సబ్ ఫీచర్

మావోల నరమేధం దేని కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో కొద్దిరోజుల క్రితం మావోయిస్టులు భయానక విధ్వంసం సృష్టించి 26 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలిగొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు ఆచూకీ లేకుండాపోయారు. చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఆంధ్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో తరచూ మావోయిస్టుల హింసాత్మక చర్యల్లో జవాన్లు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులు ఇలా నరమేధం సృష్టించడం సబబేనా? మావోల హింసాత్మక ఘటనలు ‘నాగరిక చర్యలు’ అనిపించుకుంటాయా? అని సభ్యసమాజంలో అందరూ ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
‘కమ్యూనిజం కల’ సాకారం కావాలంటూ సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టుల వల్ల భారత్‌లోనే కాదు, అనేక దేశాల్లో భద్రతాదళాల వారు, పౌరులు ప్రాణాలు కోల్పోతునే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల చేతుల్లో గత ఎనిమిది దశాబ్దాల్లో దాదాపు పది కోట్లమంది మరణించారని ఫ్రాన్స్‌లో ప్రచురితమైన ‘ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం’ గ్రంథంలో పేర్కొన్నారు. మొదటి తిరుగుబాటు విప్లవం వచ్చిన ఫ్రాన్స్‌లోనే ఈ సంచలనాత్మక పుస్తకం ప్రచురితం కావడం గమనార్హం. ఇందులో ఎందరో విద్యాధికులు, ప్రముఖులు రచనలు చేశారు. పరిశోధనాత్మక అంశాలను పొందుపరిచారు. తేదీలను, సంఘటనలను సైతం పేర్కొన్నారు. స్టీవ్ అనే విద్యాధికుడు ఈ గ్రంథానికి సంపాదకుడుగా వ్యవహరించాడు. చైనాలో కమ్యూనిస్టులు దాదాపు ఆరు కోట్ల మందిని హత్య చేశారని, రష్యాలో రెండు కోట్ల మందిని పొట్టనపెట్టుకున్నారని, కాంబోడియాలో కోటి మందిని హత్యచేశారని, వియత్నాంలో కోటి మందికి పైగా హతులయ్యారని, క్యూబాలో తూర్పు యూరప్ దేశాల్లో కోటి మందికి పైగానే విగత జీవులయ్యారని.. ఇలా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు, వామపక్ష పార్టీలు కోట్లాది మంది ప్రజలను పొట్టన పెట్టుకున్నాయని ప్రముఖులు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కృత్రిమ కరవును సృష్టించగా ఆకలితో మరణించినవారు, నిర్బంధ శిబిరాల్లో అక్కడి పరిస్థితులకు తాళలేక కన్నుమూసినవారూ ఉన్నారు. బహుశా భారతదేశంలోని బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధం, మందుపాతరలకు బలితీసుకున్న వారి సంఖ్య అందులో చేర్చి ఉండకపోవచ్చు. చేర్చి ఉంటే ఆ సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంటుందన్నమాట.
రెండు తెలుగు రాష్ట్రాల జనాభాకు సరిసమానంగా అంతమందిని ఎనిమిది దశాబ్దాల్లో పొట్టనపెట్టుకున్న కమ్యూనిజం, దాని వివిధ రూపాలు ఏ విధంగా మానవీయమైనవని భావించాలి? నాగరికత పెరుగుతున్నవేళ, చైతన్యం పురివిప్పుతున్న సమయాన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల చెంతకు చేరుతున్న సందర్భంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న పరిస్థితుల్లో ఇంత మారణహోమాన్ని వౌనంగా ఎందుకు భరించాలి? కోట్లాది మంది ప్రజల్ని బలితీసుకునే అధికారం, హక్కు కమ్యూనిస్టులకు, వారి వారసులకు ఎవరిచ్చారు? అన్న ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది కదా?
కార్మిక-కర్షక శ్రేయోరాజ్యం కోసం ప్రాణాలను పణంగా పెడతామని చెప్పుకునేవారు- ఉద్యమం ముసుగులో చేసింది, చేస్తున్నది ఏమిటి? కోట్లాది మందిని హతమార్చడమేగా? రెండు ప్రపంచయుద్ధాల్లో మరణించిన వారికన్నా ఈ సంఖ్య ఎంతో ఎక్కువ. హిట్లర్ హింసాకాండలో కన్నుమూసిన వారికన్నా, స్టాలిన్ నిరంకుశ పాలనలో మరణించినవారి సంఖ్య అత్యధికం అని తెలిసినప్పుడు కమ్యూనిస్టులను ‘మానవతావాదుల’ని అనగలమా? చివరికి కమ్యూనిస్టుపార్టీ నాయకులను, కార్యకర్తలను, విరోధులను స్టాలిన్ పెద్దఎత్తున హతమార్చిన సంగతి చెరిపేస్తే చెరిగిపోయేదికాదు. అది మొదలు కమ్యూనిస్టుల రక్తదాహానికి కోట్లాది మంది ప్రజలు కన్ను మూయడం ఏ రకంగా సమర్ధనీయం? ఏ రకంగా ఆహ్వానించే పరిణామం? గొప్ప సమాజ నిర్మాణంలో అంతర్భాగంగా ఇదంతా జరుగుతోందని పొంతనలేని మాటలను కమ్యూనిస్టులు చెప్పడం దారుణం. కోట్లాది మందిని పొట్టనపెట్టుకుని, అద్భుతమైన సమసమాజం నిర్మించమని ఏ ‘దేవుడు’ వారిని ఆదేశించాడు? వంద సంవత్సరాల క్రితమైనా, ఇప్పుడైనా ప్రజలదే సంపదపై, వనరులపై అధికారం. వారిలోనుంచి వచ్చినవారే అధికారం చేపడుతున్నారు తప్ప మరో గ్రహం నుంచి దిగొచ్చినవారు అధికారం చెలాయించడం లేదు. మరలాంటప్పుడు ఇన్ని కోట్లమంది రక్తం ఏరులై ఎందుకు భూమిపై పారాలి? సాయుధ పోరాటమే లక్ష్యంగా పాలకులను కూల్చేసి అధికారం చేపట్టమని ప్రజలెవరూ కోరలేదు. వారి తరఫున కమ్యూనిస్టులే అధికారదాహంతో నిర్ణయాలు తీసుకుని కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. మావోయిస్టులు ఇంకా ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇదెంత అరాచకం?
మనదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి దండిగా ఉంది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. ఒకప్పుడు అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఉంటే ఇప్పుడు ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందిస్తున్నాం. పాల ఉత్పత్తి సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఎగుమతులకు సంబంధించి ప్రపంచంలో ప్రథమ, ద్వితీయస్థానాల్లో ఉన్నాం. ఆర్థికంగా మన దేశం తృతీయ స్థానంలో ఉంది. త్వరలో రెండవ స్థానంలోకి చేరవచ్చన్న అంచనాలున్నాయి. అనేక విశే్లషణ సంస్థలు దీన్ని రూఢీపరుస్తున్నాయి. ఆధునిక సాంకేతిక, పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారతీయ యువత ముందున్నదని రుజువైంది. అన్నిరంగాల్లో ప్రపంచంతో కలిసి అడుగేస్తున్నాం. అంతరిక్ష రంగంలో, రక్షణ రంగంలో, పరిశోధనల రంగంలో గొప్పగా ముందంజవేసిన తరుణంలో మావోయిస్టు కమ్యూనిస్టులు స్టాలిన్ అంశతో హత్యాకాండతో విజృంభిస్తే అదెలా సమంజసమవుతుంది? స్టాలిన్ కాలానికి, ఆధునిక కాలానికి ఏమాత్రం పోలిక లేకుండా సమాజం రూపాంతరం చెందింది. అయినా కమ్యూనిస్టు భావజాలం రూపాంతరం కాకపోవడం విడ్డూరం గాక ఏమవుతుంది?
అంగారక గ్రహంపైకి, చంద్రగ్రహంపైకి మానవుడు పయనమవుతున్న సందర్భంలో అద్వితీయ మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తున్న సమయంలో మన ఆలోచనలో ఎంతో మా నవానుకూలంగా ఉండాలి..? ప్రతిక్షణం మానవ సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషిచేయాల్సినవారు- సమాధులు నిర్మించే పనిలో నిమగ్నం కావడం ఎంత అన్యాయం? సమాజం రూపాంతరం చెందేలా ఒకటి లేదా రెండు దశాబ్దాలు మార్క్సిస్టు దృక్పథంతో పనిచేసి విఫలమైతే ఆ ప్రయత్నం విరమించుకోవడంలో విజ్ఞత కనిపిస్తుంది. రెండు దశాబ్దాలకోసారి కొత్తతరం ఈ సమాజాన్ని కొత్త దృక్పథంతో చూస్తుందన్న ఇంగితజ్ఞానం మరిచి దశాబ్దాల తరబడి తిరస్కరణకు గురైన సిద్ధాంతాన్ని అమలుజేసి ‘స్వర్గం’ సృష్టిస్తామని ఒక్కొక్కరు స్టాలిన్‌లా అంతకుమించి నియంతృత్వ వైఖరితో, అమానవీయంగా విరుచుకుపడితే అది మానవాళికి ఎలా ఉపకరిస్తుందన్న వౌలిక ప్రశ్న వేసుకోకపోవడం వింతగా ఉంది. పైగా తమను మించిన గొప్ప సామాజిక విశే్లషకులు, త్యాగధనులు మరొకరు లేరని చాటి చెప్పుకోవడం విషాదకరం. యదార్థమే పదార్థమని విశ్వసించేవారు, ఆ పదార్థం సంపూర్ణంగా మారిందన్న స్పృహలేకుండా ఇంకా సమాజం స్టాలిన్‌నాటి కాలంలోనే ఘనీభవించిందని భావించి సాయుధ దాడులకు దిగి గరిష్టస్థాయిలో ప్రాణాలను బలిగొనడం, కాలాన్ని గేలిచేయడమే తప్ప మరొకటి కాదు.
మార్క్స్ తన వాదాన్ని ప్రతిపాదించకముందు కూడా ప్రజలున్నారు, తమ పద్ధతిలో తాము జీవించారు. మార్క్స్‌వాదం విఫలమైందని రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలు ప్రకటించాక కూడా ప్రజలు తమ పద్ధతిలో తాము జీవిస్తున్నారు. మార్క్స్ ముందునాటి పరిస్థితి ఇప్పుడు లేదు. అదే ‘మార్పు’-సహజ సిద్ధమైన మార్పు- ఈ మార్పుకాదని మార్క్స్ ప్రతిపాదించిన ‘మార్పు’ను సాకారం చేస్తామని రక్తకాసారాలు సృష్టించడం సవ్యమైన భావన కాదు. దీన్ని కమ్యూనిస్టులు, వారి వారసులైన మావోయిస్టులు గ్రహించాల్సిన తరుణం ఇది.

- వుప్పల నరసింహం