సబ్ ఫీచర్

బడిలో తల్లిదండ్రుల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేజీ స్కూలు తెరుస్తున్నారు. పిల్లలు పలకలు తీసుకువస్తారు. తల్లిదండ్రులు వారం రోజులు పరిశీలించారు. ‘పలక మీద ఒక అక్షరం ముక్క దిద్దలేదు. వారం రోజులు గడిచాయి ఇక స్కూలు ఎందుకు? మా పిల్లలను రేపటి నుంచి బడికి పంపేదిలేద’ని తల్లిదండ్రులు అన్నారు. ఇంద్రియ జ్ఞానం ద్వారా పిల్లలకు దృష్టి ఏర్పడాలి. ఆ దృష్టి ఏర్పడాలంటే పిల్లలు ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. పరిశీలనతో మెదడులో దృశ్యాల స్వరూపం ఏర్పడుతుంది. ఆ దృశ్యాలను పిల్లలు సూక్ష్మంగా విశే్లషిస్తారు.
నేను చూస్తా (ఐసీ), నేను మర్చిపోతా (ఐ ఫర్‌గెట్), నేను పరిశీలిస్తా (ఐ అబ్జర్వ్), నేను అవగాహన చేసుకుంటా (ఐ అండర్‌స్టాండ్), నేను చదవుతా (ఐ స్టడీ), నేను జ్ఞాపకం ఉంచుకుంటా (ఐ రిమంబర్).. అని చైనాలో పిల్లలంటారు. కేజీ స్కూల్లో పిల్లలకు ఎన్నో దృశ్యాలను చూపించాలి. ఎన్నో రాగాలను వినిపించాలి. రాగం విన్న వెంటనే పిల్లలు పక్షి పేరు చెప్పాలి. అక్షరం రాస్తున్నప్పుడు కొన్నిసార్లు చేయి వంకరగా తిరగవలసి ఉంటుంది. వంకర గీతలు గీయమని చెప్పటం అక్షరం నేర్వటం కన్నా, ముందు జరుగవలసిన పని.
కథలు చెప్పి పిల్లల్లో ఊహలు నిర్మించాలి. ఈ విధంగా ఇంద్రియ శిక్షణ జరగటానికి కేజీ స్కూళ్లు ఏర్పడ్డాయని తల్లిదండ్రులకు స్కూలు యజమానులు చెబుతున్నారు. కేజీ స్కూలులో ఇంత పరమార్థం దాగి ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచనల్లో పడతారు. పిల్లలను బడిలో చేర్చుకోకముందే తల్లిదండ్రులను కూర్చోబెట్టి కేజీ స్కూల్ లక్ష్యాలను స్కూలు యాజమాన్యం వివరించాలి.
పాఠశాల అంటే అక్షరాలు నేర్పటమే ప్రధానం అనుకుంటారు. కానీ, కేజీ స్కూళ్ల లక్ష్యం చాలా విలువలతో కూడుకున్నది. పిల్లలను బడిలో చేర్చకముందే తల్లిదండ్రుల ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. లేకుంటే దానికి ఆదరణ రాదు. అందుకు సంబంధించిన పుస్తకాలను తల్లిదండ్రులతో చదివించాలి. అప్పుడే స్కూల్‌లో తల్లిదండ్రులు భాగస్వాములవుతారు. పాఠశాలకు తల్లిదండ్రుల ఆదరణ, భాగస్వామ్యం ప్రధానం. తల్లిదండ్రులు కేవలం ప్రేక్షకులు కాదు, స్కూల్లో భాగస్వాములు.
పోటీతత్వం ఎటువైపు..?
ప్రపంచీకరణ ప్రభావంతో విద్యార్థులలో చాలా మార్పులు వచ్చాయి. వ్యాపార ధోరణితో ప్రతి పాఠశాల సైతం ఫలితాలను బేరీజు వేయటం మొదలయ్యింది. దానికితోడు డిజిటల్ యుగం కూడా కలిసిరావటం వలన ఫలితాలను అంకెల్లో చూపించటం, పాఠశాలల మధ్య పోటీ పెరగటం విద్యారంగాన్ని సంక్షేమ దృష్టితో కాకుండా వ్యాపార దృష్టితో చూడటం మొదలైంది. పరీక్షలే ప్రధానమైనాయి. పాఠశాలల మధ్య పోటీతత్వం పెరిగింది. సాధనను ఫలితాలలోనే వ్యక్తీకరించటం సర్వసామాన్యం కావడంతో మొత్తం లెర్నింగ్ ప్రాసెస్ పరీక్షా కేంద్రంగా మారిపోయింది. ఉపాధ్యాయుడు పరీక్షలను కేంద్రంగా చేయటం లెర్నింగ్ ప్రాసెస్‌గా అయిపోయింది.
గత సంవత్సరం నాటి ప్రశ్నాపత్రాలను ఆధారం చేసుకుని చదువుచెప్పటం టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్‌గా జరగటం వలన ఫలితాలు పెరిగాయి. కానీ ప్రమాణాలు పెరగటం లేదు. లెర్నింగ్‌లో ఫలితం కన్నా ప్రాసెస్ చాలా ప్రధానం. దీనివలన పిల్లల ఆలోచనాశక్తి తక్కువ కావడం, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను బట్టీపట్టడం, కంఠస్తం చేయించటం పాఠశాల కొలమానాలైపోయాయి. పాఠశాలల మధ్య పోటీతత్వం ఎన్నో అనారోగ్య వాతావరణాలను సృష్టించింది. పాఠశాలల మధ్య ఉండాల్సిన సహకారం పోయింది. పోటీతత్వమే పెరిగింది. ఇది విద్యారంగంలో కలుషిత వాతావరణానికి దారితీస్తుంది. పరీక్షలకన్నా తరగతి గదిలోని బోధనా పద్ధతులపైన, విద్యార్థుల ఆలోచనా విధానాన్ని పెంచే పద్ధతులపైన దృష్టి కేంద్రీకరించవలసి వచ్చింది. వ్యాపార పద్ధతులు లాభాపేక్షకే దారితీస్తాయి. పాఠశాలల విలువలను కాపాడాలి. విద్యార్థికి అవగాహన కన్నా పాఠశాల కీర్తే యాజమాన్యాలకు ముఖ్యమైంది. ఇది సరైన పద్ధతి కాదు.
దీన్ని సమాజం తీవ్రంగా ఆలోచించటం మొదలైంది. టీచింగ్, లెర్నింగ్‌ను మార్చకుండా ప్రమాణాలు పెరగవనే నిర్ణయానికి సమాజం వస్తోంది. ఈనాడు స్కూలు కొలమానం తరగతి గది అయిపోయింది.
పాతగోడలు కూల్చాలి..
ప్రస్తుతమున్న స్కూలు నిర్మాణం పారిశ్రామిక యుగం తర్వాత వచ్చిన పరిణామం. దానికన్నా ముందు పని విభజన లేకుండేది. స్కూలు పనిని పారిశ్రామిక యుగంలో ప్రతివారు తమ పనిలో ప్రావీణ్యత రావాలని చిన్న చిన్న భాగాలుగా విభజించారు. ఒకరిని డైరెక్టర్ అంటారు. మరొకరిని ప్రిన్సిపాల్ అంటారు. మరొకరిని టీచర్ అంటారు. అనగా బోధనా కార్యక్రమాన్ని పలువురికి కేటాయించటం, దానివలన ఎవరికి వారు తమ పనిని చేసుకుంటూపోయారు. కానీ సమన్వయ లోపం వలన విద్యారంగంలో అగాధం ఏర్పడింది. పాలనా యంత్రాంగం పనిని విభజించింది కానీ విద్యార్థి నేర్చుకునే దాన్ని విభజించలేదు. విద్యార్థి ఒక ఆట ఆడేటప్పుడు ఒకరిని గోల్ కీపర్ అంటాం. మరొకరిని బ్యాక్ అంటాం. మరొకరిని సెంటర్ అంటాం. కానీ అందరిలో టీమ్ స్పిరిట్ ఉంటుంది. ఆ టీమ్ స్పిరిట్ లేకపోవటం వలన విద్యార్థిలో అగాధం ఏర్పడుతుంది.
విద్యార్థిని అదుపులో ఉంచటమే తన పని అని ఒకరనుకుంటారు. మరొకరు పాఠశాల నిర్వహణే తన బాధ్యత అనుకుంటారు. చదువు అనేది ఐరన్ టైట్ కంపార్ట్‌మెంట్ (ఇనుప గోడలు)గా తయారయ్యింది. విద్యార్థిని అదుపులో పెట్టడం సాధనలో భాగం కానీ, అతనికి విధేయత నేర్పటానికి ఏర్పడింది కాదు, పాఠశాల ఒక లక్ష్యసాధనకు మార్గమే కానీ అదే మనకు లక్ష్యం కాదు. టీమ్ స్పిరిట్ లేకుండా పాత పారిశ్రామిక రంగం నాటి పద్ధతులను అనుకరించటంతో విద్యారంగంలో అంతరాలు ఏర్పడ్డాయి. పాత నమూనాలు వదులుకొని పాఠశాలలను ఈ కాలంలో అనుసంధానం చేసి తీర్చిదిద్దుకోవాలి.

-చుక్కా రామయ్య