సబ్ ఫీచర్

అతివేగమే అసలు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం ఎవరూ మరచిపోలేదు. దేశంలోని రింగ్‌రోడ్లు, జాతీయ రహదారులు, నగర రోడ్లలో ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అతివేగం, వాహనాల నడపడంలో నైపుణ్యం లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని నిపుణులు తేల్చిచెబుతున్నారు. తగిన శిక్షణ పొందకుండా వాహనాలు నడపడం, వాటిని నియంత్రించడంలో విఫలమవడం, హద్దులేని వేగమే రింగ్‌రోడ్లలో ప్రమాదాలకు అసలు కారణమని గడచిన కొనే్నళ్లుగా జరుగుతున్న ప్రమాదాలను పరిశీలించిన తరువాత రూఢీ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలలో 57 శాతం అతివేగం వల్లే జరిగాయని తేలింది. మరో 37 శాతం ప్రమాదాలు వాహనాలు నడుపుతూ వాటిని అదుపు చేయలేకపోవడంవల్ల జరుగుతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలకు ఈ రెండు ముఖ్య కారణాలుగా గుర్తించారు. ముందువెడుతున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే అతివేగంగా వస్తూ ఎదుట ఉన్న వాహనాలను గమనించలేక ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నమాట. పట్టణాలు, పల్లెలు, సాధారణ రోడ్లలో వాహనాలు నడపడం వేరు. రింగ్‌రోడ్లు, హైవేలపై వాహనాలు నడపడం పూర్తిగా భిన్నం. వెడల్పైన రహదార్లు, నిర్దేశిత వేగం, లైనింగ్ వ్యవస్థ, భద్రత సంకేతాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలలో వాహనాలు నడిపేటప్పుడు ఎదుటి వాహనానికి నిర్ణీత దూరంలో ప్రయాణించేలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇరుకు రోడ్లలో వాహనాలు నడిపినవారు ఒక్కసారి విశాలమైన హైవేలు, రింగ్‌రోడ్లలోకి వచ్చేసరికి రెక్కలు విప్పిన పక్షుల్లా దూసుకుపోవాలని భావిస్తారు. అయితే జాగ్రత్తలు, నియమనిబంధనలు తెలీక ప్రమాదాలకు గురవుతూంటారు. నిజానికి ప్రపంచంలో రింగ్‌రోడ్లు, హైవేలను నిశితంగా పరిశీలించిన సురక్షితంగా వాహనాలు నడపడం, సాంకేతిక ప్రజ్ఞలో శిక్షణ ఇచ్చే నిపుణుడు డాక్టర్ డి.ఎన్.రావు ఎన్నో వాస్తవాలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమమైన పారిస్ రింగ్‌రోడ్డుతో సహా ఎన్నో హైవేలను తాను పరిశీలించానని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నాణ్యత, భద్రతా ప్రమాణాలతో వాటికి దీటుగా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ రహదారిపై ప్రమాదానికి అసలు కారణం అతివేగమేనన్నది ఆయన మాట. రోడ్ ఇంజనీరింగ్‌లో ఎటువంటి లోపాలు లేవని, అలాంటి రోడ్లపై వాహనాలు నడపడంలో తగిన మెలకువులు, శిక్షణ లేకపోవడంవల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన అంటున్నారు. రింగ్‌రోడ్లలో కన్నా స్ట్రెయిట్ స్ట్రెచ్ రహదార్లలో 88 శాతం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. రాత్రిపూటకన్నా పగలు, ఆడవారు నడిపేటప్పుడు కన్నా మగవారు నడిపేటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నది మరో వాస్తవం.
హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదాల్లో గచ్చిబౌలి-శంషాబాద్ స్ట్రెయిట్‌స్ట్రెచ్‌లో 65శాతం నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 31 శాతం వెనుకనుంచి వచ్చిన వాహనాలు ఢీకొన్న సంఘటనలే. హైదరాబాద్ ఒఆర్‌ఆర్‌లో 2011లో 94 రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మరణిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి 735 ప్రమాదాల్లో 70మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నింటికి అతివేగమే అసలు కారణమని తేలింది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో ప్రమాదాల నివారణకు, సురక్షితంగా వాహనాలు నడపడానికి ఉపయోగపడే అత్యాధునిక హెచ్‌టిఎమ్‌ఎస్ (హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండిఎ చీఫ్ జనరల్ మేనేజర్ (ఒఆర్‌ఆర్) ఆనంద్‌మోహన్ చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చేసినా డ్రైవింగ్, రోడ్‌సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ విషయంలో అవగాహన లేకపోతే ప్రయోజనం తక్కువే.

-కృష్ణతేజ