సబ్ ఫీచర్

రాజకీయాలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా? అన్న చర్చ మన దేశంలో చాలాకాలంగా జరుగుతోంది. ‘అవసరమే’ అని కొంతమంది మేధావులు వాదిస్తుంటారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల, నేతల ప్రవేశం వల్ల ఇటీవలి కాలంలో ఎన్ని అనర్థాలు జరిగాయో అందరికీ తెలిసిందే. పేరుమోసిన ఓ ఉగ్రవాదికి మద్దతుగా సభలు, మతపరమైన ఉద్రిక్తతల వల్ల వర్సిటీల్లో అవాంఛనీయ పరిణామాలు.. వీటన్నింటికీ రాజకీయ నేతల జోక్యం కారణం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య, ఉస్మానియా వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ వంటి ఉదంతాలతో విద్యాసంస్థల్లో రాజకీయ నేతల ప్రమేయం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అధికార, విపక్ష పార్టీల వారు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం, విద్యార్థులు వర్గాలుగా చీలిపోవడంతో ప్రశాంత వాతావరణం కలుషితమవుతోంది. విద్యార్థులను పావులుగా వాడుకుంటున్న నాయకులు బాగానే ఉంటున్నా, చదువుకోవలసిన యువత విలువైన కాలాన్ని నష్టపోతోంది.
విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిపేవారు. రాజకీయ పార్టీలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు జోక్యం చేసుకోవడంతో కాలేజీల్లో, వర్సిటీల్లో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. దీంతో చాలా విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపడం లేదు. అయితే, వర్సిటీల స్థాయిలో మాత్రం ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మరపిస్తున్నాయి. ఒకప్పుడు విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసేవి. 1980 తర్వాతి కాలంలో పరిస్థితి మారింది. రాజకీయ పార్టీల ప్రమేయం మితిమీరడంతో విద్యార్థులు వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగే పరిస్థితి ఏర్పడింది. కుల, మతాల ప్రభావం పెచ్చుమీరింది. ఇందుకు అధ్యాపకులు, ఉద్యోగులు కూడా ఆజ్యం పోస్తున్నారు. రాజకీయ నేతలతో రాసుకు పూసుకుని తిరిగే విద్యార్థి సంఘాల నేతలు తాము హీరోలం అన్నట్టు భావిస్తున్నారు. వర్గ, కుల పోరాటాలకు వర్సిటీలు వేదికలుగా మారుతున్నాయి.
అలనాడు స్వాతంత్య్ర పోరాట సమయంలో యువతీ యువకులు చదువులు, ఉద్యోగాలు వదిలేసి దేశం కోసం త్యాగం చేశారు. ఇపుడు మాత్రం చాలామంది విద్యార్థులు రాజకీయ నేతలకు అనుచరులుగా మారుతూ కాలేజీల్లో గొడవలకు కారకులవుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు రాజకీయాలతో మమేకం అయితే విద్యార్జనలో వెనుకబడి పోవడమే కాదు, మంచి భవిష్యత్‌ను కోల్పోతారు. రాజకీయ నేతలు అధికారంలో ఉన్నా, లేకున్నా విద్యార్థులను తమ స్వార్థానికే వాడుకుంటారు. ఉద్యమాలు ముగిశాక ఆ విద్యార్థులను పట్టించుకునే నాథుడే ఉండడు. విద్యార్థులకు రాజకీయ వ్యవస్థపై, పాలనపై అవగాహన అవసరమే. వారు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఏ లక్ష్యంతో కాలేజీల్లో, వర్సిటీల్లో చేరారో దాన్ని సాధించాలే తప్ప, రాజకీయాల్లో పాల్గొనడం కాలాన్ని వృథా చేసుకోవడమే అవుతుంది. కాలేజీల్లో రాజకీయ పార్టీల, నేతల ప్రవేశాన్ని నిషేధించినపుడు ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. చదువు పూర్తయ్యాక తమ ఆసక్తి, అభిరుచుల మేరకు రాజకీయాల్లో చేరవచ్చు, దేశసేవ చేయవచ్చు.

- బచ్చు రాంబాబు సెల్: 89773 12510