సబ్ ఫీచర్

పెంపుడు జంతువులతో చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్లలో జంతువులను పెంచుకునేవారికి కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఉందని అందరికీ తెలుసు. కానీ ఇటీవల నమోదైన కొన్ని కేసులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. పెంపుడు శునకాల కారణంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో కొందరు రోగులు రావడం వైద్యులను కూడా కంగారుపరిచింది. చిలుకలు, శునకాలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి సరదా. ఈ అలవాటువల్ల మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నమాట నిజమే. అయితే వీటి పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, వాటిని పెంచేవారు శుభ్రత పాటించకపోయినా ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ జంతువులకు దగ్గరగా గడపినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రకాల పరాన్న జీవులు మన శరీరంలోకి చేరి రోగాలకు కారణమవుతాయి. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. శునకాలను పెంచేవారు వాటికి స్నానం చేయించిన తరువాత చేతులు, శరీరం శుభ్రం చేసుకోకతప్పదు. అలా చేయకపోతే వాటిలో ఉండే పరాన్నజీవులు మన శరీరంలోకి చేరతాయి. ముఖ్యంగా వాటి పేగుల్లో ఉండే టేప్‌వార్మ్ మన శరీరంలోకి చేరతాయి. ఆయా జంతువులతో తిరిగి శుభ్రం చేసుకోకుండా వంటింట్లో పనుల్లోకి వెళితే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఆహారం ద్వారా మాత్రమే అవి మన శరీరంలోకి చేరతాయి. కుక్కలు పెంచుకునేవారు తరచూ వాటిపై ఉండే పరాన్నజీవులను తొలగించాలి. కుక్కలు, పిల్లుల వెంట్రుకల వల్ల కూడా రోగాలు వస్తాయి. ఆ జంతువులు పెంచినవారి దగ్గర తచ్చాడుతూ ముఖం నాకడం వంటి చర్యల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. హైదరాబాద్, కర్నూల్, వరంగల్‌లో ఇలా పెంపుడు జంతువుల వల్ల అనారోగ్యం పాలవుతున్నవారి కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదయ్యాయి. పెంపుడు జంతువులతో ఉన్నవారిలో గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో ఆస్ప్రత్రులలో చేరడం సంచలనమైంది. అరుదుగా ఇలాంటి కేసులు నమోదవుతాయని వైద్యులు అంటున్నారు. వరంగల్‌కు చెందిన ఓ సైనికోద్యోగి హైడేటిడ్ సిస్ట్ కారణంగా ఆస్ప్రత్రి పాలయ్యాడు. బద్దెపురుగుల వల్ల అతడి గుండె కింది కవాటాల్లో అతడికి రెండు సిస్ట్‌లు ఏర్పడ్డాయని వైద్యులు గుర్తించారు. ఆ కవాటాల్లో పరాన్నజీవులు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు 2-డి ఎకో పరీక్షల్లో తేలింది. అధిక రక్తపోటు, నిస్త్రాణతో ఆస్పత్రికి వచ్చిన ఆ రోగికి వైద్య పరీక్షలు నిర్వహించినపుడు అతడి గుండె కవాటాల్లో పరాన్నజీవులున్నట్లు గుర్తించారు. ఇలా పెంపుడు జంతువులు కారణంగా గుండెవ్యాధులు రావడం చాలా అరుదు. కానీ ఇటీవలికాలంలో ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో ఇలా ఇటీవలి కాలంలో నాలుగు కేసులను గుర్తించారు. గొర్రెల వల్ల కూడా ఈ ప్రమాదం ఎక్కువే. అలాగే శునకాలు, పిల్లుల, గొర్రెల మలవిసర్జన జరిగిన ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడం వల్ల కూడా వాటిలో ఉండే పరాన్నజీవులు మనను ఆశ్రయిస్తాయి. నిజానికి పెంపుడు జంతువుల వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 0.5 నుండి 2 శాతం మేరకే ఉన్నా అది జాగ్రత్త పడవలసిన అంశమేనని కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కె.వి.కృష్ణకుమార్ హెచ్చరిస్తున్నారు.

- కృష్ణతేజ