సబ్ ఫీచర్

చైనా ‘జలాస్త్రాన్ని’ భారత్ తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి వనరులు వసుధైక కుటుంబంలో ప్రతి జీవికి అన్వయించగల మహాద్భుత శక్తి. సహజ సంపదను ఏ కొందరో ఒడిసి పట్టుకుని తమ గుప్పెట్లో వుంచుకోగలమనేది వట్టి భ్రమ. శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా ప్రకృతిని శాసించి తమ వశం చేసుకోబోవడం ఏ దేశానికైనా దుస్సాధ్యమే అవుతుంది. కృత్రిమ వర్షాలను కురిపించడానికి, నదుల ప్రవాహ గతిని మార్చడానికి చైనా చేపట్టిన పథకాలు భారత్‌కు ఆందోళన కలిగించేవే. చైనా కార్యకలాపాల వల్ల మన జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లబోయే పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని భారత రక్షణ శాఖ సహాయమంత్రి ఇప్పటికే హెచ్చరించారు.
కృత్రిమ వర్షాలు కురిపించడానికి నేడు చైనాలో 30 చోట్ల జరుగుతున్న వాతావరణ ప్రయోగాల్లో దాదాపు 50 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నట్టు వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వర్షాభావం, కరవు కాటకాలు చోటుచేసుకున్న ప్రాంతాలు లెక్కకు మిక్కిలిగానే వున్నాయి. వర్షాలు కురిపించడానికి మేఘాలపై ‘సిల్వర్ అయొడైడ్’ను చల్లే వందలాది విమానాలను సమకూర్చుకున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం గత ఏడాది వాతావరణ శాఖకు మూడు కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ ఏడాది కూడా దుర్భిక్ష ప్రాంతమైన టిబెట్‌లో భారీ ఎత్తున కృత్రిమ వర్షాలు కురిపించి ఉత్తర చైనాలోని కరవు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి అదనపునిధులు కేటాయించనుంది. టిబెట్‌లో భారీగా వర్షాలు పడితే చైనాతోపాటు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు నదుల ద్వారా ముప్పు తప్పబోదు. కృత్రిమ వర్షాలకు తోడు భారత్ సరిహద్దులోని బ్రహ్మపుత్ర నదిపై చైనా కడుతున్న ఆనకట్టల నుంచి ఒక్కసారిగా వరదలు ముంచుకొస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలకు జలప్రళయం తప్పదు. నిజానికి టిబెట్‌లో భారీ వర్షాలు కురిపించాల్సిన అవసరమేమీ లేదని రష్యాకు చెందిన దూర ప్రాచ్య అధ్యయన సంస్థ ఉపసంచాలకుడు ఆండ్రెయ్ ఓస్త్రోవ్‌స్కీ భావన. టిబెట్‌లో భారీగా కురిసే మంచు కరిగి నదులు నిండుగా ప్రవహించే సౌలభ్యముందని ఆయన అంటున్నారు. టిబెట్‌లో కృత్రిమ వర్షాలు కురిపించి తమ దేశంలోని అనావృష్టి ప్రాంతాలకు సాగునీటిని అందించాలనుకుంటున్న చైనా ప్రభుత్వం టిబెట్‌లో వ్యవసాయ విస్తరణకు ప్రత్యేక పథకాల్ని చేపట్టకపోవడం విడ్డూరం. వర్షాలు, నదుల ద్వారా అందుబాటులో ఉండే జలసంపద చాలావరకు దక్షిణ చైనాలో కనిపిస్తుంది. కానీ, చైనాలో సగం జనాభా, మూడింట రెండు వంతులు సాగుభూమి అనావృష్టి పీడిత ప్రాంతమైన ఉత్తర చైనాలోనే ఉంది. మరోవైపు నగరాల్లో జనాభా వత్తిడి కారణంగా భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లో వెయ్యి అడుగుల లోతు తవ్వితే కానీ నీరు లభించడం లేదు. నీటి ఎద్దడిని అధిగమించడానికి 2006-2016 మధ్య కృత్రిమ వర్షాల మూలంగా 5,500 కోట్ల ఘనపు మీటర్ల అదనపు వర్షపాతాన్ని సాధించారు. ఇంతవరకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు చైనా వాతావరణ ప్రయోగాలు నిర్వహిస్తున్నా, అవి మరోవైపు సైనిక ప్రయోజనాలకు కూడా ఉపకరించకుండా పోవు. రణతంత్రం కోసం వాతావరణాన్ని ఉపయోగించరాదని 1978 నాటి ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై చైనా సంతకం చేసినా, భవిష్యత్తులో ఆ ఒప్పందానికి ఆ దేశ మన్నన ఎలా ఉంటుందో ఊహించలేని పరిణామం. ఈ ఒప్పందానికి ముందే అమెరికా వియత్నాం యుద్ధంలో ప్రత్యర్థుల చొరబాటును అడ్డుకునే ప్రయత్నంగా కృత్రిమంగా కుంభవృష్టిని కురిపించిన చరిత్ర మరుపురానిది. చైనా గుట్టు చప్పుడు కాకుండా చేపట్టే వాతావరణ ప్రయోగాలు పొరుగుదేశాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. అలాంటి ప్రయోగాలే 2013లో పెను తుపాను సృష్టించినందువల్ల తూర్పు రష్యాలోని అముర్ నదికి ఎన్నడూ లేనంతగా ఉద్ధృత వరదలు వచ్చి చైనా, రష్యాల్లో అపార ఆస్తినష్టం సంభవించింది. మానవాళి మనుగడకు దోహదపడేలా విజ్ఞాన రంగ ప్రయోగాలు వుండాలే కానీ విధ్వంసానికి పూనుకుంటే అంతకంటే దారుణ తప్పిదం మరొకటి ఉండబోదు. టిబెట్‌లో కృత్రిమ వర్షాలు కురిపించడానికి తోడు భారత్‌కు అతి చేరువలో వున్న బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే భారీ జలవిద్యుత్ కేంద్రాలు భారత్, బంగ్లాదేశ్‌లకు నష్టదాయకంగా పరిణమిస్తాయి. బ్రహ్మపుత్ర జలాలను ఉత్తర చైనాకు మళ్లిస్తే నదిలో నీటిమట్టం తగ్గి భారత్‌కు అందాల్సిన జలాలకు గండి పడుతుంది. చైనా కయ్యానికి కాలుదువ్వే పక్షంలో భారత్‌పై జలఖడ్గాన్ని ఝుళిపించబోదనే భరోసా ఏమాత్రం ఉండబోదు. మొత్తం మీద చైనా ఉద్దేశాలు, సామర్ధ్యాల పట్ల ప్రతిక్షణం భారత్ అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. వాతావరణ ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితి ఒప్పందానికి అనుగుణంగా నడుచుకునేలా చైనాపై వత్తిడి తీసుకురావాలి. ఉపగ్రహాలు, సెన్సర్లు మనకున్న సాంకేతిక సాధనాలను ఉపయోగించి వాతావరణంపై నిఘా వేసి, చైనా వల్ల వాటిల్లబోయే ప్రమాదాలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి. ఆ పరిణామాలను దీటుగా ఎదుర్కొనే ధీమాతో ప్రపంచ దేశాల సహకారాన్ని సమకూర్చుకుని చైనా దుష్టపన్నాగాలను ప్రపంచానికి చాటి చెప్పేలే భారత్ వ్యవహరించాలి.

-దాసరి కృష్ణారెడ్డి