సబ్ ఫీచర్

సంఘీభావం.. అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఇప్పుడు ఓ విశ్వనగరంగా మారిపోయింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించాం. అయితే ఆ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు, కొన్ని వర్గాలకు పరిమితమైంది. ఆకలిదప్పులు, పేదరికం, అనారోగ్యం ఎక్కువమందిని వేధిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యం, కడుపునిండా తిండి చాలా తక్కువమందికే పరిమితమైంది. పారిశ్రామిక ప్రగతి పేర చేపట్టిన చర్యలు భూతాపాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా భౌగోళిక, వాతావరణ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అందువల్ల దుష్పరిణామాలు సంభవించి అతివృష్టి, అనావృష్టికి కారణమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కల్లోలానికి కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికే ఏటా డిసెంబర్ 20వ తేదీని ‘ప్రపంచ సంఘీభావ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. భద్రత, గౌరవప్రదమైన జీవన విధానం, శాంతిసామరస్యాలు, అక్షరాస్యత, సంపూర్ణ ఆరోగ్యం, అభివృద్ధితో తులతూగే చక్కటి ప్రపంచాన్ని రూపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2005 నుంచి ఈ యజ్ఞం ప్రారంభమైంది. 2030 నాటికి అద్భుతమైన ప్రపంచంగా ఈ భూగోళాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పం కార్యరూపం దాల్చేందుకు 17 ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’, 8 మిలీనియమ్ లక్ష్యాలను నిర్దేశించారు. పేదరికం, విద్య, వైద్యం, మంచినీరు, అందరికీ ఇళ్లు, ఆహారం, నాణ్యమైన విద్యుత్ ఇలాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఎయిడ్స్ నిరోధం వంటివి మరికొన్ని. కానీ విపత్తులు ఎదుర్కొంటున్న సమాజాన్ని ఆదుకోవడం, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి అండగా నిలవడం వంటివి ఈ మానవ సంఘీభావ దినోత్సవం లక్ష్యాలు. కంబోడియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మందుపాతర తొలగింపు, కెన్యా, నైజిరియా, సూడాన్, కాంగో వంటి ఆఫ్రికా దేశాల్లో ఆకలితో అలమటిస్తున్నవారికి పౌష్టికాహారం అదించేందుకు యుఎన్ సభ్యదేశాలు తోడ్పడుతున్నాయి. సంఘీభావం అన్నది కేవలం మాటలు, ప్రకటనలకు పరిమితం కావడం లేదు. భూకంపాలు, వరదలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలకు అతలాకుతలమైన ప్రాంతాలకు మిగతా ప్రపంచం బాసటగా నిలవడం కూడా ఇందులో భాగమే. ఆ మధ్య నేపాల్, ఇటీవల ఇటలీ, న్యూజిలాండ్ వంటి దేశాలు భూకంపాల తాకిడికి తల్లడిల్లినపుడు ప్రపంచం సంఘీభావం ప్రకటిస్తూ పెద్దఎత్తున సహాయం అందించాయి. ప్రపంచ సంఘీభావ దినోత్సవం ప్రధాన లక్ష్యం మాత్రం పేదరిక నిర్మూలనే. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడోవంతు పేదలు ఒక్క భారత్‌లోనే ఉన్నారు. రోజుకు 1.25 డాలరు మొత్తం ఆర్జించలేని వారి శాతం కనీసం 50 శాతంగా ఉంది. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారి శాతం ఇది. స్థూల జాతీయోత్పత్తి 9గా గొప్పలు చెప్పుకుంటున్న మనదేశంలో 70 శాతం మందికి సొంత ఇల్లు, మరుగుదొడ్డి సౌకర్యం లేవు. అభివృద్ధి సాధిస్తున్న దేశమైన భారత్‌లో పరిస్థితి ఇలా ఉంటే ఇక అభివృద్ధి చెందని దేశాల్లో పేదరికం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. సంఘీభావ దినోత్సవం సందర్భంగా పేదరికం, ఈ శతాబ్ది లక్ష్యాలపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇరుగుపొరుగు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుకు కృషి చేయాలి. శాంతి పరిఢవిల్లినపుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని చాటుతోంది సంఘీభావ దినోత్సవం.

- కృష్ణతేజ