సబ్ ఫీచర్

ఛత్తీస్‌గఢ్‌లో ఓడిన మావోలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘోరంగా ఓడిపోయారు. ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన తొలిదశ పోలింగ్‌ను బహిష్కరించాలని మావోలు ఇచ్చిన పిలుపు వీగిపోయింది. 18 శాసనసభ నియోజకవర్గాలలోని 4,336 పోలింగ్ కేంద్రాలలో తొలిదశ వోటింగ్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టుల ‘్ఫత్వా’ను ప్రజలు ఖాతరు చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ప్రజలు బారులుతీరి కనిపించారు. మావోలు తమకు పూర్తి పట్టు ఉందని భావించిన ప్రాంతాలలోనే పరిస్థితి ఇలా ఉంటే పట్టులేని చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఓపిగ్గా ఓటువేసేందుకు నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఏం అర్థమవుతున్నది?
ఛత్తీస్‌గఢ్‌లోనూ మిగతా రాష్ట్రాల ప్రజల మాదిరి స్పందించే ప్రజలే ఉన్నారు. అక్కడా సాధారణ పాలనను కోరుతున్నారు తప్ప మావోయిస్టుల నిరంకుశ వైఖరిని ఆహ్వానించడం లేదని స్పష్టమవుతోంది. దాదాపు 76 శాతం పోలింగ్ నమోదు కావడం అద్భుతమే. తమకు కంచుకోటలని భావించే బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, సుకుమా, రాజ్‌నంద్ గాఁవ్, దంతెవాడ జిల్లాల్లోని పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రోత్సాహకరంగా కనిపించింది. ఓటర్లు కాగితాలను చేతపట్టి, ‘క్యూ’లైన్లలో కనిపించడంతో మావోయిస్టుల కల చెదిరిపోయింది. ఓటేసిన వారి వేలు నరికేస్తామని ‘అన్న’లు తీవ్రంగా హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోకుండా, ఖాతరు చేయకుండా వేలాదిగా ప్రజలు తరలిరావడం దేన్ని సూచిస్తోంది? మావోయిస్టుల ‘హుకుం’ అంతగా బస్తర్- సుకుమా జిల్లాల్లో పారలేదని అర్థమైంది. ముఖ్యమంత్రి రమణసింగ్ పోటీచేస్తున్న రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం ఓటింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారని వార్తలు వెలువడ్డాయి.
సుకుమా జిల్లాలోని పాలమ్ అడుగులో 15 ఏళ్ళ అనంతరం ఎన్నికలు ప్రశాంతం జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పడవలపై ప్రయాణం చేసి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వందేళ్ళు పైబడిన వృద్ధులు సైతం తమ హక్కును వినియోగించుకున్నారు. దారుల వెంట బాంబులు అమర్చినా, పోలింగ్ బూత్ దగ్గర పేలుడు పదార్థాలు పెట్టినా అన్ని ఆటంకాలను అధిగమించి ప్రజలు ఓటేశారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది అప్రమత్తులై ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు. దంతెవాడ, సుకుమా, బీజాపూర్‌లలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను భద్రతాసిబ్బంది సకాలంలో నిర్వీర్యం చేశారు. పోలింగ్ భారీగా జరిగిందని అధికారులు చెప్పడం కాదు, ఆదివాసీలు స్వయంగా చెబుతున్నారు. తమ గ్రామాల్లో పెద్దఎత్తున ఓట్లువేశారని వెల్లడించారు. కొన్ని గ్రామాల్లో తక్కువ శాతం ఓట్లుపోలైనప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల సమయంలో కల్లోలం సృష్టించేందుకు మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా దళాలపై కాల్పులు జరిపి ఐదుగురిని గాయపరిచారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. తొలిదశలో పోలింగ్ జరిగిన 18 నియోజకవర్గాల్లో 10 స్థానాలు మావోల కంచుకోటలుగా పేరున్నప్పటికీ అసలు వాస్తవమేమిటో పోలింగ్ రోజు తేటతెల్లమైంది. 4,336 పోలింగ్ బూత్‌లను పకడ్బందీగా నిర్వహించి దాదాపు 76 శాతం ఓట్లు నమోదు కావడమంటే మావోయిస్టులు ఇప్పటికైనా కళ్లుతెరచి వాస్తవాలు గ్రహించాలి.
సిరాచుక్క కనిపించిన వారి వేళ్ళను నరికివేస్తామని మావోయిస్టులు కఠినంగా హెచ్చరించినా, పోస్టర్లు అతికించినా, కరపత్రాలు పంపిణీ చేసినా ప్రయోజనం లేకపోయింది. ముందస్తుగా భయభ్రాంతులను చేసేందుకు మందుపాతరలు పేల్చినా, బాంబులు పేల్చినా ప్రయోజనం శూన్యం. లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకున్నారు. ఆడవారు పెద్దసంఖ్యలో పోలింగ్ బూత్‌లవద్ద బారులుతీరడంతో బస్తర్ పరిస్థితి జన జీవన స్రవంతికి అనుకూలం అని తేటతెల్లమైంది. లొంగిపోయిన మావోయిస్టు దంపతులు మైనూరాయ్, అతని భార్య రాజ్‌భట్టి నారాయణ్‌పూర్ నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇలా చాలామంది మాజీ మావోయిస్టులు ఎన్నికల ఉత్సవంలో పాల్గొన్నారు. దివ్యాంగులు సైతం పెద్దఎత్తున తరలివచ్చి ఓటు వేశారు. ఇదంతా మావోయిస్టుల ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నదా? లేక ప్రజల అభిమతం ప్రకారం జీవనం కొనసాగుతున్న అంశం వెల్లడవుతున్నదా?...
తొలిదశ పోలింగ్‌కు వారం రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లో 62 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలతో లొంగిపోయారు. ఎన్నికల బహిష్కరణ పిలుపును బలవంతంగానైనా అమలు జరపాలని ఎంత ప్రయత్నించినా ఇలా వారికి ఎదురుదెబ్బలే తగిలాయి. మరోవైపు మావోయిస్టుల దళపతిగా ముప్పాళ లక్ష్మణరావు వైదొలగి, కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న నంబాల కేశవరావు ఆ స్థానంలో నియమితులైనా ఛత్తీస్‌గఢ్‌లో పెద్దగా ప్రభావం కనిపించ లేదు. మిలటరీ కమిషన్ చీఫ్‌గా కేశవరావు వ్యవహరిస్తున్నా, సాయుధ ఎత్తుగడలేవీ విజయవంతం కావడం లేదు. పైగా అధికారులు డ్రోన్ల సా యంతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఈ డ్రోన్లను విరివిగా ఉపయోగించారు. ఆ చిత్రాలు కొన్ని వార్తాపత్రికల్లోనూ ప్రచురితం కావడం విశేషం. మావోయిస్టు పార్టీలో భారీగా నాయకత్వ మార్పులు, ఇతర సంస్థాగత మార్పులు చేసినా గొర్రెతోక బెత్తెడు చందంగానే వారి వ్యవహారాలు, కార్యక్రమాలు కనిపిస్తాయి తప్ప ఆశాజనకంగా లేవు. వారెంత మిలటరీ లైన్‌కు దగ్గరవుతుంటే, ప్రజలకు అంత దూరమవుతున్న విషయాన్ని గుర్తించడం లేదు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జగదల్‌పూర్ సభలో ప్రసంగిస్తూ ఆదివాసీల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మావోయిస్టులు ఇంకెంతో కాలం ఆదివాసీలను కీలుబొమ్మలుగా ఆడించలేరని, అర్బన్ నక్సల్స్ చేతుల్లోని రిమోట్ కంట్రోల్ పనిచేయదని చెప్పారు. మావో నాయకులు ముఖ్యంగా అర్బన్ నక్సల్స్ తమ పిల్లల్ని విదేశాల్లో మంచి చదువులు చదివిస్తూ ఆర్థికంగా ఎదుగుతూ ఆదివాసీలను మాత్రం విద్యకు దూరంగా ఉంచుతున్నారన్న కఠోర వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు మోదీ చెప్పారు. ఈ విషయం ప్రజలకు క్రమంగా అర్థమవుతోంది. దాంతో పాలు- నీళ్లు వేర్వేరుగా మారుతున్నాయి. ఆదివాసీలు ఎవరిని విశ్వసించాలో తెలుసుకుంటున్నారు. దాని ప్రభావం పోలింగ్ శాతం రూపంలో దర్శనమిస్తోంది. ఆదివాసీలు ఎల్లకాలం అమాయకంగా మావోయిస్టోలను అనుసరించి అగాథంలోకి పడిపోతారన్న భయం పెట్టుకోనవసరం లేదని రుజువుచేశారు.
అర్బన్ నక్సల్స్ జీవితానికి, మావోయిస్టు నాయకుల జీవితానికి సాధారణ ఆదివాసీల జీవితానికిగల వ్యత్యాసాన్ని గమనిస్తే ఎవరు ఎక్కడ నిలబడి ఉన్నారో తేటతెల్లమవుతోంది. జీవనం సౌకర్యవంతంగా గడవాలన్న ప్రాథమిక విషయాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ, సాయుధ దాడులు, మందుపాతరలు పేల్చడం, జవాన్లను కాల్చిచంపడం, ఇన్‌ఫార్మర్ల నెపంతో ఆదివాసీలను అంతమొందించడం ఏ రకంగా అభివృద్ధికి మార్గం వేస్తుంది? ఈ మార్గంలో పయనించి ‘రాజ్యాధికారం’ సాధిస్తామనడం కేవలం పగటికల. ఆ విషయం తెలుసుకోకుండా ఆవేశపడితే అమాయకులే ఆహుతవుతారు. ఆ ‘దృశ్యం’ అర్ధశతాబ్ద కాలంగా స్పష్టంగా కనిపిస్తోంది.
ఏవో 17 దేశాలలోని మావోయిస్టు సంస్థలతో ఓ కూటమిని రెవల్యూషనరీ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ (రిమ్) పేర రూపొందించినంత మాత్రాన, దానికి తాజాగా ముప్పాళ లక్ష్మణరావు కార్యదర్శిగా నియమితులయినంత మాత్రాన భారతదేశంలో సాయుధ విప్లవం విజయవంతం అవుతుందనుకోవడం వెర్రి ఆశ తప్ప మరొకటి కాదు. ఏ రకంగా చూసినా మావోయిస్టులు ఓటమిని మూటకట్టుకుని ప్రయాణిస్తున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799