సబ్ ఫీచర్

వ్యవ‘సాయం’ మెరుగుపడేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులకు 2008 సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయల మేరకు రుణాలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. అయినప్పటికీ, కొత్త రుణాలను తీర్చలేక రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘రైతులకు రుణమాఫీ’ అంటూ అన్ని పార్టీల నేతలూ వాగ్దానం ఇస్తున్నారు. కొత్త రుణాలకు, రుణమాఫీలకు, రైతుల ఆత్మహత్యలకు అంతం కనిపించడం లేదు. ఎందుకిలా జరుగుతోందని నిపుణులు నిశితంగా ఆలోచించాలి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ వ్యవస్థ కొనసాగగలదా? మరేదైనా వ్యవస్థను ప్ర త్యామ్నాయంగా రూపొందించాలా?
1951లో మన దేశ జనాభా 40 కోట్లు. 85 శాతం అంటే 34 కోట్లు గ్రామాల్లో ఉంటూ వ్యవసాయాధారిత వృత్తులలో ఉండేవారు. ప్రస్తుతం దేశ జనాభా 130 కోట్లు. 68 శాతం అంటే 88 కోట్ల ప్రజలు వ్యవసాయాధారిత పనులలో నిమగ్నమై జీవిస్తున్నారు. 1951 నాటితో పోలిస్తే ఈ జనాభా 3.4 రెట్లు అధికం. కానీ, వ్యవసాయానికి పనికొచ్చే భూమి 3.4 రెట్లు పెరగలేదు! జనాభా అయితే 3 రెట్ల పైన పెరిగింది గానీ భూమి ఆ దామాషాలో పెరగలేదు. అంటే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం తలసరి తగ్గుతుందే కానీ పెరగడం లేదు. పట్టణాలలో, పరిశ్రమలలో పనిచేసే వారికి సెలవుదినాలలో తప్ప సంవత్సరం పొడవునా రోజూ పని ఉంటుంది. అందుకు కచ్చితమైన ఆదాయం ఉంటుంది. వ్యవసాయం మీద ఆధారపడే వారిని చూస్తే- పొలం ట్రాక్టర్ల చేత దున్నబడుతోంది. ఊడ్పులకు, పంట కోతకు యంత్రాలు వచ్చాయి. ధాన్యాన్ని విదిలించడానికీ, పురుగు మందు జల్లడానికి యంత్రాలు వచ్చాయి. ఇంకా తీవ్రమైన యాంత్రీకరణ జరుగుతోంది. ఈ పరిణామాలతో వ్యవసాయానికి సంబంధించిన శ్రమజీవుల అవసరం తగ్గుతోంది. యాంత్రీకరణకు ముందు ఏ 120 రోజులో పనివుంటే ఇప్పుడు అన్ని రోజులు అంతమందికీ పని లేదు. ఇక ఆదాయం ఎలా వస్తుంది? కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలోని కూలి చేసి బతికేవారు పనికోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వలస పోతుండేవారు. ఇలా వలసలు పోకూడదని గ్రామాలలోనే వ్యవసాయేతర పనులు కల్పించాలని, మహాత్మాగాంధీ గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ ప్రణాళికను ప్రవేశపెట్టారు. కనీసం 120 నుంచి 150 రోజులు పని కల్పించడం, రోజుకు 200 రూపాయలపైన కనీస వేతనం ఇవ్వడం, ఈపద్ధతి ద్వారా గ్రామం అభివృద్ధికి పనిచేయించడం లక్ష్యాలు. సొమ్ము అయితే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు పైగా ఈ ప్రణాళిక కింద ఖర్చు చేయబడుతోంది. దీనివల్ల అభివృద్ధి పనులు బహు స్వల్పమే. ఉదాహరణకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని ఒక గ్రామంలో 800 మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం 800 మందికి 120-150 రోజుల గ్రామాభివృద్ధి పనులు అనూహ్యం, అసంభవం. కానీ డబ్బు వితరించబడుతోంది. పర్యవసానంగా సోమరితనం, తాగుడు, లంచగొండితనం ఎక్కువైపోయినాయి. వ్యవసాయానికి పని చేసే తరుణంలో కూలీ రేటు రోజుకు 300 నుండి 400 రూపాయలు అయిపోయింది. వ్యవసాయానికి అయ్యే ఖర్చులు ఎక్కువైపోయాయి. ఆదాయం తక్కువైపోతోంది.
1951లో మన దేశం స్థూల ఉత్పత్తిలో 70 శాతంపైన వ్యవసాయరంగం నుంచి వచ్చేది. ఇప్పుడది 18 శాతానికి పడిపోయింది. మన సంవత్సరపు స్థూల ఉత్పత్తి 130 లక్షల కోట్లు. అందులో 18 శాతం అంటే 2,34,000 కోట్లు. ఇది 68 శాతం జనాభాకు అంటే 85 కోట్ల మందికి దక్కుతోంది. తలసరి 27,500 రూపాయలు వార్షిక ఆదాయం. 130 లక్షల కోట్లు జాతీయ ఉత్పత్తి 130 కోట్ల జనాభాకు. అంటే తలసరి లక్ష రూపాయలు. ఇది వ్యవసాయదారుల తలసరి ఆదాయానికి 3.7 రెట్లు. పట్టణ వాసుల జాతీయ ఉత్పత్తి రూ. 106 లక్షల కోట్లు. వారి జనాభా 42 కోట్లు. పట్టణ వాసుల తలసరి ఉత్పత్తి వ్యవసాయం మీద ఆధారపడే గ్రామస్థుల కన్నా 9.6 రెట్లు ఎక్కువ. ఈ వ్యత్యాసం పెరుగుతూ వుంది కానీ తరగడం లేదు. ఈ పెరుగుతున్న వ్యత్యాసానికి, నష్టదాయకంగా మారుతున్న వ్యవసాయానికి పరిష్కారం ఏమిటి? అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రతి దేశంలో కూడా వ్యవసాయం మీద ఆధారపడుతూ గ్రామసీమల్లో ఉండేవారి జనాభా 10 శాతం లోపే. అత్యధిక దేశాల్లో 5 శాతానికి మించకుండా వుంటోంది. కానీ మన దేశంలో ఇది 68 శాతం. అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామికీకరణ ఫలితంగా వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోతూ నగరీకర పెరిగి నగర వాసులు ఎక్కువయ్యారు. చైనాలో అభివృద్ధి జరగాల్సిన సమయంలో జనాభా నియంత్రణ జరిగింది. రెండేళ్ల క్రితం వరకు కుటుంబానికి ఒక్క బిడ్డ ఉండాలనే నియమం గట్టిగా అమలు చేయబడింది. దాంతో జనాభా అమితంగా పెరగలేదు. పారిశ్రామీకరణ పెరిగింది. గ్రామాలలో నివసించే వారి సంఖ్య, వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ వచ్చి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
1990 వరకు కూడా చైనీయుల తలసరి ఆదాయం మనకన్నా తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనకన్నా 6 రెట్లు ఎక్కువగా ఉంది. ఇంకా పెరిగిపోతోంది. మన దేశంలో వ్యవసాయ సంక్షోభానికి, మందగతిలో జరుగుతున్న ఆర్థికాభివృద్ధికి పరిష్కారం జనాభా నియంత్రణే. ఇలా జరగాలంటే బుద్ధి, చతురత ఉన్న విద్య ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఈ రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. నిరుద్యోగం పెరిగిపోతోంది. అంతకు ముందు నిరుద్యోగులు చదువునేర్చుకోని వారే. ప్రస్తుతం అధికాధిక సంఖ్యలో డిగ్రీ సర్ట్ఫికెట్లు ఉన్న నిరుద్యోగులు పెరుగతున్నారు. వీరివల్ల జరగబోయే అలజడిని నియంత్రించడం కోసం సంక్షేమం అంటూ లక్షల కోట్ల రూపాయలు (2004లో 40,000 కోట్లు ప్రస్తుతం దాదాపు 44 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేయబడుతున్నాయి. వ్యవసాయం పరిశ్రమగా మార్పు చెందాలి. పారిశ్రామికీకరణ ద్వారా వ్యవసాయాధారిత రంగంలో నుంచి, గ్రామాల నుంచి ప్రజలను పట్టణాలకు తరలించాలి. జనాభా నియంత్రణకు దోహదకారిగా రిజర్వేషన్ల ప్రయోజనాలు ఒక తరానికీ, ఒక బిడ్డకు మాత్రమే వర్తించేట్టుగా, సంక్షేమ పథకాలు కూడా ఒకే ఒక్క బిడ్డ ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే వర్తింపచేయాలి.
వ్యవసాయపు వ్యవస్థలో మార్పునకై వ్యవసాయోత్పత్తుల అమ్మకపు ధరపై నియంత్రణ ఉండకూడదు. కార్పొరేటు పద్ధతిలో వ్యవసాయం పరిశ్రమగా నిర్వహించబడాలి. ఆ ఉత్పత్తులు ఎపుడైనా, ఎక్కడైనా అమ్ముకోవడానికి రైతులకు స్వేచ్ఛ ఉండాలి. పరిశ్రమల ఉత్పత్తులకు ఈ స్వేచ్ఛ ఉన్నప్పుడు, వ్యవసాయ ఉత్పత్తులకు స్వేచ్ఛా విపణి ఉండడం సమంజసమే. తిరిగి తిరిగి అప్పులలో పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం, రుణమాఫీ రాజకీయ లభ్ధికి ఉపయోగించబడడం జరగకుండా వుండాలంటే, జనాభా నియంత్రణ, వ్యవసాయం పారిశ్రామికీకరణం, ఉత్పత్తులకు స్వేచ్ఛా విపణి ఉండడం మాత్రమే పరిష్కారాలు.

- డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి సెల్: 98490 67359