సబ్ ఫీచర్

దేశం దాటిన నల్లధనం సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి ప్రకటించడంతో- దేశంలో నల్లధనం అంతా అదృశ్యమైపోయి ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందన్న ప్రచారం ప్ర స్తుతం జోరుగా సాగుతోంది. మోదీ నిర్ణయం వల్ల నల్లకుబేరుల సామ్రాజ్యం కుప్పకూలుతుందని ప్రజలను నమ్మించేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. 2014లో ప్రధాని పదవి చేపట్టగానే మోదీ నల్లధనం విషయమై గంభీర ప్రకటనలే చేశారు. బడాబాబులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని ఆయన హామీలు గుప్పించినా, ఆ దిశగా ప్రయత్నాలు జరిగినట్టు దాఖలాలు లేవు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని కట్టడి చేసినట్టేనని, దేశఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులకు బీజం పడినట్టేనని ఎన్‌డిఎ సర్కారులో భాగస్వామి అయిన టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నా యుడు వంటివారు హర్షం వ్యక్తం చేశారు. మోదీ నిర్ణయంతో దేశంలో స్థితిగతులన్నీ ఒక్కసారిగా మారిపోతాయన్న బిజెపి నేతల ప్రకటనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవినీతి, నల్లధనం అదుపులోకి వస్తాయని, నకిలీ కరెన్సీ బెడద తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశాక సామాన్య ప్రజలకు లాభం జరిగిందా? నల్లకుబేరులకు ఏమైనా నష్టం జరిగిందా? ప్రధాని పదవిని చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత మోదీ ఇపుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? విదేశాల్లో దాగిన నల్లధనాన్ని రప్పించడం ఇక సాధ్యం కాదని మోదీ గ్రహించారా? ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికేనా? ఇందులో రాజకీయ ఎత్తుగడ ఉందా? నిజానికి దేనిని ‘నల్లధనం’ అంటారని తెలుసుకుంటే- మోదీ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉందని దేశ ప్రజలకు అర్థమవుతుంది.
నల్లధనం అంటే...
మనదేశంలో విద్యాధికులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, సామాన్యులు నల్లధనం గురించి రకరకాల అర్థాలతో, భావనలతో మాట్లాడుతుంటారు. నిజానికి పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో ‘నల్లధనం’ అనే పదం అసంబద్ధమైనది. నకిలీ నోట్లు, స్మగ్లింగ్, ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ వంటివన్నీ నల్లధనం పోగయ్యేందుకు సాధనాలని చాలామంది భావిస్తుంటారు. బ్యాంకులో డిపాజిట్ చేయని, నోట్లకట్టల రూపంలో రహస్యంగా దాచుకున్న డబ్బును నల్లధనం అంటున్నారు. చట్టవిరుద్ధమైన, అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడడం, నిబంధనలకు అతీతంగా అధిక ఆదాయం పొందడం, పన్నులు చెల్లించక పోవడం, ఎక్కువ మొత్తంలో రాయితీలు పొందడం, ప్రజాపనులకు సంబంధించి వాస్తవిక రేట్ల కంటే ఎక్కువ రేట్లు చూపి అధిక ఆదాయం పొందడం, రాబడికి మించి సంపద పోగుచేసుకోవడం ఇవన్నీ నల్లడబ్బు కేటగిరీలోకి వస్తాయి. పేద, మధ్యతరగతి వారు, చిరు వ్యాపారులు, కింది స్థాయి ఉద్యోగుల వద్ద నల్లధనం ఏనాడూ పోగుపడదు. ఈ వర్గాలవారు ధనాన్ని తమ వద్ద నిల్వ చేసుకునే అవకాశం లేదు. అక్రమ సంపాదనను వివిధ రకాల వ్యాపారాలలోకి తెచ్చి భారీగా లాభాలు గడించే పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు, బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలే నల్లధనానికి కారకులు.
గతంలోనూ జరిగింది..
పెద్దనోట్లను రద్దు చేయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి కాదు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా పెద్దనోట్లను ఉపసంహరించారు. పెద్దనోట్ల రద్దుతో ఆశించిన ఫలితాలు గతంలో రాలేదు సరికదా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారింది. 1946లో వెయ్యి, పదివేల నోట్లను, 1978లో మొరార్జీ దేశాయి ప్రధానిగా ఉన్నపుడు వెయ్యి, 5వేలు, 10వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి తప్పించారు. వాస్తవానికి ఆ రోజుల్లో పెద్దనోట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవికావు. మోదీ ఇపుడు పెద్దనోట్లను రద్దు చేసినా, నల్లధనం అంతరించిపోదని గత అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.
ముందే సర్దుకున్నారు..?
పన్నుల ఎగవేత, చట్టవ్యతిరేక పద్ధతుల్లో అక్రమార్జన ఫలితంగా నల్లధనం పేరుకుపోయిందని, దీన్ని అరికట్టేందుకే మోదీ కంకణం కట్టుకున్నారని కొందరు నేతలు ఊదరగొడుతున్నారు. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి పరిణామాలు దేశ ఆర్థిక రంగంలో గత పాతికేళ్లుగా కీలకపాత్ర పోషిస్తున్నందున కొంతమంది వద్దనే డబ్బు భారీగా పోగయ్యింది. అకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం ఎందుకూ పనికిరాకుండా పోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇపుడు వాస్తవానికి ఇది జరిగిందా? నోట్ల రద్దుతో పేద, మధ్యతరగతి వర్గాలే ఇబ్బందులు పడుతున్నారు తప్ప ధనికులెవరూ ఆందోళన చెందడం లేదు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి దాదాపు 5 నెలల క్రితమే బడాబాబులకు సమాచారం లీక్ అయిందని, వారు ముందుగానే జాగ్రత్తపడ్డారన్న వాదనలు లేకపోలేదు. ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం’ ప్రారంభించాక 70 వేల కోట్ల నల్లధనం బయటపడిందని అంటున్నారు. ఈ పథకాన్ని ప్రకటించినపుడే పెద్దనోట్ల రద్దు గురించి కొందరు పారిశ్రామిక వేత్తలకు, సంపన్నులకు, రాజకీయ నేతలకు ముందస్తు సమాచారం అందిందట! దాంతో చాలామంది నల్లకుబేరులు తమ డబ్బును వేరే రూపాల్లోకి మార్చుకున్నారన్నది జోరుగా సాగుతున్న ప్రచారం. సామాన్యులకు మాత్రం నల్లధనం గురించి ఎలాంటి ఆలోచనా, ఆందోళనా ఉండదు. అవినీతిని, అధిక ధరలను నియంత్రించాలని, తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని మాత్రమే వారు కోరుకుంటారు.
అమలు కానీ హామీ..
విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని, ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేయిస్తానని ఎన్నికల సమయంలో మోదీ జాతికి వాగ్దానం చేశారు. అలా చేస్తారన్న నమ్మకం దేశప్రజల్లో లేదు. ఆ వాగ్దానం నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ‘పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం’ అని నమ్మించడానికి బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2006 నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లడబ్బు 96,80,200 కోట్లని, ఈ ఏడాది ప్రారంభం నాటికి విదేశీ బ్యాంకుల్లో మన నల్లధనం కోటి కోట్లకు చేరిందని ఆర్థికరంగ నిపుణుల అంచనా. సుమారు 35 లక్షల కోట్ల రూపాయల నల్లధనం దేశంలోనే ఉందట. కొందరు బడావ్యక్తులు జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఎగ్గొట్టిన మొండి బకాయిలు 12 లక్షల కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నల్లధనం గురించి, బ్యాంకులకు మొండి బకాయిల గురించి విపక్షాలు అడిగినా సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో తొమ్మిదవ స్థానం పొందిన భారత్‌లో అధికశాతం ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఇపుడు కనిపిస్తున్న ‘క్యూ’లే ఇందుకు నిదర్శనం. నల్లకుబేరుల జాతకాలు బహిర్గతం కావాలంటే- ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకూ బ్యాంకుల్లో వారు చేసిన డిపాజిట్లు, వారి ఆర్థిక లావాదేవీల గురించి శే్వతపత్రం ప్రకటించే సాహసం మోదీ సర్కారు చేయగలదా? ఇందుకు ‘చేయలేదు’ అన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే బిజెపి కూడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, భూస్వాములకు నాయకత్వం వహించే పార్టీ గనుక. ఆ వర్గాల ప్రయోజనాలను ఎన్‌డిఎ సర్కారు కాపాడుతుందని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారందరికీ తెలుసు.
రద్దయిన నోట్లను బ్యాంకుల్లో వేయడంతో డిపాజిట్లు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నది మరో ప్రచారం. ప్రధాని మోదీ ప్రకటించిన ‘జన్ ధన్ యోజన’ కింద దేశంలో 24.45 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అయినప్పటికీ గ్రామాల్లో బ్యాంకు ఖాతాలు లేని వారి సంఖ్య కోట్లలోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో లేనందున పల్లెవాసులు పాతనోట్లను డిపాజిట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు కుమ్మక్కయి సహజ వనరులను, ప్రజాధనాన్ని దోచుకున్నంత కాలం నల్లధనాన్ని నిర్మూలించాలనుకోవడం కేవలం పగటికలే. పెద్దనోట్ల రద్దు తర్వాత పరిణామాలెలా ఉంటాయన్న విషయమై పాలకులు దృష్టి సారించనందున నేడు పేద, మధ్యతరగతి వారు నిత్యావసర సరకులను కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడింది. నోట్లరద్దు వంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు వివిధ పార్టీల, మేధావుల, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రభుత్వం చేసిన తప్పిదం. నల్లధనాన్ని అరికట్టాలన్న సంకల్పం ఉంటే ముందుగా విదేశాల్లో దాగిన నల్లడబ్బును దేశానికి రప్పించాలి. అవినీతి, అధిక ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం నిజంగా సంకల్పిస్తే- ఆ ప్రయత్నంలో వివిధ వర్గాల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలకు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుంది.

- దిగుపాటి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే, ఆచంట