సబ్ ఫీచర్

విశాఖను కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సోయగాలకు నిలయమైన సాగర నగరి విశాఖపట్నంపై ఇప్పటికే కాలుష్య భూతం కోరలు చాస్తుండగా, భవిష్యత్‌లో ఇక్కడి పరిస్థితులు ప్రజా జీవనానికి అనుకూలంగా ఉండబోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా గుర్తింపు పొందిన విశాఖలో సమీప భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో కనీసం సగం పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలిస్తే గానీ ఈ ప్రాంతం జన జీవనానికి పనికిరాని నగరంగా మారే ప్రమాదం పొంచి ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. సహజ సిద్ధమైన ఓడరేవు ఉండడంతో విశాఖలో పరిశ్రమలు కేంద్రీకృతమయ్యాయి. బ్రిటిష్ పాలకులు విశాఖ తీరాన 1933లో పోర్టును నిర్మించారు. నగరానికి ఒకవైపున బంగాళాఖాతం, మిగిలిన మూడు వైపులా తూర్పు కనుమలు వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంత భౌగోళిక ఆకృతి, గాలివాటం కారణంగా వాయు కాలుష్యం ఎటూ పోకుండా నగరంలోనే నిలిచి ఉండేటట్లు చేస్తుందని ఫలితంగా వాతావరణం విషపూరితం అవుతుందని అప్పట్లో గ్రహించలేక పోయారు. ‘విశాఖ పోర్టు’ నిర్మాణం తర్వాత ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి.
నగరానికి నైరుతి దిక్కున ఉన్న పలు భారీ పరిశ్రమలు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు (మార్చి నుంచి అక్టోబర్ వరకూ) వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతాయి. 300 నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న కొండలు కాలుష్య వాయువులకు అడ్డుగా ఉన్నందున, నగరంలోనే కాలుష్య మేఘాలు తిష్టవేసే పరిస్థితి ఉంది. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా ధూళి, కాలుష్య వాయువులు పైకి పోలేక భూమిపైనే కేంద్రీకృతమై ఉంటాయి. వేసవిలో వేడిగాలులు- కింద వ్యాపించిన కాలుష్య వాయువులను పైకి పోనీయకుండా చేస్తున్నాయి. దీంతో ఏడాది పొడవునా విశాఖ వాసులు కాలుష్యం కౌగిట్లో విలవిలలాడే పరిస్థితి తప్పడం లేదు. భౌగోళిక, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఈ పారిశ్రామిక నగరాన్ని ప్ర మాదం అంచుల్లోకి నెట్టేస్తున్నాయి. భోపాల్‌లో 1984లో జరిగిన దుర్ఘటన కన్నా ప్రమాదకర పరిణామాలు విశాఖలో సంభవించినా ఆశ్చర్యపడనక్కర్లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో కాలుష్యం విషమించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లోనే గుర్తించి, కొత్తగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వరాదని హెచ్చరికలు చేసింది. కొంతమంది పారిశ్రామికవేత్తల ఒత్తిడితో కాలుష్య నగరాల జాబితా నుంచి 2013లో విశాఖను తొలగించారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే ‘పర్యావరణ ప్రభావ అంచనా’ నివేదికలను వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నివేదికల రూపకల్పన ఇష్టారాజ్యంగా మారడం, ప్రభుత్వాల ఉదాసీనత వల్ల కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తునే ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ పరిసరాల్లో 1095 చిన్న, భారీ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. పోర్టు, ఇతర పరిశ్రమల ద్వారా ఇప్పటికే కాలుష్యం ప్రజలను భయపెడుతుండగా, ఈ జిల్లాలో బాక్సయిట్ తవ్వకాలకు అనుమతులు ఇస్తే పర్యావరణం మరింత ప్రమాదంలో పడుతుంది.
‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదం సాకారం కావడంతో ఇక్కడ స్టీల్‌ప్లాంటు ఆవిర్భవించాక పలు అనుబంధ పరిశ్రమలు విస్తరించాయి. అనేక గ్రామాలను విలీనం చేయడంతో ఏర్పడిన ‘గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్’ (జివిఎంసి) పరిధిలో సుమారు 18 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఒకప్పుడు విశాఖ వాసులకు వరమైన పోర్టు ఇప్పుడు పెనుశాపంలా మారింది. ఏడాది పొడవునా విష పదార్థాలను వెదజల్లుతున్న పోర్టులో కాలుష్యం సమస్యపై రెండు దశాబ్దాలుగా స్థానికులు ఉద్యమిస్తూనే ఉన్నా, న్యాయస్థానాలను, కాలుష్య నియంత్రణ మండలిని ఆశ్రయిస్తున్నా ఫలితం శూన్యమే. విశాఖ పౌరుల సంక్షేమ సంఘం 1997లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, బహిరంగ విచారణ జరిపి తగు మార్గదర్శకాలను ఓడరేవుకు ఇవ్వాలని ఎపి కాలుష్య నియంత్రణ మండలిని 1999లో న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ మండలి 2000 మార్చి నుంచి ఆరునెలల పాటు కసరత్తు చేసి, తగు చర్యలు చేపట్టాలని 2001 జూలైలో పోర్టును ఆదేశించింది. మొక్కలను పెంచాలని, బహిరంగ స్థలాల్లో గంధకం వంటి నిల్వలను తొలగించాలని ‘మండలి’ ఆదేశించినా పోర్టు యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. పోర్టు వ్యాపారంలో సగ భాగం ‘డర్టీ కార్గో’గా భావించే బొగ్గు దిగుమతి, ఇనుప ఖనిజం ఎగుమతులు కావడం గమనార్హం. బొగ్గు, ఇనుప ఖ నిజం, గంధకం వంటి రసాయనాల ధూళి వల్ల ఇక్కడి ప్రజలు శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. ధూళి కాలుష్యాన్ని నివారిస్తామని పోర్టు యాజమాన్యం ఇచ్చిన హామీలు సాగర గర్భంలో కలిసిపోతున్నాయి. విశాఖ పోర్టు ఇప్పటికే సమస్యలు తెచ్చిపెడుతుండగా- గంగవరం వద్ద మరో పోర్టును ప్రారంభించడంతో పుండుమీద కారం చల్లినట్టయ్యింది. గంగవరం పోర్టులో 70 శాతం లావాదేవీలు బొగ్గు దిగుమతులే కావడం మరో విపరిణామం. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గంగవరం పరిసర గ్రామాల వారు ఆందోళనలు చేస్తున్నారు.
ఔషధ పరిశ్రమల కోసం పరవాడ వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ను ఏర్పాటు చేయడంతో విశాఖ పరిసరాల్లో రసాయన వాయువుల ప్రమాదం మరింతగా పెరిగింది. ఔషధ పరిశ్రమల వల్ల ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు రాకపోగా, ఇక్కడి భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. ఇక్కడి పచ్చగడ్డి తిన్న పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి, జలకాలుష్యంతో పంటలు పం డడం లేదు. గర్భిణులు, పిల్లలు వ్యాధులతో సతమతమవుతున్నారు. దగ్గు, ఆయాసం, చర్మవ్యాధులతో పరవాడ ప్రాంత ప్రజలు విలవిలలాడుతున్నారు. విశాఖ తూర్పు నౌకాదళంలో ఐఎన్‌ఎస్ చక్ర, ఐఎన్‌ఎస్ అరిహంత్ అనే రెండు అణు జలాంతర్గాములు చేరాయి. విశాఖకు 65 కిలోమీటర్ల దూరంలో కొవ్వాడ (శ్రీకాకుళం జిల్లా) వద్ద భారీ అణువిద్యుత్ కేంద్రం, 20 కిలోమీటర్ల దూరంలోని అచ్చుతాపురం వద్ద బాబా అణుపరిశోధన కేంద్రం ఏర్పాటు కాబోతున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినపుడు నష్టాన్ని నివారించలేని ప్రభుత్వ యంత్రాంగం ‘అణుముప్పు’ను ఎలా ఎదుర్కొంటుందని జనం ప్రశ్నిస్తున్నారు. త్వరలో విశాఖ-కాకినాడ తీరం వెంబడి ‘పారిశ్రామిక కారిడార్’ రాబోతోంది. ప్రమాదకరమైన పెట్రోలియం,పెట్రోకెమికల్, రసాయన పరిశ్రమలు, నౌకాశ్రయాలు ఈ కారిడార్‌లో ఏర్పాటవుతాయి. తమ సమస్యలన్నింటిపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇకనైనా స్పందించాలని విశాఖ వాసులు వేడుకుంటున్నారు. మరి వారి వినతులు ఫలించేదెపుడో..?

-కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపి konathalark09@gmail.com