సబ్ ఫీచర్

ఓటుకు నోటు.. ప్రజాస్వామ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మళ్లీ ఓట్ల జాతర మొదలైంది. ఉత్తరప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలొచ్చాయంటే చాలు.. ఆ ప్రాంతంలో ఓటర్లకు పండుగే. ఓటుకు, నోటుకు అవినాభావ సంబంధం ఉంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం వెదజల్లితే కానీ ఓటర్లు శాంతించని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆనవాయితీ ప్రజల నుండి పుట్టుకువచ్చింది కాదు, రాజకీయ నాయకులు ఇందుకు కారణం. దేశంలో నేరాలు, అవినీతితోపాటు రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పార్టీలు పెరిగేకొద్దీ ఎన్నికల్లో వాటి ఓట్ల శాతాలు తీవ్రంగా పడిపోతున్నాయి. ప్రధాన పార్టీలు కూడా పలు రకాలుగా ఓటర్లను ప్రలోభపెడుతున్న దారుణ దుస్థితి దాపురించింది. ప్రజలు కూడా నోట్లు అందించే పార్టీలకే ఓట్లువేసి పట్టం కట్టే దుర్వ్యవస్థ నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్దనోట్లను రద్దుచేయాలన్న నిర్ణయంతో ‘ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందు’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాహసించారు. నల్లడబ్బును వెలికితీయడం, ఉత్తరప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించడం మోదీ ద్విముఖ వ్యూహం. అయితే, ఎత్తులకు పైఎత్తులు వేసే రాజకీయ నిపుణులు ‘నోట్లరద్దు’ను కూడా చిత్తుచేసే ప్రతిభావంతులు కావడంతో మోదీ ఆశయం నెరవేరుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలన్నీ కలిపి రూ.35,000 కోట్లు ఖర్చుచేసినట్లు ఓ నివేదిక వెల్లడి చేస్తోంది. అనేక రాజకీయ పక్షాలు ఎన్నికల్లో టికెట్లు బహిరంగంగా అమ్ముకొంటున్న సంగతి ఏమాత్రం త్రోసిపుచ్చలేని నిజం. అధికారిక లెక్కల ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అయిన ఖర్చు కేవలం ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు అంటే- మిగిలిన రూ.27వేల కోట్లు లెక్కాపత్రం లేని సొమ్ము అన్నమాట. దేశంలోని 4,120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మొత్తంగా 12,000 కోట్ల నల్లధనం ఖర్చుపెట్టినట్లు ఓ అంచనా! ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకున్న రాజకీయ నాయకులు పెద్దఎత్తున ఉన్నారు. భారీ కుంభకోణాలకు పాల్పడి, అక్రమాస్తులు కూడబెట్టుకున్న వీరిలో ఏ కొందరిపైనో తప్ప విచారణ జరగడం లేదు. 2014లో లోక్‌సభకు తిరిగి ఎన్నికైన 165 మంది ఎంపీలు తమ ఆస్తిపాస్తులు 137 శాతం పెరిగినట్లు లెక్కలు చూపారు.
రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గం. ఆదాయపుపన్ను చట్టంలోని 13ఏ నిబంధన ప్రకారం అన్నిరకాల ఆదాయంపైనా రాజకీయ పార్టీలకు వంద శాతం పన్ను మినహాయింపు ఉంది. రూ.20 వేల లోపు ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వానికి వివరించాల్సి ఉంది. దీంతో బ్యాంకుల్లో తమకు జమపడిన నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకొనే అవకాశం వారికి దక్కింది. ఎన్నికల్లో పార్టీల వ్యయంపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఈ వెసులుబాట్లను తొలగించినపుడు రాజకీయ పార్టీలు చేసే ఖర్చుకు పారదర్శకత ఉంటుంది. నిజాయితీ గల అభ్యర్థిని పక్కనపెట్టి, మద్యం, నగదు ఎవరు ఎక్కువ ఇచ్చారనే కొలమానంతో ఓటర్లు ఆ అభ్యర్థికే ఓట్లువేసి మంచి మెజారిటీతో గెలిపించడం రివాజుగా మారింది. ధన ప్రభావం కారణంగా సేవాభావం ఉన్నవారు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది.
జనసంఘ్ వంటి మితవాద పార్టీలకు లెక్కకు మిక్కిలిగా చేకూరుతున్న నిధులపై నియంత్రణ విధించేందుకు 1963లో ఇందిరాగాంధీ కార్పొరేట్ విరాళాలపై నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని 1985లో ఎత్తివేసిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 7.5 శాతం పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చనే మినహాయింపు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పాలకపార్టీలు తమకు అనుకూలురైన స్థిరాస్తి వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చే కార్యక్రమానికి తెరతీశాయి. స్థిరాస్తి, పారిశ్రామికవేత్తల తరువాత మద్యం వ్యాపారులు ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పార్టీల ప్రచార ఖర్చును భరించడం ద్వారా మద్యం మాఫియా కీలక ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు అవసరమైన లైసెన్సులు దక్కించుకొంటోంది. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) పరిధిలోకి తీసుకువస్తూ జూన్ 3, 2014లో కేంద్ర సమాచార కమిషన్ వెలువరించిన ఆదేశాలను దేశంలోని పార్టీలన్నీ దాదాపుగా ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అంతర్గత ప్రజాస్వామ్యం పాదుకొనేలా పార్టీలను ఒప్పించి, వాటిని ఆర్‌టిఐ పరిధిలోకి చేర్చడం ఇప్పుడు మోదీ ముందున్న అతిపెద్ద సవాలు. ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చే విధానాన్ని మోదీ మొదటి నుంచి ప్రస్తావిస్తునే ఉన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఓటుకు నోటు పద్ధతిని నిర్మూలించడం, నల్లకుబేరుల సంపదను బహిర్గతం చేయడం, విదేశీ బ్యాంకుల్లో నల్లడబ్బును కూడబెట్టినవారి వివరాలను వెల్లడించడం వంటివి ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యలు.
ఇక, భారత్‌లోని వినిమయదారుల సంఖ్య, రోజువారీగా బ్యాంకుల నుంచి ఖాతాదారులు పొందే మొత్తం తదితర వివరాలు రిజర్వు బ్యాంకుకు ఎప్పటికప్పుడే గణాంకాలు అందుతున్నా దేశవ్యాప్తంగ నగదుకు కొరత ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు చేరుతున్న పాత నోట్లకు ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లను ముద్రించి చెలామణిలోకి తేకపోవడం రిజర్వు బ్యాంకు చేసిన మరో తప్పిదం.
ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధులు అందుతున్నా పసిగట్టలేని నిఘా సంస్థల నిర్లిప్తత వల్ల దొంగనోట్ల చెలామణి అధికమైంది. నోట్లరద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా అంచనా వేయకపోవడం లోపమే. ఈ పరిస్థితులను చక్కదిద్దుతూనే, యుపి తదితర రాష్ట్రాల ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి