సబ్ ఫీచర్

ఫలించిన కేసీఆర్ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసింది. జాతీయ స్థాయి మీడియా సంస్థల ప్రతినిధులు, రాజకీయ విశే్లషకులు తెలంగాణ ఎన్నికల్లో తెరాస మళ్లీ గెలుస్తుందని చెప్పిన ‘ఎగ్జిట్ పోల్స్’ నిజమయ్యాయి. అయితే, ఎన్నికల ఫలితాలు ఈ స్థాయిలో ఏకపక్షంగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను పూర్తిగా అధ్యయనం చేసి, రాజకీయ పంచతంత్రాలను ఔపోసన పట్టిన తెరాస అధినేత కేసీఆర్ ‘చాణక్య వ్యూహం’తో ప్రత్యర్థులను చిత్తుచేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడం ఓ ఎత్తు. అంతకంటే ముందు వ్యూహాత్మకంగా రైతుబంధు చెక్కులను ఓ జాతరలా పంపిణీ చేయడం ఒక ఎత్తు. ఎన్నికలకు మూడు నెలల ముందే 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం వంటి వ్యూహాలను కేసీఆర్ రాజకీయ తంత్రాలలో భాగంగా పేర్కొనవచ్చు. ‘తెలంగాణలో మహాకూటమి బలపడింది, ప్రజాఫ్రంట్ ఏదో పొడిచేస్తుంది’- అని ఊహించిన వారికి భంగపాటు ఎదురైంది.
అధికారంలో ఉన్న పార్టీపై సహజంగా జనంలో కొంత వ్యతిరేకత వుంటుందని అందరూ భావించారు. యువతలో కొంతమేర వ్యతిరేకత, పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న విద్యావంతుల్లో, మేధావి వర్గాల్లో అసంతృప్తి ఎంతో కొంత వుంటుంది. ఇవి బలంగా పనిచేస్తాయని మరికొంతమంది ఊహించారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరగడంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారి ఓట్లు అతి తక్కువగా నమోదయ్యాయి. సంక్షేమ పథకాల ఫలాలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లాగా కొన్ని నెలలనుంచీ వాడవాడలా చుట్టేసిన వైనం, మహాకూటమి అభ్యర్థుల ఎంపిక తప్పుల తడకగా, కొట్లాటగా మారి చివరి నిమిషం వరకు గందరగోళం ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాళ్లకు బలపం కట్టుకొని తిరగడం, ‘తెలంగాణ ఆత్మగౌరవం’ అనే సెంటిమెంట్‌ను కేసీఆర్ రగిలింపజేయడం తదితర కారణాలతో టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నిక ఏకపక్షమైంది.
మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న కేసీఆర్‌కు అసలైన బాధ్యతలు, సవాళ్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయనే విషయం తెలుసుకొని ముందుకు సాగవలసి వుంది. సగం పనులతో నిలిచిపోయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయవలసి వుంది. సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఆశపెట్టిన డబుల్ బెడ్‌రూంల పథకాన్ని ఇక పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అవగాహన కలిగిన కేటీఆర్ ఈ రంగాల అభివృద్ధికి పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించవలసి వుంది. ఇంతకంటే ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని పూర్తిగా అరికట్టవలసి వుంది. ఏ సెంటిమెంట్‌తో చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో తెలంగాణలో పర్యటించారో.. అదే సెంటిమెంట్ ద్వారా సెటిలర్స్ కూడా తెలంగాణ పౌరులు.. అంతకంటే ముఖ్యంగా భారతీయులు... వీరిని మా గుండెల్లో పెట్టుకొని మరింత అభివృద్ధి వైపు పయనింపచేస్తానని చేతలలో చూపించవలసి వుంది.
జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా నాటుకుపోయిన భాజపా తరఫున సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేసినప్పటికీ ‘కమల దళాని’కి భంగపాటు తప్పలేదు. బీజేపీకి తెలంగాణలో ముందునుంచి బలమైన కార్యకర్తలు, ఓటర్లు వున్నారు. వీరిని ఒక తాటిమీదకు తెచ్చే నాయకత్వం లోపించింది. ఇక్కడ వున్న కొద్దిపాటి నాయకులు ద్వితీయశ్రేణి నాయకులను ఎదగకుండా చేయడం వంటి కారణాలను గురించి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచించవలసి వుంది. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని ఓడిపోవడం వెనుక కారణాలను విశే్లషిస్తే కుటుంబ చరిత్రలకు, గ్లామర్‌కు ఓట్లురాలవని, ప్రజలతో అనుక్షణం మమేకమై వున్నవారే నాయకులుగా రాణిస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా తిష్టవేసిన బడా నాయకులకు కూడా ఈ ఎన్నికలలో శృంగభంగం జరగడం పట్ల మారుతున్న ప్రజల ఆలోచనా విధానానికి, చైతన్యానికి నిదర్శనమని పేర్కొనవచ్చు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, జవసత్వంతో పోరాడేవారే రాణిస్తారని, బలమైన సామాజిక వర్గ ఆధిపత్యానికి నూకలు చెల్లాయని తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212