సబ్ ఫీచర్

శిరస్త్రాణం వద్దంటే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో అంతటా వేగమే. ఈ వేగమే ప్రమాదాలకు కారణమవుతూ వాహన చోదకులను మృత్యుమార్గంలోకి నెడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారు వేగం తప్ప భద్రతను పాటించకపోవడంతో లేనిపోని ప్రమాదాలను తేలికగా కొని తెచ్చుకుంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో కొన్నిసార్లు ప్రాణాలనే కోల్పోతున్నారు. గతంలో ఇంటికో సైకిల్ ఉండేది, నేడు ఆ స్థానాన్ని ద్విచక్ర వాహనాలు ఆక్రమించాయి. తల్లిదండ్రులు కూడా తమ కుర్రాడు కాలేజీలో చేరితే చాలు బైక్‌లు కొని ఇస్తున్నారు. యువత వాహనాన్ని ఎక్కితే చాలు పరిసరాలను మరచిపోతూ వేగాన్ని నిరోధించుకోలేకపోతున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో దూసుకువెళ్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అనువైన రోడ్లు, కూడలి ప్రాంతాల్లో సూచికల్లేని మూల మలుపుల్లో వేగాన్ని తగ్గించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని చోట్లా రహదారులు అధ్వానంగా ఉండడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం, అక్రమంగా లైసెన్స్‌లు పొందడం, తనిఖీలు లేకపోవడం వల్ల కూడా వాహన చోధకులు ప్రమాదాలకు పాల్పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని వాహనాల తయారీదారులు, ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు చెబుతున్నా పట్టించుకోకపోవడంతో ఏటా భారత్‌లో ద్విచక్రవాహనదారులే 36,800 మంది మరణిస్తుండగా, మరో 93,400 మంది తీవ్రంగా గాయపడుతున్నారు.
కార్ల ప్రమాదాల్లో కంటే ద్విచక్రవాహన దారులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు 66 రెట్లు ఎక్కువ అని కూడా తాజా సర్వేలో తేలింది. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరిస్తే 42 శాతం ప్రమాదాల్లో ప్రాణాలు దక్కించుకోవచ్చని, 69 శాతం సందర్భాల్లో గాయపడకుండా బయటపడొచ్చని కూడా ‘యుఎన్ మోటార్ సైకిల్ హెల్మెట్ స్టడీ’ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 34 లక్షల మంది మరణిస్తున్నారు. అందులో 14 లక్షల మంది హెల్మెట్ ధరించి ఉంటే తమ ప్రాణాలను కాపాడుకునేవారు. మోటారు వాహనాల ప్రమాదాలు పరిశీలిస్తే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలోనే ఉంది.
వాహనాలను నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకుంటే కొంత మంది ప్రాణాలైనా నిలిచేవని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రతి పది మందిలో జాగ్రత్తలు తీసుకుంటే కనీసం నలుగురిని కాపాడే అవకాశం ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. వాహనదారులు శిరస్త్రాణాన్ని ధరించడం లేదా సీటు బెల్డు వాడటం వల్ల ప్రాణాలు దక్కే అవకాశాలుంటాయని ప్రమాదాలను విశే్లషించిన వారు చెబుతున్నారు. శిరస్త్రాణం భారంగా భావించకుండా, ప్రయాణాల్లో దానిని ధరించడం మంచిదనే చైతన్యం వాహన చోదకుల్లో రావాలి. గతంలో పారిశ్రామిక వాడల్లో ప్రమాదాల నుండి తప్పించుకునేందుకు శిరస్త్రాణాలను వాడేవారు. దీనివల్ల ఏ ప్రమాదం సంభవించినా తలకు దెబ్బతగలకుండా ప్రాణాపాయం నుండి కూడా తప్పించుకునే వారు. నేడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి శిరస్త్రాణం ధరించాలని రవాణాశాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే, హెల్మెట్లను ధరించేందుకు ఇప్పటికీ చాలామంది విముఖత చూపుతున్నారు. వాహన ప్రమాదాలు ఆందోళనకరంగా పరిణమించడంతో సర్నోన్నత న్యాయస్థానం ఆదేశాలతో దేశం అంతా ఒక్కసారిగా కదిలింది. అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించకుంటే ఎంవి యాక్ట్ ప్రకారం వెయ్యి రూపాయిల జరిమానా విధిస్తున్నారు. ఈ జరిమానా విధింపులో రాష్ట్రాల వారీ వ్యత్యాసం ఉన్నా గతంలో మాదిరి తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. అదే నిబంధన కింద రెండో సారి పట్టుబడితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే గనుక జరిమానా, జైలుశిక్ష విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసేలా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చే యజమానిపై కూడా కేసులు నమోదు చేసేందుకు నిబంధనలను కఠినతరం చేశారు.

- బివి ప్రసాద్