సబ్ ఫీచర్

పౌరసత్వ చట్టానికి సవరణలు - వాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే. దేశంలో ఉన్న పౌరులలో 99శాతం మంది జన్మతః పౌరసత్వాన్ని పొందినవారే. కనుక ఏ చట్టం కారణంగానూ, ఏ సవరణ కారణంగానూ భారతీయుల పౌరసత్వం ఎట్టి పరిస్థితులలోనూ ఎవరూ రద్దుచేయలేరు. పౌరసత్వ నిర్ధారణకై ఎలాంటి ఆధార పత్రాలు చూపించవలసిన పని కూడా లేదు.
పౌరసత్వ చట్ట ప్రకారం నాలుగు రకాలుగా భారతదేశంలో పౌరసత్వం లభిస్తుంది. జన్మతః, వారసత్వం నమోదు, సహజీకృతంల ద్వారా పౌరసత్వం పొందవచ్చు. జన్మతః అంటే 1950 జనవరి 26 తరువాత దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడౌతాడు. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయులైతే వారి పిల్లలకు పౌరసత్వం వస్తుంది. 2004లో చేసిన సవరణ ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులైతేనే వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. వారసత్వం ద్వారా పౌరసత్వం అంటే 1950 జనవరి 26 తరువాత 1992 డిసెంబర్ లోపల భారతదేశం బయట జన్మించినవారి తండ్రి భారతీయుడైతే, వారు కోరుకుంటే ఆ బిడ్డకు భారతీయ పౌరసత్వం వస్తుంది. ఆ తరువాత ఆ నిబంధనను సరళీకరణ చేసి తల్లిదండ్రులలో ఏ ఒక్కరూ భారతీయులైనా వారి సంతానానికి పౌరసత్వం వచ్చేటట్టు చేసారు. నమోదుద్వారా పౌరసత్వం అంటే భారత సంతతికి చెందినవారు ఏ కారణం వలనైనా దేశం బయట నివసించి, తిరిగి దేశానికి వచ్చి 7 సంవత్సరాలపాటు సాధారణ నివాసులై ఉండి భారతీయ పౌరులను వివాహం చేసుకుంటే అట్టి వారికి నిబంధనలమేరకు పౌరసత్వం ఇస్తారు. ఈ మూడు పద్ధతులు- జన్మతఃవారసత్వం, నమోదు ద్వారా పౌరసత్వం పొందడానికి దేశంతో సంబంధం కలిగి ఉండటం అంటే ఏదోరకంగా భారతీయులై ఉండటం అనేది ముఖ్యం.
సహజీకృతం ద్వారా పౌరసత్వం పొందడం అనేది విదేశీయులు మన దేశ పౌరసత్వం పొందడానికి నిర్దేశించబడిన ప్రక్రియ. మన దేశంలో రూపొందిన చట్టాలకు లోబడి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషలలో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం కలిగి, సత్ప్రవర్తన కలిగి ఉండి కనీసం 11 ఏళ్ళు దేశంలో స్థిర నివాసం ఉంటే సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం పొందడానికి అర్హులవుతారు. విదేశాలకు చెందిన సుప్రసిద్ధ మేధావులు, శాస్తవ్రేత్తలు, తత్త్వవేత్తలు మొదలైన అసాధారణ వ్యక్తులు కోరుకుంటే వారికి పై నిబంధనలు సడలించి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వవచ్చు. ఈ నిర్వచనాలను గాని, నిబంధనలను గాని, పద్ధతులనుగానీ 2019 సవరణ చట్టం ముట్టుకోలేదు.
మన దేశానికి ఎటువంటి పత్రాలు లేకుండా వచ్చినవారు, నిర్దేశిత కాల పరిమితి ముగిసినా దేశంలో ఉంటున్నవారు అక్రమ వలసదారులుగా గుర్తింపబడతారు. అక్రమ వలసదారులు పౌరసత్వాన్ని పొందడానికి ఉన్న ఏకైక మార్గం సహజీకృత పద్ధతి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌లు ఇస్లామిక్ దేశాలు. ఆ దేశాల నుండి అక్కడ మైనారిటీలు అయిన హిందువులూ, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్శీలు, సిక్కులు మత వేధింపులు తట్టుకోలేక నిరంతరం మన దేశంలో ప్రవేశిస్తున్నారు. వారితోపాటుగా విదేశీ ముస్లింలు కొందరు మెరుగైన జీవనంకోసం భారతదేశం వస్తున్నారు. ఇట్టి శరణార్థులు, వలసదారులు ఎటువంటి అనుమతి పత్రాలులేకుండా దేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో నివసిస్తున్నారు. మత వేధింపుల కారణంగా పొరుగు దేశాలనుండి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం ఇస్తామని హామీని మన నాయకులు గాంధీగారి నుండి నేటివరకు ఇస్తూనే ఉన్నారు. శరణార్థులకు ఇచ్చిన ఆ హామీలను దృష్టిలోపెట్టుకొని పౌరసత్వ చట్టంలో కొత్త నిబంధనను తీసుకొని వచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాలనుండి భారతదేశానికి వచ్చిన శరణార్థులు మత వేధింపుల కారణంగా వచ్చినట్లయితే భారత పౌరసత్వంకోసం దరఖాస్తుచేసుకొనే ప్రక్రియను సరళీకరణ చేసారు. దేశ విభజన సందర్భంగాను, బంగ్లాదేశ్ విమోచన సందర్భంగానూ ఇచ్చిన హామీని చాలా ఆలస్యంగా ఇన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు నెరవేర్చారు. దీన్ని వ్యతిరేకించవలసిన పని కూడా లేదు. అందుకై 1955 పౌరసత్వం చట్టం 2వ విభాగంలో, ఉప విభాగం (ఐ)లో క్రొత్త నిబంధన (బి)ను చేర్చారు. 6ఎ విభాగం తరువాత 6బి విభాగాన్ని క్రొత్తగా తీసుకొనివచ్చారు. అంతేకాని ప్రస్తుతం ఉన్న విభాగాలను గాని, నియమ నిబంధనలను గాని మార్చలేదు.
శరణార్థులై వచ్చినవారికి పౌరసత్వం పొందేందుకు సడలించిన నిబంధన భారతీయ పౌరులైన ఏ వర్గపు ప్రజల ప్రయోజనానికి నష్టం కలిగించేది కాదు. జన్మతః వచ్చిన భారతీయ పౌరసత్వం ఈ నిబంధనలవలన రద్దుకాదు. రద్దుచేయలేరు కూడా. భారతీయ ముస్లింల పౌరసత్వానికి ఇప్పుడు సవరణ ద్వారా తీసుకొని వచ్చిన సడలింపు నిబంధనకు ఎట్టి సంబంధము లేదు. ఏ ఒక్క పౌరుడూ దీనివలన నష్టపోడు. శరణార్థులు మన దేశ పౌరసత్వాన్ని పొందేందుకు ఉద్దేశించబడ్డ నిబంధన వలన మనకెవ్వరికీ పౌరసత్వం పోదు.
పౌరసత్వ చట్టంలోని 5వ సెక్షన్ (నమోదుద్వారా పౌరసత్వం) 6వ సెక్షన్ (సహజీకృత పౌరసత్వం)లను ఏమాత్రమూ మార్చలేదు. ఇదివరకున్న నిబంధనలే ఇప్పుడు వర్తిస్తాయి. విదేశీ ముస్లిమ్‌లుగాని, ఇతర దేశాలకు చెందిన పౌరులుకానీ ఈ సెక్షన్‌న్ల క్రింద పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశీ ముస్లిమ్‌లు వారుకోరుకుంటే నిబంధనల ప్రకారం దరఖాస్తుచేసుకుని భారత పౌరసత్వం పొందవచ్చు. పౌరసత్వ చట్టానికి తీసుకువచ్చిన సవరణ ద్వారా ఏ ఒక్కరినీ దేశంనుండి బయటికి పంపడం వీలవదు. అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని 1946నాటి విదేశీయుల చట్టం, 1920నాటి పాస్‌పోర్ట్ చట్టంక్రింద వారి మతం ఏదైనప్పటికీ, దేశం ఏదైనప్పటికీ శిక్షార్హులవుతారు. అంతే తప్ప పౌరసత్వం చట్టానికి తీసుకొని వచ్చిన సవరణవల్ల శిక్షార్హులు కారు.
ఇతర దేశాలలో ఉండే హిందువులకు భారత పౌరసత్వం పొందాలంటే నియమ నిబంధనను సడలించలేదు. తీసుకొని వచ్చిన సవరణ కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ల నుండి వచ్చిన శరణార్థులకు మాత్రమే వర్తించేది. మిగిలినవారికి వర్తించేది కాదు. జాతిపరమైన, లింగపరమైన, భాషాపరమైన, సామాజిక రాజకీయ పరమైన వేధింపులకు గురైన విదేశీయులు భారతదేశంలో ఆశ్రయం పొందవచ్చు. అట్టివారు భారత పౌరసత్వంకోసం పౌరసత్వ చట్టంలో పేర్కొన్న నిబంధనలమేరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అందులో ఎటువంటి మార్పులేదు. తీసుకొని వచ్చిన సవరణ భారతీయ పౌరులకు సంబంధించినది కాదు. కాబట్టి ఎవరి పౌరసత్వమూ పోదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంలో పాకిస్థాన్ నుండి వలస వచ్చిన కాందిశీకులు గానీ, బంగ్లాదేశ్ అవతరణ సమయంలో మన దేశంలోకి వచ్చిన శరణార్థులుగాని వేలాది మంది ఇంకా ఇక్కడ పౌరులుగా గుర్తింపునకు నోచుకోక, సరియైన సదుపాయాలులేక ప్రభుత్వ ఆసరా పొందలేక, తరతరాలుగా దయనీయమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ వేధింపులకూ, అణచివేతలకు గురిఅవుతున్నారు. మన నేతలు వీరిని వారి వారి స్వదేశాలకు తిప్పిపంపాలనే ప్రయత్నం చేసారు. అయితే ఆ దేశాలు పూర్తి మత దేశాలుగా మారిపోవటంతో ఇతర మతాలవారిని వారు తమ దేశ పౌరులైనా వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. పౌరసత్వ నిర్థారణ, హక్కులు, బాధ్యతలు లేకుండా శరణార్థులుగా శతాబ్దాల తరబడి వీరు బ్రతకడం మూలంగా ఆయా ప్రాంతాలలో ప్రజలపై, ఆర్థిక, సామాజిక, వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారు. శరణార్థులలో అత్యధికులు షెడ్యూలు కులాలకు, తెగలకు చెందినవారు.
ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వీరిని మన దేశ పౌరులుగా గుర్తించడానికి మార్గదర్శకాలను పొందుపరుస్తూ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పౌరసత్వ చట్టానికి సవరణను తీసుకొచ్చారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లిమేతరులు ఆ దేశాలకు వెళ్ళి అక్కడ నివసించే పరిస్థితులు లేకపోవడం చేత వారికి త్వరితగతిన మన దేశ పౌరసత్వం వచ్చే వెసులుబాటును కల్పించారు. విదేశీ ముస్లిం శరణార్థులను ఆ దేశాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వారు వారి దేశాలకు తిరిగి వెళ్ళవచ్చు, లేదా మన దేశంలోనే ఉండాలనుకుంటే ఇప్పటికే ఉన్న నియమ నిబంధనల మేర, పౌరసత్వ అర్హతా ప్రమాణాలను అనుసరించి పౌరసత్వాన్ని పొందవచ్చు. వివక్ష, మతపరమైన హింస, బలవంతపు మత మార్పిడి తదితర కారణాలవల్ల ఆ దేశాలనుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు తమ స్వంత దేశాలకు తిరిగి వెళ్ళే పరిస్థితులులేవని రూఢీ అయిన కారణంగానే చట్టానికి ఈ సవరణ తీసుకొని వచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో విదేశీ ముస్లిములకు కూడా అట్టి పరిస్థితులే కనుక ఏర్పడితే వారికి కూడా ఈ వెసులుబాటు కల్పించవచ్చు.
జాతీయ పౌరుల జాబితా అనేది ప్రతి దేశంలోనూ అమలులో ఉంది. అది ఓటర్ల జాబితా వంటిది. జాతీయ పౌరుల జాబితా రూపొందించడానికి సంబంధించిన విధి విధానాలు, నియమ నిబంధనలు 2004లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చి పౌరసత్వ చట్టంలో పొందుపరచింది. ఆ నియమ నిబంధనలలో ఎట్టి మార్పూలేదు. దేశ సమైక్యతను, సమగ్రతను, సామాజిక సమరసతను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. కనుక విజ్ఞతతో, వాస్తవాలు తెలుసుకొని, స్పందించడం అందరికీ శ్రేయస్కరం.

- డా. బి. సారంగపాణి