సబ్ ఫీచర్

సంస్క‘రణం’లో సామాన్యులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తిమొక్కను ఆశ్రయించుకొని సుమారు పదకొండు వందల రకాల సూక్ష్మజీవులు బతుకుతాయట. వీటిలో 1,090 రకాల సూక్ష్మజీవులు మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయని, మిగిలిన పదిరకాలు మాత్రమే పంటకు హాని చేస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలు తెలిసినా తెలియకపోయినా పంటను రక్షించుకొనేందుకు రైతులు క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతుంటారు. రసాయన మందులను మితిమీరి వాడడం వల్ల సూక్ష్మజీవులే కాదు, ఒక్కోసారి మొక్కలూ చనిపోతుంటాయి. దీంతో రైతు ఆర్థికంగా చితికిపోతాడు. మొక్కలూ బతకాలి, పంటకు మేలు చేసే కొన్నిరకాల పురుగులూ బతకాలి. మొక్కకు కీడు చేసే సూక్ష్మజీవులు మాత్రమే నాశనం కావాలి. పంటల సాగులో కనిపించే ఈ సాధారణ విషయాలు మానవ జీవనానికీ వర్తిస్తాయి. ప్రభుత్వ సంస్కరణలు సజ్జనులను బాధించడంలో కృతకృత్యమైనంతగా- దుర్జనులను శిక్షించడంలో సఫలీకృతం కావడం లేదు. మన ప్రభుత్వాలు చేసే చట్టాలు, తీసుకునే విధాన నిర్ణయాల అమలులో ఈ విషయం ఇప్పటికే పలుసార్లు రుజువైంది. సంస్కరణల అమలులో సజ్జనులు కష్టాల పాలవుతూ తమ పరిస్థితి గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ పరిస్థితి ఇపుడు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కనిపిస్తోంది.
అవినీతి, నల్లధనం నిర్మూలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం ‘సజ్జన పీడిత వ్యవహారం’గా మారుతోంది. నల్లధనాన్ని భారీగా దాచుకున్న బడాబాబులు ఎంతో సునాయాసంగా పాతనోట్లను మార్పిడి చేసుకుంటుండగా పేదలు, మధ్యతరగతి ప్రజలు మాత్రం చేతిలో నగదు లేక విలవిలలాడుతున్నారు. జీతం డబ్బులు, పెన్షన్ మొత్తం బ్యాంకు ఖాతాలో ఉన్నా వేతనజీవులకు, వృద్ధులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ‘క్యూ’లో గంటల తరబడి పడిగాపులు పడినా తాము ఆశించినంత నగదు చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. తమ డబ్బును తాము తీసుకునే వీలు లేకుండా పేద, మధ్య తరగతి జనం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ‘క్యూ’లో నిలబడి నీరసించిపోతే రెండు వేల రూపాయల నోటు దక్కడం గగనమవుతోంది. మరోవైపు కోట్లాది రూపాయల కొత్త కరెన్సీ పోలీసులకు పట్టుబడుతోంది. గుట్టలు గుట్టలుగా, కట్టలు కట్టలుగా కొత్త రెండు వేల రూపాయల నోట్లు అక్రమార్కులకు ఎలా చేరుతున్నాయన్నది బేతాళ ప్రశ్నగా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వం కూడా రోజుకో నిబంధన విధిస్తూ మరింత అయోమయాన్ని సృష్టిస్తోంది. మరోవైపు విపక్షాలు, ప్రసార మాధ్యమాలు సృష్టిస్తున్న గందరగోళంతో ప్రజలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. చివరికి నగదు మార్పిడికి స్వస్తి పలికి, పాతనోట్లను ఈ నెలాఖరులోగా జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు లేనివారు, బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల వారు పాతనోట్లను జమ చేసేందుకు అవస్థలు పడకతప్పడం లేదు. బ్యాంకు ఖాతా ఉన్నా పాతనోట్లను డిపాజిట్ చేయాలంటే ఆధార్ నెంబర్, ‘పాన్’ నెంబర్ తప్పనిసరి అంటున్నారు. బ్యాంకు ఖాతాను ‘ఆధార్’తో అనుసంధానం చేసి ఉండాలి. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే తప్ప గ్రామీణ ప్రజలు పాతనోట్లను బ్యాంకులో జమచేసే అవకాశం లేదు. ‘ఆధార్’, ‘పాన్ కార్డు’ లేనివారి పరిస్థితి ఏమిటి? పేదల కోసం నిర్దేశించిన ‘జన్‌ధన్ ఖాతా’ల్లో కొందరు బడాబాబులు డిపాజిట్లు చేస్తున్నారని, ఇలాంటి ఖాతాదారులకు జైలుశిక్ష తప్పదన్న వార్తలతో జనం హడలెత్తిపోతున్నారు.
పెద్దనోట్ల రద్దు తరువాతి పరిణామాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తుండగా, విపక్షాలకు మాత్రం ప్రభుత్వంపై దాడి చేసేందుకు మంచి అవకాశం లభించినట్టయ్యింది. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ‘నగదు లేదు’ అని బోర్డులు పెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. మంచి ఉద్దేశంతోనే పెద్దనోట్లను రద్దు చేసినా, ‘ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం’ అని దుమ్మెత్తి పోసేందుకు విపక్షాలకు, ప్రసార సాధనాలకు ఓ ఆయుధం లభించినట్టయ్యింది. ‘క్యూ’ల వద్ద బడాబాబులెవరూ కనిపించడం లేదని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా హంగామా చేస్తోంది. నిజానికి భారీగా డబ్బు దాచుకున్న వారు బ్యాంకుల వద్దకు ఎందుకు వస్తారు? తమ వద్ద పనిచేసే వారిని బ్యాంకులకు పంపించో మరో మార్గంలోనో డబ్బు జమ చేయిస్తారు, నగదు మార్చుకుంటారు. నగదు పంపిణీకి ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకులో ఎపుడు ఎంత మొత్తం ఇస్తారో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. ఎటిఎంలు కొన్ని మాత్రమే పనిచేస్తుండగా రెండువేలకు మించి నగదు పొందే వీలు లేదు. జీతం అందిన మొదటి వారంలో ఉద్యోగులకు ఎన్ని అవసరాలున్నా బ్యాంకులో దక్కిన నగదుతో సరిపెట్టుకోవలసిందే. మళ్లీ డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. అధిక శాతం ఎటిఎంలు పనిచేయకపోవడంతో ఉద్యోగస్తులు సెలవుపెట్టి మరీ బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎటిఎంలు పనిచేస్తే బ్యాంకులపై ఇలా దండయాత్ర చేసే పరిస్థితి ఉండదు. ఎటిఎంలు సాధారణ స్థితికి రావాలంటే కనీసం మరో రెండు, మూడు నెలలు పడుతుందట! ఎటిఎంలలో, బ్యాంకుల్లో ఎక్కువగా రెండువేల రూపాయల నోట్లే ఇస్తున్నందున చిల్లర సమస్య వేధిస్తోంది. రెండు వేల రూపాయలకు చిల్లర లభించక వినియోగదారులు, చిరు వ్యాపారులు నానా యాతన పడుతున్నారు.
పాతనోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు గడువును పెంచే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన నగదు మార్పిడిని పరిశీలించగా ప్రభుత్వం ఆశించిన మేరకు నల్లధనం బయటపడుతుందా? అన్నది అనుమానంగానే ఉంది. రద్దయిన పాతనోట్లన్నీ బ్యాంకులకు చేరితేనే ప్రభుత్వ నిర్ణయానికి ఫలితం ఉంటుంది. ఆ డబ్బుతో మరిన్ని సంక్షేమ పథకాలను చేపట్టే అవకాశం ఉంటుంది. నల్లధనం పూర్తిగా అదుపులోకి వస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది. ఆశించిన మేరకు నల్లధనం బయటపడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? బడాబాబుల ఇళ్లపై ఐటి దాడులు చేయిస్తుందా? పాతనోట్లను జమ చేసేందుకు మరో అవకాశం ఇస్తుందా? భారీగా నగదు డిపాజిట్ చేసిన వారందరికీ ఆదాయపు పన్నుశాఖ నోటీసులిస్తుందా? అదనపు పన్ను వసూలు చేసి బడాబాబులను వదిలేస్తారా?... ఇలాంటి ప్రశ్నలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. భారీగా నల్లధనం దాచుకున్న వారికి రెట్టింపు పన్ను విధించాలని, ఐటి శాఖకు సహరించని వారికి జైలుశిక్షలు విధించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు నోట్లను దాచుకుని చిల్లర సమస్య సృష్టిస్తున్న వారిపైనా కొరడా ఝళిపించాలని సామాన్యజనం కోరుతున్నారు. ‘అరిసెలు తింటే ఆర్నెళ్ల కిందటి రోగం బయటికొస్తుంద’ని సామెత. నోట్లరద్దు నిర్ణయం ఫలితంగా దేశ ఆర్థిక రంగంలో అవలక్షణాలన్నీ ఇపుడు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దితేనే మోదీ చేపట్టిన సంస్కరణలకు సార్థకత చేకూరుతుంది.

-వరిగొండ కాంతారావు