సబ్ ఫీచర్

శాంటోస్ మాటలు మావోయిస్టులకూ శిరోధార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియాలో తమ శాంతి ఒడంబడిక ప్రపంచంలోని ఇతర సాయుధ పోరాటాలకు చక్కటి పరిష్కారం అని డిసెంబర్ 10న ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యూల్ శాంటోస్ నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలో అందుకున్న అనంతరం అన్నారు. మావోయిస్టులకూ ఇది వర్తిస్తుంది.
వర్తమాన సమాజ పరిస్థితుల నేపథ్యంలో కొలంబియాలో కుదిరిన శాంతి ఒప్పందం నిజంగానే గొప్ప స్ఫూర్తిదాయకం. అర్ధశతాబ్దానికి పైగా లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో అంతర్యుద్ధంతో ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. లక్షలాది మంది తూటాలకు బలయ్యారు. మరెన్నో లక్షల మంది వలసవెళ్లారు. తుపాకులు, మాదక ద్రవ్యాలదే రాజ్యమైనప్పుడు అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? సంవత్సరమా? రెండు సంవత్సరాలా? ఏకంగా యాభై రెండు సంవత్సరాలు ఈ రావణకాష్టం కాలుతూనే ఉంది. మార్క్సిజాన్ని విశ్వసించిన వామపక్ష తీవ్రవాదులు గెరిల్లాయుద్ధం చేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని సుదీర్ఘకాలంగా అరణ్యాలలో, అడవుల్లో మకాంవేసి పోరాటం చేశారు. ఈ ఘర్షణలో లక్షల మంది మరణించారు. ఆస్తి బుగ్గిపాలయింది. కొత్త ఆలోచనలు చేసే యువత నిర్వీర్యమైంది. మాదకద్రవ్యాల వ్యాపారులు అందించే ధనం, తుపాకులు, మత్తుమందుతో అదే ప్రపంచంగా భావించిన గెరిల్లాలు.. వారి నాయకులు గిరిగీసిన చట్రంనుంచి వెలుపలికి రాక, రాలేక అక్కడే ఉండిపోయి తమ దేశ పౌరులకు, ప్రపంచ ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తున్నామని భ్రమించి ఆయుధాలకు పనిచెప్పడంతో ఆఖరికి మిగిలింది హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా మాత్రమే, వెనుకబాటుదనమే, దారిద్య్రమే!
రష్యాలో కమ్యూనిజానికి కాలంచెల్లి పాతికేళ్లు. తూర్పు యూరప్‌లోనూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో విప్లవకారులుగా భావిస్తున్న, సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నవారు ఆత్మవిమర్శ, ఆత్మపరిశీలన చేసుకుని తదనుగుణమైన మార్గం అవలంబించాల్సింది. కాని కొలంబియాలోని గెరిల్లా పోరాటవాదులు గుడ్డిగా ఆయుధాలను నమ్ముకుని తమ దేశ పౌరులను, రక్షణ బలగాలను అంతమొందించే పనిలో మొన్నమొన్నటివరకు మునిగిపోయారు. దాంతో శవాల దిబ్బలు కుప్పతెప్పలుగా పెరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత గుణపాఠం నేర్చుకున్న నార్వే ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు, అంతర్యుద్ధ పోరాటాలు జరుగుతున్నా అక్కడివారితో చర్చలు జరిపి వాస్తవ ప్రపంచంలోకి ఇరుపక్షాలను తీసుకొచ్చి శాంతి చర్చలు జరిపేలా ప్రయత్నిస్తూ ఉంది. కొలంబియాలోనూ ఆ శాంతికాముకులు అటు ప్రభుత్వంతో ఇటు విప్లవ సాయుధ దళాల ‘్ఫర్క్’ నాయకులతోనూ చర్చలు జరిపారు. సుదీర్ఘకాలం ఇరుపక్షాలతో మాట్లాడిన తరువాత అక్కడివారికి ‘జ్ఞానోదయం’ కలిగింది. అలాగే భారతదేశంనుంచి ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఈ శాంతి చర్చల్లో కీలక భూమిక నిర్వహించి శాంతి ఒడంబడిక కుదిరేలా చూశారు. అక్టోబర్‌లో కుదిరిన ఒడంబడికను అక్కడి ప్రజలు రెఫరెండంపై ఆగ్రహంతో తిరస్కరించారు. తరువాత ఆ ఒడంబడికకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో కీలక పాత్రను పోషించిన ఆ దేశ అధ్యక్షుడు శాంటోస్‌కు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించి ఈనెల 10న ప్రదానం చేశారు. ఈ సమయంలో అంతకుముందు శాంటోస్ మాటలు ప్రపంచంలోని సాయుధ పోరాట వాదులకు కనువిప్పులా ఉన్నాయి. ఆచరణలోకి వచ్చిన తమ ఒడంబడిక ఇతరులకు స్ఫూర్తిదాయకమని ప్రకటించి ఎందరికో ఉత్తేజాన్ని కలిగించారు.
ప్రపంచమంతటా ఇప్పుడు కృత్రిమ మేధ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్పత్తిరంగాల్లోనూ ఇది గణనీయంగా కనిపిస్తోంది. చైనాలోనైతే ఇది మరింత ఎక్కువుంది. అక్కడ అన్ని సేవారంగాల్లోకి రోబోలు వచ్చాయి. వార్తలు రాసే, చదివే రోబోలు సైతం అక్కడ పనిచేస్తున్నాయి. చివరకు బౌద్ధమత సూక్తులు బోధించే రోబోలు ఆరామాల్లో దర్శనమిస్తున్నాయి. సూపర్ కంప్యూటర్ల ఆధారంగా నెలల తరబడి జరిగే పనులు క్షణాల్లో జరుగుతున్నాయి. చైనా అంతరిక్షంలోనూ తనదైన ప్రత్యేక ముద్రను కనబరుస్తోంది. స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంది. చివరకు సైనిక రంగంలోనూ కృత్రిమ మేధ విశేషంగా కనిపిస్తోంది. రోబో సైనికులు రాబోతున్నారని అంటున్నారు. టెక్నాలజీ ఇంతగా వికసించి సమాజం నూతన దిశలో పయనిస్తున్న సందర్భంలో అరణ్యాలలో ఆయుధాలు ధరించి ప్రజల మేలుకోసం, వారి సంక్షేమంకోసం పోరాడుతున్నామని వాపోవడంలో ఏమాత్రం అర్ధం లేదు.
భారతదేశంలోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పురివిప్పిన వైనాన్ని మనం తిలకిస్తున్నాం. రోబోల సేవలు బ్యాంకులు ఇతరచోట్ల కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం టెక్నాలజీ ఆధారంగా నగదు రహిత లావాదేవీలకు ఊపువచ్చింది. గ్రామాల్లోనూ సెల్‌ఫోన్ ద్వారా చెల్లింపులు జరుపుకునే సౌలభ్యం కనిపిస్తోంది. ఇంటర్నెట్‌ను ఇంటింటికి అందిస్తామని పాలకులు అంటున్నారు.రిలయన్స్ జియో అయితే టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సెల్‌ఫోన్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చింది.
ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలను మరింత ముందుకు తీసుకుపోయే పనిలో ఆయా సంస్థలు పోటీపడుతున్నాయి. అంతిమంగా ఇది సామాన్యుడి సాధికారతకు సాయపడుతోంది. అందరూ కోరుకునేది కోరుకోవలసింది ఇదే. కాని కొందరు సాయుధ పోరాటం.. అదీ సుదీర్ఘకాలం సాయుధ పోరాటం ద్వారానే సమాజాన్ని సమూలంగా మార్చి ప్రజల సాధికారతను మరింత సాంద్రతపరుస్తామని చెబుతూ అడవుల్లో, అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి ఆలోచనలు చేస్తున్నవారు కొలంబియా అధ్యక్షుడు శాంటోస్ మాటలు మననం చేసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
కృత్రిమ మేధ కొనసాగిస్తున్న జైత్రయాత్ర, పురోగమనం, అది తీసుకొచ్చిన సామాజిక, ఆర్థిక విప్లవాల గూర్చిన అవగాహనఉన్నా అలాంటి సాయుధ పోరాటవాదుల కళ్లు తెరుచుకుంటాయి. ఉత్పత్తి విధానంలో సంపూర్ణంగా మార్పులొచ్చాయి. యంత్ర, కృత్రిమ మేధ ఆధార రోబోలతో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ‘అదనపు విలువ’ అనే కాలంచెల్లిన సూత్రీకరణ ఏ రకంగానూ ప్రాసంగికతను సంచరించుకోవడం లేదు. శ్రమ సిద్ధాంతం సమూలంగా మారిన వైనాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత శాంతి ప్రపంచంలో నెలకొంటుంది. మార్క్స్ కాలంనాటి వైరుధ్యాలు, సూత్రీకరణలకు కాలం చెల్లిందనే అవగాహన ఎంత త్వరగా కలిగితే అంత త్వరగా పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి.
కాలం చెల్లిన కొటేషన్లు కూడుపెట్టవు. నైపుణ్యాలు ఇప్పుడు అందరికి అవసరమన్న వాతావరణం మనచుట్టూ పరచుకుంది. ఆ నైపుణ్యాలను ఒడిసిపట్టుకునే పనిలో ఉన్నప్పుడే ప్రయోజనముంటుంది. సమకాలీన సమాజంలో నైపుణ్యాల తెలివిడి గలవారే రాణిస్తారు. ఇది పెట్టుబడిదారి పద్ధతి, సామ్రాజ్యవాద విధానం, దోపిడీదారుల కుట్ర.. అంటూ కాలం వెళ్లబుచ్చితే ప్రపంచం వారికి అందనంత ముందుకు దూసుకెళుతుంది. క్లేడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఎకానమీతో అప్పుడు పోటీపడటం కుదరదు. కాబట్టి కొలంబియా అధ్యక్షుడు శాంటోస్ మాట భారత మావోయిస్టులకూ శిరోధార్యం కావాలి. ఆదివాసీలు, హరిజనులు, గిరిజనులు ఆధునిక ప్రపంచ వెలుగుల్ని ఆస్వాదించాలి.

- వుప్పల నరసింహం