సబ్ ఫీచర్

నూతన పదాల సృష్టికర్త తాపీ ధర్మారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు సేవ చేయించుకోవడం కోసమే పుట్టినట్టుంటారు. మరికొందరు సేవ చేయడంకోసమే జన్మించినట్టుంటారు. ఇందులో ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు రెండో కోవకు చెందినవారు. తెలుగు సాహిత్యానికి తన రచనల ద్వారా ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప దార్శనికుడు ఆయన. తెలుగు భాషలో కొత్త పదాలెన్నింటినో సృష్టించి ఖ్యాతి పొందిన వారిలో తాపీ తొలి పంక్తిలో ఉంటారు. ఎ బర్డ్స్ ఐవ్యూ- విహంగ వీక్షణానికి- పిట్ట చూపు అని చక్కని పద సృష్టి చేశారాయన. తెలుగు దినపత్రికల్లో, చలనచిత్రాల్లో తొలిసారిగా వ్యవహారిక భాషకు శ్రీకారం చుట్టింది ఆయనే. పర్లాకిమిడి కళాశాలలో ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడు గిడుగు వెంకటరామ్మూర్తి తాపీకి గురువుకావడం విశేషం. అంచేతనే గిడుగు ప్రభావం తాపీపై ఎంతోకొంత పడింది. సాహితీవేత్తగా, చరిత్ర పరిశోధకునిగా, ఉపాధ్యాయునిగా, తెలుగు చలనచిత్రాల సంభాషణల రచయితగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ‘‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు’’, ‘‘దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?’’, ‘‘రారుూ రప్పలు’’, ‘‘ఇనుప కచ్చడాలు’’, ‘‘మబ్బుతెరలు’’, ‘‘పాత పాళీ’’, ‘‘కొత్త పాళీ’’, ‘‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ’’ తదితర రచనలతో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించారు. చేమకూర వెంకటకవి రాసిన ‘విజయ విలాసానికి’ ధర్మారావు వెలయించిన హృదయోల్లాస వ్యాఖ్య ఎంతో ప్రాచుర్యం పొందింది. ‘విజయ విలాసం’కావ్యాన్ని ఒక్కసారి చదివితే చాలు ఎవరైనాసరే ఉత్తమ కవిగా పరిణమిస్తాడని మహాకవి శ్రీశ్రీ విశాఖపట్నంలో 1973లో జరిగిన ఓ సభలో పేర్కొన్నారు. అంతటి మహాకావ్యానికి సరళ సుందరమైన వ్యాఖ్యానం రాసిన అవకాశం, అదృష్టాన్ని తాపీ దక్కించుకున్నారు. తెలుగు సాహితీ వినీలాకాశంలో విరిసిన ఇంద్రధనుస్సులాంటి ధర్మారావు ఉత్తరాంధ్ర సరిహద్దు అయిన గంజాం జిల్లా బరంపురంలో 1887 సెప్టెంబరు 19 జన్మించారు. చిన్ననాటి విద్యాభ్యాసమంతా శ్రీకాకుళంలో సాగింది. ఆ తరువాత విజయనగరం, పర్లాకిమిడి, మద్రాసులలో హైస్కూలు, ఎఫ్.ఏ, డిగ్రీలను విజయవంతంగా పూర్తిచేశారు. బరంపురం, విశాఖపట్నం తదితర కళాశాలల్లో గణితశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు. 1911లో ‘వేగుచుక్క గ్రంథమాల’అనే సంస్థను స్థాపిం చి సాహితీ చర్చలకు, రచనలకు అవకాశం కల్పించారు. ధర్మారావు స్వేచ్ఛప్రియుడు. స్వతంత్ర భావాలుగల వ్యక్తి. అందుకే తన జీవితంలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యారు.
తన సాహిత్యాభిలాషకు మరింత చేరువయిన పత్రికారంగాన్ని ఎంచుకున్నారు. విశాఖపట్నంలో తన సంపాదకత్వంలో ‘కొంటెగాడు’ పత్రికను కొన్నాళ్ళపాటు సమర్ధంగా నిర్వహించారు. బొబ్బిలి సంస్థానాధీశుని కోరికమేరకు జస్టిస్ పార్టీ ఆరంభించిన ‘సమదర్శిని’ పత్రికకు సంపాదకత్వాన్ని 1930లో చేపట్టారు. ఆ తరువాత పిఠాపురం మహారాణి ఆహ్వానంమేరకు 1936లో ‘జనవాణి’ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా వ్యవహారిక భాషోద్యమానికి ఎనలేని సేవలందించారు. సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టే విధంగా ఈ పత్రికను తీర్చిదిద్దారు. ఆ తరువాత ‘కాగడా’ పత్రికను స్వయంగా స్థాపించారు. ఆరోజుల్లో వేలాదిమంది పాఠకులు ఈ పత్రికకోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. విశాలాంధ్ర దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు.
1937లో సినీ రంగప్రవేశం చేశారు. మాలపల్లి, రైతుబిడ్డ, కృష్ణప్రేమ, కీలుగుర్రం, పల్లెటూరి పిల్ల, రోజులు మారాయి, పెద్దరికాలు తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. సినీ జర్నలిజం వికాసానికి ఎంతో పాటుపడ్డారు. అందుకే ఆయన రాసిన రోజులుమారాయి, కాలచక్రం, సారంగధర తదితర చిత్రాలను పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ తన సిలబస్‌లో చోటు కల్పించింది. తన కుమారుడు చాణక్యను ఈ రంగానికి పరిచయం చేశారు. ఈయన బహుముఖ సేవలను గుర్తించి శృంగేరి పీఠాధిపతి ‘ఆంధ్ర విశారద’ బిరుదును ప్రసాదించి ఘనంగా సత్కరించారు.
1972 మే 13న హైదరాబాద్ బర్కత్‌పురా యువతీ మండలి వారు ధర్మారావు (తాతాజీ) కు సన్మాన సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో పాల్గొన్న నార్ల వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ధర్మారావు మనందరిలాగా కాదు ఎంతో మారుతూ వచ్చారు. మరికొన్నాళ్ళకి ఆయన నక్సలైట్ మారినా ఆశ్చర్యం లేదని నవ్వులజల్లుల మధ్య కితాబ్‌నిచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు జీవితంలో భాషలో, సాహిత్యంలో సామాజిక శక్తిగా మారి ఎందరినో మలిచిన మహావ్యక్తి తాతాజీయని నార్ల ప్రశంసించారు. లోకం పోకడను, సామాజిక స్థితిగతుల్ని ఆధునిక దృక్పథంలో వీక్షించి ఆలోచించి అవగాహన చేసుకొనేవారు. అందువల్లనే ఆయన రచనలన్నీ నవ్యతకు దర్పణం పడతాయి. 1971లో ధర్మారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆయన గొప్పతనానికి, ప్రతిభా పాటవాలను మెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ప్రదానం చేసింది. 1957నుంచి 1973వరకు ఈ పదవిలో కొనసాగారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేటు సభ్యునిగా కొన్నాళ్లు వ్యవహరించారు. 1973 మే 8న సుందర ప్రపంచంనుంచి మహాప్రస్థానం చేశారు. ధర్మారావు జయంతిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా సగర్వంగా జరుపుకుంటున్నాం. తాపీ రచనలను నవ యువ కవులు అధ్యయనం చేయడమే సరైన నివాళి అవుతుంది.

- వాండ్రంగి కొండలరావు