సబ్ ఫీచర్

దివ్యాంగులకు సంపూర్ణ విద్య.. ఓ మిథ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగవారికి కూడా రాకూడదని భావించే అంగవైకల్యంతో కూడుకున్న వారి బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో 740 కోట్ల మంది ప్రజలుంటే వారిలో వంద కోట్లమంది ఏదో ఒక శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారేనని ఐక్యరాజ్యసమితి తేల్చింది. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరు వైకల్య బాధితులే. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి వెల్లడించే గణాంకాలు ఎవరికైనా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. వైకల్యంతో బాధపడేవారిలో కనీసం 50 శాతం మంది ఎలాంటి ఆర్థిక ఆసరా లేని వారేననేది నిర్వివాదాంశం. వైకల్యం నివారించదగిందే అయినా అందుకు తగ్గ వైద్యసాయాన్ని వారు పొందలేకపోతున్నారు. దివ్యాంగులైన పిల్లలకు లైంగికహింస ముప్పు మిగతా బాలల కంటే నాలుగురెట్లు ఎక్కువగా ఉందని కూడా ఐరాస నివేదిక పేర్కొంది. 2030 నాటికి ప్రపంచంలో వైకల్యం లేని అత్యుత్తమ పౌరుల సమాజాన్ని చూడాలని యుఎన్‌ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే 17 అంశాలను అధిగమించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి ‘్థమ్’గా ఆ అంశానే్న ఐరాస తీసుకుంది. తాము నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను దివ్యాంగులు ఇతరులతో చెప్పుకోలేరు. ఇంకొకరి ఆసరా కూడా వారికి పెద్ద భారమే. ఈ ప్రభావం చివరికి వారి చదువులపై కూడా పడుతోంది. ప్రభుత్వాలు సైతం లెక్కలేనితనంతో వ్యవహరించడం వల్ల వారికి సంపూర్ణ విద్య ఒక మిథ్యగా మారుతోంది.
1992 డిసెంబర్ 3న తొలిసారిగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ‘వికలాంగులు’ అనడం బాగులేదని భావించి, వారిని వైకల్యంతో బాధపడుతున్న వారిగా వ్యవహరించాలని తొలిసారిగా ‘వైకల్యంతో కూడిన పౌరుల అంతర్జాతీయ దినోత్సవం’ (ఐడిపిడి) పేరిట 2008లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకల్యంతో బాధపడుతున్న వారిని ‘దివ్యాంగులు’గా వ్యవహరిస్తున్నారు. మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు కల్పించినా, అవి ఆచరణలో అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం వీరి సమస్యలపై ఎన్నో కమిటీలను వేసింది. ఆ కమిటీలు అనేక సిఫార్సులను, విధానాలను సూచించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ప్రామాణిక నియమావళి (1994), రామ్మూర్తి కమిటీ (1992), వికలాంగుల జాతీయ విద్యా విధానం (1996), చర్యల కార్యాచరణ (పిఓఎ-1992) వంటి కీలక నివేదికలలో అనేక సిఫార్సులు పూర్తిగా అమలులోకి రాలేదనే చెప్పాలి.
వాస్తవానికి అన్ని కమిటీలు దివ్యాంగులకు ఏ తరహా విద్యను అందించాలనే దానిపై స్పష్టమైన సిఫార్సులు చేశాయి. అయితే ఈ సిఫార్సులన్నీ ప్రాథమిక విద్య చుట్టూనే తిరిగాయి. ఉన్నత విద్యకు సంబంధించి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేకపోయాయి. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) మాత్రం ఉన్నత విద్యాసంస్థల్లో వికలాంగులకు భవనాల్లో దిగువ అంతస్థుల్లోనే తరగతులు నిర్వహించాలని, అన్ని యూనివర్శిటీల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక శిక్షకులను నియమించాలని రాష్ట్రాలకు సిఫార్సు చేసి చేతులు దులుపుకుంది. అందుకు తగ్గ నిధులను సమకూర్చకపోవడంతో ఇప్పటికీ ఆ సిఫార్సులు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్టస్థ్రాయిలో వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, విభాగాలు పనిచేస్తున్నా వారికి కల్పించిన హక్కులను పర్యవేక్షించే యంత్రాంగం, మంత్రాంగం లేకపోవడంతో విధాన నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు కమిషన్లు ఉన్న రీతిలో వికలాంగులకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటుచేయకపోవడం కూడా శాపంగా మారింది. మిగతా విద్యార్థులతో కలిపి వికలాంగులకు విద్య నేర్పించడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించలేమని, వీరి కోసం ప్రత్యేక దృష్టిసారించాలని, వౌలిక సదుపాయాలు కల్పించాలని యుఎన్‌ఓ, యునిసెఫ్ సిఫార్సులు చేశాయి. కొఠారీ కమిషన్ సైతం వికలాంగుల విద్యపై కొన్ని సూచనలు చేసింది. అందులో ప్రధానంగా ‘ప్రత్యేక విద్య’ అనేది కేవలం మానవత్వపు పునాదులపై కాకుండా, ప్రయోజనాల ఆధారంగా రూపొందించినపుడే సార్ధకత వస్తుందని పేర్కొంది.
భారత పునరావాస చట్టం, మెంటల్ హెల్త్ యాక్ట్, జా తీయ ట్రస్టు చట్టం, వికలాంగుల చట్టం, ఐక్యరాజ్య సమితి వికలాంగుల ఒప్పంద పత్రం ఉండనే ఉన్నాయి. మన దేశ జనాభాలో రెండున్నర కోట్లకు పైగా వికలాంగులున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో 1.5 కోట్ల మంది పురుషులు కాగా, 1.18 కోట్ల మంది మహిళలు ఉన్నారు. బడి ఈడులో ప్రత్యేక అవసరాలున్న పిల్లలు మన దేశంలో ‘డైస్ -2015’ లెక్కల ప్రకారం 25,13,492 మంది ఉన్నారు. వీరిలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నవారు 22,85,531 మంది, మాథ్యమిక స్థాయిలో 2,27,961 మంది ఉన్నారు. తెలంగాణలో 2-14 ఏళ్ల మధ్య ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,32,710 మంది కాగా, ఆంధ్రాలో ఈ సంఖ్య రెండులక్షలకు పైగానే ఉంది.
దివ్యాంగులు విద్యను అభ్యసించడానికి నానా అవస్థలు పడుతున్నారు. వీరిలో ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. తరగతి గదిలో మిగతా పిల్లలతో సమానంగా వీరు ఇమడలేక సతమతమవుతున్నారు. తోటి పిల్లల చులకన భావం వీరిని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నది. చదువుకుందామనే బలమైన కోరిక ఉన్నా అది నీరుకారిపోతోంది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో ప్రతిసారీ ఉపాధ్యాయుడు వీరిని పర్యవేక్షించడం కష్టమవుతుంది. సామాజిక కార్యకర్తలు, మానసిక శాస్తవ్రేత్తల చేత తరచూ సమావేశాలు ఏర్పరచి అందరూ సమానమే అనే భావనను విద్యార్ధుల్లో కలిగించినట్టయితే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీరికి సాధారణ బోధనా పద్ధతులు పనికిరావు. మూగ, అంధ, చెవిటి వారికి ప్రత్యేక పద్ధతుల్లో పాఠాలు చెప్పాలి. 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని రామమూర్తి కమిటీ సూచించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకే విద్యా హక్కు చట్టంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సంబంధించి నిబంధనలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీరికి ప్రత్యేక అధ్యాపకులను నియమించాల్సి ఉంటుంది. ఈ అధ్యాపకులు దివ్యాంగుల మానసిక విచలనాలలో మార్పు తీసుకురావడం ఎలాగో శిక్షణ పొంది ఉండాలి. అపుడే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తెస్తూ వారికి తోడ్పాటు అందిస్తారు.
దేశంలో సుమారు 2.52 మిలియన్ల మంది దివ్యాంగులు తగిన విద్యను అందుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రాలు సరిపడా నిధులను అందుకుంటున్నా, సహిత విద్య పద్ధతిలో కాకుండా ఒప్పంద పొరుగు సేవల ద్వారా భవిత విద్యా కేంద్రాల (ప్రత్యేక పాఠశాలలు) ద్వారా చదవులను కొనసాగించడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. తెలంగాణలోనే మండలానికి ఇద్దరు చొప్పున 934 మంది ఉపాధ్యాయులకు కేంద్రం నిధులు ఇస్తుండగా, 860 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ‘యుడైస్’ లెక్కల ప్రకారం దివ్యాంగుల పిల్లల చదువులకు కేంద్రం 196 కోట్లు ఇచ్చేందుకు వీలుంది, కనీసం 50వేల మంది పిల్లల సౌకర్యాలకు మరో 15 కోట్లు ఇచ్చే వీలున్నా వీటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం లేదు. మాథ్యమిక విద్యకు మరో 59 కోట్లు కేంద్రం ఇచ్చే వీలుంది. అంటే మొత్తం మీద 272 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఈ ప్రతిపాదనలు పెట్టడానికి కూడా అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్టుందనే విమర్శలు వినవస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దివ్యాంగుల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? అంతర్జాతీయ దినోత్సవం అంటే చాలు.. ఒకటే హడావుడి. వాడవాడలా ఉత్సవాలు, సభలు, ఉపన్యాసాలతో లక్ష్యాలను చేరుకోగలమా?

-బి.వి. ప్రసాద్