సబ్ ఫీచర్

రాజకీయ రిజర్వేషాలు రచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లకు అర్థం మారి కొన్ని దశాబ్దాలయిపోయింది. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పుణ్యాన రిజర్వేషన్లు ఓట్లరూపం సంతరించుకుని, అవి క్రమేపీ పాలకుల పాలిట పులిమీద స్వారీలా మారిపోయాయి. పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలన్న రాజ్యాంగ ధర్మకర్తల మాటను అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీనే, ప్రస్తుతం దేశం నలుమూలలా చెలరేగుతున్న రిజర్వేషన్ల కుంపట్లకు మూలకారణమన్నది నిర్వివాదం. మోదీ ప్రధాని అయిన తర్వాత ధనవంతులు గ్యాస్ సిలండర్ల సబ్సిడీ వదులుకోవాలని చెప్పగానే, లక్షల సంఖ్యలో స్పందించి స్వచ్ఛందంగా వదులుకున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల వల్ల దశాబ్దాల నుంచి ఫలితాలు అనుభవిస్తున్న కుటుంబాలు కూడా వాటిని వదులుకుని, అర్హులైన అదే వర్గాలకు ఆ ఫలాలు అందించాలన్న సూచన అప్పట్లో భాజపేయుల నుంచే వచ్చినా, రిజర్వేషన్ తేనెతుట్టె కదిలి తేనెటీగలు తమనెక్కడ కుడతాయోనన్న భయంతో ఆ చర్చల్లోకి వారు మళ్లీ వెళ్లలేదు.
ప్రస్తుతం దేశం అంతటా రిజర్వేషన్ల చర్చనే జరుగుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల మంట ఇంకా ఊపందుకోకపోయినా, దానిపై చర్చయితే ఘాటుగానే సాగుతోంది. ప్రధానంగా కేసీఆర్ సాహసించి కదిపిన ఈ తేనెతుట్టె ఫలితాలు ఎలా ఉంటాయన్నది మరికొద్దిరోజుల తర్వాత గానీ చెప్పలేం. ఎందుకంటే దానిపై ప్రస్తుతానికి బిజెపి-తెదేపా మాత్రమే పోరాడుతుండగా, బీసీ సంఘాలు కులపరంగా తీవ్రంగానే నిరసిస్తున్నాయి.
తెలంగాణ సర్కారు రిజర్వేషన్లపై చర్చ పెట్టి, ప్రతిపాదనలు ఆమోదించుకునేందుకు సరైన సమయం ఇవ్వకుండా, ఒక్కరోజులోనే అసెంబ్లీ పేరంటాన్ని ముగించడం బట్టి, సర్కారుకు రిజర్వేషన్లపై చర్చించడం అంతగా ఇష్టం లేనట్లు అర్థమవుతూనే ఉంది. నిజంగా అర్హులైన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించినప్పుడు చర్చను కనీసం రెండు మూడురోజుల పాటు నిర్వహించి కదా తుది నిర్ణయం తీసుకోవలసింది? సందేహాలుంటే తీర్చుకునేందుకు ముసాయిదా బిల్లు ప్రతులు రెండురోజుల ముందే ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకరోజు ముందు సభ్యులకు ఇవ్వడం బట్టి సర్కారు ఆంతర్యమేమిటో తెలిసిపోలేదూ? బిల్లుపై కూలంకషంగా చర్చించకుండా అర్జెంటు పనులేవో ఉన్నట్లు, ఆదరాబాదరా నిర్ణయాలు తీసుకున్నందుకు సర్కారు శీలాన్ని శంకించడంలో తప్పేమిటి?
తెలంగాణ రాష్ట్రంలో బీసీ-ఈ కోటా కింద ముస్లింలకు ప్రస్తుతం ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 8 శాతానికి, 6శాతంగా ఉన్న ఎస్టీల రిజర్వేషన్లను అదనంగా మరో 4 శాతానికి పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. దానికోసం తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల చట్టం-2017 బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును ఎవరూ పెద్దగా వ్యతిరేకించడం లేదు.
చిక్కల్లా ముస్లిం రిజర్వేషన్లతోనే. ఆర్థిక, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికన కాకుండా మత ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తున్న బిజెపి వంటి పార్టీలతోపాటు, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపువల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని గొంతెత్తుతున్న బీసీల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోవలసినవే. మరి బీసీ, ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ను కేసీఆర్ సర్కారు ఎందుకు పట్టించుకోలేదు? అసలు కోటా అంటూ పెంచాల్సి వస్తే బీసీల్లోని ఐదు గ్రూపులకూ రిజర్వేషన్లు పెంచాలి తప్ప, ఐదో గ్రూపులో ఉన్న బీసీ-ఈ కులాలకే పెంచడం ఏమిటన్న దళిత, బీసీ సంఘాల ప్రశ్నలకు సర్కారు వద్ద సమాధానం ఉండకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీలేదు.
పోనీ సర్కారు సెలవిచ్చినట్లుగా బీసీ - లోని అన్ని కులాలకు ఇది వర్తిస్తుందా అంటే అదీ లేదు. అది కూడా కేవలం ముస్లింలకు మాత్రమేనని ప్రకటించడం బట్టి, కేసీఆర్ నిర్ణయం మతపరమైన రిజర్వేషన్లుగానే భావించడంలో తప్పేమిటి? దీనిపై కేసీఆర్, మరికొందరు సర్కారు ప్రముఖులు నిలువుగా వాదించినా, అడ్డంగా వాదించినా తెలంగాణ సర్కారు తీసుకున్నది నూటికి నూరు శాతం మతపరమైన రిజర్వేషనే్ల!
ముస్లింలపై కేసీఆర్ అవ్యాజానురాగం మెచ్చదగిందే. అయితే ఇది న్యాయస్థానాల్లో నిలుస్తుందా? కేంద్రం ఆమోదిస్తుందా? రెండు రిజర్వేషన్లను ఒకే బిల్లులో ఎందుకు చేర్చారన్నదే ప్రశ్న. ఏబిసిడి వర్గీకరణకు సమైక్య రాష్ట్రంలోనే అసెంబ్లీ తీర్మానం చేసినా ఇప్పటికీ అతీగతీ లేదు. వైఎస్ జమానాలో ముస్లింల కోసం పెంచిన 4 శాతం రిజర్వేషన్ వ్యవహారం బెడిసి కొట్టగా, ఇప్పుడది స్టేపై బతుకుతోంది. దాని స్టే ఎత్తివేతకు సర్కారు ప్రయత్నించకపోవడం వల్లే ఆ రిజర్వేషన్ కొనసాగుతోంది. పోనీ కేసీఆర్ ప్రసాదించిన బిల్లు ఏమైనా ఎస్టీ, మైనారిటీలకు విడిగా ఆమోదించారా అంటే లేదు. రెండూ కలిపే ఆమోదించారు. దీనివల్ల అసలుకే మోసం కదా?
అయితే కేసీఆర్ అమాయకుడేమీ కాదు. కోర్టులో చుక్కెదురైనా, తమిళనాడు మాదిరిగా కేంద్రం ఆమోదించకపోయినా ముస్లిం, ఎస్టీలను ఆకాశంలోకి తీసుకువెళ్లాలని తాను ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుందని, ఈసారి ఎన్నికల్లో మొత్తం అన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తన పార్టీ ఖాతాలో వేస్తే, వచ్చే ఎన్నికల తర్వాత మీ రిజర్వేషన్లు మీకెక్కడికీ పోవని భరోసా ఇచ్చే మతలబు దాగుందని తెలియని వారు అమాయకుల కిందే లెక్క.
నిజంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వాలంటే దానికంటే ముందు జనాభా ప్రాతిపదకన బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలన్న రేవంత్‌రెడ్డి వాదనను కొట్టివేయలేం. అంటే 52 శాతం ఉన్న బీసీలకు 25 శాతం ఇచ్చి, 12 శాతం ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా కుల-మత పంచాయితీకి తెరలేపడమే కదా? ముస్లిం రిజర్వేషన్ల వల్ల బీసీ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఏలిన వారిది కాదా? సర్కారు జనాభా లెక్కల ప్రకారమే ముస్లింల జనాభా 12.68 శాతమని 2011 నాటి లెక్కలు చెబుతున్నాయి.
అంటే 12 శాతం ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే, మరి అదే జనాభా ప్రాతిపదికన మిగిలిన అన్ని కులాలకూ ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి లాంటి నేతల లాజిక్కును తప్పుపట్టలేం? గిరిజనులకు 9.08 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 2015 జూన్ 29నే కోర్టు ఆదేశించింది. అప్పుడెందుకు దానిని అమలుచేయలేదని అడిగితే మహాపరాధం.
రిజర్వేషన్ పెంపుపై పట్టుదలతో ఉన్న కేసీఆర్ ముచ్చటను తప్పుపట్టకపోయినా, ఆ ముచ్చట తీర్చుకునేందుకు తమిళనాట అమలువుతున్న రిజర్వేషన్లను అధ్యయనం చేసేందుకు వేస్తామన్న జ్యుడిషియల్ కమిటీ, 2014 నవంబర్ 28 నుంచి ఎందుకు నేలమాళిగల్లో పెట్టారో చెప్పాల్సిన బాధ్యత దయగల ప్రభువులపైనే ఉంది. రిజర్వేషన్లంటే ఎవరి భాష్యాలు వారికున్నా, దానిని బాధితులకు అందించాల్సిన బాధ్యత పాలకులదే. దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెరాస మేనిఫెస్టో విషయాన్ని కేసీఆర్, ముస్లిం రిజర్వేషన్ల బిల్లు ఉత్సాహంలో మర్చిపోయినట్లున్నారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ బిల్లు కేంద్రానికి వెళితే అక్కడ ఆమోదముద్ర పొందుతుందా అన్న ప్రశ్నకు కేసెఆర్ వద్ద జవాబు లేదు. ఓ పక్క వెంకయ్యనాయుడు మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించేది లేదని చెబుతూనే ఉన్నారు. కేసీఆర్ మాత్రం కేంద్రంపై పోరాడతామని ఉద్యమ మాటలు చెబుతున్నారే తప్ప, అక్కడ గ్యారంటీ ఉంటుందని మాత్రం చెప్పకపోవడం బట్టి, ఇదంతా కేంద్రంపై నెట్టివేసి సేఫ్‌గేమ్ ఆడేందుకు జరుగుతున్న రాజకీయ రిజర్వేషాలనేనని అర్థమవుతుంది.
* * *
నవ్యాంధ్రలోనూ రిజర్వేషాలు కులాల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. మంజునాధ కమిషన్ నివేదిక ఇంకా ఇవ్వకపోయినా, కాపులను బీసీల్లో చేర్చేందుకు సిఫార్సు చేస్తుందా? లేదా? ఒకవేళ చేస్తే బీసీ హక్కులు, ప్రయోజనాల సంగతేమిటి? తెరపైకి వచ్చే ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలకు చంద్రబాబు సర్కారు ఇచ్చే జవాబేమిటి?
ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. తెలంగాణలో రిజర్వేషన్లు అమలుచేసి పేదవాడికి అండగా ఉన్నారంటూ కేసీఆర్‌ను కీర్తించిన కాపునేత ముద్రగడ పద్మనాభం, ఏపిలో కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న దానికి అంగీకరిస్తారా? తెలంగాణలో 12 శాతం ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేసీఆర్ సర్కారుకు జైకొట్టిన ముద్రగడ పద్మనాభం, ఇక్కడా బీసీలకు అదే లెక్కన రిజర్వేషన్లు ఇవ్వాలని ఎందుకు గళం విప్పడం లేదు? కేసీఆర్‌ను ఆకాశానికెత్తిన ముద్రగడ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరపడిన కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆయన విభీషణ పాత్రను అందరూ మెచ్చుకునేవారే కదా?!
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144