సబ్ ఫీచర్

పరిపూర్ణ పాత్రికేయ జీవితానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొంభై ఒక్క ఏళ్ల వయసు.. అందులో 64 ఏళ్ల జర్నలిస్టు జీవితం.. తుదిశ్వాస వరకూ రాస్తూనే బతుకు పుస్తకాన్ని అక్షరమయం చేసుకున్న నిండైన పాత్రికేయ జీవితం వి. హనుమంతరావు సొంతం. ‘డిఎన్‌ఎఫ్’ హనుమంతరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన రాస్తూనే జీవించారు. చివరి వరకు రాయడానికే ఇష్టపడ్డారు. 80 ఏళ్ల వయసులోనూ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. బడ్జెట్ పుస్తకాలను అమితంగా ప్రేమించేవారు. అసెంబ్లీలో బడ్జెట్ పుస్తకాల కట్టలు కనీసం ఓ పది కిలోల బరువు ఉంటాయి. శాసన సభ్యులు, జర్నలిస్టుల్లో ఆ పుస్తకాల కట్టలను చదివేవారు ఎంత మంది ఉంటారో కానీ హనుమంతరావు మాత్రం అంకెలను విపరీతంగా ప్రేమించేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టగానే రెండు మూడు రోజుల్లో ఆ గణాంకాల ఆధారంగా లోతైన విశే్లషణలతో పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. సాధారణంగా కవులు, రచయితలు, జర్నలిస్టులు అక్షరాలను ప్రేమిస్తారు. హనుమంతరావు మాత్రం అక్షరాలతో పాటు అంకెలను విపరీతంగా ప్రేమించారు. ‘అంకెలు ఒక పట్టాన అర్థం కావు.. అర్థం అయ్యాయంటే వాటిని ప్రేమించడం ఎప్పటికీ మానరు’ అన్నమాటలకు ఆయనే నిదర్శనం. 64 ఏళ్లపాటు ఒకే వృత్తిలో కొనసాగడం అరుదైన విషయం. ‘జర్నలిస్టు అంతర్వీక్షణం’ పేరుతో తన ఆరు దశాబ్దాల అనుభవాలు, అనుభూతులను ఆయన భావితరాల కోసం గ్రంథస్తం చేశారు.
‘రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం ఉంటుంది. దాని కోసం జర్నలిస్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్నా చేస్తారు. ప్లాట్లు, స్కూటర్లు, కార్లు, మద్యం సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీలో విలేఖరిగా పని చేసేప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్‌ను ఎంపిక చేసుకున్న జర్మలిస్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా వారు ఏమీ అడిగేవారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ శాఖకు సంబంధించిన సమాచారం కావాలని మెల్లగా బయటపెట్టేవారు. సీసాలకు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి ఉం టుంది?’- ఇదీ హనుమంతరావు తన ‘అంతర్వీక్ష ణం’లో ప్రస్తావించిన వి షయం. ‘అప్పటి జర్నలిజం ఇప్పుడిలా మారిపోయింది కానీ- మా కాలంలో పునీతంగా ఉండేది’ అంటూ మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కానీ, ఓ స్కాచ్ బాటిల్ కోసం దేశానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా విదేశీ రాయబార కార్యాలయం వారికి అర్పించే జర్నలిస్టులు 50వ దశకంలోనూ ఉన్నారని హనుమంతరావు స్వయంగా చూసిన విషయం ఆత్మకథలో ప్రస్తావించారు.
ఆయన చివరి రోజు వరకూ ఎంతో నిబద్ధతతో గడిపారు. 80 ఏళ్ల వృద్ధాప్యంలో అసెంబ్లీ చుట్టూ తిరిగి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు. కానీ, ఆయన నికార్సయిన నిండైన జర్నలిస్టు గనుకే వయసు సహకరించినంత కాలం పాత్రికేయుడిగానే కాళ్లకు బలపం కట్టుకుని మరీ సమాచార వేటలో గడిపారు. ‘పత్రికలో ప్రచురించే వార్తలను అనుకూలంగానూ, ప్రతికూలంగానూ మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధం అని అనుకోవద్దు’’ అంటూ హ నుమంతరావు వార్తల్లో నిజానిజాలను ఆవిష్కరించారు. ‘జర్నలిస్టుగా ఎంతమంది ప్రముఖులు పరిచయం అనేది ముఖ్యం కాదు. జర్నలిస్టుగా సమాజం కోసం నువ్వేం చేశావు అనేది ముఖ్యం’ అన్న మాటలను ఆయన ఆచరణలో పాటించేవారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఓసారి భారతీయ స్టేట్‌బ్యాంకు రైతులకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని యువ జర్నలిస్టుగానే కవర్ చేయడానికి వెళ్లిన హనుమంతరావు ఒక రైతు నాలుగు వందల వేలిముద్రలు వేయడాన్ని గమనించి ఆశ్చర్యం వేసి మళ్లీ లెక్కించాడు. ‘వంద రుపాయల రుణానికి నాలుగు వందల వేలిముద్రలు’ అంటూ ఆయన రాసిన వార్త- ఆ బ్యాంకు విధి విధానాలను మార్చుకోవలసిన పరిస్థితి కల్పించింది. ఒక సభలో స్వయంగా ఈ విషయాన్ని ఆ బ్యాంకు అధికారి గుర్తు చేశారు. అప్పటి నుంచి రైతులకు రుణ దరఖాస్తులను సులభతరం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. యాంత్రికంగా పనిచేయడం కన్నా సమాజానికి ఉపయోగపడే విధంగా హనుమంతరావు ఆలోచించడం ద్వారా వెలుగు చూసిన సమస్య అది.
ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివాక 27 ఏళ్ల వయసులో జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వామపక్షనేత పుచ్చలపల్లి సుందరయ్యతో కలిసి ఉన్నారు. న్యూఢిల్లీలో విశాలాంధ్ర విలేఖరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి పార్లమెంటు సమావేశాలను కవర్ చేశారు. 1956లో విశాలాంధ్ర చీఫ్ రిపోర్టర్‌గా హైదరాబాద్ వచ్చారు. చివరి వరకు హైదరాబాద్‌లోనే గడిపారు. కృష్ణాపత్రిక, ఎకనమిక్స్ టైమ్స్,యుఎన్‌ఐ, ఈనాడు వంటి సంస్థల్లో పని చేశారు. 1977లో ఈనాడు నుంచి బయటకు వచ్చిన తరువాత ‘డేటా న్యూస్ ఫీచర్స్’ (డిఎన్‌ఎఫ్) పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో తొలి న్యూస్, ఫీచర్ ఏజెన్సీని ప్రారంభించారు. జర్నలిజం వ్యాపారమయం కావడం పట్ల ఆయన ఆవేదన చెందేవారు. టీవీ చానెళ్లు, దినపత్రికలు ఒకే అంశాన్ని తమ తమ కోణంలో ప్రజలకు చూపిస్తున్నాయని అనే వారు. యువ జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సహించేందుకు, వారి నైపుణ్యాన్ని గుర్తించేందుకు డిఎన్‌ఎఫ్ తరఫున ఆయన అవార్డులను అందజేసేవారు. పాకిస్తాన్ యుద్ధం- బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో యుద్ధం గురించి తొలిసారి రాసింది హనుమంతరావే. తాను రాసిన వార్త మరుసటి రోజు అన్ని జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని ఆయన నిరూపించారు. రాయడం, రాస్తూ ఉండడం ఆయనకు వ్యసనం కావొచ్చు. కానీ- అది సమాజానికి మేలు చేసింది. పాత్రికేయ వృత్తికి గౌరవం తెచ్చింది.

చిత్రం..వి.హనుమంతరావు

- బుద్దా మురళి