సబ్ ఫీచర్

మాతృభాష.. కంఠశోష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాతృ దినోత్సవం’, ‘మాతృభాషా దినోత్సవం’ అంటూ ఏటా హడావుడి చేస్తుంటాం. తల్లిదండ్రులు నిరాదరణకు గురవడంతో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతోంది. ఇదే రీతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న మాతృభాష నానాటికీ దీనావస్థకు చేరుకుంటోంది. ఆంగ్లం కింద పడి మాతృభాషలు నలిగిపోతూనే ఉన్నాయి. అమ్మ చేయి తనమీద పడగానే రోజుల శిశువు సైతం మాతృస్పర్శని గుర్తించి ఏడుపు ఆపేస్తుంది. ఎవరూ చెప్పకుండానే తల్లిపాలు తాగుతూ శిశువు ఎదుగుతుంది. ఈ విషయాలు ఆ చిన్ని శిశువుకి ఎవరు నేర్పారు? శిశువు ఏడ్చేటప్పుడు మనకి ‘మా..’ అని వినిపిస్తుంది. తర్వాత ‘అత్త, తాత, అమ్మ..’ లాంటి చిలుక పలుకులు మొదలు పెడుతుంది. ఇదెవరు నేర్పారు? అమ్మ, అమ్మభాష పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక ఉంటుంది. క్రమంగా అమ్మతోపాటు అమ్మభాషతోనూ శిశువుకు సాన్నిహిత్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటూ నేర్చుకునే మాతృభాషకు ఎందరో గురువులు! పూర్తిగా మాట్లాడడం రాగానే ఆ మాతృభాషనే రాయడానికి, చదవడానికి పాఠశాలకి పంపుతారు.
ప్రాథమిక విద్యలో ఐదవ తరగతి చదివేసరికి మాతృభాషలో చదవడం, రాయడం పూర్తిగా వస్తుంది. లేకపోతే మాతృభాష వౌఖిక భాషగానే మిగిలిపోతుంది. అందుకని ప్రాథమిక స్థాయి వరకూ మాతృభాషని నేర్పడం అవసరం. అలా ఒక భాష వచ్చినప్పుడు, ఆ అనుభవంతో ఆ తర్వాత ఎన్ని భాషలనైనా నేర్వగలరు. ఆంగ్లభాషని గాని, హిందీని గాని, మరే ఇతర భాషనైనా గాని నేర్చుకోవద్దని ఎవ్వరూ అనరు. ఎన్ని ఎక్కువ భాషలు నేర్పిస్తే అంత మంచిది కదా! కాకపోతే ప్రాథమిక విద్య మాతృభాషలోనే నేర్వడం అవసరం. మాతృభాషతో మాట్లాడడంలో పరిపూర్ణత లభిస్తుంది. కేవలం విని, మాట్లాడడంతో మాతృభాషని అర్ధంతరంగా వదిలివేసి ఆంగ్ల భాషా మాధ్యమంలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే- ఆ కొత్త భాషని హఠాత్తుగా నేర్చుకుని, విద్యని కొనసాగించడం పిల్లలకు కష్టమవుతుంది. పైగా మాతృభాషని సగంలోనే వదిలివేయడంతో ఆ భాషా కూడా సరిగ్గా రాదు, ఆంగ్లమూ సరిగ్గా రాదు. అందుకనే ఈ కాలం పిల్లల్లో చాలామంది ఈ రెండు భాషల్ని కలిపి మాట్లాడడం చూస్తుంటాం. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి. పాఠశాలలో చేరేసరికి పిల్లలు తమ మాతృభాష సాయంతో ఆలోచించడం ప్రారంభిస్తారు. అందుకని వాళ్ళ ఆలోచనలూ మాతృభాషలోనే ఉంటాయి. అదే మనం పెద్దయిన తర్వాత గమనిస్తే- ఇతర భాషలలో మాట్లాడుతున్నప్పుడు, మన జవాబుల్ని ముందు మాతృభాషలో అనుకుని, అనువదించుకుని ఆ భాషలో ఇస్తాం. అందుకైనా మనకు మాతృభాష రావాలిగా! మనకి ఇతర భాషలని నేర్పేటప్పుడు ‘అనువాద పద్ధతి’లోనే నేర్పుతుంటారు. ఏఎన్‌టి యాంట్- అంటే ‘చీమ’ అంటూ!
1885లో ఫ్రాన్స్‌లో ‘అంతర్జాతీయ ధ్వని సంస్థ’ ఏర్పడింది. భాష అనేది ధ్వనుల సముదాయం. ఈ ధ్వనులను నోటినుంచి ఉచ్ఛరిస్తారు. ఒక్కొక్క భాషలో ఒక్కో రకమైన ధ్వనులుంటాయి. ప్రపంచంలోని భాషలలో చాలావాటికి లిపి లేదు. లిపి ఉన్న భాషలలో కూడా కొన్నింటి లిపికి, ఉచ్ఛారణకూ సంబంధం లేదు. ఉదాహరణకు ఇంగ్లీషులో అంతర్జాతీయ ధ్వని సంస్థ ఉచ్ఛారణ విధేయమైన లిపిని 1886లో ప్రవేశపెట్టింది. ఈ లిపిలో రోమన్, గ్రీకు అక్షరాలు వాడారు. ఈ లిపిలో ఏ భాషనైనా ధ్వని విధేయంగా మాట్లాడేట్లు రాసుకోవచ్చు. దీనిని అంతర్జాతీయ ధ్వని లిపి (ఐ.పి.ఏ.- ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్) అంటారు. లండన్ యూనివర్సిటీలో ఫొనెటిక్స్ ప్రొఫెసర్ డేనియల్ జోన్స్ ఇంగ్లీష్ ఉచ్ఛారణ, ధ్వని విధేయంగా అంతర్జాతీయ ధ్వని లిపిలో రాసి, పుస్తకాలు ప్రచురించారు.
1912 డిసెంబర్‌లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డేనియల్ జోన్స్‌తో 16 ఉపన్యాసాలు ఇప్పించారు. గిడుగు రామ్మూర్తి తన కుమారుడు సీతాపతితో కలిసి వెళ్ళి ఈ ఉపన్యాసాలు విన్నారు. ‘ఎవరికైనా ప్రాథమిక విద్యని మాతృభాషలోనే గరపాలి. అప్పుడు వాళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇతర భాషలని నేర్పి, ఇతరుల గురించి తెలుసుకోగల’రని గిడుగు రామ్మూర్తి చెప్పేవారు. ఆరోజుల్లో సవరులనే కొండ జాతివాళ్లు నాగరికుల చేతుల్లో మోసపోవడాన్ని ‘గిడుగు’ ఆయన గ్రహించారు. అందుకని ఆయన సవర భాషను నేర్చుకుని, వాళ్ళ కథలు, గేయాల్ని సేకరించి గ్రంథస్థం చేశారు. అవసరమైన మరికొన్నింటిని వాళ్ళకోసం రాశారు. సవర భాషకు లిపి లేకపోవడంతో వాళ్ళ నోటి వెంట వింటూ తెలుగు లిపిలో రాశారు. ఆ తర్వాత ఆ భాషకు వ్యాకరణం రాశారు. సవర-తెలుగు, తెలుగు-సవర, సవర- ఇంగ్లీష్, ఇంగ్లీష్-సవర నిఘంటువుల్ని రూపొందించారు. ఇంత శ్రమా ఆయన పడింది సవరలకు మాతృభాషని నేర్పి, ఆ తర్వాత ఆ భాష ద్వారా వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ భాషలు నేర్వడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ‘లిపి లేని భాషకు వీటన్నింటినీ రూపొందించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిం’దని ఆయన అనేవారు. మరి.. లిపి వున్న, ప్రాచీన హోదా కలిగిన మాతృభాషని, అది మాతృభాషగా కలవారు నేర్వకుండా చేస్తే ఆ జాతికి ఎంత హాని తెలపెట్టినట్లు!
పాఠశాలలో ప్రవేశించే నాటికి పిల్లలకు మాతృభాషలో చక్కగా సంభాషించడం వస్తుంది. గతంలో ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తుండేవారు కాబట్టి ప్రాథమిక విద్యని ఆంగ్ల మాధ్యమంలోనే గరపుతుండేవారు- ప్రత్యక్ష పద్ధతిలో! ప్రత్యక్ష పద్ధతి (డైరెక్ట్ మెథడాలజీ)లో తెలుగు మాటలు దొర్లకుండా, తెలుగులోకి అనువాదం చేయకుండా ప్రారంభం నుంచి చిన్నచిన్న వాక్యాలు అలవరచడం, అభినయంతోనే అర్థమయ్యేట్లు ప దాలు-వాక్యాలు బోధించడం చేసేవారు. విద్యార్థికి సందేహాలుంటే ఆంగ్లంలోనే అడగాలి. మాతృభాషలో అడగకూడదు. ఇది ఆంగ్ల భాష మాతృభాషగా ఉన్న వాళ్ళకి ఆంగ్లంలో విద్యాబోధన చేసే పద్ధతి. స్వాతంత్య్రానంతరం మాతృభాషల ద్వారా మన దేశంలో ప్రాథమిక విద్యని నేర్పేవాళ్ళు. తర్వాత ఆంగ్లభాషని నేర్పేప్పుడు అనువాద పద్ధతి (ట్రాన్స్‌లేషన్ మెథడాలజీ)లో బోధించడం ప్రారంభించారు. ఇలా ఆంగ్లబోధన ఉన్నత విద్యాబోధనగా ఉండేది. ఇప్పుడలా కాకుండా మాతృభాషని బోధించకుండా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనని చాలామంది తట్టుకోలేరు. మధ్యలో చదువుమానివేసే వాళ్ళు ఎక్కువ కావచ్చు. బలవంతాన బట్టీపడుతుండడం వల్ల అయోమయ పరిస్థితులేర్పడవచ్చు.
ఆంగ్లం మాతృభాష కానివాళ్ళకు ముందు ఆంగ్ల భాషని బోధించాలి. ఆ తర్వాత ఆ మాధ్యమంలో విద్యాబోధన చేయాలి. మళ్ళీ విద్యాబోధనా పద్ధతిలో వెనక్కి వెళ్ళాలంటే ఇవన్నీ తెలుసుకునిమరీ ముందుకు కదలాలి. ఆంగ్ల మాధ్యమాల్ని వద్దని ఎవరూ అనడం లేదు. ఆంగ్లభాషనే కాదు, ఏ భాషని నేర్చుకోవడాన్ని వద్దనడం లేదు. కాకపోతే మాతృభాషలో రా యడం, చదవడాన్ని ప్రాథమిక దశలో నేర్చుకుని, ఆ తర్వాత ఇతర భాషలపై ఆసక్తి చూపితే బాగుంటుంది.

- డా. వేదగిరి రాంబాబు