సబ్ ఫీచర్

చైనా ‘పెద్ద ముందడుగు’.. మావోలకు కనువిప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. నవంబర్ 1న చైనా 5జి సర్వీసులను ప్రారంభించి సాంకేతిక రంగంలో తన సత్తా చాటుకుంది. వర్తమాన సాంకేతిక రంగంలో తానే అగ్రగామి అని చైనా ప్రపంచానికి చాటింది. అలా పెద్ద ముందడుగు వేసింది. ఇరు దేశాల మధ్య ‘స్పర్థ’ సరికొత్త తీరాలకు చేరింది.
వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 5జి సేలను చైనా ముందుగానే ఆరంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ కొరియా కొన్ని నెలల క్రితం 5జి సర్వీసులను ప్రారంభించినా, అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే 5జి సేవలు అందుతున్నా, 50 నగరాలలో 5జి సేవలను ప్రవేశపెట్టి చైనా అగ్రభాగాన నిలిచింది. చైనా టెలికాం, చైనా యూనికాం, చైనా మొబైల్ అనే మూడు ప్రభుత్వ సంస్థలు ఈ సేవలు ప్రజలకు అందిస్తున్నాయి. చైనాకన్నా ముందే తమ దేశమంతటా 5జి సేవలు ప్రవేశపెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని నెలల క్రితం తన వారిని పురమాయించినా, చైనాకు చెందిన ‘హువావే’ స్మార్ట్ఫోన్ ఉత్పత్తిపై అపవాదు వేసి, గూఢచర్యం కోసం ఆ ఫోన్ తయారైందని ఆరోపణలు చేసి, 5జి సేవలు చైనాలో ఆలస్యమయ్యేందుకు ప్రయత్నించినా, వాణిజ్య యుద్ధం పేర ఆంక్షలు విధించినా దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చినా 5జి విషయంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయింది.
చైనా ఇపుడు మేఘాల్లో తేలిపోతోంది. దక్షిణ కొరియా సైతం చైనా దరిదాపుల్లో కనిపించడంలేదు. 5జి సేవలిప్పుడు ప్రపంచంలో ‘గేమ్ ఛేంజర్’గా మారాయి. ఈ సూపర్‌ఫాస్ట్ టెక్నాలజీ ఎవరి గుప్పిట్లో ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచే వీలుంది. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానమంతా ఈ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నది. అందుకే దీన్ని ‘రాబోయే తరం సాంకేతికత’ (నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ)గా పిలుస్తున్నారు. చైనా ముందుగా మేల్కొని మార్కెట్‌లోకి వచ్చింది. సేవలు ప్రారంభమైన నిముషాల్లోనే హువావే లక్ష హ్యాండ్ సెట్లు అమ్మినట్లు వార్తలు వెలువడ్డాయి.
5జి సేవలను ఇతర దేశాల్లోనూ అందించి ఆర్థికంగా శక్తిమంతమయ్యేందుకు చైనా ప్రణాళికలు రచించింది. రష్యాలో సైతం చైనా 5జి టెక్నలజీ పనిచేయనున్నది. భారత్‌లోకి రాబోతోంది. ఇటీవల జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో హువావే పాల్గొన్నది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక 5జి సెల్‌ఫోన్లు వాడే దేశంగా చైనాను తీర్చిదిద్దే పనిలో అక్కడి పాలకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చైనా 5జి సర్వీసులకు అతి పెద్ద మార్కెట్‌గా ఉబికి వచ్చింది. త్వరలోనే లక్షా ముప్ఫైవేల బేస్ స్టేషన్లు అక్కడ పనిచేయనున్నాయి. ఇంతవరకు ఇన్ని బేస్ స్టేషన్లు ప్రపంచంలో ఎక్కడా లేవు. దక్షిణ కొరియాలోగాని, అమెరికాలోగాని పరిమిత సంఖ్యలో ఇవి కనిపిస్తాయి. 5జి హ్యాండ్ సెట్ల తయారీ కంపెనీలు సైతం ఉత్పత్తి వేగాన్ని పెంచాయి. హువావే (మేట్ 30, మేట్ 30 ప్రో) వివో, గ్జియామి, ఒప్పో తదితర కంపెనీలు ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. అమెరికా హువావేపై ఆంక్షలు విధించినా, నిషేధించినా మిగతా బ్రాండ్లు మార్కెట్లోకి దూసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో బ్రిటన్, అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో 5జి సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే- ‘డిమాండ్’ను అందుకోవడానికి ఆ సంస్థలు సిద్ధంగా ఆన్నాయి. ఇప్పటికే 18 రకాల హ్యాండ్ సెట్లు మార్కెట్‌లోకి వచ్చాయి. చైనాలో 5జి వినియోగదారుల సంఖ్య 17 కోట్లకు చేరవచ్చునని, దక్షిణ కొరియాలో కేవలం 8 లక్షల 75 వేలకు పెరగవచ్చని భావిస్తున్నారు. చైనాలో 5జి వినియోగదారుల సంఖ్య 60 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరంలేదని నిపుణుల మాట.
4జిలోని వేగం కన్నా 5జిలో వేగం వందరెట్లు ఎక్కువ అన్నమాట మంత్రంలా పనిచేస్తోంది. ‘వేగం’ అభివృద్ధికి చిహ్నంగా భావిస్తున్న వర్తమాన సందర్భంలో అందరూ 5 జివైపు మొగ్గడంలో ఆశ్చర్యమేముంది? దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జి 5జి సాంకేతికతపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. 5జి నెట్‌వర్క్‌పై భారీ ఎత్తున ఖర్చు చేశామని ఆ సంస్థకు చెందిన ‘యుప్లస్‌కార్ప్’ ప్రకటించింది. స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ వచ్చే సంవత్సరం 5జి ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. అప్పుడు 5జి వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఫ్లాష్‌బ్యాక్..
చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టిన దాదాపు దశాబ్దానికి మావో నాయకత్వంలో పెద్ద ముందడుగు (గ్రేట్ లీఫ్ ఫార్వార్డ్) ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది. వ్యవసాయ రంగం నుంచి దేశాన్ని పారిశ్రామీకరణ వైపు నడిపించాలన్నదే దాని లక్ష్యం. కాని సరైన ప్రణాళిక, అవగాహన, శాస్ర్తియ దృక్పథం లేకపోవడంతో చైనాలో ఆ ఉద్యమం బెడిసికొట్టింది. ఫలితంగా ఆర్థికంగా దివాలా తీయడమేగాక ఘోరమైన క్షామం ఏర్పడింది. కోట్లాదిమంది ప్రజలు ఆకలితో మరణించారు. సమష్టి వ్యవసాయం పేర జరిపిన ప్రయోగం విఫలమవడం, గ్రామీణ పారిశ్రామీకరణ నినాదం నిష్ఫలం కావడంతో చైనా తన ఆర్థిక రంగాన్ని, దేశ ప్రతిష్ఠను గొప్పగా నిలపాలనుకుంటే అది కాస్త పాతాళానికి జారిపోయింది. మావో ప్రతిష్ఠ పూర్తిగా దిగజారింది. తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి మావో 1966లో సాంస్కృతిక విప్లవాన్ని ప్రకటించారు. ఇది చైనా స్వరూపాన్ని, స్వభావాన్ని మరింత దిగజార్చింది. కోట్లమంది ప్రజలు కన్నుమూశారు. విశృంఖల్వం వీర విహారం చేసింది. ‘రెడ్ గార్డ్స్’ పేర యువకులు బీభత్సం సృష్టించారు. మానవత్వం తలదించుకునేలా చేశారు. ‘పాత’ను ధ్వంసం చేయాలన్నది ఆనాటి నినాదం. పాతతరం అవమానాలకు, అకృత్యాలకు బలైంది. మావో చేపట్టిన ఈ రెండు ఉద్యమాలు మానవాళిని హీనంగా చూశాయి.
రెండవ పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో
వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణకోసం వేసిన ‘పెద్ద ముందడుగు’ విఫలమైనా తాజాగా నాల్గవ పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో చైనా 5జితో వేసిన పెద్ద ముందడుగు విజయవంతమైంది. దీన్ని మానవ చరిత్రలో గొప్పగా నిలిచే మలుపుగా, భావి తరాలకు దిక్సూచిగా తలుస్తున్నారు. చైనా ఇప్పుడు గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. ఒకప్పుడు అమెరికాను అధిగమించాలనుకుని గ్రేటీ లీ ఫార్వాడ్‌తో బొక్కబోర్లా పడిన చైనా, వర్తమానంలో నిటారుగా నిల్చుని తన సత్తాను చాటింది. అమెరికా సృష్టించిన ఆటంకాలను అధిగమిస్తోంది. మావో ఆలోచనా విధానం, సిద్ధాంతం విఫలమైనచోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గెలుపుతీరాల వైపు నడిపించింది, నడిపిస్తోంది.
భారత మావోలు
ఈ కీలక మార్పును భారత మావోయిస్టులు గమనించలేకపోతున్నారు. విఫలమైన గ్రేట్ లీఫ్ ఫార్వాడ్, సాంస్కృతిక విప్లవ కీర్తనలు ఆలాపిస్తూ, అదే సరైన దారి, ఆ దారిలోనే 2019-20 సం.లోనే భారత ప్రజలను నడిపిస్తామని కంకణం కట్టుకుని దండకారణ్యంలో ‘మార్చ్’ చేయడం చూస్తే, చదవేస్తే వున్న మతిపోయిన చందంగా వుంది.
చైనా తనకు తాను ఆ రెండు విఫలమైన ఉద్యమాలంటూ రుజువుచేసినా కోట్లాదిమంది సాధారణ ప్రజలు కన్నుమూశారని, వాటివల్ల వీసమెత్తు ప్రయోజనం ఒనగూరలేదని, పైగా తిరోగమనం, ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చైనా పాలకులే ప్రకటించినా- ఆ విధానాలు, ఉద్యమాలు.. వైఖరే ముద్దు అని భారత మావోలు ‘డాక్యుమెంట్లు’ రాసుకుని తుపాకులతో తిరిగితే ఏమిటి ప్రయోజనం?
అదే చైనా వర్తమానంలో 5జితో ‘పెద్ద ముందడుగు’ వేసి ఆర్థికంగా ఎదుగుతున్న ‘దృశ్యం’ కనిపిస్తున్నా, అనేక దేశాల్లో 5జితో చైనా వ్యాపారంతో భారీ సంపదను పోగేస్తున్నా, తన ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆ సంపదను ఖర్చు చేస్తున్నట్టు కనిపిస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా భారత మావోలు ఇంత గుడ్డిగా - ‘మావో కాలం నాటి లాంగ్ మార్చ్‌ను, గ్రేట్ లీఫ్ ఫార్వార్డ్‌ను, సాంస్కృతిక విప్లవాన్ని ఆహ్వానిస్తాం.. ఆచరణలో పెడతాం.. మావో ఆలోచనా విధానమే సమాజపు సర్వసమస్యలకు పరిష్కార మార్గాల’ని మూఢభక్తిని ప్రదర్శిస్తూంటే, ఈ దేశ మేధావి వర్గం, చైతన్య యువతరం.. ఆ కాలం చెల్లిన పద్ధతులను ఎందుకు ఎండగట్టలేకపోతున్నట్టు? కొందరు ఆ పనిచేసినా ‘మందమైన చర్మం’గల మావోలు స్పందించకపోవడం దారుణం గాక ఏవౌంతుంది? చరిత్రలో మావో చేసిన రెండు పెద్ద పొరపాట్లను భారత మావోలు తలపై పెట్టుకోవడమంతటి ‘అన్యాయం’ మరొకటి లేదు. అదే చైనా ఇప్పుడు మరో రూపంలో గొప్ప ముందడుగు (గ్రేట్ లీఫ్ ఫార్వాడ్) వేసింది.. వేస్తోంది.. 5జితో ప్రపంచాన్ని కొత్త ఎత్తులోకి నడిపిస్తోంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం భారత మావోలతోపాటు అందరికీ వుంది!

-వుప్పల నరసింహం 99857 81799