సబ్ ఫీచర్

ముగింపు దిశగా మావోల ప్రస్థానం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోని ‘ట్రై జంక్షన్’లో గత నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొప్పారం దేవరాజం అలియాస్ యోగేశ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అజిత మరణించారు. ‘సైలంట్ వ్యాలీ’గా పిలిచే ఈ అటవీ ప్రాంతంలో ఆరోజు తుపాకుల మోత ప్రతిధ్వనించగా కొందరు మావోయిస్టులు జాడలేకుండా పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశే్లషకుల భావన. దక్షిణాది రాష్ట్రాల్లోని ట్రైజంక్షన్ మావోలకు కీలక ప్రాంతం. పశ్చిమ కనుమల్లోని ఈ అరణ్యంలో పాగా వేస్తే చాలా ప్రాంతాలకు విస్తరించడం సులువవుతుందని వారి ఆలోచన. కబని, నాదుకని, భవాని అనే నదుల పేర్లతో మూడు గెరిల్లా దళాలు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాయి.
పశ్చిమ కనుమల స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడు రూపేశ్, అతని భార్య షైనీని 2015లో తమిళనాడు పోలీసులు అరెస్టుచేయడంతో కొంతకాలం మావోల అలజడి తగ్గింది. కర్నాటకకు చెందిన యోగేశ్ ఆ స్థానంలోకి రావడంతో మళ్లీ వారి కార్యకలాపాలు పెరిగాయి. మూడు దళాలతో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో యోగేశ్‌తోపాటు అజిత ఎన్‌కౌంటర్ కావడం వారి ఉద్యమానికి గండి పడినట్టే. ‘ట్రై జంక్షన్’ ఎన్‌కౌంటర్ తర్వాత కేరళ విద్యుత్ మంత్రి ఎం.ఎం.మణి మీడియాతో మాట్లాడుతూ, ‘అమాయక ప్రజలను చంపుతున్న మావోలు కమ్యూనిస్టులెలా అవుతారు? సామాన్యుల నుంచి డబ్బు వసూలుచేసే వారెలా పోరాటయోధులవుతారు?’- అని ప్రశ్నించారు. ఇది అందరూ ఆలోచించవలసిన అంశం. మణి కమ్యూనిస్టు పార్టీ నేత, పేదల పక్షపాతి, చాలాకాలంగా ప్రజాజీవితంలో ఉన్నవాడు. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు కేరళలో ప్రతిధ్వనిస్తోంది. ‘మావోయిస్టు పార్టీ కూడా రాజ్యాధికారం కావాలంటున్నది. మిగతా పార్టీలకు, మావోయిస్టు పార్టీకి వ్యత్యాసం కనిపించడం లేదు’ అని నీలాంబర్ అటవీ ప్రాంతంలో గిరిజన యువకులు ఇపుడు ప్రశ్నిస్తున్నారు. మంత్రి మణి లేవనెత్తిన, గిరిజన యువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా, హేతుబద్ధంగా, మానవీయ కోణంలో మావోలు చెప్పగలిగితే- చాలా అనుమానాలకు నివృత్తి లభిస్తుంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పోలీసులు, మావోల మధ్య నలిగిపోతున్న ప్రజల్లాగే సైలంట్ వ్యాలీలోని గిరిజనులు కూడా అనునిత్యం సతమతమవుతున్నారు. వీరిలో శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన తమిళులు సైతం ఉన్నారు. శ్రీలంకలో బతకలేక పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వస్తే ఇక్కడా వారికి ‘పోరు’ తప్పడం లేదు. మావోయిస్టులు ఈ శరణార్థులపైనే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేస్తున్నారని వినికిడి. తమిళ పాటలతో, ఆటలతో, మాటలతో వారిని ఆకర్షిస్తున్నారు. ఉత్తర తెలంగాణ, చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో అవలంబించిన ఎత్తుగడలను మావోయిస్టులు ఇక్కడా అనుసరిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దశాబ్దం క్రితం మావోయిస్టులు చర్చలు జరిపిన తర్వాత వారు నల్లమల, శేషాచలం, ములుగు తదితర అడవుల నుంచి తమ కేడర్‌ను దండకారణ్యానికి తరలించారు. బస్తర్‌తోపాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర (ఇది కూడా ట్రైజంక్షన్ లాంటిదే)లో మావోలు తమ కార్యక్రమాల్ని పెంచారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ)ని పటిష్ట పరిచే చర్యలు చేపట్టారు. గెరిల్లా దళాల ఆధ్వర్యంలో జనతన సర్కారును విస్తరించడానికి తీసుకోవలసిన చర్యలన్నీ అమలు చేశారు. దట్టమైన బస్తర్ అబూజ్ మాడో ప్రాంతంలో వారు కొంత సఫలీకృతమయ్యారు. ఆదివాసీలను కవచంగా చేసుకుని అనేక దాడులకు తెగబడ్డారు. తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ‘విముక్తి ప్రాంతం’ పేర పటిష్ట పరిచే పనిలోపడ్డారు. ఈ దశలోనే ప్రభుత్వం వేలాది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను సమస్యాత్మక ప్రాంతాల్లో దింపింది. తాజాగా మహిళా కమాండోలను సైతం రంగంలోకి దింపింది. గిరిజన మహిళల పట్ల జవాన్ల అరాచకాలు చేస్తున్నారన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు మహిళా కమాండోలు జార్ఖండ్ , చత్తీస్‌గఢ్ అడవుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
‘గ్రీన్‌హంట్’ పేరిట దాడులను ఆపాలని మావోయిస్టు సానుభూతి పరులు ఆందోళనలు చేపట్టి ఎంతో కొంత మద్దతును ప్రజల నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ యత్నాలు ఇంకా జరుగుతుండగా మరోవైపు ‘రాజ్యం’ తన పని తాను చేసుకుంటూ పోతోంది. తూర్పు కనుమలను ‘రెడ్ కారిడార్’గా మార్చుకుందామనుకున్న మావోలకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. దాంతో వారు పశ్చిమ కనుమల్లో తమ స్థావరాలను ఏర్పరచుకునే పనుల్లో పడ్డారు. దశాబ్దంన్నర క్రితం నల్లమల అడవుల నుంచి దండకారణ్యం వైపు ‘మార్చ్’ చేసినట్టుగా ఇప్పుడు చత్తీస్‌గఢ్ నుంచి సైలెంట్ వ్యాలీకి తరలాలన్న యోచన చేస్తున్నారు. ఇలా పదిచోట్లకు స్థావరాలను మార్చడం 21వ శతాబ్దం వాతావరణానికి సరిపడని వ్యవహారం. సాంకేతికంగా అభివృద్ధి చెందని రోజుల్లో కీకారణ్యాల్లో డేరాలేసుకుని కార్యక్రమాలు కొనసాగిస్తే చెల్లుబాటయింది. ఇపుడు ఉపగ్రహాలు, ఇంటర్నెట్ పనిచేస్తుండగా ఏ మూలన జరుగుతుందో పసిగట్టే పరికరాలు, విజ్ఞానం ఇబ్బడిముబ్బడిగా అందుబాటులో ఉండగా ఇలా తూర్పు కనుమల నుంచి పశ్చిమ కనుమలకు, తర్వాత మరో దిశగా నడక... గొప్ప కార్యాచరణ కాదు. తూర్పు నుంచి పడమరకు ప్రయాణమంటే అది అస్తమయానికే సంకేతం.
నాల్గవ తరం పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న ప్రస్తుత సందర్భంలో తొలి పారిశ్రామిక విప్లవం నాటి భావజాలంతో ప్రజలను కదలిస్తామనుకోవడం కాలం చెల్లిన వ్యవహారమే. ఉత్పత్తి రంగంలోకి రోబోలు వచ్చాయి. మానవ జీవన విధానం డిజిటల్ రూపంలోకి మారుతోంది. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) ఆధారంగా స్మార్ట్ నగరాలు దేశంలో వందకు పైగా ఆవిర్భవించనున్నాయి. వాటిని అనుసరిస్తూ మరిన్ని పట్టణాలు, పెద్ద గ్రామాలు ఎదిగేందుకు ప్రయత్నిస్తాయి. ఈ సాంకేతిక విప్లవ తరుణంలో- మావోల సాయుధ పోరాటం, గెరిల్లా దళాలు, తూర్పు నుంచి పడమటి కనుమల వైపు ప్రయాణం ప్రాసంగికమైన పరిణామంగా కనిపిస్తోందా?.. అని ప్రజలంతా ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

- వుప్పల నరసింహం