సబ్ ఫీచర్

ప్రైవేటులోనూ కోటా సమంజసం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యలో ప్రైవేటు ఉపాధి రంగంలో కూడా వాటాలు, కోటాలు, ‘ముంగాపులు’ (ఇది ‘రిజర్వేషన్స్’కు తెలుగు పదం) ఉండాలి, వాటికోసం చట్టం కూడా చేయాలి అంటూ కొందఱు వాదిస్తున్నారు; అందుకోసం ఏకంగా ఒక మహా ఉద్యమమే సాగాలంటున్నారు మఱి కొందఱు. అసలు ప్రాథమికంగా గాని, వౌలికంగా గాని ఉద్యోగార్థికి ఉండాల్సిన అర్హత ఏమిటి? ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆ అర్హత అనేది విద్య- లేక-విజ్ఞానము మాత్రమే. నేడు ఎవరైనా సరే విద్య, విజ్ఞానాలకు కొలమానంగా చూస్తున్నది, భావిస్తున్నది ఏమి టి? ఏడు, లేక ఎనిమిదవ తరగతిలో ఉత్తీర్ణత, ఐ.టి.ఐ. లాంటి వాటి సర్ట్ఫికెట్ కోర్సు పాసుకావటం, డిప్లొమా, డిగ్రీ, స్నాతకోత్తర పట్టా, డాక్టరేట్- వీటిలో ఏదోఒకటి ఆయా ఉద్యోగాల స్థాయి, అక్కడ ఉండే పని బాధ్యత యొక్క బరువునుబట్టి. వీటిలో ఏ విద్యాప్రమాణానికైనా ప్రతిభకైనా కొలమానంగా ఏది చూస్తున్నారు, దేనిని తీసుకుంటున్నారు ప్రభుత్వంగాని, ప్రైవేటు వాళ్ళుగాని? మూల్యాంకాలు (మార్కులు).
దాని అర్థం ఏ చదువులోనైనా తక్కువ మార్కులు వచ్చినతనికంటే ఎక్కువ మార్కులు వచ్చినతని ప్రతిభ, విజ్ఞాన పరిధి, బుద్ధికుశలత, నైపుణ్యాలు ఎక్కువనేగా! ఒకవేళ వ్రాత పరీక్షలో కనీసపు మార్కులు వచ్చిన వాని నుండి చాలా ఎక్కువ మార్కులు వచ్చిన వాని వఱకు వౌఖిక పరీక్షకు అందఱినీ పిలచినా కూడా మళ్ళీ వౌఖిక పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు, ఇస్తున్నారు. ఏం? అలా ఎందుకివ్వాలి? ఎందుకు అంటే పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినవారి ప్రతిభగాని, విజ్ఞానస్థాయి గాని, పనితనం గాని, అతనికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాని వాటంత శ్రేష్ఠంగా ఉండదు కనుక అని ప్రత్యేకంగా చెప్పక్కఱలేదు. అలా వ్రాత పరీక్ష, వౌఖికాలలో ఎక్కువ మార్కులు పొందిన వానికి ఉండే చెప్పుకోదగ్గ సమర్థతే సమాజానికి శ్రేయోదాయకం. అలాంటి వ్యక్తి ఉద్యోగంలో చేరినాక అతను చేసే మేలైన విధి నిర్వహణవల్ల ఆ సంస్థ యజమానికి, వినియోగదారులకు అందఱికీ సంపూర్ణ ప్రయోజనం సమకూరుతుంది. ఇది తిరుగులేని అనుభవైక వేద్య సత్యం.
దీనిని బలిచేసి ఒక వ్యక్తో, కొందరు వ్యక్తులో కలసి ఏదో ఒక ఉత్పాదక వాణిజ్య వృత్తో, పనులు-సేవల వాణిజ్య వృత్తో చేపడితే వాళ్ళుకూడా ‘చట్ట నిర్ణీత కులపు’ మనుషులనే ఒక నిర్ణీత శాతంలో తప్పక తీసుకోవాలి అనటం ఎంతవఱకు సబబు? ఎంత వఱకు న్యాయం? ఇది ఏ రకమైన వ్యక్తి స్వాతంత్య్రం? రాజ్యాంగ స్ఫూర్తిలోని మూడు ముఖ్యాంశాలైన స్వేచ్ఛ (లిబర్టీ), సమానత్వం (ఈక్వాలిటీ), సోదరభావం (ప్రాటర్నిటీ)లకు విరుద్ధం కాదా ఇది? 1950లో విధించిన రాజ్యాంగంలో దళితులకు, ఆ తరువాత వచ్చిన సవరణలవల్ల వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల ముంగాపులు (రిజర్వేషన్స్) ఉన్నాయి కనుక మన దేశంలోని వివిధ ప్రభుత్వాలు వాటిని అమలుచేస్తున్నాయి. ఆ రిజర్వేషన్ల ద్వారా సమాజంలో ఆర్థిక సమానత గాని, లేక కనీస ఆర్థిక స్వావలంబన గాని తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వ రంగానిది, ప్రభుత్వ శాఖలది, సంస్థలది. ఆ బరువును ఒక వైయక్తిక బాధ్యతగా చేయటం అనేది ఎలా ఉంటుందంటే ‘నేను చెప్పినట్టే నీవు గాలిపీల్చు’ అన్నట్టుంటుంది. కార్యదక్షత, గుణ్యతల విషయంలో రాజీపడటం అటు సంస్థకుగాని ఇటు వినియోగదారుడికి గాని ఎట్టి పరిస్థితిలో శ్రేయస్కరం కాదు.
దీనికి పరిష్కారమార్గం ప్రైవేట్‌లో రిజర్వేషన్లుకాదు. కూడు, గుడ్డ, గూడు, చదువు అనే నాలుగు ప్రాథమికావసరాలలో ఏ వస్తువు ఎవరికి లేదో ఆ వస్తువును మాత్రమే అది లేని వ్యక్తికి మాత్రమే నేరుగా అందించాలి కుల ప్రసక్తిలేకుండా. ఆ తర్వాత ఉద్యోగం గాని, ఉపాధి గాని వ్రాత-వౌఖిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినవారికి మాత్రమే ఇవ్వాలి కుల ప్రసక్తిలేకుండా. అదీ నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి. అది సమానత్వము, సమానావకాశాలు అంటే; ప్రతిభకు గుర్తింపు, సద్వినియోగతలు అంటే. ఓట్లకోసం రాజకీయాలు, చట్టాలు కాకూడదు. రాజకీయ పక్షాల వాళ్ళు వాళ్ళ స్వార్థంకోసం రిజర్వేషన్ల జపము, ఓట్ల ఆకర్షక తంత్రాలు చేస్తూనే ఉంటారు. అందుకని ప్రతి ప్రభుత్వం ప్రతిదాంట్లోను ప్రత్యేకతలు, ముంగాపులు అంటూ నినాదాలు, కార్యాచరణ హోరెత్తిస్తూనే ఉంటుంది. కానీ అదే పని ప్రైవేటు సంస్థలు కూడా చేయాలి అనటం ఒక భావ నియంతృత్వం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు లేనివాడికి వెన్నుదన్నుగా నిలబడి ఆర్థికపు ఊతమివ్వాలి గాని పనితనాన్ని, ప్రతిభను పణంగాపెట్టో, బలిచేసో, మార్కుల్ని అవమానపరుస్తూ కోటాలు, వాటాలు, ముంగాపులు, పెద్దపీటలు, రిజర్వేషన్‌లు, సెపరేషన్లు అంటూ ఉద్యోగ చట్టాలు చేస్తూపోతే వర్తమానం ఒక అలంకృత సుందరిగానే కనిపించవచ్చు. సమాజ భవిష్యత్తుమాత్రం ఒక అష్టావక్ర కురూపి అవటం తథ్యం.
పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినవారికి తగిన కోచింగ్‌లు, శిక్షణలు ఇప్పించండి కుల ప్రసక్తిలేకుండా. వాళ్ళకు మళ్ళీమళ్ళీ పరీక్షలు పెట్టండి. విద్యార్హత ఉన్న అందఱ్నీ కామన్ ఇంటర్వ్యూలకు పిలవండి. నిపుణతా ప్రతిభలు ఉన్నవాళ్ళనే ఉద్యోగాలకు నియమించండి. అప్పుడు సమాజంలో పదిమందికి ఉపయోగపడే పనిలాభం సిద్ధిస్తుంది. రిజర్వేషన్లు ఉండాలి అన్న అంబేద్కర్ కూడా ముందు శిక్షణలు ఇప్పించండి అన్నాడు. అంటే ఆయన అంతరంగంలో పనితనానికి పెద్దపీట వేశాడు. అది మాత్రం ప్రక్కన పెడుతున్నాం మనం.
కనుక చదువులోని నాణ్యత, వ్యక్తి ప్రతిభలనుబట్టి ఉద్యోగం ఇవ్వాలి ఎవరికైనా. అంతేగాని ప్రభుత్వోద్యోగాలకు చట్టం ముంగాపును ఇచ్చింది కాబట్టి ప్రైవేట్‌లోగూడా కోటా చట్టం రావాలి అనటం సమంజసం కాదు.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం