సబ్ ఫీచర్

యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నది ఎవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో యువతను మించిన దృఢమైన, యుక్తివంతమైన, వేగవంతమైన శక్తి మరొకటి లేదు. ఒంట్లో వేడి రక్తం, గుండెల నిండా ఉత్సాహం, కండరాల్లో బలం పుష్కలంగా ఉండే ఆ వయసులో యువతరానికి ఏదీ అసాధ్యం కాదు. వారు కొండలను చకచకా ఎక్కేయగలరు, సముద్రాల లోతుల్ని కొలిచి రాగలరు, ఆకాశానికి రాకెట్లు పంపి అక్కడికే చేరిపోగలరు. తమ మేధాశక్తితో శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలు ఆవిష్కరించగలరు. వివిధ రంగాల్లో అభివృద్ధిని శక్తివంతం, వికాసవంతం చేయగలరు. అందుకే భవిష్యత్ భారతానికి యువశక్తి అవసరం ఎంతో ఉంది. ప్రతి రంగంలోనూ వాళ్ళ ప్రవేశం, పనితనం, అద్భుత ఫలితాల ఆవశ్యకత ఎంతో ఉంది. యువశక్తి లేని దేశాన్ని, ప్రపంచాన్ని అసలు ఊహించలేం. అయితే- నాణానికి రెండో వైపు ఉన్నట్లే.. యువశక్తి ఈ ప్రపంచానికి ఎంతగా ఉపయోగపడుతున్నదో మరోపక్క అది నిర్వీర్యమైపోతున్నందున ఈ ప్రపంచానికి అంతగా నష్టం వాటిల్లుతోంది. ఏ టెక్నాలజీ, ఏ ఆధునిక వ్యవస్థ అయితే యువత తెలివితేటలకు దోహదం చేస్తున్నదో.. అదే టెక్నాలజీ, అదే వ్యవస్థ వాళ్ళలోని శక్తిసామర్థ్యాలు వెలికిరాకుండా అడ్డుపడుతూ, వాళ్ళను ఎందుకూ పనికిరాని వాళ్ళుగా కూడా తయారుచేస్తుండటం విచారించాల్సిన విషయం.
యువతీ యువకులు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు పోషక విలువలున్న, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించటం కుటుంబ పెద్దల బాధ్యత. ఇంటిపట్టున ఉండే పిల్లలకు సైతం అమ్మ చేతి వంట కరవవుతున్న ఈ రోజుల్లో.. హాస్టళ్ళ తిండి గురించి చెప్పనే అవసరం లేదు. ఇక సంక్షేమ హాస్టళ్ళలోనయితే పురుగుల అన్నం, రుచీపచీ లేని ముదురు కూరగాయలతో చేసిన కూరలు, బొద్దింకలు, బల్లులు పడిన సాంబారుతో పిల్లలు శక్తిమంతులు కావటం మాట అటుంచి రోగాల బారిన పడుతున్నారు. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా బోయిస్ హాస్టళ్ళు, గర్ల్స్ హాస్టల్లే..! ప్రభుత్వం వారు నడిపే సంక్షేమ హాస్టళ్లలో కప్పుకోటానికి దుప్పట్లు లేక, కాలకృత్యాలు తీర్చుకోవటానికి పరిశుభ్రమైన బాత్‌రూములు, టాయిలెట్లు లేక పిల్లలు నానా ఇబ్బందిపడుతున్నారు. ఇరుకిరుకు హాస్టల్ గదుల మూలంగా రోడ్ పక్కన పేవ్‌మెంట్లమీద కూర్చుని చదువుకోవటం, అన్నాలూ అక్కడే తినేయటం చేస్తున్నారు. ఆ సమయంలో అటుగావెళ్ళే పాదచారులకు అవి హృదయాన్ని కదిలించే దృశ్యాలే.
ప్రతి పనిలోనూ వ్యాపార ధోరణి వచ్చి చేరటం.. మనిషికి డబ్బు యావ, సంపాదన తాపత్రయం ఎక్కువ అవడంతో ప్రతి విషయంలోనూ నాణ్యతాలోపం, బాధ్యతారాహిత్యం, అశ్రద్ధ, నిర్లక్ష్యం చేరుతున్నాయి. మనిషి ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం లెక్కచేయని విష సంస్కృతి చోటుచేసుకుంటోంది. ‘ఎవరెలాపోతే నాకేంటి..? నేను, నా కుటుంబం బాగుంటే చాలు.. లక్షలు, కోట్లు సంపాదనే లక్ష్యం’ అనుకునే స్వార్థపూరిత మనస్తత్వం విషంలా సమాజంలోకి పాకేస్తోంది. ఫలితంగా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను యువతను టార్గెట్‌గా చేసుకుని భారీగా విక్రయిస్తున్నారు. హానికరమైన డ్రగ్స్ యువత శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. డ్రగ్ మాఫియాతో సినిమావాళ్ళు, ఇతర సెలబ్రిటీలు సైతం చేతులు కలిపి మత్తుపదార్థాల వ్యాపారానికి దోహదం చేస్తున్నారు. చాక్లెట్లలో డ్రగ్స్ కలిపి పిల్లలకు సరఫరా చేస్తున్న ముఠా ఒకటి ఈమధ్యనే పట్టుబడటం ఇందుకు ఒక ఉదాహరణ. యువతను గుట్కాలకు, పాన్ మసాలాలకు అలవాటుచేసి కాన్సర్ వ్యాధికి వాళ్ళను బలిచెయ్యటం.. హుక్కాలకు, డ్రగ్, సిగరెట్లకు, డ్రగ్ ఇంజక్షన్లకు నవతరాన్ని అలవాటుచేసి.. అస్తమానం వాళ్ళు మత్తులో తూలుతూ ఉండేలాచేసి వాళ్ళ శారీరక శక్తిని, మేధాశక్తిని హరించివెయ్యడం సంఘవిద్రోహక శక్తులైన ఈ మాఫియాల పని! కష్టపడకుండా కోట్లు పోగుచేసుకోవాలన్న వాళ్ళ ఆలోచన యువతకూ ఇంజక్ట్ చేయబడటంతో ‘ఈజీ మనీ’కోసం నవయువత సైతం చెడుదారిలో నడవాల్సి వస్తున్నది.
మరోవైపు ఎంతోమంది యువతీ యువకులు రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకోబడుతున్నారు. దాంతో స్వార్థరాజకీయాలు కుల, మత, వర్గపోరాటాల ముసుగేసుకుని విద్యాప్రాంగణాల్లోకి సైతం ప్రవేశించి విద్యార్థుల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచి వేసేస్తున్నాయి. రాజకీయ నేతలు వాళ్ళతో ఉద్యమాలు, పోరాటాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేయించి, వాళ్ళకు తమ అండదండలు ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి.. ఆ తరువాత వాళ్ళను ఆ ఉచ్చులో బిగించి మెల్లగా తప్పుకుంటున్నారు. యువశక్తి రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది. మంచికి వాడుకుంటే నవ సమాజ నిర్మాణానికి యువత తన శక్తియుక్తులను ధారపోస్తుంది. చెడుకు వాడుకుంటే విధ్వంసానికి, విస్ఫోటనానికి తనూ ఒక చెయ్యివేసి వినాశనకారి అవుతుంది. కాబట్టి యువశక్తిని మరింత శక్తివంతం చేయటమేగాక సద్వినియోగం చేసుకునే బాధ్యత కూడా మేధావులు, సంఘ సంస్కర్తలు, నాయకుల చేతుల్లోనే ఉంది. ఈరోజుల్లో మీడియా, సినిమాలు, టీవీ చానళ్లు వ్యాపారాభివృద్ధే ధ్యేయంగా నడుస్తుండటంతో అందులో యువత మితిమీరిన ఫ్యాషన్లను, విచ్చలవిడి ఆధునికతను, చెడు అలవాట్లను, బూతును దృశ్య, శ్రవణరూపాల్లో చూపించి- జీవితం అంటే ఇదే అని యువత భావించేలా చేస్తున్నారు. దాంతో అబ్బాయిలు, అమ్మాయిలు విలువలను, వ్యక్తిత్వాన్ని, చదువును, కెరీర్‌ను పట్టించుకోకుండా ఆ ఆకర్షణలో జీవితాన్ని చిత్తుచేసుకుంటున్నారు. అది వాళ్ళను ఒక్కోసారి ఎంత దూరం తీసుకెళుతుందంటే వాళ్ళతో నేరాలు చేయించేదాకా, వాళ్ళను జైలుపాలు చేసేదాకా..!
ఒక యువకుడు లేక యువతి జీవితంలో ఒక్కసారి తెలిసో తెలియకో తప్పుచేసి- వక్రమార్గంలో నడిచి భవిష్యత్తును కోల్పోతే ఆ నష్టం ఆ ఒక్క వ్యక్తికి సంబంధించింది మాత్రమేకాదు.. ఈ సమాజం మొత్తం ఆ నష్టాన్ని భరించవలసి వస్తుంది. అది అతని లేక ఆమె వ్యక్తిగత సమస్య కాదు.. సమాజ సమస్య.. దేశ సమస్య.. ప్రపంచ సమస్య అయి కూర్చుంటుంది. కనుక యువశక్తి ఎప్పుడూ నిర్వీర్యం కావడమో.. తప్పుడు పనులకు ఉపయోగించడమో జరగకూడదు. అలా జరిగితే దానికి కారణం యువత కాదు.. ఈ వ్యవస్థ! పైపైన ఈ సమస్యను చూడకుండా మూలాల్లోకి వెళ్ళి.. సునిశిత దృష్టితో పరిశీలించ గలిగిన వాళ్ళకు బోధపడే అసలు సత్యం ఇది.

- కొఠారి వాణీచలపతిరావు