సబ్ ఫీచర్

విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అడుగు ముందుకు.. నాల్గు అడుగులు వెనుకకు ఇది తెలంగాణ విద్యాశాఖ పరిస్థితి. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రకటనలు విద్యావంతులు, మేధావులను అయోమయానికి గురిచేశాయ. ఈ ఏడాది మొదట్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎన్నికలవల్ల ఆపేశారు. మరల మార్చినెల మొదటివారంలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మరో రోజు తర్వాతే కేంద్రం టెట్ విధానాలు మారుస్తుందంటూ వాయిదావేశారు. తీరా టెట్ వాయిదాపై నిరుద్యోగులనుంచి విమర్శలు రావటంతో గత్యంతరం లేక మరల నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో టెట్ పాసైన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల దగ్గర జవాబులేదు.
సిబిఎస్‌ఇ తరహాలో అకాడమిక్ క్యాలెండర్‌ను చాలా ముందుగానే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అందుకు సన్నద్ధం కాలేక విఫలమయ్యారు. ఎలాంటి వ్యూహం, ప్రణాళిక లేకుండానే మార్చి 21 నుంచి నూతన తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. నూతన విద్యా సంవత్సరం జూన్ 12కు బదులుగా మార్చి 21నుండే ప్రారంభించటానికి సర్కారు బడులకు సమయానికి పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేదు. టెక్స్ట్‌బుక్స్ లేకుండా సర్కారు బడులు ఎలా నడుపుతారని పేరెంట్స్, టీచర్ ప్రశ్నించారు. ఇదేం విద్యాశాఖ? అంతా అయోమయం, గందరగోళం అనే విమర్శలు రావటం జూన్ 12నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని మరల సవరణ ఆదేశాలు ఇచ్చారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 23వరకు రెండు పూటలా బడులు నిర్వహించాలని విద్యాశాఖ మొదట్లో ఆదేశాలు ఇచ్చింది. తర్వాత తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు గొడవ చేయటంతో మళ్లీ ఒంటిపూట బడుల నిర్వహణకే మొగ్గుచూపారు. ప్రభుత్వం తలాతోకాలేని నిర్ణయాలవల్ల అభాసుపాలవుతున్నది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా క్షేత్రస్థాయిలో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యావేత్తలను చర్చించి ఒక నిర్ణయం ప్రకటించాలి. ఏప్రిల్ నెలలో పూర్తిఅయ్యే 9వ తరగతి పరీక్షల్ని ముందువెనుకా ఆలోచన లేకుండా మార్చి 15నాటికే పూర్తిచేసి 38 రోజుల అమూల్యమైన విద్యార్థుల సమయాన్ని దుర్వినియోగం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు ప్రభుత్వ పుస్తకాలు, ప్రభు త్వ సిలబస్‌నే వాడాలని ఆదేశాలు ఇచ్చారు. కాని మళ్లీ నిర్ణయం మార్చుకున్నారు. అక్కరకు రాని ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను ప్రవేశపెట్టి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలు నిలువుదోపిడి చేస్తున్నాయి. నియంత్రణ అధికారులు విఫలంఅయ్యారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ముద్రించటానికి ప్రచురణకర్తలకు అనుమతి ఇవ్వాలి. కానీ అది జరగలేదు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 దాక విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలో శిక్షణ ఇస్తామన్నారు. వార్షిక పరీక్షలు ముగిశాయంటే సమ్మర్ హాలీడేస్ వచ్చినట్లు విద్యార్థులు భావిస్తారు. పరీక్షలు అయ్యాక బడికి వచ్చేదెవ్వరు? మండే ఎండల్లో విద్యార్థులు బడికి రారు. బడికి పంపటానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ముందూవెనకా ఆలోచించకుండా రెండు పూటల బడికి రావాలని గుడ్డిగా ఆదేశాలు జారీచేశారు. మార్చి నెలలోనే మే నెలకన్నా ఎక్కువ వేడి ఉండటంవల్ల సర్కారు ఆదేశాలు అమలుకాలేదు.
ఇంటర్, డిగ్రీ, పీజీతోపాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో లేని నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)లను పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సర్కారు పాఠశాలలు సర్వశిక్షాఅభియాన్ నిధులతో కెమెరాలు కొనుక్కోవచ్చునని ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ పరీక్షా కేంద్రాల్లో ప్రైవేట్ యాజమాన్యాలు స్వంత ఖర్చుతో నిఘా నేత్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశాలుఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ లేని ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత రావటంతో సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఈవిధంగా ఈ ఏడాది విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రతి విషయంలోను గందరగోళం, ఆందోళనకు దారితీస్తున్నాయి. ముందూ వెనుకా ఆలోచన చేయకుండా కొత్త నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత రావటంతో నాలుక కరుచుకొని నిర్ణయాలను రద్దుచేస్తున్నారు. గత 20నెలల నుంచి సుమారు 15 నిర్ణయాలను ప్రకటించి అధికారులు విరమించుకోవటం పట్ల విద్యాశాఖ పయనం ఎటుపోతున్నదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

- రావుల రాజేశం