సబ్ ఫీచర్

దిక్కుతోచని విపక్ష నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుగులేని మెజారిటీతో నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక విపక్షపార్టీలకు అయోమయ పరిస్థితి ఎదురైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలందరూ ప్రాంతీయత, కులమతాలకతీతంగా దేశ ప్రగతి, దేశ సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తూ భాజపాకు అఖండ మెజారిటీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర విపక్ష నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దారుణ ఓటమి అనంతరం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఇపుడు మతిమాలిన మాటలతో విపక్ష నాయకులు తమ నిజస్వరూపాలను బయటపెడుతున్నారు. విపక్ష పార్టీల్లో అగ్రనాయకుల నుంచి గల్లీ నాయకుల వరకూ ఒకే ఊతపదాన్ని వల్లెవేస్తూ ‘భాజపా మతతత్వ పార్టీ’ అని నిందలు వేస్తూ దేశాన్ని మరోసారి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారు.
ఇపుడు దేశవ్యాప్తంగా విస్తరించిన భారతీయ జనతాపార్టీ అలనాటి జనసంఘ్ పార్టీ నుంచి ఉద్భవించింది. డా.శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఎంతో దూరదృష్టితో జనసంఘ్‌ను 1957లో ఏర్పాటుచేశారు. తూర్పు బెంగాల్ రాష్ట్రంలోని హిందూ మైనారిటీ మతస్థులు పడే బాధలకు, కష్టాలకు వివక్షకు ఎంతో బాధపడి నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి ముఖర్జీ బయటకు వచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న ప్రత్యేక ప్రతిపత్తి ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అని ముఖర్జీ చేసిన ప్రసంగాలు ఇప్పటి నాయకులకు ఆదర్శం. జనసంఘ్‌కు అనుబంధ సంస్థలైన ఆర్‌యస్‌యస్, విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ లాంటి సంస్థలు కుల మత వైషమ్యాలను వ్యతిరేకిస్తున్నాయి. పరమత సహనంతో, మత ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యతకు, అభివృద్ధికి నిరంతరం పాటుపడే ఈ సంస్థలను విమర్శించడం నేటి కుహనా లౌకిక నాయకులకు పరిపాటిగా మారింది.
ఈ దేశంలో పుట్టిపెరిగిన ప్రతివ్యక్తీ భారతీయుడే. స్వచ్ఛమైన జాతీయ భావానికి, మాతృభూమి వైభవానికి, మత సామరస్యానికి, దేశ అభివృద్ధికి హిందూ భావజాల పార్టీలు నెలవు. తారేఖ్‌ఫత్ అనే పాకిస్తాన్ సామాజికవేత్త హిందు భావజాలాన్ని ఎంతగానో శ్లాఘించారు. హిందూ జాతీయవాదం బలపడితే అది భారతదేశానికే పరిమితం అవుతుంది. అంతేగాని ఇతర మతాలకు ఎటువంటి ఉపద్రవం కలుగదు. అదే ఇస్లామిక్ తీవ్రవాదం ప్రబలితే ప్రపంచానికే నష్టం. అప్పుడు ప్రజాస్వామ్యానికి పుట్టగతులుండవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు తమ మతిలేని వ్యాఖ్యలను మానుకోవాలి. భారతీయ తత్వమే సర్వమత సమభావన.
బ్రిటీష్ పాలకులు మన దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినపుడు అదే సమయంలో పాకిస్తాన్ ఏర్పడినపుడు ఆ దేశంపై అభిమానంతో మదర్ ఇండియా సినిమా దర్శకుడు మహబూబ్‌ఖాన్ పాకిస్తాన్ పోయి స్థిరపడ్డాడు. కొంత కాలానికి పాకిస్తాన్ నిజ స్వరూపం తెలుసుకొని అక్కడ ఉన్న తన ఆస్తులు అమ్ముకొని తిరిగి ఆయన భారతదేశం వచ్చి ముంబాయిలో స్థిరపడ్డాడు.
ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న రాజకీయ ద్వేషంతో ముస్లిం మత సంస్థలను రెచ్చగొట్టడం సరికాదు. మమత ఇచ్చిన మద్దతుతో కోల్‌కతలోని టిప్పుమసీద్ ఇమాం బర్కతీ అనే ముల్లా ప్రధానమంత్రి మోదీకి మద్దతుఇచ్చే ముస్లింలపై ఫత్వా విధిస్తున్నట్లు ప్రకటించడం మత రాజకీయాలకు ప్రేరణే. ఈ విషయాన్ని ఎన్‌డీఏ కూటమిలోని మిగతా భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకించకపోవటం శోచనీయం. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి?
ప్రతి ఎన్నికల ముందు అవకాశవాద రాజకీయ నాయకులు దేశ ప్రగతిని విస్మరించి లౌకికవాదం అంటూ ప్రజల చెవులలో పూలు పెడుతున్నారు. ఇంతకాలం వారి మోసపూరిత మాటలకు భ్రమపడి జనం వారికి మద్దతుఇచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధిని, దేశ సమగ్రతను గత ఐదు సంవత్సరాల్లో వీక్షించిన ప్రజలు చైతన్యవంతమయ్యారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చబోతున్న మోదీ నాయకత్వానికి జేజేలు పలుకుతున్నారు. ఈ దేశ ప్రజల భావనలకు హిందూ సంస్థల భావజాలానికి ఎప్పుడూ పొందిక ఉండదని రాహుల్‌గాంధీ ఆరోపించడం అవగాహన లేనితనానికి నిదర్శనంగా కనపడుతున్నది. ఇప్పుడు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ఈ కుహనావాదుల సత్యదూర వాదనల అసలు రంగు అర్థమైంది. అందుకే జాతి మొత్తం ఏకమై తమ ఓటుహక్కుతో వారికి జ్ఞానోదయం కలిగించారు.
ప్రతిపక్ష నాయకులు భస్మాసుర హస్తాల్లాంటి సెక్యులరిజం, లౌకికరాజ్యం పదాలను ఎంతకాలం వల్లెవేస్తుంటారో అంతకాలం దేశ ప్రజల అభిమానానికి, పరిపాలనకు వారు దూరమైపోవడం ఖాయం. ఇప్పటికైనా తమ తప్పులు తెలుసుకొని దేశప్రగతి, ప్రజల సంక్షేమం కోసం నిర్మాణాత్మకమైన, ఆమోదయోగ్యమైన ఉద్యమాలు చేపట్టి చిత్తశుద్ధితో పనిచేసిన నాడే ప్రతిపక్ష పార్టీలకు పూర్వవైభవం వస్తుంది. లేకపోతే త్వరితగతిన రాజకీయ రంగం నుంచి అవి పూర్తిగా నిష్క్రమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

-జన్నాభట్ల నరసింహ ప్రసాద్