సబ్ ఫీచర్

మొక్కులు తీర్చడం తప్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు వివిధ రూపాల్లో శాంతియుత ఉద్యమాలు నిర్వహించినా ఫలితం దక్కకపోవడంతో చివరికి పోరాటాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మానవ ప్రయత్నాలకు తోడు భగవంతుడి కృపను పొందేందుకు ఉద్యమకారులు దేవుళ్లకు మొక్కుకున్నారు. ఉద్యమంలో కీలకనేతగా ఎదిగిన తెరాస వ్యవస్థాపకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దైవాన్ని నమ్మి వివిధ దేవుళ్లకు మొక్కుకున్నారు. ప్రజల ఆకాంక్షలు ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆయన మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో తప్పు పట్టాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా కాకుండా, తెలంగాణ ప్రజల తరఫున ఆయన మొక్కులు చెల్లిస్తున్నారు. అయితే, లౌకికవాద నేతలుగా ప్రచారం పొందుతున్న కొందరు కెసిఆర్‌పై విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వ నిధులను మొక్కుల పేరిట కెసిఆర్ భారీగా ఖర్చు చేస్తున్నారని కొందరు చేస్తున్న వాదనలో బలం లేదు. మతం పేరిట ప్రజలను విభజించి, వివాదాలను రగిలించేందుకే ఇలా విమర్శలు చేయడం సమంజసం కాదు.
హిందూ దేవాలయాలు మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయి. మసీదులు కానీ, చర్చిలు కానీ ప్రభుత్వ అధీనంలో కాకుండా ఆయా మతస్తుల అధీనంలోనే ఉంటాయన్నది ‘సెక్యులర్’ నేతలకు తెలియని విషయం కాదు. సౌదీ అరేబియాలోని ‘హజ్’ ప్రపంచంలోని ఇస్లాం మతస్తులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ‘హజ్’ వెళ్లాలని పరితపిస్తాడు. ఎలాంటి అప్పు చేయకుండా కష్టార్జితంతో ‘హజ్’కు వెళ్లాలన్నది ఇస్లాం నియమం అని చెబుతుంటారు. కానీ, హజ్‌కు వెళ్లే ముస్లింలకు ప్రభుత్వం ప్రయాణ ఖర్చులలో సబ్సిడీ ఇస్తోంది. ఈ డబ్బు ప్రజలందరిదీ కాదా? మొక్కులు తీర్చుకున్నందుకు సిఎం కెసిఆర్‌పై హైకోర్టులో కేసు వేసిన సామాజికవేత్తలు కంచె ఐలయ్య వంటి వారు- ‘హజ్’ యాత్రీకులకు ప్రజల డబ్బు ఇవ్వడంపై ఏమంటారో చెప్పాలి.
ఇస్లాం, క్రైస్తవ మతాల పండుగలకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. ఆ వర్గాల్లో పేదలకు కొత్తబట్టలను కానుకలుగా ఇస్తోంది. ఆ నిధులు ప్రభుత్వానికి ఎక్కడి నుండి వస్తుంటాయో చెప్పాల్సిన బాధ్యత సామాజికవేత్తలకు లేదా? జ్ఞాన నిలయాలైన విశ్వవిద్యాలయాలలో ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహించిన కంచె ఐలయ్య ఎంతటి ఉదారవాదో తెలుగు ప్రజలకు తెలియనిది కాదు. హిందూ దేవతలను నిందించడం ఐలయ్య లాంటి వారికి కొత్తకాదు. ‘బీసీ కులాల వారికి తెలివి లేదు, బ్రాహ్మణులపై దళిత క్రైస్తవులు పోరాడాలి, వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి, పుష్కరాలకు ఏ ఒక్కరు పోకుండా చూడాలి..’ అంటూ ఐలయ్య ఉపన్యాసాలు ఇచ్చారు. హిందూత్వాన్ని వ్యతిరేకించడం, ప్రశ్నించడం, అవహేళన చేయడం తప్ప ఇలాంటివారికి వేరే పనిలేదు. సెక్యులరిజం ముసుగులో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి దారులు వేయడం సామాజిక బాధ్యత కాజాలదు. సమాజంగా సంఘటితంగా ఉండాలని కోరుకునే వారందరూ ఇలాంటి ‘కుహనా లౌకికవాదుల’ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

-బలుసా జగతయ్య