగలిగాడు.
ఈ సంపుటాలలో ప్రధానమైన కథ ‘కరువుకాలం’ అనేది. దేశంలో కరువు ఏర్పడితే వరమ్మ అనే ఆమె (జగన్నాధపురం కొల్లు వీరయ్య అనే పెద్ద రైతుకు భార్య) ప్రజలను ఆపదలనుంచీ, ఆకలినుంచీ రక్షించింది. ఈ విషయం కర్ణాకర్ణిగా తెలుసుకున్న మునగాల పరగణా రాణివారు భర్తను ప్రేరేపించి జనోపకరణమయిన పనులు చేయిస్తుంది. వరంగల్లు జిల్లాలో పాఖాల చెరువు నిర్మాణం గురించి మరో కథ, కాకతీయ చక్రవర్తులకు కులగురువు అయిన విశే్వశ్వర దేశికులవారి మంత్రశక్తి, వడ్డెర వాడి వేషం వేసుకుని ధైర్యంగా ముందుకు వచ్చి కూడా, చివరిదాకా నిలదొక్కుకోలేని ప్రతాపరుద్రుని ప్రతాపం రుూ కథకు ఆయువుపట్టు.
కథలన్నీ ఆ ప్రాంతపు జనం జీవితానుభవాలే. ‘విరిసిన గాజుల హరివిల్లు’ చిన్నతనంలో ఒక అమ్మాయి గాజులు తొడిగించుకుని మురిసిపోవడంలో వున్న ఆనందం పాఠకులతో పంచుకుంటుంది.
చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ‘పుట్టినిల్లు’ రూపురేఖలు మాసిపోవడంతో అక్కడి తన అనుభవాలను గుర్తుచేసుకునే కథ ‘శిథిలమైపోయిన నా పుట్టిల్లు’. అలాగే ‘పానగలు చెరువు కథ’ కూడా. హైదరాబాద్, సికిందరాబాద్ ఎలా కల్సిపోయాయో, నల్లగొండ-పానగల్లు అలా కలిసిపోయాయి అని రచయిత తుది పలుకు.
‘రెండు కోడిగుడ్లకోసమా?’ అనే కథలో రాజావార్ల పట్టుదలలు ఎలా వుంటాయో విశదపరుస్తుంది. ‘ఏహ్యంగానూ, హుందాగాను, అల్పంగానూ మరి వీరందరు ఏం సాధించినట్లు? యాభై ఏండ్లుగా హృదయంలో దాచి వుంచిన విషయాలను మీ ముందు వుంచుతున్నాను... ఇప్పటికీ రుూ కథను ఆ ప్రాంతంలో చెప్పుకుంటూ వుంటారు. అలా జరగకుండా వుండాల్సివుండెననీ, ఆత్మ సంఘర్షణ పడుతూ వుంటారు. ‘ఇదేం విడ్డూరం’ రెండు కోడిగుడ్ల కోసమా ఇంత విషాదం జరిగింది అని వుసూరుమంటూ వుంటారు ప్రజలు!
‘రాజావారి పౌరుషం’ 1787 సంవత్సరం నాటి సంగతి. నైజాం ప్రాంతాలయిన సూర్యాపేట తాలూకా, హుజూర్‌నగర్ తాలూకా, ఖమ్మం తాలూకాల మధ్య భాగంలో దీనిలా వుంటుంది మునగాల పరగణా’ అనే భౌగోళిక వివరం రుూ కథలో దొరుకుతుంది. కందిబండ జగ్గయ్య కథ యిది. ‘జగ్గయ్య కాలం చేసిన తరువాత తన తండ్రి పేరు మీదుగా జగన్నాథపురాన్ని, (జెగ్గూడెం), తన తల్లి సీతమ్మ పేరుమీదుగా సీతానగరాన్ని నిర్మించాడు జగ్గయ్య ఒక్కగానొక్క కొడుకు, ఇజారాదారుడు అయిపోయి.
‘దొరవారి సేద్యం’ కథ సైదికానిగూడెం అనే వూరు పాలేరుగా ఎలా మారిందో చెబుతుంది. దొర తన స్వంత గ్రామం వదలి- జనానికి దూరంగా వెళ్లడం ఇష్టంలేని సందర్భం- పోవటానికి అంగీకరించని ఉదంతం. జమీందారీలు, దొరతనాలు పోయిన చరిత్రను తెలియజెప్పే కథ.
పాత రోజులతోపాటు, భారత స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ప్రజా పాలనలో ఎలాంటి మార్పులు చేర్పులు సమకూడాయో చెబుతాయి ‘నిజాంను మించిన నయా నవాబులు’ కథ.
‘అల్లాకు మన రాజ్యంమీద కోపం వచ్చింది.. నాయకనగూడెం నుంచి సైదికాని గూడెం వరకు మనం పెద్ద కట్ట పోయించినట్లయితే అక్కడో పెద్ద చెరువు తయారవుతుంది.. మీ డబ్బు వడ్డీతో ఇస్తాను. ఎన్ని వందలు ఇవ్వగలిగితే అంత యివ్వండి అన్నాడు నవాబు. ఒక గొల్లామె బస్తా రూపాయిలు అక్కడ రాశి పోసింది. అలా పోగైన డబ్బుతో పాలేరు రిజర్వాయర్ పూర్తి అయింది. కథకు రచయిత ఇచ్చే ముక్తాయింపు చూడండి: ‘‘ఆ రోజుల్లో పాతిక లక్షలతో మొత్తం పాలేరు రిజర్వాయర్ నిర్మాణమే పూర్తి అయింది. అది ధర్మకాలం. అయితే గత సంవత్సరం అదే పాలేరు రిజర్వాయర్ కట్టను వెడల్పు చేసి షోకులు చేశారు. పదికోట్లు ఖర్చయింది. ఎక్కడ పాతిక లక్షలు, ఎక్కడ పది కోట్లు? ఎవరెంత మింగారో ఎవరికెరుక?’’- కథ పేరు కూడా ‘ఎవరికెరుక’ అనే.
ప్రాంతీయ చరిత్ర, పదజాలం, పరిపాలనలో క్రమానుగతంగా వచ్చిన మార్పులు వీటన్నిటినీ రుూనాటి కళ్లతో చూచి, ప్రవచించిన కథలు ఇవన్నీ! వాస్తవ గాథ చిత్రణలో ఈ పుస్తకం పరిగణనీయం అయినదే అవుతుంది.

-శ్రీవిరించి