సబ్ ఫీచర్

మోదీ టీ కప్పులో తుపాను..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు తాను ‘స్ట్రాంగ్ టీ’ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. అయితే- 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ నిర్ణయం స్ట్రాంగ్ టీ కప్పులో తుపాను అయింది! ‘టీ కప్పులో తుపాను రేగడం’ భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద బారులు తీరిన పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాలు పడుతున్నా అసహనం చెందడం లేదు. కానీ, నోట్లరద్దు నిర్ణయం ‘నల్లదొరల’ పాలిట పెను తుపానే అయింది. నిరంతర సేవలు అందిస్తున్న నిజాయితీపరులైన బ్యాంకు ఉద్యోగులు ఎంత అభినందనీయులో, అక్రమ పద్ధతుల్లో అందినకాడికి సొమ్ము చేసుకున్న కొంతమంది బ్యాంకు అధికారులు అదే స్థాయిలో విమర్శల పాలవుతున్నారు. నగదు కోసం తాము గంటల తరబడి పడిగాపులు పడుతున్నా మోదీ నిర్ణయం మంచిదేనని సామాన్య జనం అంటున్నారు. ఆలయాల వద్ద, సినిమా థియేటర్ల వద్ద ‘క్యూ’లో ఇబ్బందులు పడడం లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. నల్లధనం తొలగిపోతే తమకు మంచిరోజులొస్తాయని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దేశ ప్రజల దురవస్థకు, ఆర్థిక వ్యవస్థ రుగ్మతలకు నల్లధనమే ప్రధాన కారణం. గత ప్రభుత్వాల హయాంలో నల్లధనం ఏరులై ప్రవహించి అనేకానేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. నోట్లరద్దుతో జనం ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది విపక్ష నేతలు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారు. నోట్లరద్దుపై చర్చిద్దామని పాలకపక్షం సిద్ధంగా ఉంటే సభకు ప్రధాని మోదీ రావాలని వారు వితండవాదానికి దిగుతూ, విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ‘క్యూ’లో ఉన్న జనం సంయమనం పాటిస్తున్నారు. ఎక్కడా గొడవలు, అల్లర్లు లేవు. అయితే, పార్లమెంటు ఉభయ సభల్లో మాత్రం విపక్ష నేతలు నానా హడావుడి చేస్తున్నారు. మరోవైపు మోదీ స్వయంగా ఇచ్చిన సర్వే పిలుపునకు కేవలం 30 గంటల వ్యవధిలో 5 లక్షల మంది స్పందించారు. ఈ సర్వేలో 90 శాతం మంది నోట్లరద్దును సమర్ధించారు.
నగదు కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటోంది. రైతులు, చిల్లర వ్యాపారులు, పేదవర్గాల వారి కోసం నిబంధనలను సడలిస్తోంది. మరో రెండువారాల్లో పరిస్థితి చక్కబడుతుందని, బ్యాంకుకార్డుల వినియోగం పెరుగుతుందని, పన్ను రాబడి గణనీయంగా వృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దనోట్ల రద్దు ఫలితంగా రుణాలపై వడ్డీ తగ్గుతుందని, ద్రవ్యోల్బణం తగ్గి నిత్యావసర సరకుల ధరలు దిగివస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందుగా చెప్పి పెద్దనోట్లను రద్దు చేస్తే ‘నల్లకుబేరులు’ జాగ్రత్త పడే అవకాశం ఉన్నందున, ఇలాంటి కీలక నిర్ణయాలను ఆకస్మికంగా ప్రకటించాల్సిందేనని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇదొక సంధికాలం, మార్పుకు నాందీ వాచకం. గనుక ప్రస్తుత తరుణంలో దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులను భరించక తప్పదు.
అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ఓ వ్యూహం ప్రకారం కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. దేశంలో సగం మందికి బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితిలో ‘జన్‌ధన్ యోజన’ను ప్రారంభించారు. బ్యాంకు ఖాతాలను ‘ఆధార్’తో అనుసంధానం చేశారు. ‘స్వచ్ఛంద ఆదాయ ప్రకటన’ పథకాన్ని ప్రారంభించారు. ఇలాంటి సంస్కరణలు అమలు జరిగితే ప్రజలు క్రమంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ప్లాస్టిక్ మనీ వినియోగానికి అలవాటు పడతారు.
దీపావళికి నరకాసురుడి వధ జరిగితే, ఆ పండుగ వెళ్లిన వారానికే ‘నల్లకాసురుల’ భరతం పట్టేందుకు మోదీ నడుం కట్టారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు భారీగా పన్నులు చెల్లించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు, మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకు వందల కోట్ల రూపాయల్లో ఆదాయం లభించింది. అనుకోని రీతిలో పన్నులు వసూలు కావడంతో- పెద్దనోట్ల రద్దు స్థానిక సంస్థలకు వరంలా మారింది. ఇలా ఎనె్నన్నో ప్రయోజనాలు కలుగుతున్నందునే నోట్లరద్దుపై ‘స్టే’ విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నల్లధనం రద్దు వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు 3 లక్షల కోట్ల మేరకు వెసులుబాటు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, గ్రామీణ భారతం డిజిటల్ బ్యాంకింగ్‌కు దూరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో సంస్కరణలు ఫలితం ఇస్తాయా? అని విపక్ష నేతలు వాదిస్తున్నారు. గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తున్నందున రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇకపై అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరిగితే వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులకు, పేదలకు విముక్తి లభిస్తుంది. ప్రజలు కూడా మార్పుకు సుముఖంగా ఉన్నందున మోదీ ఆశిస్తున్న విలక్షణ ఆర్థిక వ్యవస్థ త్వరలో సాకారమయ్యే అవకాశాలున్నాయి. 2004 -2014 కాలంలో పదేళ్ల పాటు యుపిఎ హయాంలో పాలకులు ఖజానాను ఖాళీ చేయడమే గాక అనేక భారీ కుంభకోణాలకు పాల్పడడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తాను తీసుకొస్తున్న సంస్కరణలతో ఆర్థిక రంగం తిరిగి పుంజుకుంటుందని మోదీ జాతికి భరోసా ఇస్తున్నారు. పన్నులు చెల్లించని వారిని ఇక ఉపేక్షించేది లేదని, నల్లధనాన్ని బయటకు రప్పిస్తానని చెబుతున్న మోదీ అందుకు అనుగుణంగానే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వల్ల ఇప్పటికే కొన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో అవినీతిపరులకు, నల్లకుబేరులకు వెన్నులో వణుకు ప్రారంభమైంది. నిబంధనలకు విరుద్ధంగా నగదు దాచుకున్న వారికి జరిమానాలు, జైలుశిక్షలు తప్పవని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలతో పరిస్థితి ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. జన్‌ధన్ ఖాతాలను క్రమంగా పొదుపు ఖాతాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదులకు సాయం వంటి అవలక్షణాలను సమూలంగా సమాధి చేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఆరంభం మాత్రమే. అక్రమాలకు అలవాటుపడి నీతిబాటను తప్పితే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవనడానికి పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రస్తుత పరిణామాలే నిదర్శనం. అందుకే మన పెద్దలు ఎపుడో చెప్పారు- ‘వస్తా వట్టిదే పోతా వట్టిదే.. ఆశ ఎందుకంట.. చేసిన ధర్మము చెడని పదార్థము చేరునె నీ వెంట’ అని.

- తాడేపల్లి హనుమత్ ప్రసద్ 96761 90888