సబ్ ఫీచర్

బ్యాంకింగ్‌పై అపనమ్మకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెద్దాయన మాటంటే.. బ్యాంకులో మూటే’ అనే నానుడి జన వ్యవహారంలో ఉండేది. అంటే బ్యాంకులో డబ్బు దాచుకుంటే ఎంత భద్రంగా, వినియోగానికి వీలుగా వుంటుందో- పెద్దాయన ఇచ్చిన వాగ్దానం కూడా అంత విలువైనది అని అర్థం. ఇది పాతకాలం నాటి మాట. ఇప్పుడు ప్రజల్లో అలాంటి నమ్మకం సడలిపోతున్నది. గత సంవత్సరం నవంబర్ 8వ తేదీన పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే నగదు వినిమయం గురించి ఎన్నో నియమ నిబంధనలు విధించారు. నిబంధనలు లేకుండా ఏ వ్యవస్థా క్రమశిక్షణతో పని చేయలేదు. నిజమే. కానీ కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వంటి అతిపెద్ద వ్యవస్థలు ప్రకటించే నియమ నిబంధనలు పరస్పర విరుద్ధంగా వుండకూడదు. రెండవసారి ప్రకటించే నియమం- మొదట ప్రకటించిన అదే నియమాన్ని రద్దు చేసేలా కానీ, ఆచరణలో ప్రజలకు కష్టం కలిగించేలా లేదా అనుమానాలను కలిగించేలా కానీ ఉండకూడదు.
నోట్లరద్దు తరువాత విడుదలైన నియమ నిబంధనలు ప్రజలను అనిశ్చిత పరిస్థితుల్లో వుంచాయి! పెద్దనోట్ల రద్దు వలన లాభమెంత? నష్టమెంత? అన్న విషయంపై చర్చ కాదిది. ప్రజల మధ్య జరగవలసిన ఆర్థిక లావాదేవీలు, నగదు భద్రత, నగదు వినిమయం, నోట్ల మార్పిడిల విషయంలో ఏర్పడిన అనిశ్చితి, సందిగ్ధ పరిస్థితులను విశే్లషించుకోవలసి వుంది. నోట్ల రద్దు కాలంలో విడుదలైన నిబంధనలు కొన్ని పరస్పర విరుద్ధంగా ఉన్నవి. అందువలన ప్రజలు అయోమయంలో పడ్డారు. బ్యాంకు నుండి ఒక ఖాతాదారుడు తన డబ్బును ఎంత మేరకు తీసుకోవచ్చుననే విషయంలో మార్పులు చేశారు. బ్యాంకులో తమ ఖాతాలో గరిష్టంగా ఎంత డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చుననే నిబంధనలోనూ అస్పష్టత రాజ్యమేలింది. ఇందువలన ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ అనిశ్చితికి కారణం నిర్దిష్టమైన విధానం లేకపోవడమే.
పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని చెబుతునే మరోవైపు 2 వేల రూపాయల నోట్లు విడుదల చేశారు. ఇప్పటికీ అవి దైనందిన వ్యవహారాల్లో మారకం కష్టంగానే ఉంటున్నది. అంతేకాక రెండు వేల రూపాయల నోట్లను తిరిగి ఉపసంహరిస్తారనే అనుమానం ప్రజల్లో ఇప్పటికీ కొనసాగుతున్నది. అందువలన ఆ నోట్లను తీసుకోవడానికి చిన్న వ్యాపారులు, ప్రజలు సుముఖత చూపడడం లేదు. మరోవైపు పది రూపాయల నాణెం మారడం లేదన్న పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్లలో నిజం లేదని చివరికి రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది. ఈ పుకార్లను ఎవరు సృష్టిస్తున్నారు? బ్యాంకుల్లోనూ పదిరూపాయల నాణాలను తీసుకోవడం లేదన్న వార్తలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి.
ఇటువంటి అస్పష్టత, అనిశ్చితి వలన డబ్బు మారకం పట్ల, బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలుతోంది. ఎప్పుడు ఏ రూపంలో కొత్త నిబంధన వస్తుందో, తమ డబ్బు బ్యాంకు ఖాతాలో వుండిపోతుందేమోనని ప్రజలు అపనమ్మకంతో వుంటున్నారు. పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారుల విషయం వేరు. కానీ సాధారణ ప్రజలు తమ దగ్గర అయిదు లేదా పది లక్షలు గానీ నగదు ఉంటే, భద్రత కోసం బ్యాంకు ఖాతాలో వేసుకునే వారు. అవసరం కలిగినపుడు రెండు మూడు లక్షలు తీసుకుని వాడుకోవచ్చుననేది వారి నమ్మకం! కానీ ఇప్పుడు ఒకేసారి అంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేసినా, తీసినా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వస్తుంది. దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఆ డబ్బుకు నిజమైన ఆధారం వున్నప్పటికీ ఎందరు సాధారణ వ్యక్తులు ఐటి ఆఫీసుల చుట్టూ తిరగగలరు? పద్ధతులు వారికి తెలియవు. ఆడిటర్సును పెట్టుకోవాలి! ఇదంతా పడలేక, కొద్దిపాటి డబ్బు ఉన్నా కూడా ఇదివరకటిలా బ్యాంకు ఖాతాల్లో ప్రజలు వేయడం లేదు. అందువలనే బ్యాంకుల్లో డిపాజిట్లు అవుతున్న మొత్తం బాగా తగ్గిపోయిందని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవల పేర్కొన్నారు. ఈ విధంగా నగదు భద్రత, మారకం మీద ప్రజలకు నమ్మకం సడలిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు క్షేమకరం కాదు. నోట్ల రద్దు కాలంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని పది ప్రశ్నలడిగింది. వాటిలో ముఖ్యమైనది- ఒక పౌరుడు శ్రమ ద్వారా సమకూర్చుకున్న తన స్వంత డబ్బును బ్యాంకులో ఉంచితే, పరిమిత కాలానికైనా ఉపయోగించుకోకుండా నిలుపుచేసే అధికారం మన రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి కలిగిస్తున్నదా? ఏ అధికరణ కింద ఆ అధికారాన్ని కలిగిస్తున్నది? ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఏం జవాబిచ్చిందో తెలియదు. బ్యాంకు ఖాతాల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అవసరమైనప్పుడు వారికి విడుదల చేయకుండా నిలుపు చేస్తూ బ్యాంకులను ఆదేశించే అధికారం రిజర్వు బ్యాంకు ఏ చట్టం ప్రకారం ఉంది? అని న్యాయస్థానం అడిగింది. దీనికి రిజర్వు బ్యాంకు ఏం జవాబిచ్చిందో తెలియదు. నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించినపుడు- డిసెంబర్ 31 వరకు సంబంధిత బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవచ్చునని, ఆపైన మార్చి 31 వరకు సరైన కారణాలు చూపి రిజర్వుబ్యాంకు బ్రాంచీలలో మార్చుకోవచ్చుననీ అన్నారు. కానీ, ఈ ప్రకటనను కూడా ఎందుకు అమలు చేయలేదని ఇటీవలన మళ్లీ సుప్రీంకోర్టు వారినడిగింది.
నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఇదంతా చేసామని ప్రభుత్వం చెబుతున్నది. నల్లధనాన్ని వెలికి తీయాల్సిందే. కానీ నల్లధనమంతా కూడా నగదు రూపంలోనే వుండదు. దానిని కలిగిన వారు ముందే స్థిర చరాస్తులుగా మార్చేస్తారు! నల్లధనంతో ఎలాంటి సంబంధం లేని కోట్లాది మంది దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇతర పాలనా వ్యవస్థలన్నీ కూడా ప్రజల క్షేమం కోసం ఏర్పడినవే అనేది గుర్తించాలి. ప్రజాక్షేమాన్ని విస్మరిస్తూ ఏ వ్యవస్థా నడవకూడదు. అంతిమంగా ప్రజలే ప్రభువులు! ‘ఏ ప్రభుత్వమైతే ప్రజల మీద తక్కువ ఒత్తిడిని కలిగిస్తుందో అది ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతున్నది!

- మనె్న సత్యనారాయణ