సబ్ ఫీచర్

తెలుగువాడి గుండెలో చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే, సామ్యవాదాన్ని సమాధి చేసే అరాచక నేతలు రాజ్యమేలినపుడు, దురాగతాలు ప్రజ్వరిల్లినపుడు, నరజాతి అనునిత్యం పరపీడిత బాధితులై రోదించినపుడు ఆయా కాలాలలో గొప్ప వ్యక్తులు అవతరిస్తారు. ప్రజల కన్నీళ్లు తుడిచి, వారి కష్టాలను రూపుమాపి జన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ కోవకు చెందిన విలక్షణ నేత- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. దేశంలో తెల్లదొరల పాలన అంతరించిన అనంతరం అధికార పగ్గాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భారతావనిని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా, నిరంకుశంగా సుదీర్ఘ కాలం పాటు పరిపాలించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తప్ప మరోపార్టీకి అధికారం ఆశించే అవకాశం లేని పరిస్థితులు ఉండేవి. ఆ అహంభావంతో, అధికార దర్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాశ్రేయస్సును విస్మరించింది. తమను రక్షించే వారెవరని వెయ్యికళ్లతో ప్రజలు వేచి చూస్తున్న తరుణంలో- తెలుగునాట రాజకీయ యవనికపై ఉదయించిన కాంతి కిరణం- ఎన్టీఆర్. అవమానాల పాలవుతున్న తెలుగువారిని ఆదుకోవాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలింపజేయాలని 1982లో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. దశాబ్దాల పాటు సినీ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా వెలిగిన ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో సైతం సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆయన అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
1983 జనవరిలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని, పరిపాలనా వ్యవస్థలో ఎవరూ ఊహించని రీతిలో ఎనె్నన్నో సంస్కరణలు చేపట్టారు. ‘సమాజమే దేవాలయం, ప్ర జలే దేవుళ్లు’ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ వినూత్న సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అప్పటివరకూ కష్టాల కడలిలో, గాఢాంధకారంలో దిక్కుతోచని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుజాతి వదనంలో ఆ నందం వెల్లివిరిసింది. తెలుగువాడి ఖ్యాతి ఖండాంతరాలకు ఎగసింది.
అధికార పీఠాన్ని అధిష్ఠించిన వెంటనే- ప్రజలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు, పేదల కనీస అవసరాలు తీర్చేందుకు, ‘కూడు- గూడు- గుడ్డ’ కల్పించేందుకు ఎన్టీఆర్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగువారి అభ్యున్నతి కోసం పదవిలో ఉన్నంతవరకూ పోరాడిన శ్రమజీవి ఎన్టీఆర్. ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు, రైతుల వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, బడుగువర్గాల పిల్లలకు ఆశ్రమ పాఠశాలలు, పారదర్శక పాలన వంటి విధానాలతో ప్రగతిరథాన్ని పరుగులు తీయించారు, ప్రజలకు చేరవయ్యారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు పరితపించిన మానవతావాది ఆయన. గ్రామ పరిపాలనలో పటేల్, పట్వారీ (కరణం, మునసబు) వ్యవస్థను రద్దు చేసిన సాహసిగా చరిత్రపుటల్లో నిలిచిపోయా రు. పల్లె నుంచి జిల్లా స్థాయి వరకూ స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు, అధికార వికేంద్రీకరణను ఆచరణలో చూపేందుకు మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పేదలకు, అణగారిన వర్గాలకు, మహిళలకు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, నగర పాలక సంస్థ మేయర్‌లను ప్రజలు నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు నిరీక్షించరాదని, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలని అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన పరిపాలనాదక్షుడు ఎన్టీఆర్. పాత వ్యవస్థలకు మంగళం పాడినా, కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టినా సాహసమే ఆయన ఊపిరి. అన్నదాతల సంక్షేమానికి ‘కర్షక పరిషత్’ను ఏర్పాటు చేసిన రైతు బాంధవుడు ఆయన.
తెలుగుభాషకు, సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేలా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తెలుగుభాషా వికాసానికి అవిరళ కృషి చేశారు. మహిళలకు ప్రత్యేకంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడమే కాదు, రాజకీయ పదవుల్లోనూ వారికి భాగస్వామ్యం కల్పించారు. సమాజంలో స్ర్తికి సమున్నత స్థానం కల్పించిన నవయుగ వైతాళికుడు. పేదలకు అండగా నిలిచి, అవినీతిపరులపై సమరం చేసిన రాజకీయ ‘కథానాయకుడు’ ఆయన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతిపక్షాలను జాగృతం చేసి, కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటుకు పునాది వేసిన రాజకీయ దురంధరుడు ఆయన. అందుకే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాయి. శతాబ్దాల నాటి జాతీయ పార్టీకైనా, కొత్తగా ఆవిర్భవించే ప్రాంతీయ పార్టీలకైనా ఎన్టీఆర్ ఎజెండానే మార్గదర్శకం. ఆయన ఆచరించిన సిద్ధాంతాలు, నిర్దేశించిన లక్ష్యాలు, కార్యాచరణ ఎందరికో స్ఫూర్తిదాయకం. అవినీతిపై సమరనాదం.. అక్రమాలపై ఉక్కుపాదం.. చెక్కు చెదరని మనోధైర్యం.. పేదవర్గాలపై అభిమానం.. అదే ఆయన నైజం. అందుకే- ఆయన ప్రజా శ్రేయోభిలాషి, జన హృదయవాసి.

- తాడికొండ సాయికృష్ణ 98663 65222