సబ్ ఫీచర్

యువత పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు, ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన వయసులో కొంతమంది యు వకులు దారి తప్పుతున్నారు. కన్నవారి కలలను సాకారం చేయాల్సిన విద్యార్థులకు నేడు ఇంటాబయట సరైన దిశానిర్దేశం లభించడం లేదు. చదువు, నైతిక విలువలు, బాధ్యతలు వంటి అంశాలపై ఇటు ఇంట్లోగాని, అటు కళాశాలల్లో గానీ యువతకు సూచనలిచ్చేవారు కరవవుతున్నారు. తమ కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతున్నా, టీనేజీ పిల్లలు మద్యం, ధూమపానం, లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు, చోరీలు, మాదక ద్రవ్యాలు, చెడు సావాసాలు, ఇతర వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. చాలామంది స్మార్ట్ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాతోనో, అశ్లీల వెబ్‌సైట్లతోనో నిత్యం కాలక్షేపం చేస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధ్యాపకులు, పేరెంట్స్ పర్యవేక్షణ కొరవడుతోంది.
విద్యార్థులు మద్యం తాగి పట్టుబడితే పోలీసులు వారి తల్లిదండ్రులను సైతం పోలీసు స్టేషన్‌కు రప్పించి కౌనె్సలింగ్ ఇస్తున్నారు. అయినా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసుల్లో నిందితుల్లో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారు. కౌమార దశ చాలా కీలకం, ప్రమాదకరమైంది కూడా. ఈ వయసులోనే పిల్లల్లో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. టీనేజీ పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అతి స్వేచ్ఛ, మితిమీరిన గారాబం వల్ల పిల్లలు అదుపుతప్పి చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన లోపంతో తమకు కనిపించేదంతా నిజమని పిల్లలు నమ్ముతుంటారు. ‘ఆకర్షణ’ను ‘ప్రేమ’ అని భ్రమపడుతూ ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే కొందరు యువకులు లైంగిక వేధింపులకు, భౌతిక దాడులకు దిగుతుంటారు. అందుకే పిల్లల మానసిక ప్రవర్తనను, వారి కదలికలను పేరెంట్స్ కనిపెడుతూ ఉండాలి. వారి స్నేహితుల పట్ల ఆరా తీస్తుండాలి. తరగతి గదిలో తమ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకునేందుకు తరచూ కళాశాలకు వెళుతూ అధ్యాపకులతో మాట్లాడుతుండాలి. ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండే పిల్లల పట్ల మరింత శ్రద్ధ చూపాలి. వారి ఆరోగ్యం, చదువు, అలవాట్లపై ఆరా తీస్తుండాలి. డబ్బు ఖర్చు విషయంలో పిల్లల ధోరణి గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి.
యువతీ యువకులు భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని మనో నిగ్రహంతో ముందుకు సాగాలి. జీవిత లక్ష్యం చేరేదాకా కృషి చేయాలి. తాత్కాలిక ఆనందం కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటే చివరికి మిగిలేది విషాదమే అని తెలుసుకోవాలి. చదువులో రాణించలేక పోతున్నామని, ప్రేమలో విఫలమయ్యామని కొందరు యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారికి శోకం మిగులుస్తున్నారు. మానసిక కుంగుబాటుకు లోనయ్యే విద్యార్థులను గుర్తించడంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. విలాసాలు, ప్రేమ వ్యవహారాలు, విలాసాల కంటే చదువు, కెరీర్ ముఖ్యమని విద్యార్థులకు పెద్దలే వివరిస్తుండాలి. చెడు మార్గంలో పయనించే విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటే మిగతా పిల్లలు వక్రమార్గం పట్టకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది.

-రావుల రాజేశం