సబ్ ఫీచర్

సాగర సంరక్షణ సమష్టి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. ‘ఆకాశాతృతితం తోయం యథారచ్ఛతి సాగరం’ అంటారు. అంటే ఆకాశం నుండి పడిన ప్రతి నీటిబొట్టు చివరికీ కలిసేది సముద్రంలోనే అనీ. అలాగే ‘నదీ నాం సాగరో గతిః’ అంటారు. నదులకు సముద్రమే గతి అని అర్థం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సముద్రాలు కాలుష్యానికి గురికావడం విచారకరం. మనం పీల్చే ప్రాణవాయువు సగం సముద్రాల నుంచే వస్తుంది. మనం విడుదల చేసే కార్బన్‌డై ఆక్సైడ్‌లో నాలుగోవంతు సముద్రాలే శోషించుకుంటున్నాయి. తిండినిస్తున్నాయి. వర్షాలకూ, వాతావరణ సమతుల్యతకు కారణమవుతున్నాయి. పురాణాల్లో సముద్ర స్నానానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. సముద్రంలోని ఉప్పునీటి వల్ల స్వేద గ్రంథులన్నీ శుభ్రపడుతాయి. మన శరీరంపై చిన్న చిన్న గాయాలు ఉప్పునీటికి మానిపోతాయి. సముద్రంలో అలలతో ఆడుకోవడం వల్ల ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది.
మనిషి చేస్తున్న తప్పిదాలతో వాతావరణం వేడెక్కి ఉత్తర, దక్షిణ ధృవాలలోని విస్తారమైన మంచుకొండలు కరిగిపోతున్నాయి. మంచు ఖండంగా పిలుచుకునే అంటార్కిటికాలో కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు ఫలకాలు విరిగి సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. దీంతో సముద్ర మట్టం పెరుగుతోంది.
ప్లాస్టిక్ కాలుష్యం...
ప్లాస్టిక్ కాలుష్యం సాగర జలాల్ని విష పూరితం చేసి, జలచరాల్ని కబళిస్తోంది. భూమండలంపై ఏటా మూడున్నర కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం పేరుకుపోతూ, అందులో నాలుగోవంతు దాకా జలాల్లోకి చేరుతుందన్న సంగతి తెలిసిందే. ప్రపంచ జిడిపిలో 5 శాతం (180 ట్రిలియన్ రూపాయలు) ఆదాయం సముద్రం నుంచి ఏటా లభిస్తోంది. సముద్ర గర్భంలో మానవుడికి ఇంకా అంతుబట్టని జీవజాతులు మిల్లియన్లలో ఉన్నాయి. ఇప్పటికి రెండు లక్షల జీవ జాతులు మాత్రమే సముద్రంలో గుర్తించారు. ఎన్నో మిలియన్ల ప్రజలకు సముద్రం ఆహారాన్నిస్తోంది. అటువంటి సముద్రాన్ని మనిషి తన అజ్ఞానంతో కాలుష్యమయం చేయటం విచారకరం.
మనకు అక్కరకు లేని ప్రతి వస్తువు చివరకు సముద్రంలోకి చేరుతుంది. ఇది ఇలాగే కొనసాగితే అది సముద్రాలకే కాదు మనుషులకు చేటే. సముద్రాల మనుగడ మన చేతుల్లోనే ఉంది. మితిమీరిన చేపల వేటకు అడ్డుకట్టవేయాలి. ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులను సముద్రాల్లోకి చేరకుండా నివారించాలి. కొన్ని జల చరాలు ప్లాస్టిక్ పదార్థాలను ఆహారంగా భ్రమ చెంది తినే ప్రమాదం ఉంది. పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలను, ఇతర చెత్తను సముద్రంలోకి ప్రవేశించకుండా చూడాలి. జీవరాశిలోని దాదాపు ఐదు రకాల జలరాశులు ఇప్పటికే కాలుష్యంలో అదృశ్యమై పోయాయి. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాల వలన సముద్రాలలో రెండు లక్షల నలభై అయిదువేల చదరపు కిలోమీటర్ల మేరకు 400 పైగా మృత ప్రాంతాలుగా తయారయ్యాయి. ఆహారంలో అవసరమైన ప్రొటీన్లను సముద్రాలు 300 కోట్ల మందికి అందిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20 కోట్ల మందికే సముద్రాలు జీవనోపాధినిస్తున్నాయి.
జీవనోపాధికి మార్గం...
భూగోళం మీద మూడింట రెండు వంతుల మేర సముద్రం ఆవరించి ఉంది. విస్తారమైన ఉప్పు నీటి భాగానే్న సముద్రమంటారు. నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. భూమిని నీటి గ్రహం అంటారు. భూమి మీద ఉండే నీరులో 97.2 శాతం సముద్రంలోనే ఉంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండటానికి కారణం ఈ జీవనది తమ నీటితో పాటు భూమి మీద లవణాలను నిరంతరం సముద్రంలో వదలడం వల్ల నీరు ఉప్పుగా ఉంటుంది. కానీ భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి భారీ మంచు పర్వతాలు సైతం క్రమంగా కరిగి అంతరించిపోయే ప్రమాదముంది. ఇదే జరిగితే సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగి తీర ప్రాంతంలో నగరాలు, పట్టణంలో మునిగిపోయి కోట్లాది మంది ప్రజలు మృత్యువాతపడే అవకాశముంది. హిమానీ నదుల్లో సాధారణంగా మైనస్ డిగ్రీతో ఉండే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటం, మంచు కూడా అదే స్థాయిలో కరుగుతూ సముద్రాలు గణనీయంగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారానే అనే్వషకులు ప్రయాణించి అనేక దేశాలను కనుక్కొన్నారు. ప్రపంచంలో నాలుగింట మూడొంతులు నీరే ఉంది. ఇది సముద్ర రూపంలో ఉంది. సముద్ర నీరు మొత్తంగా నీటిలో 97 శాతం ఉంది. మరో విచిత్రమైన అంశమేమిటంటే భూమండలం మీద 99 శాతం జీవులకు సముద్రాలే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా మూడువందల కోట్ల మంది సముద్ర ఆధారంగా జీవిస్తున్నారు. దక్షిణాసియాలో ఏడువేల కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం కలిగి ఉంది. భారత ఉప ఖండంలో అధిక భాగాన్ని కూడుకుని ఉన్నది భూభాగం. వాతావరణ మార్పులలో సముద్ర మట్టాలు కూడా పెరిగి పోతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాలైన నగరాల అస్థిత్వం ప్రమాదంలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం భూగ్రహానికి గుండె వంటిది అంటారు. ముందుగా భూగ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సముద్రాలను కాలుష్య రహితంగా ఉంచుకోవాలని మనం గుర్తుంచుకోవాలి.
సముద్ర ఉపరితలంపై వీచే గాలితో ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో తీర ప్రాంతాల్లో ఆర్ద్రత పెరిగిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. వెచ్చటి ఉపరితలాలు తుపాన్లకు కారణవౌతాయి. అందుకే సముద్ర పరిరక్షణలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న సవాళ్లను గురించి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్గించి ఆరోగ్యవంతమైన సముద్రాల కొరకు, ప్లాస్టిక్ రహిత సముద్రాల కోసం ఏటా జూన్ 8న ‘అంతర్జాతీయ ఓషన్స్ డే’ జరుపుకొంటారు. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర కెరటాలను చూస్తే యువతీ యువకులు ఉరకలేస్తారు. నిజానికి మనిషి జీవితం నీటితో ముడివడి వుంది. సాగర జల సంపద చాలా విశేషమైనది. సాగరంలో దొరికే జీవ సంపదలో ప్రత్యక్ష స్థానం చేపలదే. తర్వాత తాబేళ్లు, తిమింగిలాలు, సీల్స్ వంటివి ఉన్నాయి. సముద్రంలో పనికిరాని పదార్థాం లేదు. సముద్రంలో గ్యాస్ లభిస్తుంది. ఎన్నో ఆయిల్ రిఫైనరీలకు ముడి చమురు తీస్తున్నారు. ప్రకృతి సంపద అయిన సముద్రాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ప్రతి 8 సంవత్సరాలకు ఒక మిల్లీమీటరు చొప్పున సముద్ర నీటిమట్టం పెరుగుతుందని గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. సముద్ర పరిరక్షణ కోసం 1992లో మొదటిసారిగా ‘ప్రపంచ ఓషన్స్ డే’ ప్రారంభించారు. 2008 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 8 తేదీన ‘వరల్డ్ ఓషన్స్ డే’గా గుర్తించింది. సముద్రమంటే కేవలం రవాణా మార్గం మాత్రమే కాదు. సముద్రం మనకు ఆక్సిజన్‌ను ఇస్తుంది. జల చరాలకు ఆవాసంగా ఉంటుంది.
నౌకా మార్గాలకు అంతరాయం
భూవాతావరణం వేడెక్కి సముద్రాల ఎత్తు పెరిగితే కొన్ని అంతర్జాతీయ నౌకా మార్గాలు మూసుకుపోయే ముప్పు ఎదురవుతోంది. ముఖ్యమైన జలసంధులు, కెనాళ్ల వద్ద ఈ సమస్య మరీ అధికం. మలక్కా (మలేషియా), హోర్ముజ్ (ఇరాన్ యుఎఇ) సూయజ్ కెనాల్ (ఈజిప్టు) బాద్.ఎల్. మందేబ్ జలసంధి (యెమెన్ దిజ్‌బూతి ఎరిత్రియా) పనామా కెనాల్ (పనామా) దానిష్ (స్టెయిట్స్, తుర్కిష్ స్టెయిట్స్) దీనికి ఉదాహరణలు. ఈ జలసంధులు, కెనాళ్లు ఎంతో ముఖ్యమైన నౌకా మార్గాల్లో భాగం. భూవాతావరణంలో 10 శాతం ఆక్సిజన్ విడుదల చేసే ‘ప్రోక్లోరోకోకస్’ అనే బాక్టీరియా మనుగడ ప్రమాదంలో పిందని తాజా అధ్యయనంలో ఒకటి తేల్చింది. సముద్రంలో ఆక్సిజన్ కరువై వేలాది ‘వేల్’ చేపలు ఒడ్డుకు కొట్టుకుని రావడం, ప్లాస్టిక్ పదార్థాలను తినటం వల్ల సముద్ర తీరంలో పెద్దసంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. సముద్ర తీరంకి చేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, బలమైన గాలులకు, తీక్షణమైన సూర్యరశ్మికి గురై చిన్న చిన్న ముక్కలుగా మారుతాయి. ముక్కలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లో సులభంగా కరుగుతాయి. ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న సముద్రాలను రక్షించుకుందాం.

-కె.రామ్మోహన్‌రావు 94414 35912