సబ్ ఫీచర్

కృష్ణ పాత్రలో ఆయనకు ఆయనే సాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివంగత పీసపాటి నరసింహమూర్తి ఆరు దశాబ్దాల కాలం నటసింహమై తనకి తానే సాటి అనిపించుకున్న గొప్ప కళాప్రపూర్ణుడు. ఆయన మహానటుడే గాక తెలుగు నాటక రం గంలో పెనుమార్పులు తెచ్చిన నటనకు భాష్యం చెప్పి నూతన ఒరవడిని భావితరం కళాకారులకందించిన గొప్ప దార్శనికుడుగా అసమాన ఖ్యాతి నార్జించారు. పద్యాన్ని సాగదీసి రాగాలాపనతో పాడడమే నాటకం అని భావించే రోజు ల్లో దానికెదురునిల్చి నాటకానికి నటనే గుండెకాయ అని నిరూపించిన ప్రజ్ఞాశాలి. తెలుగు సంస్కృత పరిజ్ఞానం కలిగివుండడం చేత పద్యపఠనంలో గద్య ఉచ్ఛారణలో స్పష్టత, మధురత, గంభీరత, నటనపై చక్కని అవగాహన పట్టు కలిగి వుండడం వారికి వెన్నతో పెట్టిన విద్య, ఆ దైవమిచ్చిన వరం.
‘పీసపాటి’ అనగానే తెలుగునాట జనావళికి గుర్తుకు వచ్చేది ఆయన కృష్ణ పాత్రే. ఆ రోజుల్లో కె.రఘురామయ్య, బందా కనకలింగేశ్వరరావు, అబ్బూరి వరప్రసాదరావు, షణ్ముఖ ఆంజనేయరాజు, ఎ.వి.సుబ్బారావు మున్నగు కృష్ణులెందరున్నా రాయబారం కృష్ణుడుగా పీసపాటి ఉం డడం గమనార్హం. పౌరాణిక నాటకాలలో కృష్ణు డే గాక అర్జున, నక్షత్రక, హరిశ్చంద్ర, నారద, బాహుకుడు వంటి ము ప్ఫై పౌరాణిక, చారిత్రిక నాటకాలలో ఏ పాత్ర ధరించినా అందులో లీన మై ప్రేక్షకుల యెద లో మరపురాని ముద్రవేయడంలో ఆయన అందెవేసిన చేయి. కవి హృదయాన్ని పద్యభావాన్ని ఆకళింపు చేసుకొని పద్యపంక్తుల- పదాలను విరిచి భావయుక్తంగా ప్రవచించడంలో ఆయన శైలి ప్రత్యేకతను సం తరించుకోవడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పం దన లభించేది. నాటక నిర్వాహకులకు ధనం బా గా చేరేది. ఆ రోజుల్లో ఎక్కువగా టిక్కెట్టు ప్రదర్శనలే ఉండేవి. ఆంగిక, సాత్విక, వాచిక, అభినయాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. డైలాగులు చెప్పడంలో భావాన్నిబట్టి హెచ్చుతగ్గులు ధ్వనిలో చూపడం, కొంటెతనపు చిరునవ్వులు, నిల్చొనే విధానం, నటనా వైభవం, చూపుల్లో చురుకుతనం, కరుకుతనం, ఉచ్ఛారణా పటిమ అన్నీ కలిసి, ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రా ఏకైక కృష్ణుడుగా పేరుగాంచారు. ఆయ న కృష్ణ పాత్రలో నటిస్తున్న సమయంలో ప్రేక్షకులు అనిర్వచనీయమైన మధురానుభూతిని పొందేవారంటే అతిశయోక్తికాదు. ఆ నైపుణ్యం పీసపాటికే అబ్బింది. రాయబారం కృష్ణుడుగా ఆయనకు తిరుగుండేది కాదు.
విజయనగరం జిల్లా బొబ్బిలి తాలూకా వంతరాం అగ్రహారంలో మాతామహుల ఇంట, 1920, జూలై 10న జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. స్వగ్రా మం రాముడువలస. పిన తండ్రి వద్ద కాకినాడ లో కొంతకాలం పెరిగారు. కొంతకాలం పురోహిత వృత్తి చేశారు. సమయంకోసం ఎదురుచూడగా అవకాశం కలిసి వచ్చింది. 1938లో ప్రప్రథమంగా ‘రంగూన్‌రౌడీ’ నాటకం ద్వారా నాటక రంగంలోకి ప్రవేశించారు. అనంతరం ఖిల్జీ రాజ్యపతనం నాటకంలో ‘గణపతి’ పాత్ర ధరిం చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్సాహం, గుర్తింపు, ఉన్నతి, తరుముకొచ్చాయి.
1939లో సామర్లకోటలో వాణీ నాట్యమండలిలో చేరి కిళాంబి కృష్ణమాచార్యులవద్ద నటనాభ్యాసం చేశారు. అదే సంవత్సరం ఆయన వైవాహిక జీవితం శ్రీమతి పాపమ్మతో జరిగింది. అనంతరం మడమ తిప్పని మహావీరునిలా నాటక రంగానికి, కళని తన జీవితాన్ని అంకితం చేసి, విశేషంగా పరిశ్రమించారు. అలా అనేక నాటకాలలో ముప్ఫైకి పైబడి పాత్రలను పోషించారు. అన్నింటిలోనూ తన ప్రత్యేకతను నిలుపు కున్నారు. 1940లో మద్రాస్‌లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో కన్నమదాసు నాటక ప్రదర్శనలో కన్నమదాసు పాత్రను ధరించి ప్రప్రథమంగా ఆ పాత్రకు ప్రథమ బహుమతి పొం దారు. ఆయన నటనా జీవితంలో అది తొలి విజయం.
1945లో శ్రీకాకుళం జిల్లా పొందూరుకు తన నివాసాన్ని మార్చారు. అక్కడ పాలిశెట్టి సూర్యం అండదండలతో శ్రీరామా నాట్యమండలి స్థాపిం చి అనేక నాటకాలను ప్రదర్శించారు. నాటకానుభవాన్ని పెంచుకున్నారు. 1949లో గుంటూరులో జరిగిన నాటక పోటీలలో ‘పాండవోద్యోగం’ నాటకం ప్రదర్శించి, నాటకం రాసిన కవి అప్పటి రాష్ట్ర ఆస్థానకవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీ సమక్షంలో శ్రీకృష్ణ పాత్రకు ప్రథమ బహుమతి బంగారు కిరీటాన్ని పొందారు. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అభినందించి తన స్వహస్తాలతో బంగారు నటరాజ విగ్రహాన్నిచ్చి సన్మానించారు. 1949లోనే నరసరావుపేట పురజనులు పౌర సన్మానం జరి పి ఘంటా కంకణాన్ని బహూకరించారు. 1950 లో విజయనగరం పురప్రజలు బంగారు కిరీ టం సుదర్శన చక్రం ఇచ్చి సన్మానించారు. 1954 తిరిగి విజయనగరం ‘రఘు’ ఉత్సవ సంఘం, తాతానగర్ ఎం.డి.యల్.సంఘాలు, సంయుక్తంగా ఘనంగా సన్మానించాయ. 1955లో హైదరాబాద్ నాటక కళాపరిషత్ సన్మానించింది. 1957లో ఆంధ్ర నాటక కళాసంఘానికి అధ్యక్షులయ్యారు. అదే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యత్వంతో గౌరవించింది. 1958లో గుంటూరు ప్రజలు ‘సువర్ణ సుదర్శన’ చక్రంతో సన్మానించారు. 1964లో తెనాలి ‘శారదీపీఠం’లో సువర్ణ పుష్పాభిషేకంతో సన్మానించారు. శ్రీ స్థానం నరసింహారావు ‘గండపెండేరం’తో సత్కరించి ‘నటచక్రవర్తి’ బిరుదునిచ్చి గౌరవించారు. 1972లో బాపట్లలో పురపాలక సంఘం చైర్మన్ యడ్లవల్లి సూర్యనారాయణ నగర వీధుల్లో ఊరేగింపు చేసి ‘నటశేఖర బిరుదు’నిచ్చి సన్మానించారు. 1972లో బొబ్బిలి లయన్స్ క్లబ్ రజిత పాత్రను పట్టువస్త్రాలను ఇచ్చి సత్కరించింది. విశాఖ పురజనులు తెనే్నటి విశ్వనాథంగారిచే ‘గండపెండేరం’తో సత్కరించారు. 1989లో పర్లాకిమిడి పుర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. విశాఖపట్టణం గురజాడ కళాక్షేత్రంలో ‘కళాబంధు’ శ్రీ టి.సుబ్బిరామిరెడ్డి కళాపీఠం వారి ‘లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్’ అవార్డుతో పీసపాటిని సత్కరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యం హైదరాబాద్‌లో ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.
రంగస్థలంపై ఎన్నో పాత్రలలో నటించి కీర్తిపొందినా, శ్రీకృష్ణ పాత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకు చిరకీర్తి తెచ్చిపెట్టింది శ్రీకృష్ణ పాత్రే. ఆయన పద్యపఠనం ఓ అమృతఝరి. పద్య పఠనాశైలి, నటనా శైలి, గద్యం చెప్పినా, పద్యం చదివినా, సుస్పష్టమైన స్వరబద్ధమైన గొంతు ఆయనకో ప్రత్యేకతనిచ్చింది.
మలేషియా, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో ప్రదర్శనలిచ్చి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలు సంపాదించారు. తెలుగు నాటక రంగం లో ఆరు దశాబ్దాలు పాటు ‘మకుటం లేని మ హారాజులా’ వెలుగొందారు. తన 87వ ఏట 2007, సెప్టెంబరు 28న దివంగతులయ్యారు.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు సెల్: 9293327394