సబ్ ఫీచర్

ఫలించని ప్రైవేటు మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు రోజుల ఆలస్యంగా డెలివరీ ఇచ్చిన కొరియర్ బాయ్‌ని కారణమడిగితే తను సెలవులో ఉన్నానని చెప్పాడు. కొరియర్ బాయ్ లేకుంటే ఇంకొకరి ద్వారా పంపరన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగించింది. పోస్ట్ఫాసులో ఒకరు సెలవుపెట్టాలంటే రిలీవరు ఉండవలసినదే. కానీ ఉత్తరాల బట్వాడా ప్రభుత్వాధీనంలోని పోస్టల్‌శాఖ మాత్రమే నిర్వహించే కాలంలో- ‘పెళ్ళికి రమ్మని శుభలేఖ వేస్తే బారసాల నాటికైనా అందుతుందో లేదో’వంటి మాటలు విన్పించేవి. ప్రైవేటు రంగంలో పనులు వేగంగా జరుగుతాయన్న నమ్మకాన్ని వమ్ము చెయ్యడానికి పైన చెప్పిందొక ఉదాహరణ. (వాస్తవానికి కొరియర్ సర్వీసెస్ ఉత్తరాలను బట్వాడా చెయ్యరాదన్న నియమముంది. అది వేరే సంగతి.) తక్కువ ఖర్చుతో, ప్రతిరోజూ డెలివరీ ఉండే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొడిగట్టిన దీపంలా ఉంది.
పోస్టల్ డిపార్ట్‌మెంట్ మాత్రమే కాదు, ప్రతి రంగంలోనూ కూడా ప్రైవేటు సంస్థలు ప్రవేశిస్తే పరిస్థితి మెరుగుపడుతుందన్న నమ్మకం ప్రజలలో ఉంది. ‘దూరదర్శన్’ మాత్రమే ఉన్నప్పుడు ప్రైవేటు టీవీ చానెళ్ళు వస్తే చాయిస్ పెరుగుతుందనీ, పోటీ వల్ల వివిధ చానెళ్ళు మంచి ప్రోగ్రాంలు రూపొందిస్తాయనీ, ప్రభుత్వ కంట్రోల్ లేనందువల్ల అన్నిరకాల కార్యక్రమాలూ చూడవచ్చనీ అనుకునేవారు. కంట్రోలు అంత దుర్మార్గమైనదా? దేశమంతటా టీవీ ప్రసారాలు ప్రారంభమైన కొత్తలో (1984లో) మషూర్ మహల్ అనే క్విజ్ ప్రోగ్రాం వచ్చింది. వృద్ధురాలిని చూపి-‘ఈమె వయస్సు ఇరవయ్యా? లేక అరవయ్యా?’వంటి ప్రశ్నలుండేవి. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ స్వయంగా పూనుకుని ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించారు. అదే విధంగా సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలను బఫూన్‌లా చూపించిన ‘తెనాలి రామన్’ అనే కార్యక్రమాన్ని అప్పటి కేంద్ర ప్రసారశాఖామాత్యులు ఉపేంద్ర నిలిపివేయించారు.
ఇప్పుడు భావ ప్రకటనాస్వేచ్ఛ పేరుతో అసత్యాలు ప్రసారవౌతున్నాయి, అసభ్యమూ, అశ్లీలతా నాట్యమాడుతున్నాయి. యాంకర్లు (న్యూస్ చానెళ్ళు కొంతవరకూ నయం) తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారు. ఒక వాక్యంలో సగానికి పైగా ఆంగ్ల పదాలే. శ్రామికవర్గంలో ఇంగ్లీషు వ్యామోహం పెరగడానికి టీవీ చానెళ్ళే ముఖ్య కారణం.
నూటికి తొంభై శాతం పైగా పిల్లలు ప్రభుత్వ విద్యాలయాలకో, గవర్నమెంట్ ఎయిడ్ ఉన్న పాఠశాలలకో వెళ్ళేకాలం నుండి పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం కానె్వంటులకు పంపే రోజులు వచ్చాయి. (కానె్వంటులు నడిపేవారికి కానీ, వాటిలో పనిచేసే టీచర్లకు కానీ కానె్వంటు అన్న మాటకు అర్థం తెలిసి ఉంటుందా?) ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు బాగుండడం లేదు. ఇదేమాట ప్రభుత్వ వైద్యశాలలకూ చెప్పవచ్చును. ప్రభుత్వాధీనంలోని ఆర్.టి.సి. వంటి సంస్థలకూ చెప్పవచ్చును. దీనికి కారణమేమిటి? విద్య, వైద్య రంగాలూ, రవాణా వ్యవస్థా కార్పొరేట్ సంస్థల పాలయ్యాయి. కార్పొరేట్ రంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ నాయకుల చేతిలో ఉంది. అనేక ప్రజోపకార రంగాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రైవేటు విద్యాలయాలలో, ఆసుపత్రులలో అవసరమయి కానీ, అనవసరంగా కానీ వసూలుచేసే ఫీజులకి ఎలాంటి పరిమితి లేదు.
ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాసంస్థలలో, వైద్యాలయాలలో అవినీతి, అసమర్థత పేరుకుపోయి ఉన్నాయనీ, ప్రైవేటు మంత్రం పఠిస్తే బ్రహ్మాండమైన మార్పు వస్తుందనీ ప్రజలు విశ్వసించి, ప్రైవేటురంగాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. మొదట్లో మత్తుపదార్థాలు ఫ్రీగా ఇచ్చి, మనుషుల్ని వ్యసనపరుల్ని చేసినట్లే చాలా వస్తువులూ, సేవలూ చవగ్గా దొరికాయి. మాగీ నూడుల్స్ పాకెట్ అయిదు రూపాయలకు అమ్మి, టీషర్టు ఫ్రీగా ఇచ్చేవారు. విమానయానం మధ్యతరగతికి అందుబాటులోకి వచ్చింది. నేడు మాగీ నూడుల్స్ విషపూరితమని తెలిసినా, కింగ్‌ఫిషర్, సహారా వంటి ఎయిర్‌లైన్స్ లక్షల కోట్ల రూపాయల అప్పు ఎగవేసినా ప్రజలు నిస్సహాయంగా చూడడమే మిగిలింది. ప్రభుత్వోద్యోగుల అవినీతికి కొంతైనా పరిమితి ఉంటుంది, కొంతవరకైనా జవాబుదారీతనం ఉంటుంది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల లాభార్జనకు ఆకాశమే హద్దు.

- పాలంకి సత్య