సబ్ ఫీచర్

నిస్వార్థ దేశభక్తుడు ‘గరిమెళ్ల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాకొద్దీ తెల్లదొరతనము దేవ, మాకొద్దీ తెల్లదొర తనము’ అం టూ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ కంచుకంఠం నుం చి వెలువడిన ఈ పాట ఆనాడు తెలుగునాడును చైతన్యవంతం చేసింది. 1920-22 మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో గరిమెళ్ళ పా ల్గొని ఈ పాటతో ప్రభజంనాన్ని సృష్టించా రు. ఈ పాట పెద్దల్ని, పిన్నల్ని, స్ర్తిలను, పురుషులను మంత్రముగ్ధుల్ని చేసింది. నాటి కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీ టోపీ పెట్టుకొని, బారులు తీరి మువ్వనె్నల జెండా ఎగురవేసుకొంటూ ఈ పాటను ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ కవాతు చేసేవారు. ఆ దృశ్యం తలచుకుంటేనే మేను జలదరిస్తుంది.
1922లో అప్పటి గోదావరి జిల్లా కలెక్టర్ బ్రాకెన్ రాజమండ్రిలో ‘మాకొద్దీ తెల్లదొరతనం’ పాటను గరిమెళ్ళచే స్వయంగా పాడించుకొని విన్నాడు. అది తెలుగు భాషరాని తనకు సైతం ఎంతో గగుర్పాటు కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గరిమెళ్ళను 8-2-1922న అరెస్టు చేయించారు. ఈమేరకు అదే ఏడాది ఆగస్టు 12వరకు కడలూరు, మద్రాసు, రాయవెల్లూరు కేంద్రీయ కారాగారాల్లో ఆయన కఠిన శిక్షను అనుభవించారు. ఈ సందర్భంగా ఆయనకు రూ.200 జుల్మానాను విధించారు.
ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేందుకు ఎంతో కృషిచేసిన గరిమెళ్ళ శ్రీకాకుళం జిల్లా గోనెపాడులో తన అమ్మమ్మ గారింట్లో 1893 జూలై 15న జన్మించారు. తన విద్యాభ్యాసం, యవ్వనమంతా ఇదే జిల్లాలోని ప్రియాగ్రహారంలోని స్వగృహంలో గడిపారు. పై చదువుల్ని విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి పట్టణాల్లో కొనసాగించారు. గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రధా న గుమస్తాగా, విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. గేయ రచయితగా, పాత్రికేయునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగానే ఆయన సుపరిచితులు.
ఆయన జైలునుంచి విడుదల కాగానే తిరిగి నలుగురిలో గొంతెత్తి పాడసాగాడు. అవి ప్రజల్ని ఉత్తేజపరిచాయి. పిల్లలు, పశువుల కాపర్లు, బిచ్చగాళ్ళు సైతం పాడేవారు. గరిమెళ్ళను బయట ఉంచడం తమ ఉనికికి ప్రమాదకరమని బ్రిటిషు అధికారులు భావించారు. ఆయన పై రాజద్రోహం కేసును మోపి, కాకినాడ మేజిస్ట్రేటు ముందర హాజరుపరిచారు. ‘‘కూలిపోతున్నది కూలిపోతున్నది’’/ మూలమట్టముతోటి కూలిపోతున్నది ప్రభు త్వం/ కూకటి వేళ్లతో కూలిపోతున్నది మూర్ఛ ప్రభుత్వం’’అంటూ గరిమెళ్ళ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఆయనకు రెండేళ్ల కఠిన కారాగారశిక్షను విధించారు.
ఆ తరువాత ‘‘స్వరాజ్య గీతములు’’ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించాడు. ఆంగ్లేయ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. దాని ప్రతులన్నీ జప్తు అయ్యాయి. ఈ విషయమై 1924 నవంబర్ 11న మద్రాసులోని ఎగ్మూరు పోలీసులు ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు కోర్టులో కేసును దాఖలు చేశారు. అతనిపై రాజద్రోహ నేరారోపణ చేశారు. ఆయన నేరాన్ని అంగీకరిస్తూ ‘‘దండాలండోయ్- మేముండలేమండోయి బాబు....వర్తకానికంటూ ఇంట్లో పాదమెట్టినాడు బాబు/ పాదం పెట్టి దొంగతనం- ప్రారంభించాడండీ బాబు’’ అంటూ ఆయన కలం, గళంలోంచి జాలువారిన ఆ పాట చిచ్చరపిడుగే అయింది.
ఆ ప్రభుత్వం పట్ల తనకు గల వ్యతిరేకతను మరోసారి చాటి చెప్పారు. ‘‘నా భౌతిక శరీరాన్ని నిర్బంధించగలరేమో గాని, నా ఆత్మను ఆశయాలను మాత్రం ఎప్పుడూ నిర్బంధించలేరు. ఎందుకంటే నేనిప్పటికీ నా ఆత్మను నా సాహిత్యం ద్వారా నా దేశం మీది కి విడిచి పెట్టేశాను. అది నేను జైలునుంచి తిరిగి వచ్చేనాటికి గాంధీజీ నాయకత్వాన నా ప్రజలకు సంపూర్ణ స్వరాజ్యం తీసుకువస్తుందని’’ అంటూ నిర్భయంగా పేర్కొన్నారు. ఫలితంగా గరిమెళ్ళకు 1924 నవంబరు 11 నుంచి మరో ఏడాది జైలు శిక్ష పడింది. గరిమెళ్ళ కడలూరు కేంద్రీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తుండగా 1925 మే 6న ఆయన భా ర్య మరణించింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కష్టాలు అధికమయ్యాయి. తన స్నేహితుల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్నా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.
బతుకుతెరువుకోసం 1933లో మద్రాసులో అడుగుపెట్టి తన కలాన్ని నమ్ముకొని పూర్తిస్థాయి పాత్రికేయునిగా మారారు. అక్కడ కె.ఎస్.కేసరి నేతృత్వంలోని ‘గృహలక్ష్మి’ పత్రికలో సంపాదకునిగా చేరారు. ఆ తరువాత ఆచార్య ఎన్.జి.రంగా యాజమాన్యంలోని ‘‘వాహిని’’ పత్రికకు సహాయ సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ‘ఆంధ్రప్రభ’లో సహాయ సంపాదకునిగా వ్యవహరించారు. తదనంతరం ‘‘ఆనందవాణి’’ పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. ప్రజలకోసం తప్పించి యాజమాన్యాలకోసం పనిచేయని గరిమెళ్ళ ఏ పత్రికలోను ఎక్కువకాలం పనిచేయలేదు. దుందుభి, వికారి తదితర పేర్లతో ఢంకా, కృష్ణాపత్రిక, త్రిలింగ తదితర పత్రికలకు వ్యాసాలు రాశారు. మద్రాసు ఆకాశవాణి కేంద్రం ఆయన ప్రసంగాలను పలుసార్లు ప్రసారం చేసింది. గరిమెళ్ళ కేవలం సాహిత్యంపైనే వ్యాసాలు రాయలేదు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఎన్నో వ్యాసాలు రాశారు. పాత ధోరణులను విస్మరించి ఆధునిక భావపరంపరతో తన వాదాన్ని సుస్పష్టం చేశారు. ఒక్క పాటతోనే ఆంగ్లేయుల గుండెల్లో ఇంత దడ పుట్టించిన రచయిత దేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. ‘హార్ట్ ఆఫ్ ఇండియా’’ అనే ఆంగ్ల రచన కూడా గరిమెళ్ళకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘హరిజన పాటలు’ అనే రచన ఆయన కలం నుంచి జాలువారిందే.
గరిమెళ్ళను ‘‘జాతీయ గేయ కవితా సార్వభౌముడని’’ జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. అభ్యుదయ కవితా వ్యాప్తికి, స్వరాజ్య సాధనకు ఎనలేని సేవలందించిన ఈ త్యాగమూర్తి అవసాన దశలో దయనీయ జీవితాన్ని అనుభవించారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండడంతో మద్రాసు మైలాపూర్‌లో హోటల్ నడిపారు. అది కూడా దివాలా తీసింది. దీనికి తోడు కంటి చూపును కోల్పోయారు. అనారోగ్య సమస్యలతో అతని జీవితం అతలాకుతలమైంది. ఆకలితో అలమటించారు. కేవలం ఓ కప్పు కాఫీకోసం మద్రాసు మహానగరంలో నడిరోడ్డుమీద ప్రజలముందు తల దించుకొని బిక్షాటన చేస్తూ 1952 డిసెంబరు 18న అత్యంత దయనీయ స్థితిలో అంతిమ శ్వాస విడిచారు. 59 ఏళ్లు మాత్రమే జీవించారు. ఆ మహనీయుని మరణవార్తపై ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మ సంతాపం వ్యక్తం చేస్తూ ‘‘గరిమెళ్ళ జీవితం ఓ విషాద గేయం, తెలుగు జాతికది మానని గాయం’’ అని వ్యాఖ్యానించారు. గరిమెళ్ల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం అవసరం. శ్రీకాకుళంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు ను పెట్టడం సరియైన నివాళి అవుతుంది.

చిత్రం... గరిమెళ్ల సత్యనారాయణ

- వాండ్రంగి కొండలరావు