సబ్ ఫీచర్

కొత్త జిల్లాల ఆర్థిక విధానం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓఆవాస ప్రాంతంగాని, మండలం, జిల్లాగాని రాష్ట్రం లేదా దేశం గాని ఒక ప్రత్యేక ఆర్థిక విధానాన్ని కలిగివుంటాయి. ఈ ఆర్థిక విధానం స్థానిక వనరులకు అనుబంధంగా ఉం టుంది. ఇవి భూ, జల సంబంధంగా వుంటాయి. భూసంపద ఉపరితల వనరులతో, భూగర్భ వనరులతో అలరారితే, ఇవిలేని మైదాన ప్రాంతాలు, నదీ, వాగుల పరీవాహక ప్రాంతాలు వ్యవసాయికంగా అశేష శ్రమ జీవులకు ఆలవాలంగా ఉం టాయి. ప్రతి వనరు, అభివృద్ధి దశలోగాని, ఉత్పాదక స్థాయిలోగాని ప్రత్యక్షంగా కొంతమందికి ఉపాధిని ఉద్యోగాన్ని కల్పిస్తే, పరోక్షంగా వేలాదిమందికి జీవనాధారంగా ఉంటాయి. వ్యవసాయ, చేనేత రంగాలు అన్ని రకాల కులవృత్తులకు, సం ప్రదాయ వృత్తులకు, గ్రామీణ కళాకారులకు వ్యవసాయ కూలీలకు, నీరడి, సుంకరి, బేగలి, తలారి, బైండ్ల, కొలుపుల, లేకుల, వారికి కాలానుగుణంగా పనిని కల్పిస్తూ జీవించే హక్కుకు భరోసాను కలిగిస్తాయి. వీరందరిపై ఆధారపడి వ్యాపారవర్గాలు, బ్రాహ్మణ వర్గాలు, చివరికి పెద్దపెద్ద భూస్వాములు, దొరలు, దర్జాగా పై వనరుల ఆధారంగా బతుకుతారు. వ్యవసాయదారులు భూకేంద్రంగానే జీవన చక్రం సాగిస్తారు.
స్వాతంత్య్రానికి పూర్వం నుండే మొదలైన తెలంగాణ భూపోరాటం, తర్వాత వచ్చిన ముల్కీ నిబంధనల పోరాటంగా, చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా రూపాంతరం చెంది, రెండు సంవత్సరాల క్రితం సాధించుకోవడం జరిగింది. ప్రజల శక్తి ముందు ఏ రాజకీయ శక్తి, నాయకత్వం పనిచేయదని తెలంగాణ ఉద్యమం తేటతెల్లం చేసింది. ఈ విధంగా సాధించుకున్న తెలంగాణలో అవసరమైన ప్రయోగాలతోపాటు రాజకీయ ప్రయోజనాల్ని, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే ప్రయోగాల్ని ముందుకు తేవడంతో రియల్ ఎస్టేట్ రంగం ఓ చోదక శక్తిగా మారిపోయింది. చివరికి భూకేంద్రంగా సాగిన ఉద్యమం, తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి అనే మంత్రదండంతో, బంగారు తెలంగాణ అనే ఊహాజనిత నినాదంతో బంగారంలాటి పంటలు పండే భూముల్ని లాక్కోవడం జరుగుతున్నది. ఈ చర్యలు అశేష వ్యవసాయదారులకు కడంగండ్లనే మిగులుస్తున్నాయి.
తెలంగాణ కల కల్లలుగా మారడంతో, మేలుకోవాల్సిన ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని ముందుకు తెచ్చి ప్రజల మధ్యన చిచ్చు పెట్టింది. చిన్న రాష్ట్రాల ఆవశ్యకత ఎంతనో, చిన్న జిల్లాల ఆవశ్యకత అంతే వుంటుందనడంలో సందేహం లేదు. కాని, కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయ నీలినీడలు, ముఖ్యంగా పాలకపక్ష ప్రధాన వ్యక్తుల లబ్ది స్పష్టంగా కనబడుతున్నది. ఆశాస్ర్తియ విభజన రాజకీయ ప్రకంపనల్ని కలిగించగా, రియల్ ఎస్టేట్ రంగానికి మహదవకాశాన్ని కలిగిస్తున్నది. ఏర్పడుతున్న కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాలకు అందుబాటులో వుండగా, మరికొన్ని ప్రాంతాలకు అతిదూరం అవుతున్నాయి. దీంతో సద్దుమణిగిన తెలంగాణ పోరాట స్ఫూర్తి తిరిగి తెరమీదకు రా గా, రాష్ట్ర వ్యాపితంగా జిల్లా, కొత్తమండలాల సా ధన, వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి.
సరే! కొత్త జిల్లాలు ఏర్పడడం మంచికే అనుకుందాం. పరిపాలనా సౌలభ్యాలు మరింత దగ్గరౌతాయని అనుకుందాం. పైన ప్రస్తావించినట్లు ఓ జిల్లా, మండలం, ఏర్పాటు భౌగోళికంగా, సంస్కృతిపరంగా కొంతనైనా ఏకరీతి సారూప్యత ఉం డాలి. అన్నింటికి మించి అత్యధిక శాతం ప్రజలకు ఆర్థిక వెసులుబాటును కలిగించే వనరులుండాలి. ప్రధాన వ్యవసాయంతో పాటు, వ్యవసాధారిత చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉపాధిని, కొంతమేరకు ఉద్యోగాల్ని కలిగించాలి. కాని, కొత్తగా ప్రకటించిన అత్యధిక జిల్లాలు ఈ ఊసే లేకుండా, కేవలం పాలకపక్షానికి రాజకీయ లబ్దిని చేకూర్చేలా కనబడుతున్నాయి. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడానికి గల భౌతిక కారణాలు తప్ప మిగతా ఏ కారణాలు సహేతుకంగా కనపడడం లేదు. జిల్లాల ఏర్పాటుకు గల సాంఘిక, ఆర్థిక, వనరుల, ఉపాధి అవకాశాలకు గల కారణాలేంటో, ప్రభుత్వం దగ్గర లేవు. చిన్న జిల్లాల నినాదం తప్ప, వ్యవసాయపరంగా, కుటీర పరిశ్రమలపరంగా, చిన్న, మధ్య భారీ పరిశ్రమల పరంగా విధి విధానాలేంటో ప్రభుత్వం ప్రకటించలేదు. వీటన్నింటి పట్ల ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉండి ఉంటే, కొన్ని జిల్లాల్లో ప్రజల కోపాగ్ని ఇలా ఉండేది కాదు.
పోనీ ఏర్పడుతున్న జిల్లా కేంద్రాలు అన్ని ప్రాంతాలవారికి అనుకూలంగా వుంటున్నాయా అంటే అదీ కనబడడం లేదు. ఆశ్చర్యకరంగా హన్మకొండ, నిర్మల్ జిల్లాలను వ్యతిరేకించేవారు కొందరైతే, ఫలానా ప్రాంతాన్ని కొత్తమండలంగా ఏర్పాటు చేసినా తమ జిల్లాలో కలపొద్దని కొందరు, ఇంకొందరు పక్క జిల్లా దగ్గరగా వుంటుంది కాబట్టి అందులో కలపాలని ఉద్యమబావుటాలు ఎగరేస్తున్నారు. నిజానికి ఇవన్నీ వాస్తవిక చిత్రాలే.
ఉదాహరణకు జిల్లాగా ఏర్పడుతున్న కామారెడ్డిని చూస్తే, 60 కిలోమీటర్ల దూరంలోని నాగిరెడ్టిపేట మండలం వారు 20 కిలోమీటర్ల పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో కలపమని డిమాండ్ చేస్తుంటే, పాలకవర్గ అనుకూల ప్రజాప్రతినిధులు కామారెడ్డిలోనే వుంచాలనే తీర్మానం చేయడం గమనార్హం. ఇలాంటి పరిస్థితినే మద్నూర్ ప్రాంతం వాసులకు ఏర్పడింది. 70వ దశకంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఈ ప్రాంతంవారు దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. తర్వాత 80వ దశకంలో తాడ్కోలు దగ్గర మంజీరా నదిపై వంతెన నిర్మాణం జరగడంతో 100 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఈ మధ్యన కోటగిరి మండలం పోతంగల్ వద్ద మరో వంతెన నిర్మించడంతో మద్నూర్, నిజామాబాద్‌ల మధ్యన దూరం కేవలం 65 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఈ సంతోషాన్ని అనుభవించనీయకుండానే మ ద్నూర్, జుక్కల్, బిచ్‌కుంద, చిర్కూర్ మండలా ల్ని కామారెడ్డి జిల్లాకు అనుసంధానం చేయడంతో తిరిగి దూరం 110 కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఈ ప్రాంత ప్రజలంతా దీన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తుంటే, తెరాస శ్రేణులు కామారెడ్డిలో ఉండాలంటూ మండలస్థాయి సమావేశాల్లో తీర్మానించడం రాజకీయం కాదా? ఈ తాపత్రయమం తా ఎందుకు జరుగుతున్నదంటే, కొన్ని దూరప్రాంత మండలాల్ని కలిపితే తప్ప, కొత్తగా ఏర్పాటవుతున్న సిద్దిపేట, మెదక్, కామారెడ్డి లాంటి జిల్లాల ఉనికి భౌతికంగా కనబడటం లేదు. ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లా, మెదక్ జిల్లా కేంద్రాలు విసిరేసినట్లు జిల్లా భౌగోళికానికి పడమట దిశగా ఉండగా,జిల్లాల విస్తీర్ణం 200 కిలోమీటర్లకు పైగా తూర్పు పడమరలుగా వుండేవి. వీటిని వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో తిరిగి తూర్పువైపున్న కామారెడ్డికి మద్నూర్‌కు అనుసంధానం చేయడం అశాస్ర్తియమే.
ఈ నిరసనలే కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడ మండలం వారు ప్రస్తావిస్తున్నారు. ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఏటూర్ నాగారం వారు జిల్లా కేంద్రం కావాలని అడుగుతున్నారు. ఆదిలాబాద్‌లో ఉట్నూర్ కూడా ఏజెన్సీ కేంద్రమే కాబట్టి, ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక గద్వాలది సహేతుకమైన డిమాండే. దగ్గదగ్గరగా ఉన్న వనపర్తిని, నాగర్ కర్నూల్‌ను జిల్లాలుగా ప్రకటించినప్పుడు, గద్వాల దూరంగా ఉండడమే కాకుండా, అన్ని హంగులతో వుందనేది అక్కడి ప్రజల డిమాండ్. ఇక సిరిసిల్లను పాలకపక్షమే తలగోకి కొరివి పెట్టుకుంటున్నది. ముందుగా జిల్లా చేయాలని కెటిఆర్ కోసమే ఈ ఏర్పాటనే విమర్శ రావడంతో విరమించుకొని, పెద్దపల్లికి మార్చింది. కాని పెద్దపల్లి కరీంనగర్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం తెలిసిందే. భిన్నంగా మంథనిగాని, కాళేశ్వరం పేరున కాటారం కేంద్రంగా ఏర్పాటు చేస్తే, సుదూర ప్రాంతాలైన మహదేవ్‌పూర్ లాంటి వాటికి అనుకూలంగా ఉండేది. కవలలుగా అతుక్కున్న వరంగల్, హన్మకొండలను విడదీసి హన్మకొండ జిల్లాగా ప్రకటించి అభివృద్ధి పథంలో ఉన్న, డిమాండ్‌లో ఉన్న జనగామను ప్రకటించకపోగా కొత్తగా ఏర్పడుతున్న యాదాద్రితో అనుసంధానం చేయడం జనాలకు కోపాన్ని కలిగించే చర్యలే.
వనరుల పరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా ఆలోచన లేకున్నా కనీసం భౌగోళికంగానైనా కొత్తగా ఏర్పడుతన్న జిల్లాల మద్య సమతుల్యత ఉంటే బాగుండేది. ఓ సమస్యను పరిష్కరించడానికై, మరికొన్ని సమస్యల్ని సృష్టించడం రాజకీయమే. ఇలాంటి రాజకీయాలే ప్రజల దృష్టిని ప్రధాన సమస్యలనుండి పక్కకు మరలిస్తాయి. ఏదోవిధంగా ఇవి సమసినా, మరోరోజు మరో రూపంలో బహిర్గతవౌతాయి. అప్పుడు జటిలంగా మారతాయి. ఆనాడు పాలకులకు తలనొప్పిగా మారితే, ప్రజలకు కడగండ్లుగా తయారవుతాయి. ఈ నిరంతర పోరుతో కంటికి కునుకు లేకుండా ఇబ్బందులు పడేది సామాన్య ప్రజలే.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162